Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నట్లుల తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని మంత్రులతో సీఎం అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు ఉండే అవకాశం ఉంటుందని.. అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. “ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాం. అయినా కూడా మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలి. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.” అని సీఎం జగన్‌ కేబినెట్‌ భేటీలో అన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష పార్టీల విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.

 

*పెన్షన్‌ పెంపు, విశాఖ మెట్రోతో పాటు ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు కీలక అంశాలపై చర్చించారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3000కు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మొత్తం 45 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. మిచౌంగ్ తుఫాన్ నష్ట పరిహారం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు ఆమోదం లభించింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభం కానున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది.

 

*ఒంటరిగానే పోటీ చేస్తాం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మించి సీట్లు పొందుతాం
పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఒంటరిగానే పోరాడుతామని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను అధిగమించి సీట్లు పొందుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంత దూరమో, కాంగ్రెస్ కూడా అంతే దూరమన్నరు. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యాచరణ ఆ సమావేశంలో నిర్ణయం అవుతుందని తెలిపారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్న పాల్గొనక పైన బీజేపీ శ్రేణులు మాత్రం పాల్గొనాలన్నారు. బీజేపీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తారని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల పైన ఉమ్మడి పది జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి నేత ఆ రివ్యూ లో పాల్గొంటారన్నారు. వెంటనే పార్లమెంట్ ఎన్నికలకి సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వస్తున వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతనో బీఆర్ఎస్ కూడా తమకు అంతే అని స్పష్టం చేసిన ఆయన ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.

*రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి!
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలు కాగా.. భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెసులుస్తోంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు.

*చంద్రబాబుకు తలకాయ ఉండి ఆ లేఖలు రాస్తున్నాడా??
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది జగన్ ప్రభుత్వమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మేం చేసిన పనులపై చంద్రబాబు అభూత కల్పనలు చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేశామన్నారు. గ్రామాల స్వరూపం మారిందని.. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామన్నారు. వీటిలో ఐదు లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం పూర్తి అయ్యిందని సజ్జల వెల్లడించారు. 16 లక్షల కోట్లతో స్కూళ్లల్లో నాడు – నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ళల్లా మారాయన్నరు. చంద్రబాబుకు తలకాయ ఉండి ఆ లేఖలు రాస్తున్నాడా?.. 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం అని ఏ ప్రాతిపదికన చంద్రబాబు చెబుతున్నాడని ఆయన మండిపడ్డారు. బాధ్యత ఉన్న నాయకుడు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబుకు పంట నష్టం అంచనాలు ఎలా వేస్తారో తెలియదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. సజ్జల మాట్లాడుతూ.. “ఏడాదిలో 300 రోజులకు పైగా హైదరాబాద్‌లో ఉంటావ్.. గెస్ట్ లాగా ఇక్కడికి వస్తాడు.. మూడు నెలల్లో ఎలా వస్తాడు… ఎక్కడికి వస్తాడు??. ప్రజామోదం చంద్రబాబుకే లేదు. 2019లోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. ఐదేళ్ళ పాలనలో ఏమీ చేయకపోవడమే కాదు ప్రజలను రాచి రంపాన పెట్టాడు. చంద్రబాబు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నాడనే అనుమానం ఉంది. గతంలోనూ క్షుద్రపూజలు చేశాడు. మా అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నాడు. బీసీ స్థానాల్లో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎందుకు పోటీ చేస్తున్నారు?. ఏం చేయాలో మా పార్టీకి స్పష్టత ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. కుప్పంతో సహా టీడీపీ గెలిచే స్థానం ఒక్కటీ లేదు. ఓటమి ఖాయం అని తెలిసి దానికి ఒక వంకను వెతుక్కుంటున్నాడు.” అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.

*16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. పరిశీలిస్తున్న యూకే ప్రభుత్వం..
యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనిపై చర్చల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంత వరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నిషేధం లేదా తల్లిదండ్రుల నియంత్రణ వంటి చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలను ఆన్లైన్ నుంచి సురక్షితంగా ఉంచే విధంగా విస్తృతంగా పరిశీలిస్తున్నామని రిషి సునాక్ ప్రతినిధి కెమిల్లా మార్షల్ గురువారం మీడియాతో తెలిపారు. నిర్ధిష్ట చర్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇటీవల యూకే ప్రభుత్వం ‘‘ఆన్లైన్ సెఫ్టీ యాక్ట్’’ తీసుకువచ్చింది. ప్రజలను, ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి యూజర్ టూ యూజర్ సేవలను అందించే కంపెనీల బాధ్యతలను పెంచడానికి ఆన్లైన్ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. ఇటీవల ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ని ప్రవేశపెట్టాలని మెటా నిర్ణయం తర్వాత పిల్లల భద్రత గురించి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ వారి తల్లిదండ్రులను ఫేస్‌బుక్ యాక్సెస్ గురించి హెచ్చరించింది. గురువారం విద్యాశాఖ మంత్రి డామియన్ హిండ్స్ మాట్లాడుతూ.. మెటా తన నిర్ణయాన్ని పునరాలోచించమని కోరారు. ఇది ప్రజల గోప్యతను రక్షించడం గురించి కాదని.. ఇది పిల్లల దుర్వినియోగంలో వ్యక్తులను అడ్డుకోవడం, దర్యాప్తు చేయడం, న్యాయం చేసే సామర్థ్యాలకు సంబంధించిన విషయమని హిండ్స్ టైమ్స్ రేడియోతో చెప్పారు.

 

*ఇజ్రాయిల్ తదుపరి లక్ష్యం హమాస్ నాయకత్వమే.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే గాజాలో యుద్ధం ఇప్పుడు హమాస్ నాయకత్వంపై ఖచ్చితమైన, ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలపై దృష్టి సారించే కొత్త దశకు పరివర్తన చెందుతోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ శుక్రవారం అన్నారు. మరోవైపు గాజాలో ఆపరేషన్ తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయిల్‌ని అమెరికా కోరింది. పౌరుల భద్రతపై శ్రద్ధ చూపాలని సూచించినట్లు సమాచారం. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో 1200 మందిని హతమార్చింది. 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదులే టార్గెట్‌గా గాజాపై విరుచుకుపడుతోంది. ముందుగా ఉత్తర గాజాను టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ బలగాలు ఇప్పడు దక్షిణ ప్రాంతంపై కూడా దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 19,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఇందులో చాలా మంది పిల్లలు ఉండటంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

*భారతీయులకు వీసా అవసరం లేదు.. ఇరాన్ కీలక నిర్ణయం..
భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్‌తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను పెంచడంతో పాటు, ప్రపంచదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిచారు. పర్యాటకాన్ని పెంచే ప్రయత్నాలు ఇరానోఫోబియా ప్రచారాన్ని నిర్వీర్యం చేయగలవని ఆయన అన్నారు. భారత్‌తో పాటు రష్యన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ట్యునీషియా, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, సీషెల్స్, ఇండోనేషియా, దారుస్సలాం, జపాన్, సింగపూర్, కాంబోడియా, మలేషియా , బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా మరియు హెర్జెగోవినా, సెర్బియా, క్రొయేషియా మరియు బెలారస్ దేశాలకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. దీనికి ముందు టర్కీ, అజర్ బైజాన్, ఒమన్, చైనా, ఆర్మేనియా, లెబనాన్, సిరియా దేశల పర్యాటకులకు వీసా మినహాయింపు ఉంది. ప్రస్తుతం భారత్ నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్ వెళ్లే వారికి మాత్రమే వీసా అనుమతి నుంచి మినహాయింపు ఉండేది. ప్రస్తుతం పర్యాటకులను కూడా ఈ జాబితాలో చేర్చింది. గత కొన్ని రోజులుగా పలు దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని పలు దేశాలు కల్పిస్తున్నాయి. శ్రీలంక, మలేషియా, థాయ్ లాండ్, కెన్యాలు ఇప్పటికే భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పించగా.. తాజాగా ఇరాన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

 

*దావూద్ ఇబ్రహీం ఫోన్ తో వ్యూహం సినిమాకు సెన్సార్.. వర్మ షాకింగ్ కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న క్రమంలో అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పానని, ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అయ్యిందని అన్నారు. ఏం మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు, ఎందుకంటే అసలు ఏపీ సీఎంకు నాకు పరిచయం లేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది వ్యూహం సినిమా అని ఇందులో అన్ని అంశాలను టచ్ చేసానని అన్నారు. గతంలో బయట వాళ్ళు మైక్స్ దగ్గర ఏమి చెప్పారో అదే ప్రజలకు తెలుసు కానీ వాళ్ల బెడ్ రూమ్, బాత్ రూమ్ విషయాలు ఈ సినిమాలో చూపించానని అన్నారు. అయితే అలా అని అంటూనే అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ అని, నేను ఏమీ చూపించానో అనేది సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది, వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఎలా వచ్చిందని చెబితే మమ్మల్ని జైలుకు పంపిస్తారని అన్నారు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల వ్యూహం సినిమాకు సెన్సార్ చేశారని ఆయన అన్నారు. వ్యూహం సినిమా ఒక పొలిటికల్ డ్రామా అని వైఎస్సార్ చనిపోయిన దగ్గర నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుందని అన్నారు. ఇక తనకు చంద్రబాబు అంటే రసగుల్లా కన్నా ఇష్టం అని పేర్కొన్న ఆయన తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఓ కంట కన్నీరు, రేవంత్ రెడ్డి గెలుపు మరో కంట పన్నీరులా ఉందన్నారు. తెలంగాణలో ఉన్నంత బలమైన ప్రతిపక్షం ఏపీలో లేదని ఆయన అన్నారు. టోటల్ నా సినిమా లో కనబడేవి రియల్ క్యారెక్టర్ లు, నేను చూసినవి నేను తెలుసుకున్నవి అన్నిటినీ బేరీజు వేసుకుని నా కోణంలో తీసిన సినిమా ఇదని అన్నారు. రివైజింగ్ కమిటీ యు సర్టిఫికెట్ ఇచ్చిందని, వైఎస్ జగన్ అంటే నాకు పాజిటివ్ ఒపీనియన్ అని అన్నారు. అయితే నేను ఎవ్వరికీ ఓటు వెయ్యమని చెప్పనని అంటూ ఆయన కామెంట్ చేశారు.

Exit mobile version