*ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం సమాధానం
బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు. బడ్జెట్‌ను సహేతుకంగా రూపొందించామని.. గత పదేళ్ళలో ఆదాయం ఉన్నా లేకున్నా, ప్రతి ఏడాది 20 శాతం బడ్జెట్ పెంచుతూ వచ్చారన్నారు. ఈ సారి అలా చేయదలుచుకోలేదని.. 5 నుంచి 6 శాతం తేడా కంటే ఎక్కువ ఉండొద్దని మా ఆలోచన పేర్కొన్నారు. బడ్జెట్ తగ్గించడంపై ఎవరు ఏమనుకున్నా.. వాస్తవ బడ్జెట్ ఉండాలి అనేది మా విధానమన్నారు. 2. 75 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. గతంలో మాదిరిగా గ్యాప్స్ ఉండవన్నారు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు బడ్జెట్ ఉండాలనేది మా విధానమన్నారు. మీరు డబ్బులు లేకున్నా బడ్జెట్ పెంచి బీసీలకు రుణాలు ఇవ్వలేకపోయారని.. దళితబంధు ఇవ్వలేక పోయారని ఆయన విమర్శించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం తప్పని సరి అని.. మీరు చేసిన ఇబ్బందులు అధిగమించే ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్ష ల 11 వేల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. మేము అప్పు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చారన్నారు. ఉద్యోగాల కోసం పదేళ్లు యువత గడ్డాలు పెంచుకుని తిరిగారని.. ఒక్క గ్రూప్-1 ఉద్యోగం అయినా మీరు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీకి అదనంగా సిబ్బందిని, 40 కోట్లు వెంటనే విడుదల చేశామన్నారు. ఒకే రోజు 6,900 నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సింగరేణిలో 412 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర పెట్టామన్నారు. జాతర కొనసాగుతుందన్నారు. ఇంకో 2 వేల మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉన్న దాంట్లోనే కొద్దీ కొద్దిగా అన్నిటినీ అమలు చేస్తామన్నారు. 3500 ఇందిరమ్మ ఇండ్లు ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో తెలిపారు. నెలకు 300 కోట్లు అదనంగా ఆర్టీసీకి ఇస్తున్నామన్నారు. రూ.500కే సిలిండర్, మహాలక్ష్మి పథకం అమలుకు అంచనాలు వేస్తున్నామన్నారు. ఫైనల్ బడ్జెట్‌లో అన్నింటికీ మార్పులు చేర్పులు ఉంటాయన్నారు.
*తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం
తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. సింహం అరుపులతో ఆ వ్యక్తి చెట్టు ఎక్కాడు. కానీ భయంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. ఆ వ్యక్తిని గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సింహం దాడిలో మృతి చెందిన మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు తెలిసింది.
*ముగిసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు
రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. .. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయితే, ఏపీలోని రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.. మూడు సీట్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి ముగ్గురు నామినేషన్ల దాఖలు చేశారు.. రెండు సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధ్ రెడ్డి, గొల్ల బాబూరావు.. అయితే, రాజ్యసభ రేసుకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. దీంతో, వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.. ఏకగ్రీవం లాంఛనమే కాగా.. నామినేషన్ల పరిశీలన ,ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వైసీపీ ముగ్గురు అభ్యర్థులు ఎన్నిక అయినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించనునుంది. కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా బరిలోకి దిగి.. తమ అభ్యర్థిని గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ.. దీంతో, రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో టీడీపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనే చర్చ జోరుగా సాగింది.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. సీట్లు దక్కని సిట్టింగులు, మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారని.. ఇది క్యాష్ చేసుకోవడానికి టీడీపీ తన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ప్రచారం సాగింది. కానీ, బలం లేకపోవడంతో బరిలో దిగకూడదని నిర్ణయించుకుంది టీడీపీ.. పార్టీ సీనియర్ల సమావేశంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇక, రేసు నుంచి టీడీపీ తప్పుకోవడంతో మూడు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తోన్న నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ.. అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తరువాత ఈ ఇద్దరికి అవకాశం కల్పించినట్టు పీసీసీ చెబుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని వీరిని ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
*తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది..
బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె పీఎల్ అలేఖ్య, వారి అనుచరులతో కమలం పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరడం పార్టీకి బలం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. ఈసారి తమ ఓటు బీజేపీకి, మోడీకి వేస్తామని రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వచ్చేది మోదీ ప్రభుత్వమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ అన్నివర్గాల ప్రజలను కోరుతున్నాను బీజేపీని బలపర్చాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా బీజేపీ వైభవంగా నిర్వహిస్తున్నదన్నారు. బ్రిటీష్ వారు అధికార దుర్వినియోగంతో మత మార్పిడులకు పాల్పడ్డారని, దానికి వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాటం చేశారని గుర్తు చేశారు. సంతు సేవాలాల్ తెలుగు రాష్ట్రాల్లో జన్మించి.. ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. బంజారా సమాజం హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం బీజేపీ పని చేస్తుందన్నారు.
*బీజేపీ ఓబీసీ లీడర్ హత్య.. కత్తితో పొడిచి చంపిన దుండగులు..
తమిళనాడులో బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. మధురైలో బీజేపీ ఓబీసీ విభాగం నేత గురువారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని శక్తివేల్‌గా గుర్తించారు. బీజేపీ ఓబీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఈయన గురువారం ఉదయం ఫైనాన్సింగ్ పనిలో నిమగ్రమై ఉండగా.. సాంగు నగర్‌లోని గోదాం వద్దకి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది. శక్తివేల్ వల్లనాథపురంలోని తన ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఉదయం 6 గంటలకు ఈ దారుణం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, దుండగుల బృందం అతనిని వెంబడించి, దారుణంగా దాడి చేసి హత్య చేశారు. దీనిపై అన్నానగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష కోసం పంపారు. అయితే, గూడ్స్ క్యారియర్ విక్రమానికి సంబంధించి శక్తివేల్‌కి ఇటీవల తలెత్తిన వివాదంతో ఈ హత్యకు ఏమైనా ప్రమేయం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
*ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసిన ఫరూక్ అబ్దుల్లా..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉంటామని భావించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విబేధాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. సీట్ల షేరింగ్‌లో కాంగ్రెస్ వైఖరిని నిందించాయి. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందా.? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఆప్ పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదిలా ఉంటే, ఇండియా కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఇతర రాజకీయ పార్టీలో పొత్తు పెట్టుకోకుండా, మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఇండియా కూటమి మూడు సమావేశాలకు హాజరైన ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయం ఇండియా కూటమికి పెద్ద షాక్ అనే చెప్పాలి. గత నెల అబ్దుల్లా సీట్ల షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ మనం దేశాన్ని రక్షించాలంటే, మనం విభేదాలను మరిచి దేశం గురించి ఆలోచించాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ ఇటీవల అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*ఏడుగురు కేంద్రమంత్రుల్ని నామినేట్ చేయని బీజేపీ.. కారణం ఇదేనా..?
లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్‌సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఏప్రిల్ నెలలో రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఏడుగురు కేంద్రమంత్రుల్ని మరోసారి రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయలేదు. అంటే దీని అర్థం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరిని బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ జాబితాలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక) ఉన్నారు. పర్యవరణ మంత్రిగా ఉన్న భూపేందర్ యాదవ్(రాజస్థాన్), ఫిషరీ మంత్రి పురుషోత్తమ్ రూపాలా(గుజరాత్), స్మా్ల్, మీడియా ఇండస్ట్రీస్ మినిస్టర్ నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశాంగ సహాయమంత్రి వి మురళీధరన్(మహారాష్ట్ర) ఉన్నారు. వీరందరూ కూడా రానున్న ఎంపీ ఎన్నికల బరిలో నిలవచ్చని తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రం ఒడిశాలోని సంబల్ పూర్ లేదా ధేక్నాల్ నుంచి పోటీలో ఉండే అవకాశం ఉంది. భూపేందర్ యాదవ్ రాజస్థాన్ ఆల్వార్ లేదా మహేంద్రగఢ్ నుంచి, చంద్రశేఖర్ బెంగళూర్ లోని ఏదో ఒక చోటు నుంచి, మన్సుఖ్ మాండవీయ గుజరాత్ లోని భావ్ నగర్ లేదా సూరత్ నుంచి, పురుషోత్తమ్ రూపాలా రాజ్ కోట్ నుంచి, మురళీధరన్ సొంత రాష్ట్రం కేరళ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 28 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం నలుగురి మాత్రమే బీజేపీ రిపీట్ చేసింది. మిగిలిన 24 మంది లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
*లంచాలు, కమీషన్ల కోసమే ఎలక్టోరల్ బాండ్లు.. కేంద్రంపై రాహుల్ ఆగ్రహం..
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ వాటిని నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు. కాగా, మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ..మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పార్లమెంట్, రాజ్యాంగం తీసుకొచ్చి రెండు చట్టాలను ఉల్లంఘించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇక, ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నికల బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలు, డోనర్ల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
*వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగంతో లేఖ
రాజ్యసభ ఎన్నికలకు రాజస్థాన్ నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత సోనియా గాంధీ రాయ్ బరేలీ ప్రజలకు సందేశం ఇస్తూ పెద్ద ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆరోగ్యం, వయసు పెరగడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. రాయ్‌బరేలీ నా ప్రియమైన కుటుంబ సభ్యులు. ఢిల్లీలో నా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా అది నెరవేరుతుంది. ఈ ప్రేమపూర్వక సంబంధం చాలా పాతది. నా అత్తమామల నుండి నేను దానిని ఆశీర్వాదంగా పొందాను. రాయ్‌బరేలీతో మా వ్యాపార సంబంధాలు చాలా లోతైన మూలాలను కలిగి ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో నా మామగారు ఫిరోజ్ గాంధీజీని ఇక్కడి నుంచి గెలిపించి ఢిల్లీకి పంపారు. ఆయన తర్వాత నా అత్తగారి ఇందిరాగాంధీని మీరే సొంతం చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ధారావాహిక జీవితం, ఒడిదుడుకులు, కష్టతరమైన మార్గంలో ప్రేమ, ఉత్సాహంతో కొనసాగింది. దానిపై మా విశ్వాసం బలపడిందని సోనియా లేఖలో పేర్కొన్నారు.
