పొత్తులు ఏ రకంగా ఉన్నా.. అన్ని పార్లమెంట్, అసెంబ్లీలో పోటీకి రెడీ..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో.. వైసీపీ సింగిల్‌గానే పోటీకి రెడీ అవుతుండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లే దిశగా చర్చలు సాగుతున్నాయి.. అయితే, పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా బీజేపీ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారు అని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేంద్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “ప్రజాపోరు యాత్ర” ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం అని ప్రకటించారు. మద్యపాన నిషేదం, రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేస్తాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లలను ఐదు క్లస్టర్ గా విభజించి బూత్ స్థాయి కార్యకర్తలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిశా నిర్దేశం చేస్తారని వివరించారు.. ఇక, అన్ని పార్లమెంట్, అసెంబ్లీలో బీజేపీలో పోటీ చేయడానికి సిద్దంగా ఉంది.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి.
టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ.. వాటిపై ఫోకస్
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన పార్టీలు.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అందులో భాగంగా ఈ రోజు టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని విజయవాడలోని నోవాటెల్‌లో నిర్వహించారు..ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై కూడా సమాలోచనలు చేశారు.. ఉమ్మడి సభకు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. అయితే, సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో క్లారిటీ రానుందట.. ఇక, మేనిఫెస్టో రూపకల్పనపై కీలకాంశాల ప్రస్తావన జరిగినట్టుగా సమాచారం.. డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలక చర్చ సాగగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టనునుంది టీడీపీ – జనసేన కూటమి. అయితే, వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను టీడీపీ – జనసేన సీరియస్‌గా తీసుకున్నాయి.. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దనే ఈసీ ఆదేశాలు ఉన్నాయని టీడీపీ – జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేశారు. ఈ రోజు జరిగిన సమావేశానికి టీడీపీ, జనసేన నుంచి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
పోతవరంలో దారి దోపిడి.. భారీగా బంగారం, నగదు దోచుకున్న దొంగలు..
తూర్పుగోదావరి నల్లజర్ల మండలం పోతవరంలో భారీ దారిదోపిడికి తెగబడ్డారు దొంగలు. భీమవరం చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు జంగారెడ్డిగూడెం వ్యాపార లావాదేవీలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియన వ్యక్తులు మరోకారుతో అడ్డుపడ్డారు. తాము ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ వారిని నమ్మించారు.. ఆ తర్వాత వ్యాపారులను తమ కారులో ఎక్కించుకుని రాజమండ్రి వైపు తీసుకెళ్లారు.. ఇక, వ్యాపారులు ప్రయాణించిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు కేటుగాళ్లు.. వారి కారులో మరో ఇద్దరు దొంగలు వెనుకాలే వస్తున్నట్టు నటించారు.. కారులోని నగదు, బంగారాన్ని అపహరించుకుపోయారు. దీంతో, బాధితులు నల్లజర్ల పోలిసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.. ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పక్క పధకం ప్రకారమే దొంగలు దోపిడికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
పొత్తు ఉన్నా లేకున్నా రెండు స్థానాల్లో పోటీ చేస్తాం..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉందని ఆయన చెప్పారు. మరోవైపు.. కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ శత్రుపూరిత వైఖరి అవలంభిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తమ్మినేని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు.. కేంద్రంలో వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్‌కి హాజరయ్యే ప్రముఖులు వీరే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే మతిపోతుంది. చూడ్డానికి ఈ రెండు కళ్లు కూడా సరిపోవు. ఇప్పటికే వారి ఇంట ఎన్నో కార్యక్రమాలు జరిగాయి.. అవన్నీ కూడా ఓ రేంజ్‌లో నిర్వహించారు. ఇప్పుడు చిన్న కుమారుడి వివాహం వచ్చింది. నిశ్చితార్థమే అత్యంత గ్రాండ్‌గా చేశారు. తాజాగా మరోసారి చిన్న కుమారుడి ప్రీవెడ్డింగ్ జరగబోతుంది. పైగా అంబానీ ఇంట్లో చివరి పెళ్లి. ఇక చూడండి.. ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ప్రపంచంలో ఉన్న అతిరథ మహారథులంతా ఇండియాకు రాబోతున్నారు. ఇంతకీ ప్రీవెడ్డింగ్ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తున్నారు. వచ్చే ఆ విదేశీ అతిథులెవరో తెలియాలంటే ఈ వార్త చదవండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ను (Anant Ambani-Radhika Merchant) వివాహమాడనున్నారు. 2022 డిసెంబర్‌లోనే వీరిద్దరికి నిశ్చితార్థం జరగ్గా.. ఈ ఏడాది జులైలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే మ్యారేజ్ కంటే ముందు గుజరాత్‌లో ప్రీవెడ్డింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు గుజరాత్ జామ్‌నగర్ అతిపెద్ద ఈవెంట్‌కు వేదిక కాబోతుంది. దీనికి ప్రపంచ దేశాలకు చెందిన అపర కుబేరులు, వివిధ కంపెనీల సీఈవోలు, పలు దేశాల రాజకీయ ప్రముఖుల రానుండటంతో మరోసారి భారత్‌లో సందడి వాతావరణం నెలకోబోతుంది. వచ్చే నెలలో 1-3 తేదీల మధ్య జామ్‌నగర్‌లోని రిలయన్స్ కాంప్లెక్స్‌లో అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Zuckerberg), మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అడోబ్ సీఈవో శంతను నారాయణ్ హాజరుకానున్నారు.
పుతిన్‌పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!
అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. గతంలో అనేక మార్లు పుతిన్‌పై నోరు పారేసుకున్నారు. తాజాగా మళ్లీ వ్యక్తిగత దూషణలకు దిగారు. మిస్టర్ పుతిన్ అని సంభోదించడానికి ఒక బూతు పదాన్ని బైడెన్ ఉపయోగించారు. పుతిన్ వల్ల అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందని.. దీంతో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణుయద్ధం గురించి ఆందోళన చెందాల్సిందేనని బైడెన్ వాపోయారు. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదకరమేనని చెప్పుకొచ్చారు. ఇక శుక్రవారం నుంచి రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు.
గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్.. ఐపీఎల్ 2024కు షమీ దూరం
ఐపీఎల్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. దీని షెడ్యూల్కు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనుంది. కాగా.. షెడ్యూల్ ప్రకటించకముందే గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత వన్డే ప్రపంచకప్ తర్వాత చీలమండ గాయం వల్లే ఏ సిరీస్‌లోనూ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు. గుజరాత్ జట్టులో కీలకమైన షమీ లేకపోవడం పెద్ద దెబ్బే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండుసార్లు ఫైనల్‌కు చేరుకోవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. షమీ జనవరి చివరి వారంలో లండన్‌లో ఉన్నాడని, అక్కడ తన చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు చేయించుకున్నాడని, అయినప్పటికీ అతని నొప్పిని తగ్గించలేదని, ఇప్పుడు అతనికి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మహ్మద్ షమీ సర్జరీ కోసం యూకే వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో షమీ ఐపీఎల్ ఆడటం కష్టమని అంటున్నారు.
గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్, అన్నపై రేప్ కేసు… అసలు కథ ఇదే!
బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇప్పిస్తానని వైజాగ్ కి చెందిన డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెను తన అన్న సంపత్ వినయ్ కి పరిచయం చేశాడు. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టగా పదేళ్లుగా ప్రేమలో ఉండి ఇంట్లో ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ జరుగగా యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 28న ఇద్దరి పెళ్లి ప్రయత్నాలు జరుగుతుండగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఫిర్యాదుతో సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు అక్కడ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి నార్సింగ్ ఏసిపి రమణ గౌడ్ మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఒక యువతి సంపత్ వినయ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసిందని, యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళామని అన్నారు. అక్కడ సంపత్ తమ్ముడు, బిగ్ బాస్ ఫేం షణ్ముక్ ఉన్నాడు, అప్పుడే ఫ్లాట్ లో కొన్ని మత్తు పదార్థాలు దొరికాయని అన్నారు. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ పై రేప్, చీటింగ్ కేసు నమోదు చేశాం, అయితే 16 గ్రాముల మత్తు పదార్థాలు కూడా దొరికాయి కాబట్టి NDPS కేసు కూడా పెట్టామని అన్నారు. ఇక ఈ కేసులో షణ్ముఖ్ ప్రమేయం పై విచారణ జరుపుతున్నామని అన్నారు. ఇక షణ్ముక్ అన్న వినయ్ సంపత్ ను నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు పోలీసులు.
తిరుపతి నుంచి నిహారిక పోటీ..! క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్
ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి, ప్రచారం నడుస్తోన్న వేళ.. ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్.. మార్చి 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.. ఇక, ఈ రోజు రాజమండ్రిలో పర్యటించిన హీరో వరుణ్ తేజ్.. సినిమా విషయాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీపై మా కుటుంబంలో పెద్దవాళ్ల నిర్ణయమే మా నిర్ణయం అన్నారు వరుణ్ తేజ్.. ఎన్నికల్లో ప్రచారంపై మా కుటుంబంలో పెద్దవారి నిర్ణయమే ఫైనల్ అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వరుణ్ తేజ్.. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కల్యాణ్ ఏది చెప్తే అదే చేస్తామని అన్నారు. మా అవసరం ఉన్నది అనుకుంటే ఎన్నికల ప్రచారానికి వస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు.. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కల్యాణ్ వెంటే ఉంటామని పేర్కొన్నారు. అయితే, మేం పొలిటికల్‌గా ఏం చేయాలనుకున్నా పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని వివరణ ఇచ్చారు. ఇక, అనకాపల్లి నుండి నాన్న నాగబాబు పోటీ చేస్తే ప్రచారానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుండి నిహారిక పోటీ చేస్తుందంటూ జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ.. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు వరుణ్ తేజ్.
స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
కేథరిన్ ట్రెసా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు శంకర్ ఐపీఎస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఇక తెలుగులో చమ్మక్ చల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది… అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.. ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కేథరిన్ నటించారు. అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకుంది.. ఇక మరోసారి బన్నీ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది.
