రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందంటూ ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. దీనిపై పలు సందర్భంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.. అయితే, డీఎస్సీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని స్పష్టం చేశారు.. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. ఇక, అంగన్వాడీల సమ్మెపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి వెంటనే వేయి రూపాయాలు పెంచుతాం అని హామీ ఇచ్చాం.. అదే మాదిరిగా రూ.11 వేలు ఇచ్చాం అన్నారు. పది డిమాండ్లు ఒప్పుకున్నాం.. ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలకు వెళ్తున్నాం కావున.. ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.. మరోవైపు, బెల్ట్ షాపులు చంద్రబాబు టైమ్ లో వచ్చాయి వాళ్లని అడగండి.. అని నిలదీశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏదో చెబుతాడు.. దానికి ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేడని దుయ్యబట్టారు. ట్యాబ్‌ల కొనుగోలు విషయంలో.. ఏడు వందల కోట్లు. అన్నీ కలిపితే పద్నాలున్నర కోట్లు.. అంతే గాని వందల కోట్లు అవినీతి అని చెప్పాడం సిగ్గు అని మండిపడ్డారు.
జనసేన-బీజేపీ-టీడీపీ పొత్తు..! పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. రాజకీయ వాతావరణం మారిపోతోంది.. ఇప్పటికే ఒంటరిగానే బరిలోకి దిగాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోగా.. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. తాము వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించింది.. ఆ దిశగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఇండియా కూటమి.. అంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి పోటీ చేసే విషయంలో చర్చలు జరుపుతున్నాయి. అయితే, జనసేన పార్టీ.. బీజేపీతో ఉందా? లేదా? అనేది మాత్రం ఎటూ తేలడంలేదు.. బీజేపీతో మేం పొత్తులో ఉన్నామని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతూ వచ్చారు.. ఇక, పురంధేశ్వరి కూడా అదే విషయం మరోసారి స్పష్టం చేశారు. మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నేను పలానాచోట పోటీ చేస్తానని పార్టీని అడగలేదన్నారు పురంధేశ్వరి.. కానీ, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. కాగా, గతంలో కూడా బీజేపీ-జనసేన రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని పవన్ చెప్పడం.. జనసేనాని కూడా అదే చెప్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చెబుతున్న విషయం విదితమే.. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా జనసేన ఎక్కడా చెప్పలేదని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నామని ఇప్పటికే పురంధేశ్వరి స్పష్టం చేసిన విషయం విదితమే.
వైసీపీ రెండో లిస్ట్ రెడీ.. 30 నియోజకవర్గాల్లో మార్పులు..? రోజా సేఫ్..! అంబటికి నో ఛేంజ్..!
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి.. తొలి విడతలో మంత్రులు సహా 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధిష్టానం.. ఇక, రెండో లిస్ట్‌పై కసరత్తు కొనసాగుతుండగా.. అది ఫైనల్ అయినట్టుగా ప్రచారం సాగుతోంది.. అయితే, మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలను రెండో జాబితా టెన్షన్ పెడుతోంది.. వైసీపీలో ఎలక్షన్ హీట్ కొనసాగుతుండగా.. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పుపై కసరత్తు సాగుతోంది.. తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు జరిగాయి.. మరో 10, 11 స్థానాలతో దాదాపుగా సిద్ధం అయ్యిందట సెకెండ్ లిస్ట్.. ఇవాళ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. రెండో జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది.. అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు. ఇక, దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ కు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఎమ్మిగనూరు పై ఇంకా స్పష్టత రాలేదు.. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నారు.. ఇప్పటికే ఆయనకు 82 ఏళ్ళ వయస్సు రావటంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందట పార్టీ హైకమాండ్.. ఎమ్మిగనూరు నుంచి బుట్ట రేణుక లేదా చెన్నకేశవ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక, మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ తానే పోటీ చేయబోనని ప్రకటించారు.. కానీ, ఎమ్మెల్యే వసంతను పిలిచి వైసీపీ అధిష్టానం బుజ్జగించిందట.. మరోసారి పోటీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసిందట.. దీంతో.. మరోసారి పోటీకి రెడీ అవుతున్నారట వసంత కృష్ణప్రసాద్. అయితే, రెండో జాబితాలో 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే చర్చ సాగుతుండగా.. ఫైనల్‌లిస్ట్ వస్తేగానీ.. ఆయా స్థానాల్లో నేతల టెన్షన్‌కు తెరపడేలా లేదు.
బీసీలకు ప్రత్యేక చట్టాల అమలు..! తీవ్రంగా స్పందించిన మంత్రి..
బీసీ చట్టానికి సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేక చట్టాలు అమలు చేస్తే మొదట అది నీ తండ్రి (చంద్రబాబు నాయుడు)పైనే ప్రయోగించాల్సి ఉంటుంది అని సెటైర్లు వేశారు. బీసీలను దూషించిన వ్యక్తి నీ తండ్రి.. బీసీలను ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఇప్పుడు బీసీలు చైతన్యవంతులు అయ్యారు.. కాబట్టే 2019లో మీకు 23 స్థానాలు ఇచ్చారు.. ఇప్పుడు మూడు మాత్రమే మిగులుస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఇక, బీసీ యువత నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావడం 2004లో వైయస్సార్ హయాం నుంచి ప్రారంభమైందన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకు అమలు చేసిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు.. మరోవైపు.. ఒక పీకే (పవన్ కల్యాణ్) సరిపోలేదనుకుని ఇప్పుడు మరో పీకే (ప్రశాంత్ కిషోర్)ను తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంది.. ఇద్దరు పీకేల మధ్యన లోకేష్ దూరాడు అంటూ సెటైర్లు వేశారు. అయితే, ఎంతమంది వచ్చినా.. ఎందరు పీకేలు వచ్చినా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరు.. 2024లో సైతం వైఎస్ జగన్ హవా మాత్రమే నడుస్తుంది.. మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదు.. వ్యక్తిగత కారణాల వల్లే కొంత మందికి అసంతృప్తి..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జ్‌ల మార్పు కొన్ని ప్రాంతాల్లోని నేతలు అసంతృప్తి వ్యక్తం చేసేలా చేసింది.. అంతేకాదు.. కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఇతర పార్టీలో చేరుతున్నారు.. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ఇంఛార్జీల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని యాత్రలు చేసిన నారా చంద్రబాబు నాయుడును మరోసారి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. బీసీ డిక్లరేషన్ , గ్యారెంటీలు ప్రజలను మోసం చేయడానికే అనే దుయ్యబట్టారు. ఇక, కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు అనేక కారణాలు ఉన్నాయని.. సామాజిక సమీకరణాలు కొన్ని చోట్ల, ఆర్థిక వ్యవహారాలు మరికొన్ని చోట్ల.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు కారణంగా చెప్పుకొచ్చారు.. అయితే, ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్లే కొంత మంది పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యే వంశీ.. జనసేన పార్టీలో చేరడంపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ వంశీకి పోటీ చేసే అవకాశం ఇస్తే భారీ తేడాతో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. కాగా, తొలి జాబితాలో మంత్రులు సహా 11 మంది స్థానాలు మార్చిన వైసీపీ అధిష్టానం.. రెండో జాబితా సిద్ధం చేస్తోంది.. రెండో జాబితాలో ఏకంగా 30 మందిని మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోన్న విషయం విదితమే.
ఎంపీ స్థానాలపై ఫోకస్.. జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.
• 3న ఆదిలాబాద్
• 4న కరీంనగర్
• 5న చేవెళ్ల
• 6న పెద్దపల్లి
• 7న నిజామాబాద్
• 8న జహీరాబాద్
• 9న ఖమ్మం
• 10న వరంగల్
• 11న మహబూబాబాద్
• 12న భువనగిరి
• 16న నల్గొండ
• 17న నాగర్ కర్నూలు
• 18న మహబూబ్ నగర్
• 19న మెదక్
• 20న మల్కాజ్ గిరి
• 21 సికింద్రాబాద్, హైదరాబాద్
వృద్ధాప్య పెన్షన్‌పై జార్ఖండ్ సీఎం సంచలన నిర్ణయం
తన ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు, రాష్ట్రంలో స్థాపించే కంపెనీలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేయబడతాయని సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు చేశారు. జార్ఖండ్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమని, కొవిడ్-19, కరువుతో పోరాడుతున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి గందరగోళం లేదని హేమంత్ సోరెన్ అన్నారు. జార్ఖండ్ వంటి పేద రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేశాయని, మహమ్మారి సమయంలో పేద కార్మికులు రక్షించబడ్డారని, అయితే ఇద్దరు మంత్రులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గత బీజేపీ పాలనపై జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, సీఎం హేమంత్ సోరెన్ విరుచుకుపడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్నింటినీ నాశనం చేసిందని.. ఆ సర్కారు హయంలో రైతు మరణించారని ఆయన అన్నారు. తన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. జార్ఖండ్‌ను ఢిల్లీ లేదా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి కాకుండా గ్రామాల నుంచి పరిపాలిస్తామని అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగమేనన్నారు. స్థానికులకు ఉద్యోగాల వాగ్దానాల రూపురేఖలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, పంజాబ్, హర్యానా హైకోర్టు గత నెలలో హర్యానాలో ఇదే విధమైన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. ఈ చట్టం వెనుక ఉన్న నేల పుత్రులు అనే భావన యజమానుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.
రేపే పట్టాలెక్కనున్న అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. గంటకు ఎన్ని కి.మీ ప్రయాణిస్తుందంటే..
కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందేభారత్‌కు స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమ్రిత్ ఎక్స్‌ప్రెస్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే వీటి ప్రారంభోత్సవానికి రంగం అంతా సిద్ధమైంది. రేపు డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను అయోధ్యలో రేపు లాంచనంగా ఈ రైళ్లను ప్రారంభించననున్నారు. ఇందులో ఒకటి యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్భంగా వరకు సేవలు ప్రయాణిస్తుండగా.. రెండవది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా-బెంగళూరు వరకు ఏపీ మీదుగా ప్రయాణుకులకు సేవలు అందించనుంది. ఈ అమ్రిత్ భారత్ రైళ్లను ప్రత్యేక సదుపాయాలతో ప్రవేశపెడుతున్నారు. ఇవి గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఈరైళ్లను తీసుకువచ్చినట్టు యూనియన్ రైల్లే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో ‘పుష్-పుల్’ వంటి అడ్వా్న్డ్స్ టెక్నాలజీని కలిగి ఉందని, ఇది రైళ్ల వేగాన్ని, ప్రయాణీకుల సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుందని చెప్పారు. ఈ అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, సీసీటీవీలు,పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టిమ్ వంటి ఇరత సౌకర్యాలు కలిగి ఉన్నాయి. రేపు అయోధ్యలో ప్రదానీ జెండా ఊపీ రైళ్లను ప్రారంభించననున్నారు. అనంతరం టెస్ట్ కోసం 4, 5 నెలల పాటు టెస్ట్ రన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
విజయకాంత్ బ్రతికిఉండి ఉంటే తమిళ రాజకీయాలలో ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు..
తమిళ స్టార్ నటుడు, డీఎండీకే చీఫ్ ,కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తనను ఎంతో బాధించిందని తలైవా రజనీకాంత్ తెలిపారు.శుక్రవారం ఉదయం చెన్నైలోని అన్నాసాలైలోగల ఐలాండ్ మైదానం లో కెప్టెన్‌కు రజినీ నివాళులర్పించారు. అనంతరం ఆయన విజయకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. విజయకాంత్ మంచి మనసున్న వ్యక్తి.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.. ‘నా ప్రియ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. విజయకాంత్ ఆరోగ్య సమస్యల నుంచి త్వరలోనే కోలుకుంటారని తాము అంతా అనుకున్నాం. అయితే ఇటీవలే డీఎండీకే మీటింగ్‌లో ఆయన్ని చూడగానే నాలో వున్న ఆ కాస్త ఆశ పోయింది. ఆయన బతికి ఉండి ఉంటే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకం గా వ్యవహరించేవారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసేవారు. విజయకాంత్ లాంటి మంచి మనసున్న వ్యక్తి మనకు ఎప్పటికి దొరకడు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అంటూ రజినీ తన సంతాపం వ్యక్తం చేసారు. కాగా విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతోబాధపడుతున్నారు. గత నెల 18న కూడా జలుబు, దగ్గు,గొంతునొప్పి వంటి సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. చికిత్స తరువాత కోలుకుని డిసెంబర్ 11 న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలైనా గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో చెన్నై లోని ఆసుపత్రి లో చేర్పించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నై లోని అన్నాసాలై లోగల ఐలాండ్ మైదానం లో ఉంచారు. శుక్రవారం సాయంత్రం 4:45 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమం లో విజయకాంత్ ను కడసారి చూసేందుకు సినీ మరియు రాజకీయ ప్రముఖులు అలాగే ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు వేలాది మంది తరలివస్తున్నారు.
గ్రాండ్ గా అమీర్ ఖాన్ కూతురి పెళ్లి..
బాలివుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది.. ఆమె పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..అయితే జనవరి 3వ తేదీన నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకోనుంది. ఇప్పటితే వీరి వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ జంట వివాహం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో పెళ్లి జరగనుందని అబ్బాయి కుటుంబ సభ్యులు తెలిపారు.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రెసెప్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లి తర్వాత రెండు రిసెప్షన్ పార్టీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6 నుంచి 10 తేదీల మధ్య ఢిల్లీతో పాటు జైపూర్‌లోనూ రిసెప్షన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.. ఐరా సమాజ సేవలు చేస్తుంది.. మానసికంగా సరిగ్గా లేని వారికి చేయూతను ఇస్తుంది.. వారికోసం అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి..
షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
కోలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడం వలనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతితో కోలీవుడ్ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొట్ట తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఇక తాజాగా దళపతి విజయ్.. గురువారం రాత్రి చెన్నైలోని ఐల్యాండ్ గ్రౌండ్‌లో విజయకాంత్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాడు. ఆయనను చివరి చూపు చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. అనంతరం ఆయన తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. విజయ్ రాకతో అభిమానులు మొత్తం గుంపుగా పోగయ్యారు. ఆయన కారు వద్దకు వెళ్తుండగా.. ఎవరో గుర్తుతెలియని వాయ్కటి విజయ్ పై చెప్పు విసిరాడు. అది విజయ్ తలకు తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి ఎదురైంది. కచ్చితంగా ఈ పని చేసింది అజిత్ అభిమానినే అని కోలీవుడ్ టాక్ నడుస్తోంది. అసలు విజయ్ వచ్చిన ప్లేస్ ఏంటి.. ? సందర్భం ఏంటి.. ? అనేది కూడా చూడకుండా ఇలాంటి చెత్తపనులు చేయడమేంటనీ నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ వార్ ఉంటే బయట చూసుకోండి. హీరోలు.. హీరోలు బాగానే ఉంటారు. మీరు కొట్టుకొని.. ఇలాంటి పనులు చేసి అభిమానులే పోలీసుల చేతికి చిక్కి తన్నులు తింటున్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక విజయ్ కు, విజయకాంత్ కు విడదీయరాని బంధం ఉంది. విజయకాంత్ సినిమాలో విజయ్ బాలనటుడిగా నటించి మెప్పించాడు. ఆ అనుబంధంతోనే విజయ్ అంతగా ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
