Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణం ఉచితం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో TSRTC యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో నివాసం ఉంటున్న అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అంతర్ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో ప్రయాణం ఉచితం. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి ఖర్చును రీయింబర్స్ చేస్తుంది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించింది.

*ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయం
ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ప్రజా దర్బార్ కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక ప్రజాభవన్ లో మంత్రి సీతక్క వినతి పత్రాలు స్వీకరించారు. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం ప్రజాభవన్ వేదికగా జరిగిన ప్రజాదర్బార్ కు వేలాదిమంది బాధితులు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్ లో నిలబడి.. సీఎం రేవంత్ రెడ్డికి సమస్యలను చెప్పారు. అంతేకాకుండా.. వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్ లో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి , ప్రజాదర్బార్ లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.

*గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల
నిరుద్యోగులకు ఏపీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీలో 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే పలు రకాల పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు.. అందులో కొన్ని భర్తీ కాగా.. మరికొన్ని ఫలితాల వరకు వచ్చాయి.. ఇదిలా ఉండగా.. గురువారంగ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు.. ఇక, గ్రూప్‌ -2 పరీక్షలకు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఈ పరీక్షల కోసం 2023 డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు.

 

*మీరు ధైర్యంగా ఉండండి.. ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రైతులకు అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్నారు. బాపట్ల జిల్లా పాత నందాయపాలెంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రైతులను చూస్తుంటే బాధేస్తుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని.. మీ చిరునవ్వుతో అది స్పష్టమవుతుందన్నారు. ఈ ప్రభుత్వం మీది అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మంచే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరికి చెడు జరగదన్నారు. కోస్తా తీర ప్రాంతంలో అనేక గ్రామాలను అనేక ప్రాంతాలను ఈ తుఫాను ముంచేసిందని.. ఎన్నడూ చూడని భారీ వర్షాలు కురిశాయని సీఎం చెప్పారు. మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది మన రాష్ట్రంలోనే ఉన్నది ఒక గొప్ప సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అని.. ఈ వ్యవస్థ ద్వారానే ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా చేయి పట్టుకొని సహాయం చేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. వివక్షతకు తావు లేకుండా, మనకు ఓటు వేయని వారికి నష్టం జరిగినా వారికి తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుందన్నారు. అత్యంత పారదర్శకతతో బాధితులను గుర్తించడం, వాళ్ళందరికీ ధైర్యం కల్పించడం ఈ ప్రభుత్వం బాధ్యత అని వెల్లడించారు. గత ప్రభుత్వాలు కరువు వచ్చినా, వరదలు వచ్చినా పట్టించుకునేవి కాదన్నారు. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో , ఎంతమందికి సబ్సిడీ వస్తుందో ఎవరికీ తెలిసేది కాదని, కానీ గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ఈ ప్రభుత్వం చరిత్రను మార్చేసిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులు ఎవరైనా సరే, రేషన్‌తో పాటు 2500 రూపాయలు ప్రతి బాధిత కుటుంబానికి ఇస్తున్నామన్నారు. పంట నష్టానికి సంబంధించి ప్రతి రైతన్న అపోహలు నమ్మొద్దు…. ఇన్సూరెన్స్ రాదని ,ఇన్పుట్ సబ్సిడీ రాదని చెప్తే, మాయమాటలు నమ్మొద్దన్నారు. నేను చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండండి అంటూ సీఎం జగన్‌ అన్నదాతలకు ధైర్యం చెప్పారు. వచ్చే సంక్రాంతి లోపు ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ మీ ఖాతాలో పడుతుందన్నారు సీఎం జగన్. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సప్లై చేస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్, వచ్చే ఖరీఫ్ ప్రారంభానికి ఇచ్చి తీరుతామన్నారు.

 

*”క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో పార్లమెంట్ నుంచి ఎంపీ మహువా మోయిత్రా బహిష్కరణ
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రాపై ‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 49 ఏళ్ల మహువా మోయిత్రా లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అదానీలను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి, బహిష్కరించాలని సిఫారసు చేసింది. ఈ రోజు ఎథిక్స్ కమిటీ తన నివేదికను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది. రూ. 2 కోట్ల నగదు, విలాసవంతమైన వస్తువులను లంచంగా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నారని తేలింది. అయితే ఆమె తాను లంచం తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు. లాగిన్ వివరాలను వేరేవాళ్లకు ఇచ్చిన విషయాన్ని ఒప్పుకున్నారు. లోక్‌సభ సభ్యురాలిగా తన బహిష్కరణపై మహువా మోయిత్రా పార్లమెంట్ వెలుపల మాట్లాడారు. నన్ను బహిష్కరించడం ద్వారా అదానీ సమస్యను దూరం చేయాలని ఈ మోడీ ప్రభుత్వం భావిస్తే.. దీనిని కోర్టులో చూపించండి అంటూ విమర్శించారు. యావత్ భారత్ దీనిని అదానీ వ్యవహారంలో మీరు చేస్తున్న చర్యల్ని గమనిస్తోందని అన్నారు. ఒక మహిళా ఎంపీని లొంగదీసుకోవడానికి, వేధించడానికి ఎంత దూరం వెళతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దోషిగా తేల్చేందుకు ఎథిక్స్ కమిటీ అన్ని నిబంధనలను ఉల్లంఘించిందని మహువా ఆరోపించారు. రేపటి నుంచి సీబీఐని నా ఇంటికి పంపించి వేధించాలని అనుకుంటున్నారని చెప్పారు.

వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం..
దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను అదుపులో ఉంచడంతో పాటు, సామాన్యులకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ఎగుమతులపై వచ్చే ఏడాది మార్చి వరకు నిషేధాన్ని విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘‘ఉల్లిపాయల ఎగుమతి విధానం.. మార్చి 31, 2024 వరకు నిషేధించబడింది’’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) నోటిఫికేషన్‌లో తెలిపింది. దేశ రాజధానిలో స్థానిక విక్రేతలు కిలో ఉల్లిని రూ.70-80 చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి ముందు వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైన్ మార్కెట్‌లలో ఉల్లి బఫర్ స్టాక్‌ని కిలోకు రూ. 25 చొప్పున విక్రయించాలని కేంద్రం అక్టోబర్ నెలలో నిర్ణయించింది. ధరల నియంత్రణకు కేంద్రం గతంలో అనేక చర్యలు తీసుకుంది. అక్టోబర్ 28 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు కనిష్ట ఎగుమతి ధర(ఎంఈపీ)ని 800 డాలర్లుగా విధించింది. ఆగస్టు నెలలో డిసెంబర్ 31 వరకు ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. అయితే, ఉల్లి ఎగుమతులపై పలు దేశాల అభ్యర్థన మేరకు మంజూరు చేసిన అనుమతి ఆధారంగా అనుమతించబడుతుందని డీజీఎఫ్‌టీ తెలిపింది. ఈ నోటిఫికేషన్ ముందు వరకు లోడైన ఉల్లిపాయల షిప్‌మెంట్‌ల ఎగుమతి చేసుకోవడానికి అనుమతించబడుతుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి చేసింది. దేశం నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే టాప్-3 దేశాల్లో బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ ఉన్నాయి. ఈ ఖరీఫ్ కాలంలో వర్షాలు, ఇతరత్రా వాతావరణ సమస్యలు ఉల్లి పంటపై ప్రభావం చూపడంతో, ధరలు పెరిగాయి. నవంబర్ 14న విడుదల చేసిన డబ్ల్యుపిఐ డేటా ప్రకారం, కూరగాయలు మరియు బంగాళదుంపల ద్రవ్యోల్బణం వరుసగా (-) 21.04 శాతం మరియు (-) 29.27 శాతం వద్ద ఉండగా.. అక్టోబర్ నెలలో మాత్రం ఉల్లి వార్షిక ధర పెరుగుదల రేటు 62.60 శాతం వద్ద అధికంగా ఉంది.

 

*దేశంలో 12.5% పెరిగిన గుండెపోటు మరణాలు.. కారణం ఏమిటంటే..!?
ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న గుండెపోటు సమస్య పైన ఎన్‌సీఆర్‌బీ ద్రుష్టి సారించింది. ఎన్‌సీఆర్‌బీ చేసిన పరిశోధనల నివేదిక ప్రకారం 2021తో కంటే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని వెల్లడించింది.కేవలం 2022 లోనే గుండె పోటు కారణంగా 32,547 మందిమరణించారని తెలిపింది. ఈ మరణాలకు కారణాన్ని కూడా కనుగొన్నామని పేర్కొంది. ఇలా గతంలో కంటే ప్రస్తుతం గుండెపోటు శాతం పెరగడానికి కారణం కొవిడ్‌ వ్యాధి అని తెలిపింది. కొవిడ్‌ వ్యాధి వల్ల గుండె పనితీరు బలహీనంగా మారిందని.. దీనితో గుండెపోటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. 2022లో 56,450 హఠాత్తు మరణాలు సంభవించాయని పేర్కొన్న ఎన్‌సీఆర్‌బీ.. హింస వల్ల కాకుండా ఏ ఇతర కారణాల చేత మరణించిన.. ఉదాహరణకు గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి కారణాలతో నిమిషాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఆ మరణాన్ని హఠాత్తు మరణంగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే ఇలా హఠాత్తు మరణాల సంఖ్య పెరగడం పెరగడం ఆందోళన కలిగిస్తుందని విచారం వ్యక్తం చేసింది. అలానే ఈ మరణాలను అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం వంటి లక్షణాలను అలవర్చుకోవడం వల్ల గుండెపోటు సమస్యను అధిగమించవచ్చు అని తెలిపింది.

*కొత్త సీఎం కు మహేష్ బాబు అభినందనలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ” తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు.. మీరు రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు మరియు అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలకు నడిపించండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికోస్తే.. ప్రస్తుతం ఆయన గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.మరి ఈ సినిమాలతో మహేష్ బాబు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version