Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక మలుపు.. నిందితురాలిగా కవిత

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సమాచారం కోసం కవితను సీబీఐ ప్రశ్నించింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. 41-C కింద నోటీసులు ఇచ్చామని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్‌ కేసులో నిందితుల స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. 2022 డిసెంబర్‌లో కవితను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా చేర్చుకుండానే కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజా నోటీసుల నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

 

*వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్.. ఆ రోజే 2 హామీలు ప్రారంభిస్తామని ప్రకటన
మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్ 75 రోజుల పాలన గురించి వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజా ఆకాంక్షల మేరకే పని చేస్తామని తెలిపారు. మేడారం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.. ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ స్కీమ్ గ్యారంటీలను ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి గురించి సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తీపికబురు చెబుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను సకాలంలో అందించేలా, ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు. పరిపాలనను గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే మీడియా అకాడమీ ఛైర్మన్‌ను కూడా నియమిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు. మేడారం జాతర కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గురువారం రోజున మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చిలకలగుట్టనుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరడంతో మహాజాతర పరిపూర్ణత సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరడంతో భక్తుల మొక్కులు జోరందుకున్నాయి.

 

*ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముగిసిన ఏపీ ప్రభుత్వం చర్చలు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమై.. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించింది. పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, పెన్షన్‌ బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించింది. నాలుగు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. పెన్షనర్లకు బకాయిలపై సమావేశంలో అడిగామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఆలస్యం చేయకుండా ఐఆర్‌ ఇవ్వాలని అడిగామన్నారు. జులైలోపే పీఆర్సీని సెటిల్‌ చేసే కొత్త సంప్రదాయనికి శ్రీకారం చుడతామన్నారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 27న చలో విజయవాడను విరమించుకోమని ఏపీ జేఏసీ నేతలను కోరామని, నిర్ణయం సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామన్నారు. మార్చి నెలలో లోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తాం అని మళ్ళీ చెప్పామన్నారు. ఐఆర్‌ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వ విధానం కాదని, సమయానికి పీఆర్సీ ఇస్తామన్నారు. ప్రభుత్వంతో చర్చల తరవాత ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస్ మాట్లాడారు. 49 డిమాండ్లను ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఉద్యమ కార్యచరణ ఇచ్చామని.. ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చామన్నారు. 30 శాతం ఐఆర్‌ ఇవ్వాలని కోరాం.. కానీ PRC షెడ్యూలు ప్రకారం ఇస్తాం అని చెప్పారనన్నారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది.. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా మా డిమాండ్‌లపై హామీ ఇస్తే ఉద్యమ కార్యాచరణపై పునరాలోచన చేస్తామన్నారు. ఒక వేళ లిఖితపూర్వక హామీ ఇస్తే, జేఏసీ సమావేశం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం చలో విజయవాడను విరమించుకోవాలని మమ్మల్ని కోరిందని స్పష్టం చేశారు.

 

*టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష!
హైదరాబాద్ లో ఒక టీవీ చానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. యాంకర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు. యాంకర్ ని పెళ్లి చేసుకోవాలని ఆత్రుతతో కిడ్నాప్ పాల్పడ్డ త్రిష ఇప్పుడు పోలీసులకు చిక్కింది. ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ప్రణవ్ తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ అతన్ని రూమ్ లో త్రిష బంధించినట్టు తెలుస్తోంది. ఇక చాలా నరకం అనుభవించి త్రిష చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు ప్రణవ్. ఈ త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ను నడుపుతున్నదని గుర్తించారు. భారత్ మాట్రిమోనిలో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్ట పడ్డ త్రిష పెళ్లి చేసుకుంటే అతనినే వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే నిజంగా యాంకర్ ప్రణవ్ ఆ ప్రొఫైల్ పెట్టలేదు, ప్రణవ్ పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు అతని పేరుతో డబ్బు సంపాదించే స్కెచ్ వేశారు. ఇక నిజంగానే ప్రణవ్ ఐడి అనుకోని ఇష్టపడ్డ త్రిష పెళ్లి అతన్నే చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్ పై ఇష్టంతో మనసు పడ్డ త్రిష కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్ ఆమె అదుపు నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఐదు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎండిగా ఉన్న త్రిష కోట్లాది రూపాయలకు అధినేత్రి అని తెలుస్తోంది. మొత్తానికి ప్రణవ్ దెబ్బకు కిడ్నాప్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లింది.

 

 

*అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కి చుక్కెదురు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amit Shah) చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌గాంధీకి (Rahul gandhi) జార్ఖండ్ హైకోర్టులో (jharkhand High Court) చుక్కెదురైంది. పరువు నష్టం కేసును కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాతపూర్వకంగా రాహుల్ అభ్యర్థించినా న్యాయస్థానం మాత్రం నిరాకరించింది. 2018లో అమిత్ షాపై కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలని రాహుల్ గాంధీ పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. 2018లో అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీన్ ఝా పరువునష్టం దావా వేశారు. తాజాగా హైకోర్టు విచారణ చేపట్టి కాంగ్రెస్ నేత రాహుల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తదుపరి కార్యాచరణపై ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.

 

*మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..!
లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ స్పీడ్‌ని పెంచాయి. ఏ క్షణానైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మార్చి 13 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు శుక్రవారం తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. మార్చి 13 లోపు రాష్ట్రాల పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులు ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఈవీఎంల తరలింపు, భద్రతా బలగాల అవసరం, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా, ఈ సారి ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్స్‌లో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఎంపీ ఎన్నిలకు జరిగే అవకాశం ఉంది. దేశం మొత్తం 96.88 కోట్ల మంది ప్రజలు ఓటేసేందుకు అర్హులుగా ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ల సంఖ్య.

 

*బెంగాల్‌లో మోడీ టూర్.. ఎప్పుడంటే..?
సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా రాష్ట్ర పర్యటనలతో ప్రధాని మోడీ (PM Modi) బిజిబిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో ప్రధాని పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ.. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ (West Bengal) పర్యటన ఆసక్తి రేపుతోంది. గత కొద్ది రోజులుగా సందేశ్‌ఖాలీ నిరసనలతో మార్మోగుతోంది. తమపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. బాధిత మహిళలకు మద్దతుగా బీజేపీ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ అలజడి నేపథ్యంలో ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన ఖరారైంది. మార్చి 1, 2 మరియు 6 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి 1న ఆరంబాగ్‌లో, 2వ తేదీన కృష్ణానగర్‌లో మోడీ పర్యటిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (Sukanta Majumdar) తెలిపారు. అలాగే బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అనంతరం అదే నెల మార్చి 6న కూడా మరోసారి మోడీ పర్యటించనున్నారు. బెంగాల్ నార్త్ 24 పరగణాల జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అత్యాచార బాధిత మహిళలతో కూడా మోడీ భేటీకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహిళా ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ పర్యటనలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర రాజకీయ దుమారం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. సందేశ్‌ఖాలీలోని (Sandeshkhali) పలువురు మహిళలు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులపై భూకబ్జాలు మరియు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీని సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు కలవాలనుకుంటే అందుకు ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెలిపారు.

 

*రష్యా తరుపున యుద్ధంలో భారతీయులు.. కేంద్రం కీలక సూచనలు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు పోరాడుతున్నట్లు సమాచారం ఉంది. భారతీయులు బలవంతంగా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్నట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో భారతదేశం శుక్రవారం తన పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులు ‘‘జాగ్రత్తగా వ్యవహరించాలి, వివాదాలకు దూరంగా ఉండండి’’ అని సూచించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘కొంత మంది భారతీయులు రష్యా సైన్యంలో సహాయక ఉద్యోగాల కోసం పనిచేస్తున్నట్లు మాకు తెలుసు. భారత రాయబార కార్యాలయం వారి కోసం సంబంధిత రష్యన్ అధికారులతో క్రమం తప్పకుండా మాట్లాడుతోంది. భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వివాదాలకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు. ముగ్గురు భారతీయులు రష్యా సైన్యంలో పోరాటడానికి బలవంతం చేయబడ్డారని వారిని రక్షించాలని ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని కోరారు. కనీసం ముగ్గురు భారతీయ పౌరులను ఏజెంట్ మోసం చేసి ‘‘ ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్స్’’గా పని చేయడానికి రష్యాకు పంపబడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ముగ్గురు కూడా ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిని రక్షించడానికి , ఇంటికి తీసుకురావడానికి సాయం చేయాలని జైశంకర్‌ని అసదుద్దీన్ కోరారు.

 

 

*సెలబ్రిటీలకు కలసిరాని ఓఆర్ఆర్.. రవితేజ తమ్ముడు మొదలు లాస్య నందిత దాకా !
దేశంలో వరుస ప్రమాదాలు కారణంగా రోడ్డు నెత్తురోడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతి వేగంతో కూడిన డ్రైవింగ్‌, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో బతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ మధ్య ప్రమాదాలకు సంబంధించిన వార్త లేకుండా పత్రికలు లేవంటే అతిశయోక్తి లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అజాగ్రత్తతో వాహనాలు నడపడం, మద్యంమత్తులో వాహనాలు నడపడం, అతివేగం వలన శీతా కాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడక పోవడం,తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డు రావడం, రోడ్డు భద్రతకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం, అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదారులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఎంతో మంది ప్రముఖులు, ప్రముఖుల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారిపై ఒక లుక్ వేద్దాం.
కోమటిరెడ్డికి విషాదం మిగిల్చిన కొడుకు
మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వేగంగా వెళ్తున్న ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టి నుజ్జు నుజ్జుయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
అజారుద్దీన్ ఇంట విషాదం
ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ల్లో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్(19) మృతి చెందాడు. బైక్‌పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయాజుద్దీన్ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.
కోట శ్రీనివాసరావు ఇంట విషాదం
జూన్ 20, 2010న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌(39) మృతి చెందారు. కోట వెంకట సాయిప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫిలింనగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్ ‌కు బయల్దేరి ప్రసాద్‌ తన 1000 సీసీ స్పోర్ట్స్‌ బైకు(ఏపీ0938 డీఎక్స్‌-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం(ఏపీ29టీఏ-4656) రింగ్ రోడ్డు పైకి దూసుకొచ్చిన క్రమంలో బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ప్రసాద్‌ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడగా తలకు తీవ్ర గాయాలై మరణించారు.
రవితేజ సోదరుడు భరత్ రాజు
సినీ రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ రాజు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు వెనుక నుంచి ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది, ఆయన రవితేజ సోదరుడని గుర్తించలేకపోయారు. కారు నంబర్ ఆధారంగా భరత్‌ను గుర్తించారు.
లాస్య నందిత మరణం
ఈరోజ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్‌ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపుతప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌ సమీపంలో ఎక్స్‌ఎల్‌6 రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొంది. మేడ్చల్ బయలుదేరే ప్రదేశం సుల్తాన్‌పూర్ ORR ఎగ్జిట్ కు సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.

 

 

 

Exit mobile version