*జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డు ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని పేర్కొ్న్నారు. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాల పై చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2.75 లక్షల కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు.. కాంగ్రెస్ ఆరు హామీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
*త్వరలోనే రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్..
తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రూ. 2,75,891కోట్లు లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను కాంగ్రెస్ సర్కార్ రూపొందించింది. ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించినట్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అర్హులైన అందరికి ‘గృహజ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల విద్యు్త్‌ను ఉచితంగా అందజేసేందుకు ఇప్పటికే మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ. 2,418 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్ కో, డిస్కమ్ లకు ఈ బడ్జెట్ లో 16వేల 825 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు శాసన సభలో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక, బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇక, వాటి అమలు కోసం 53 వేల 196 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో భాగంగానే అర్హులైన లబ్దిదారులు అందరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రెడీ అయినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే ఈ హామీకి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఇక, అలాగే, మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలను చెల్లిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
*త్వరలో రైతు రుణమాఫీ.. వారికి రైతు బంధు కట్..
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాపీపై కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని తెలిపారు. అంతే కాకుండా.. అర్హులకే రైతు బంధు ఇస్తామని, రైతు బంధు నిబంధనలు పున:సమీక్ష చేస్తామన్నారు. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని వెల్లడించారు. . రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారని తెలిపారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారని మండిపడ్డారు. అలాంటి వారందరికి రైతు బంధు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు.. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ. 1000 కోట్లు.. ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3.500 ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు. జ్యాబ్ క్యాలెండర్ ను తయారు చేస్తున్నామని, త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాలు వెల్లడించనున్నాట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని, త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం అన్నారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నాం.. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్వేయమన్నారు. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామన్నారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నాం.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని తెలిపారు. టీఎస్పీఎస్సీకి రూ. 40 కోట్లు.. త్వరలో మెగా డీఎస్సీ ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేది.. నకిలీ విత్తనాలతో మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
*సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా TSRTC 100 బస్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను మేడారంకు కూడా నడపనున్నుట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టాలని మేనిఫెస్టోలో పెట్టాం.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకం అమలు చేశామన్నారు. 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని.. ఉద్యమంలో కార్మికులు సైతం ముందుండి నడిపించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించిందని పేర్కొన్నారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగం చేశారు.. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టిందని సీఎం తెలిపారు. ఈసారి రవాణా శాఖకి బడ్జెట్ లో వాస్తవిక అవసరాల మేరకు బడ్జెట్ తగ్గినా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతినెలా ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3 వందల కోట్లు చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం ఆర్టీసీని బలోపేతం అవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించుకుని అయినా సరే.. రాష్ట్ర అవసరాలకు తమ ఖజానాని వాడుతారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మంచి పరిపాలన అందిస్తే తెలంగాణ మోడల్ను ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
*కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదు..
బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడారు. అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. రైతు భరోసా, బీమాలకు నిధులు ఇవ్వలేదన్నారు. రైతుల విషయంలో హస్తం మొండి చేయి అయిందని.. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం నిధుల కేటాయింపులు లేవన్నారు. రైతుల బోనస్‌కు బోగస్ చేసింది ఈ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు కరెంట్ రావట్లేదని.. సబ్ స్టేషన్‌లకు వెళ్లి లాగ్ బుక్‌లు చూద్దాం రండి అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. బడ్జెట్‌లో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయని.. వీటిలో రెండు హామీలు మాత్రమే అమలు అయ్యాయని.. మిగతా 11 హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. వీటిలో ఏది కూడా అమలు చేయట్లేదన్నారు. జనవరి నెల పెన్షన్‌లను ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని.. లేకుంటే నిరుద్యోగుల నుంచి నిరసనలు తప్పవన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలి.. దానికి కేటాయింపులు లేవన్నారు. ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. గృహ జ్యోతి ద్వారా ఉచిత కరెంట్ కావాలంటే 8 వేల కోట్లు కావాలి , కానీ రెండు వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఆటో కార్మికులకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా…ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు.
*పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.
ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడరుకు సూచించారు.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దన్న ఆయన.. జనహితానికీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ అని స్పష్టం.. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నాం అన్నారు.. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో.. పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దు అని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దు అని సూచించారు పవన్.. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగినట్టు అవితుందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలూ, సందేహాలు ఏమైనా ఉంటే రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలన్నారు.. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయి. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకుంటున్నాం అన్నారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవశ్యం అని జనసేన శ్రేణులను అప్రమత్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
*అభివృద్ధిపై చర్చించడానికి రెడీ.. నారా లోకేశ్‌కు మంత్రి సీదిరి సవాల్
చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని, పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరులో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. మహిళల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు.. డబ్బు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రధాని మోడీకి లెటర్ రాశారని ఆరోపించారు. ఇప్పుడు అవకాశం ఇస్తే అన్ని ఇస్తానని చెబుతున్నారు.. ప్రజలు నమ్ముతారా? ప్రజలు బాబుని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాకు, పలాస నియోజకవర్గానికి చంద్రబాబు , నారా లోకేష్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని నారా లోకేష్ చూడాలన్నారు. అభివృద్ధి అంటే కళ్లబొల్లి కబుర్లు కాదని ఎద్దేవా చేశారు. ప్రస్ట్రేషన్‌లో ప్రతిపక్షనేతలు పిచ్చి పిచ్చిగా మాటాడుతున్నారని మంత్రి తీవ్రంగా వ్యాఖ్యానించారు. లోకేష్ శ్రీకాకుళం వచ్చి ఏం మాట్లాడతాని ఆయన ప్రశ్నించారు. 14 ఏండ్ల బాబు పాలన , ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్ధమని.. లోకేష్‌తో అభివృద్ధి అంశంపై చర్చించడానికి రెడీ అంటూ సవాల్ విసిరారు. టీడీపీ బహిరంగ సభకు వచ్చి మాట్లాడటానికైనా తాను రెడీ అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.
*ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా అన్నారు. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని.. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తు్న్నామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మా మిత్రులను ఎప్పుడూ మేము బయటకు పంపలేదని ఆయన చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల గురించి అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో టీడీపీ వచ్చి చేరుతుందా.. ఇతరులు ఎవరైనా వచ్చి చేరుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.
*ఎన్నికల ముందే సీఏఏ అమలు.. అమిత్ షా సంచలన ప్రకటన..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ(సవరణ)చట్టం(సీఏఏ)పై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ‘‘మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏపై రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు’’ అని ఆయన చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్(యూపీపీ)పై దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇతరులు సంతకం చేసిన రాజ్యాంగంలోని ముఖ్యమైన ఎజెండా అని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలతో దానిని విస్మరించాయని, ఉత్తరాఖండ్ యూసీసీ అమలు సామాజిక మార్పుగా అమిత్ షా అభివర్ణించారు. లౌకికదేశంలో మతం ఆధారిత సివిల్ కోడ్ ఉండకూడదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన శనివారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తాము మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని గ్రహించాయని చెప్పారు. మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాం కాబట్టి ప్రజలు మాకు మెజారిటీ ఇస్తారని ఆయన అన్నారు. 1947 దేశ విభజనకు నెహ్రూ-గాంధీ కుటుంబమే కారణమని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన సమయంలో దేశాన్ని ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందనే విషయాన్ని తెలిపేందుకే పార్లమెంట్‌లో శ్వేతపత్రాని సమర్పించామని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలు 500 ఏళ్లుగా అడుగుతున్నారని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల రామ మందిర నిర్మాణానికి అనుమతి లభించలేదని అన్నారు.
*కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఆప్.. పంజాబ్‌లో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటన..
ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఈ కూటమి ఉంటుందా.? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో ప్రధాన రూపశిల్పిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జతకట్టాడు. ఇది ఇండియా కూటమిని మనోబలాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఇదిలా ఉంటే, తాజాగా పంజాబ్ లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఆప్ అస్సాంలో కూటమితో సంబంధం లేకుండా మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్ కనీసం ఈ సారి 40 స్థానాలైనా గెలుస్తుందా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెబుతోంది.
*సీఎం యోగి పాపులారిటీకి తిరుగులేదు..టాప్-10 బెస్ట్ సీఎంలు వీరే..
దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.సొంత రాష్ట్రాల్లో సీఎంల పాపులారిటీలో 52.7 శాతం రేటింగ్‌తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటిస్థానంలో ఉండగా.. 51.3 రేటింగ్‌తో రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
రాష్ట్రాల్లో సీఎంల పాపులారిటీ:
1) నవీన్ పట్నాయక్ (ఒడిశా)
2) యోగి ఆదిత్యనాథ్(యూపీ)
3) హిమంత బిశ్వ శర్మ(అస్సాం)
4) భూపేంద్ర భాయ్ పటేల్(గుజరాత్)
5) మానిక్ సాహా( త్రిపుర)
6) ప్రమోద్ సావంత్(గోవా)
7) పుష్కర్ సింగ్ ధామి(ఉత్తరాఖండ్)
9) అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ)
10) ఎంకే స్టాలిన్( తమిళనాడు)
దేశవ్యాప్తంగా టాప్-10 బెస్ట్ సీఎంలు:
1) యోగి ఆదిత్యనాథ్( యూపీ)
2) అరవింద్ కేజ్రీవాల్( ఢిల్లీ)
3) మమతా బెనర్జీ (వెస్ట్ బెంగాల్)
4) ఎంకే స్టాలిన్ (తమిళనాడు)
5) నవీన్ పట్నాయక్ (ఒడిశా)
6) సిద్ధరామయ్య( కర్ణాటక)
7) హిమంత బిశ్వ శర్మ( అస్సాం)
8) ఏక్‌నాథ్ షిండే( మహారాష్ట్ర)
9) పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్)
10) భూపేంద్రభాయ్ పటేల్( గుజరాత్)
