*ప్రజలకు శుభవార్త.. రూ. 25 లక్షల వరకూ వైద్యం ఉచితం!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు ప్రజలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం అంటూ తీపికబురును అందించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 18న కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 18నసీఎం వైయస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అని ముఖ్మమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ముఖ్యమంత్రి జగన్. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ఫాలో అప్ కన్సల్టేషన్ రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
*పార్లమెంట్‌లో దాడి.. ఎంపీ గోరంట్ల మాధవ్ సాహసం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూసుకెళ్లి రంగు పొగను విసిరిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ దుండగులు వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత ఎంపీల సీట్ల ముందు జంప్ చేస్తూ.. హంగామా చేశాడు. సభలోకి దూకిన ఆ వ్యక్తి కలర్ స్మోక్ వదిలాడు. షాక్‌కు గురైన ఎంపీలు కొంత మంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. కానీ సభలోనే ఉన్న గోరంట్ల మాధవ్ వెంటే ఆ దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. లోక్‌సభలో దూకిన ఆగంతకుడిని ఎదురుగా వెళ్లి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్టుకున్నారు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. గోరంట్ల మాధవ్‌ను సహచర ఎంపీలు అభినందించారు. గతంలో ఆయన పోలీస్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. సీఐగా సర్వీసులో ఉండగానే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. గోరంట్ల మాధవ్ మీడియా మాట్లాడుతూ, బెంచీలు దాటుకొని, స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చి ఆగంతకుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని, ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నానని అన్నారు. వివాదాస్పద ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఆయన ఈ సారి పార్లమెంట్‌లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు.
*డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి ప్రజా భవన్ కి షిఫ్ట్ అవ్వనున్నారు. కాగా.. నిన్న రాత్రి ప్రజా భవన్ భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపు ఉదయం 8.20కి ఆర్ధిక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. ప్రజా భవన్ లో అధికారిక నివాస భవనంలో ఉండనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. అక్కడ ఇన్ని రోజుల పాటు ప్రజా దర్బార్ ను కూడా నిర్వహించారు. ఇప్పటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజా దర్బార్ నిర్వహస్తుంది. ఆ కార్యక్రమంలో.. సామాన్యుల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది.ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను ప్రకటించడంతో.. మరి సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఎక్కడ అనేది అందరు చర్చించుకుంటున్నారు. అయితే, ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.
*కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదు..
మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన ప్రభుత్వం వచ్చాక.. కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారని అన్నారు. హౌసింగ్ స్కాములపై CID విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది.. ఒక్కో కాంగ్రెస్ నాయకుడు 50 ఇళ్ల బిల్లులు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈరోజు లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. కాగా.. ఈ ఘటనపై హరీష్ రావు స్పందించారు. 2009లో పార్లమెంట్ పై దాడి జరిగింది.. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ జరుగుతుంటేనే ఈ ఘటన జరిగింది.. అదృష్టవశాత్తూ ఎంపీలకు ఎవరికి ఏం కాలేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరగాలి.. మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాటలు గొప్పగా చెప్పడం కాదు.. చేతలు కూడా ఘనంగా ఉండాలన్నారు. గొప్పగా కట్టామని చెబుతున్న పార్లమెంట్ కే రక్షణ లేదని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
*మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు..
మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. శామీర్ పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. తహశీల్దార్ తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా కేశవాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని తెలిపారు. అందుకు సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
*తొందరపాటు వద్దు.. కేటీఆర్ పై సీతక్క ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. అయితే.. తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. కాగా.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని అమలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
అయితే.. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని తెలిపారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని అన్నారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడని వ్యంగాస్త్రం వేశారు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అంటూ కేటీఆర్ చిట్ చాట్ ద్వారా తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు కేటీఆర్.
*ఈనెల 18 నుంచి 23 వరకు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18 నుంచి రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు అంటే ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమే బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా..రాష్ట్రపతి రాక సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకోని, రాష్ట్రపతి విడిది ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు తెలిపారు.
*పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. గ్యాలరీ నుంచి సభలో కి దూకిన ఇద్దరు అగంతకులు
ఈరోజు పార్లమెంట్ హౌస్‌పై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ భద్రతలో భారీ లోపం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి లోక్‌సభ కార్యకలాపాల్లోకి ప్రవేశించి బెంచ్‌పై నిలబడ్డారు. ఈ వ్యక్తులు టియర్ గ్యాస్ కూడా విడుదల చేశారు. దీని కారణంగా ఆవరణలో పొగ వ్యాపించింది. వారిద్దరినీ కొందరు ఎంపీలు పట్టుకుని భద్రతా బలగాలకు అప్పగించారు. ఒక వ్యక్తి కూడా బెంచ్‌పైకి ఎక్కి నినాదాలు చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన కలకలం సృష్టించడంతో ఎంపీలు బయటకు రావడం ప్రారంభించారు. వెంటనే విచారణను వాయిదా వేశారు. ఈ అనుభవం చాలా భయానకంగా ఉందని ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని కార్తీ చిదంబరం అన్నారు. ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని సస్పెండ్ అయిన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ చెప్పారు. ఈ సంఘటన చాలా తీవ్రమైనది ఎందుకంటే ఈరోజు పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22వ వార్షికోత్సవం. అదే రోజు ఇటువంటి భద్రతా లోపం బట్టబయలు కావడం ఆశ్చర్యకరం. ఆడియన్స్ గ్యాలరీ నుంచి లోక్ సభ ప్రొసీడింగ్స్ లోకి దూకిన వ్యక్తి పేరు సాగర్ అని సమాచారం. ఎంపీ లేఖపై గెస్ట్ పాస్‌తో ప్రేక్షకుల గ్యాలరీకి వచ్చారు. లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. జీరో అవర్ సమయంలో ఈ ఘటన జరిగింది. జీరో అవర్ ప్రొసీడింగ్ సమయంలో ఓ యువకుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి దూకాడని, ఆ తర్వాత మరో వ్యక్తి దూకాడని ఎంపీ తెలిపారు. నియంతృత్వం పని చేయదు’ అంటూ వారు నినాదాలు కూడా చేశారు.
*బీజేపీ ఎంపీ పేరుతో విజిటర్ పాస్.. పార్లమెంట్ ఘటనలో కీలక విషయాలు..
పార్లమెంట్‌లోకి దుండగులు చొరబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగి 22 ఏళ్లు పూర్తియిన ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. విజిటర్ గ్యాలరీ నుంచి హౌస్ ఛాంబర్‌లోకి దుండగులు ఎల్లో పొగతో కూడిన డబ్బాలతో ప్రవేశించారు. పలువురు ఎంపీలు ధైర్యంగా వీరిని పట్టుకున్నారు. ఇదిలా ఉంటే బుధవారం లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తుల్ని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరికి బీజేపీ ఎంపీ జారీ చేసిన విజిటర్ పాస్ ఉంది. నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మ, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో జారీ చేయబడిని విజిటర్ పాస్ కలిగి ఉన్నాడు. మరో చొరబాటుదారుడు మైసూర్‌కి చెందిన మనోరంజన్ గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా ఇంజనీర్ అని తేలింది. నిందితులిద్దరిది కూడా కర్ణాటకలోని మైసూర్ ప్రాంతం. పార్లమెంట్ బయట ఆందోళన చేసిన ఇద్దరిలో మహిళని నీలంగా గుర్తించారు. ఈమె హరియానాకు చెందిన వ్యక్తిగా, మరొకర్ని అమోల్ షిండేగా గుర్తించారు. ఇతడిని మహారాష్ట్రలోని లాతూర్‌గా గుర్తించారు.
విజిటర్ పాసులు ఎలా వచ్చాయి..?
ఎవరైనా పార్లమెంట్‌ని సందర్శించాలనుకునే వారు ముందుగా తమ నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుని పేరుతో అభ్యర్థన చేస్తారు. సాధారణంగా ఎంపీలు ఎవరి పేరోతో పాస్‌లు జారీ చేస్తారో, వారి గుర్తింపు కార్డులను విజిటర్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సెక్యూరిటీ చెక్ చేస్తారు. విజిటర్స్ పార్లమెంట్‌లోకి వెళ్లే సమయంలో ఎంట్రీ వద్ద గార్డులు, ఎలక్ట్రానిక్ మిషన్స్ ద్వారా కఠినమైన భద్రతా తనిఖీలు జరుగుతాయి. ఇంత పకడ్భందీగా సెక్యూరిటీ చెక్ ఉన్నప్పటికీ నిందితులిద్దరి వద్ద పొగడబ్బాలతో ఎలా ప్రవేశించగలిగారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీరో అవర్ సమయంలో ఇద్దరు చొరబాటుదారులు మధ్యాహ్నం 1 గంటలకు పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకారు. నియంతృత్వం అనుమతించబడదు అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పార్లమెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
*షాకింగ్ ఘటన.. కడుపు నొప్పని వెళ్తే, గర్భాశయంలో కాకుండా పేగులో పెరుగుతున్న శిశువు..
ఫ్రాన్స్ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. మహిళ పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లతో పాటు నిజం తెలిసి సదరు మహిళ కూడా ఒక్కసారిగా కంగుతిన్నారు. 37 ఏళ్ల మహిళ తనకు తెలియకుండానే 23 వారాల గర్భవతి అని తేలింది. అయితే బిడ్డ పేగులో పెరుగుతున్నాడనే వార్త తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ కేసు వివరాలు ప్రచురించబడ్డాయి. సదరు మహిళ పది రోజుల పాటు తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరంతో ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు స్కాన్ చేసి చూస్తే, కడుపు, పేగుల మధ్య ఉదర కుహరంలో సాధారణంగా ఏర్పడిన పిండం పెరుగుతున్నట్లు గమనించారు. ఫలిదీకరణ సమయంలో అండం గర్భాశయం వెలుపల, ఉదర కుహరంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని, దీనిని ‘‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’’ అని అంటారని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో బిడ్డను కోల్పోవడం జరుగుతుందని చెప్పారు. అయితే, ఫ్రాన్స్‌లోని వైద్యులు మాత్రం విజయవంతంగా 29 వారాల బిడ్డను ప్రసవించేలా చేశారు. మూడు నెలల తర్వాత నవజాత శిశువు, తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇంటర్నల్ బ్లీడింగ్, ట్యూబ్ పగిలిపోవడం వంటివి జరిగి తల్లికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. ఇది పిండం మరణానికి దారి తీయవచ్చు. ఇలాంటి కేసుల్లో 90 శాతం బిడ్డను కోల్పోయే అవకాశాలే ఉంటాయి. జీవించి ఉన్నప్పటికీ.. పుట్టుకతో వచ్చే లోపాలు, మెదడు దెబ్బతినే అవకాశం ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఫ్రాన్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స పద్ధుతులను ఉపయోగించి, ఆశ్చర్యకరంగా డెలివరీ చేశారు. అయితే గర్భాశయంలో కూకుండా పొట్టలోని ఇతర ప్రాంతాల్లో బిడ్డ పెరగడం ఇదే మొదటికేసు కాదు. గతంలో కాలేయంలో పెరుగుతున్న పిండం కేసు నమోదైంది. సాధారణంగా పొత్తి కడుపులో మాత్రమే పిండం పెరగడం చూస్తాం, కానీ కాలేయంలో పిండం పెరిగే కేసు చూడటం మొదటిసారని మానిటోబాలోని చిల్డ్రన్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన డాక్టర్ మైఖేల్ నార్వే చెప్పారు.
