Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*నేటి నుంచే చలాన్లపై డిస్కౌంట్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాయితి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు (డిసెంబర్ 26) నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టూ వీలర్స్‌పైన 80 శాతం రాయితీ ప్రకటిస్తున్నట్టు జీవో స్పష్టం చేసింది. త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీ.. కార్లకు 50 శాతం రాయతీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తింపు. కాగా రాష్ట్రంలోని వాహనదారులకు పోలీసు శాఖ పెండింగ్‌ చలాన్లు తక్షణమే చెల్లించేందుకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు వాహ‌నాల పెండింగ్ చ‌లాన్లు రాయితీపై చెల్లింపున‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. పెండింగ్ చ‌లాన్ల‌పై డిస్కౌంట్ ఇస్తూ ర‌వాణా శాఖ కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. నేటి నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు పెండింగ్ చ‌లాన్ల‌ను చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు.గత ఏడాది ఇలాగే రాయితీ ప్రకటించడంతో 45 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్ల రుసుము వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు.

 

*ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఢిల్లీలోని ప్రదాని నివాసానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం మోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించన్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇతర అంశాలపై సీఎం మాట్లాడనున్నారు.

 

*వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై మంత్రి అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల వైసీపీలో ఇంఛార్జులను సీఎం జగన్‌ మార్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తి గళం విప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై అనకాపల్లిలో మంత్రి అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్లు మార్పు ఉంటుందని ముఖ్యమంత్రి ముందే మాకు స్పష్టం చేశారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రికి 175 మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమన్నారు. మా సీటు మార్చినా పోటీ చేయొద్దు అన్న పార్టీకి కట్టుబడి ఉంటామని.. ముఖ్యమంత్రి ప్రకటించింది నియోజకవర్గం ఇంఛార్జులను మాత్రమే ఎమ్మెల్యే సీట్లు కాదన్నారు. బీఫాం ఇస్తేనే సీట్లు ప్రకటించినట్టు అంటూ మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

 

*వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తి గళం విప్పుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్యీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో మారుతున్న రాజకీయ పరిణామాలు , వచ్చే ఎన్నికలు, అనంతర రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పార్టీ మార్పు వ్యవహారంపై స్ధానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆయన పార్టీ మారుతున్న సమాచారం నా దగ్గర లేదని మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు. పార్టీ ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చిందని.. ఎమ్మెల్సీ పార్టీ మారితే రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నారు.

 

*కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు. పూంచ్‌లో ఉగ్రవాదుల దాడిలో 5 మంది ఆర్మీ జవాన్లు మరణించి, మరుసటి రోజు ముగ్గురు పౌరులు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఫరూక్ అబ్దుల్లా దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. “మనం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకపోతే, ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్న గాజా, పాలస్తీనాల మాదిరిగానే మనం కూడా అదే విధిని ఎదుర్కొంటాము” అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. కాశ్మీర్‌పై దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వైఖరిని ఉద్దేశిస్తూ ఫరూక్ అబ్దుల్లా ఇలా అన్నారు. ”మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్‌పేయి తరచు చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ? నవాజ్ షరీప్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా చర్చలకు (ఇండియాతో) సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాగా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించి, ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న గుహలను కూల్చివేయాలని స్థానిక సైనికులను కోరారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇంతలో, రాజౌరీ-పూంచ్‌లో వైమానిక నిఘా, కూంబింగ్ కార్యకలాపాలు, ముఖ్యంగా డేరా కి గలీ, బఫ్లియాజ్ అటవీ ప్రాంతంలో మంగళవారం 7వ రోజుకి చేరుకోవడంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వరుసగా నాల్గవ రోజు మూసివేయబడ్డాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం రాజౌరీ-పూంచ్ సెక్టార్‌ను సందర్శిస్తారని, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనికులతో సంభాషిస్తారని, ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడుల తరువాత ఇప్పటికీ పోరాడుతున్న పౌరులతో సమావేశమవుతారని పలు వర్గాలు తెలిపాయి

 

*వారు ఎక్కడ దాక్కున్నా గుర్తించి వేటాడుతాం.. రక్షణ మంత్రి ప్రతిజ్ఞ
భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు. వర్తక నౌకపై దాడి చేసిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా కనుగొంటామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సముద్రంలో భారత నౌకాదళం నిఘా పెంచిందని ఆయన స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సముద్రంలో జరిగిన దాడులను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నిఘాను పెంచింది. సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని రక్షణ మంత్రి తెలిపారు. భారతదేశ అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు విస్తుపోతున్నాయని మంత్రి తెలిపారు. సౌదీ అరేబియా నుంచి ముడి చమురును తీసుకువెళుతున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే కార్గో నౌక న్యూ మంగళూరు ఓడరేవుకు వెళుతున్నప్పుడు అరేబియా సముద్రంలో భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ద్వారా హౌతీ మిలిటెంట్లు చేసిన డ్రోన్ దాడిలో లక్ష్యంగా చేసుకుంది. జపాన్‌కు చెందిన, నెదర్లాండ్స్‌కు చెందిన లైబీరియన్ జెండా కింద ఉన్న కెమికల్ ట్యాంకర్‌ను డిసెంబర్ 23న భారత తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ ఢీకొట్టింది. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ నౌకాశ్రయం నుంచి న్యూ మంగుళూరు ఓడరేవుకు ఇది ముడి చమురును తీసుకువెళుతోంది. భారత నౌకాదళం ప్రకారం, 20 మంది భారతీయ, వియత్నామీస్ సిబ్బంది వాణిజ్య నౌకలో ఉన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో కార్గో షిప్ సోమవారం ముంబై పోర్టుకు చేరుకుంది.

 

*అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు ‘ఆదిపురుష్’కి పిలుపు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనుంది. ఈ వేడుక కోసం దేశంలో భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులను హాజరు కమ్మని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుక కోసం రణబీర్ కపూర్, అలియా భట్, అక్షయ్ కుమార్‌లతో పాటూ తెలుగు నుంచి చిరంజీబీవీతో పాటు ప్రభాస్ ను సైతం ఆహ్వానించినట్లు పింక్‌విల్లా ఒక రిపోర్టులో పేర్కొంది. సన్నీ డియోల్, అజయ్ దేవ్‌గన్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్ – యష్ లు కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. అదే విధంగా సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, రాజ్‌కుమార్ హిరానీ సహా ఇంకా చాలా మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ రామజన్మభూమి దర్శనం కోసం అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించారు. ఇక, అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని, ఆలయ సంప్రోక్షణకు ఆహ్వానం అందడం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. తాజాగా జగద్గురు రామభద్రాచార్య తులసి పీఠంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో, భారతదేశాన్ని వివిధ మార్గాల్లో నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి” – వాటిలో ఒకటి “సంస్కృతాన్ని పూర్తిగా నాశనం చేయడం” అని అన్నారు. నిజానికి రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడే సాధువులు మరియు VVIPలతో సహా సుమారు 6000 మంది ప్రముఖుల జాబితాను ట్రస్ట్ ఈ నెల మొదట్లోనే ఖరారు చేసింది. ఇక మూడు గంటల ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది, ప్రధానమంత్రి వేదిక నుండి బయలుదేరిన తర్వాత మాత్రమే ఇతరులను బయలుదేరడానికి అనుమతిస్తారు.

 

*సలార్ మరో సెన్సేషన్… తెలుగు రాష్ట్రాల్లో RRR రికార్డు బ్రేక్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమాకి క్రిస్టమస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కువగా పడుతున్నాయి. ఇక ఈ సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ పేరు మీద ఉన్న రికార్డును ఈ సలార్ సినిమా బద్దలు కొట్టింది. ఏపీ తెలంగాణలో కలిపి 4వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్టు ఈ మేరకు ఉంది. 18.05 కోట్లతో సలార్ మొదటి ప్లేసులో ఉండగా ఆర్ఆర్ఆర్ 17.73 కోట్లతో రెండో ప్లేసులో ఉంది. ఇక తరువాత బాహుబలి2 – 14.65 కోట్లు, సర్కారు వారి పాట – 12.06 కోట్లు, అలవైకుంఠపురములో – 11.56 కోట్లు, వాల్తేర్ వీరయ్య – 11.42 కోట్లు, కేజీఎఫ్ 2 (డబ్) – 10.81 కోట్లు, సాహో – 9.60 కోట్లు, సరిలేరు నీకెవ్వరు- 8.67 కోట్లు, మహర్షి – 8.44 కోట్లు, అఖండ- 8.31 కోట్లు షేర్ సాధించి టాప్ టెన్ నాలుగో రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఇక సలార్ సినిమా టోటల్ కలెక్షన్స్ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సలార్ రెండు భాగాలుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. మొదటిది ‘సాలార్- సీజ్ ఫైర్(కాల్పుల విరమణ)’ కాగా రెండవది ‘సాలార్ – శౌర్యాంగ పర్వం.’ ప్రభాస్ దేవా అలియాస్ సాలార్ పాత్రలో నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ వరద రాజ మన్నార్‌గా, జగపతి బాబు రాజమన్నార్‌గా, శృతి హాసన్ ఆద్యగా కనిపించారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది.

Exit mobile version