Site icon NTV Telugu

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

వైసీపీకి బిగ్‌ షాక్..! ఎంపీ వేమిరెడ్డి రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ తగిలినట్టు అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఎంపీ పదవితో పాటు.. జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. ఈ మేరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. నేను, నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మరియు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను.. నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుచున్నాను.. ఈ సందర్భంగా మీరు న ఆకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియిజేస్తున్నాను అంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. ఇక, నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను అంటూ మరో పత్రికా ప్రకటన విడుదల చేశారు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి..

నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు.. కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా..? చంద్రబాబుకా?
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నిజం గెలవాలి పేరుతో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె.. రెండు రోజుల క్రితం కుప్పం చేరుకున్నారు.. నిన్న, మొన్న, ఈ రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు.. ఈ రోజు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన భువనేశ్వరి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరదాగా మాట్లాడారు.. కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సరదాగా సభలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఆయనకు రెస్ట్‌ ఇస్తాం.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కరించారు. అయితే, ఇద్దరూ కావాలంటూ చేతులెత్తారు సభికులు.. అలా కుదరదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగారు భువనేశ్వరి.. సరదాగా అంటున్నా.. నేను చాలా హ్యాపీగా ఉన్నా.. రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ తర్వాత వ్యాఖ్యానించారు.. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు.. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్నారు నారా భువనేశ్వరి.. అయితే, భువనేశ్వరి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. భువనేవ్వరి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కొందరు నెగిటివ్‌ కామెంట్లు పెడుతుంటే.. మొత్తం వీడియో చూడాలంటూ.. తెలుగుదేశం పార్టీ కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతోంది.

టీడీపీ గూటికి మంత్రి గుమ్మనూరు జయరాం..!
ఏపీలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది.. మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.. దీనికోసం టీడీపీ పెద్దలతో జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారట మంత్రి.. అయితే, గుమ్మనూరు జయరాం.. పార్టీ మార్పులో కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కీలకపాత్ర పోషించినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, గుమ్మనూరు జయరాం గుంతకల్లు అసెంబ్లీ సీటు కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.. అయితే, ఆలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంను తప్పించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.. ఆ సీటుకు విరుపాక్షిని ఇంఛార్జ్‌గా నియమించింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని గుమ్మనూరుకు సూచించింది పార్టీ అధిష్టానం.. కానీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు జయరాం.. వైసీపీ అధిష్టానంతో పలుసార్లు సంప్రదింపులు జరిపినా ఎమ్మెల్యే టికెట్ లేదని వైసీపీ పెద్దలు స్పష్టం చేశారట.. దాంతో.. కొంత కాలం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఎవరికీ అందుబాటులో లేరనే ప్రచారం సాగింది.. ఇదే సమయంలో ఆయన టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లారట.. టీడీపీ నుంచి కూడా పాజిటివ్‌ సంకేతాలు ఉన్నాయని.. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.. అయితే, పార్టీ మార్పుపై గుమ్మనూరు జయరాం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

తెరమీద బొమ్మలు చూడకండి.. రియల్ హీరో జగన్..
తెరమీద బొమ్మలు చూడకండి.. నిజ జీవితంలో మార్పు తీసుకువచ్చినవారిని చూడండి.. రియల్ హీరో జగన్ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్ సేవలకు పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ఎవరికీ అభిప్రాయం చెప్పొద్దని చెప్పలేదు. వాలంటీర్ కూడా మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని చెప్పే హక్కు ఉంది. ఏ ప్రభుత్వం కన్నీరు తుడిసిందో‌ , ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఇక, ఏ వృద్దుడు ఇతర పార్టీలకు ఓటు వేయరన్న ఆయన.. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఉంది, దానిని వినియోగించమని చెప్పండి. మీరే దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయండి అని సూచించారు. వాలంటీర్ కి సర్వీస్ రూల్స్ ఏం లేవు. ఈ ప్రభుత్వం పడిపోయిన రోజున వేలాది మంది గుండేలాగి సచ్చిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు. అవసరం అయితే వాలంటీర్ ఏజెంట్ గా కూర్చోవలసి ఉంటుందన్నారు ధర్మాన.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం..
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నానని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో బాటిళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రోడ్లు, బస్సులు, త్రాగునీరు అన్ని సౌకర్యాలు చేశామన్నారు. మరోవైపు.. చిన్నపిల్లలు ఉన్నట్లైతే వెంట మంచినీటి బాటిళ్లను తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. ఇక ఈరోజు సాయంత్రం సారలమ్మ గద్దెపై కొలువుతీరనుందని.. ఈ మహా ఘట్టం కోసం ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

స్కూళ్ల టైమింగ్స్‌పై నితీష్ సర్కార్ కీలక ఉత్తర్వులు
ఈ మధ్య ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే ఇటీవల ఒడిషా ప్రభుత్వం కూడా డిగ్రీ విద్యార్థులకు రూ.9 వేలు, షెడ్యూల్ తెగల విద్యార్థులకు రూ.10 వేలు స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఇక కేరళ సర్కార్ అయితే మంచినీళ్లు తాగేందుకు విద్యార్థులకు వాటర్ బ్రేక్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో రాష్ట్రం కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు స్కూళ్ల టైమింగ్స్‌ను కుదిస్తూ నితీష్‌ కుమార్ ప్రభుత్వం (CM Nitish Kumar) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది గంటల పాఠశాల వ్యవధిని తగ్గిస్తామని గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీకి (Bihar Assembly) హామీ ఇచ్చారు. తాజాగా సమయాలపై శాసనసభలో రగడ చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి నితీష్.. సమయాలను మార్చాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు విద్యా శాఖ పాఠశాల సమయాలను (Change In School Timings) సవరించింది. పాఠశాల సమయాన్ని ఆరు గంటలకు తగ్గించింది. సవరించిన సమయాలను అనుసరించి, ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కన్హయ్య ప్రసాద్ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సమయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ పేర్కొంది.

కాంగ్రెస్‌తో పొత్తు.. రాహుల్ యాత్రపై క్లారిటీ ఇచ్చేశారు!

యూపీలో కాంగ్రెస్‌తో (Congress) తమ పొత్తు కొనసాగుతుందని.. రాహుల్‌ గాంధీతో (Rahul Gandhi) తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. రాహుల్‌తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. ఎలాంటి వివాదం లేదని అఖిలేష్ తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ మధ్య పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్‌కు బదులుగా సీతాపూర్‌ సీటును కాంగ్రెస్‌కు కేటాయించినట్లు సమాచారం. ఇక 2019 ఎన్నికల్లో యూపీలో రాయ్‌బరేలీ సీటు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా సోనియా గాంధీ మాత్రం విజయం సాధించారు. అమేథీలో పోటీ చేసిన రాహుల్ మాత్రం ఓడిపోయారు. ఈసారి రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్?
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది.. ఈ వాచ్ ల పై ఆసక్తి కలిగిన వారు కేవలం రూ. 99 రూపాయలు మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.. . 1,000 డిస్కౌంట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఉచిత బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫీచర్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ వాచ్ 2 సప్పైర్ క్రిస్టల్‌తో 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. అయితే, ఈ స్మార్ట్ వాచ్ 2 మోడల్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జనరేషన్ 1 చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. గూగుల్ ప్లాట్‌ఫారమ్‌ను ఇందులో ఉపయోగిస్తుంది.. అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉన్న ఈ వాచ్ రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు సిలికాన్ వాచ్ బెల్ట్‌లతో స్టెయిన్‌లెస్ స్టీల్ కేసులను కలిగి ఉంటాయని తెలుస్తుంది..

తరుణ్ భాస్కర్ పై కోర్టుకెళ్లిన ఎస్పీ చరణ్.. డిమాండ్స్ ఇవే
దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై గాయకుడు-నటుడు-నిర్మాత, లెజెండరీ సింగర్ ఎస్‌పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్‌పి చరణ్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో ఒక పాట కోసం AIని ఉపయోగించి ఎస్‌పి బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి కుటుంబ అనుమతిని అడగకపోవడంతో ఎస్‌పి చరణ్ కోర్టుకు వెళ్లాడు. సినిమాలో SPB ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వాయిస్‌ని ఉపయోగించినందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ఇతరులపై అతను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు . కాపీరైట్ చట్టాల ప్రకారం, వాణిజ్య ప్రయోజనాల కోసం ఏదైనా రూపంలో అతని వాయిస్ ఉపయోగించినట్లయితే సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యుల సమ్మతి (కళాకారుడు జీవించి లేకుంటే) తీసుకోవాలి. SP చరణ్‌ డిమాండ్ చేస్తున్న దాన్ని బట్టి కీడా కోలా నిర్మాతలు ఎస్‌పి బాలసుబ్రమణ్యం కుటుంబానికి నష్టపరిహారం కింద రూ. 1 కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, అలాగే రాయల్టీ డబ్బుతో పాటు ఒక అపాలజీ కూడా డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో కాపీరైట్ చట్టాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరగనుంది. ‘శ్రీమంతుడు’ కాపీరైట్‌ సమస్య ఓ కొలిక్కి రావడానికి ఆరేళ్లు ఎలా పట్టిందో ఇటీవలే చూశాం. ‘ కీడ కోలా’లో తరుణ్ భాస్కర్ , బ్రహ్మానందం , చైతన్య రావు , రాగ్ మయూర్ , జీవన్ కుమార్ తదితరులు నటించారు . ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎప్పుడో పూర్తి కాగా ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది.

విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటి..
సినీ సెలెబ్రేటిల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడమో, ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది.. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ పేరుతో నకిలీ అకౌంట్ ను క్రియేట్ చేశారని ఆమె పోలీసులను ఆశ్రయించింది..ఆమె పేరుతో జరుగుతోన్న మోసాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్‌ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ దారుణం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యాబాలన్ పపోలీసులను ఆశ్రయించింది. చాలా రోజులుగా జరుగుతున్న మోసం గురించి నటికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఈ నేపథ్యంలోనే ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దుండగులు ప్రజలను మోసం మోసం చెయ్యనున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.. సినీ పరిశ్రమలోని ప్రముఖులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా విద్యాబాలన్ పేరుతో మోసం జరుగుతోందని ఓ కాస్ట్యూమ్ డిజైనర్‌కు తెలిసింది. ఆ విషయాన్ని నటికి తెలిజేశారు. వెంటనే అప్రమతమైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. భూల్ భూలయ్య 3′ చిత్రానికి సంతకం చేసింది.. 2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భూల్ భూలయ్య’లో ప్రధాన పాత్ర పోషించిన విద్య సీక్వెల్ లో మాత్రం మిస్ అయ్యింది..

Exit mobile version