NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

వైసీపీకి యార్లగడ్డ గుడ్‌బై.. గన్నవరం నుంచి గెలిచి జగన్‌ని అసెంబ్లీలో కలుస్తా..!
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు యార్లగడ్డ వెంకట్రావు.. తన అనుచరులు, ముఖ్య నేతలతో సమావేశం అయిన యార్లగడ్డ వెంకట్రావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను టికెట్ కావాలని అడిగితే పార్టీ పెద్దలకు ఏం అర్థం అయ్యిందో నాకు తెలియటం లేదన్నారు.. వైఎస్‌ ఉండి ఉంటే నాకు ఇలా జరిగేది కాదు అని అందరూ అంటున్నారు.. వైఎస్‌ ఉంటే పార్టీ ఎలా ఉంటుందో.. అలానే ఉంటుంది అనుకున్నాను.. కానీ, ప్రభుత్వం వచ్చినా కేసులు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు యార్లగడ్డ.. సజ్జల వ్యాఖ్యలు తనను బాధకు గురి చేశాయన్న ఆయన.. KDCC బ్యాంక్ ను అభివృద్ది చేసినా పనికి రాను అని పక్కన పెట్టారని.. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీకి అభివృద్ధి చేశానన్నారు. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. 2019లో సరిపోయిన నా బలం.. ఇప్పుడు సరిపోదా అంటూ నిలదీశారు. మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం చూపలేదు.. తడి గుడ్డతో గొంతు కోశారంటూ ఎమోషనల్‌ అయ్యారు. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన వారు రావటమేనా? పార్టీ బలం అని ప్రశ్నించారు. రాజకీయం, నైతికత అనేది వైఎస్‌కి ఉంది.. రాజకీయ పార్టీలకు నమ్మించిన వ్యక్తులను కాపాడుకోవాలని సూచించారు.

విశాఖ రాజధానిపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు..
విశాఖ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జనసేనాని చేపట్టిన మూడో విడత వారాహి విజయయాత్ర ఈ రోజు విశాఖలోముగిసింది.. రెండు వారాహి బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్‌.. 4 ఫీల్డ్‌ విజిట్స్‌ చేశారు. విశాఖలో భూలు ఆక్రమణలకు గురవుతున్నాయి.. అధికార పార్టీ నేతల అండతో కబ్జా చేస్తున్నారంటూ.. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే. ఇక, వారాహి యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. మూడోవిడత వారాహి యాత్ర సక్సెస్ అయ్యిందన్నారు. ప్రభుత్వంపై కోపం, జనసేన పోరాటం ప్రజల్లో కనిపించిందన్న ఆయన.. తెలంగాణ నుంచి ఆంధ్రావాళ్లను తరిమి వేయాలనే కోపం పెరగడానికి జగన్ కూడా కారణం అన్నారు.. అందుకే వరంగల్ లో విద్యార్థులు వైఎస్‌ జగన్‌ను తరిమికొట్టారని గుర్తుచేశారు. ఇక, ఉత్తరాంధ్రను గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప విశాఖ రాజధానిపై పాలకులకు ప్రత్యేక మైన ప్రేమ లేదంటూ విశాఖ రాజధానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్‌.. జనవాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూదోపిడీలకు సంబంధించినవే అన్నారు.. అయితే, ఉత్తరాంధ్రపై నాకు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. సహజవనరులు ఉండి ఇక్కడ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. కాలుష్యం కారణంగా ఎదురవుతోన్న వ్యాధుల వల్ల నష్టపోతోందన్నారు. మరోవైపు.. లా అండ్ ఆర్డర్‌ విషయంలో బీహార్ కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయని ఆరోపించారు జనసేనాని.. ఉత్తరాంధ్ర ప్రజలు, యువత ఒక విధంగా ఆలోచిస్తే నాయకత్వం మరో విధానంలో ఆలోచిస్తోందన్న ఆయన.. బాక్సైట్ పేరుతో లేటరైట్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. అడ్డగోలుగా ఖనిజాలు తవ్వకాలు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీవి దొంగ సర్వేలు.. వారికి 14 శాతం ఓట్లు కూడా రావు..!
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి దొంగ సర్వేలు అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీవి దొంగ సర్వేలు.. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు కలగా జోస్యం చెప్పారు. వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్న ఆయన.. మహిళలు మోసకారి జగన్‌ను సాగనంపండి అంటూ పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహాశక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు చంద్రబాబు.. 1996 తుపాను సమయంలో కోనసీమ ప్రాంతం విచ్ఛిన్నమయితే.. నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సమస్యలను పూర్తిగా పరిష్కరించామని గుర్తుచేసుకున్నారు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆక్వా రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు ఓపిక పట్టండి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఏపీలో పొత్తులు.. ఎన్డీఏపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. టార్గెట్‌ అది ఒక్కటే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతూనే ఉన్నాయి.. టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయా..? లేదా బీజేపీ కూడా వారితో చేతులు కలుపుతుందా? అనే చర్చ సాగుతూనే ఉంది.. అయితే, మరోసారి ఎన్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. కొత్త ప్రభుత్వం జనసేన – బీజేపీ నా? లేక జనసేన – టీడీపీ – బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, భవిష్యత్ లో ఎన్డీఏ ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరోసారి క్లారిటీ ఇచ్చిన పవన్‌.. కానీ, ప్రజల మద్దతు పూర్తిగా ఉంటే ఓకే అన్నారు. ఎన్నికలు అయ్యాక శాసనసభ్యుల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిపై నిర్ణయం ఉంటుంది.. ఈ ప్రాసెస్ లో ఓటు చీలకూడదన్నది నా ఉద్దేశంగా తెలిపారు. టీడీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు పవన్‌ కల్యాణ్.. జనసేన సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉందని చెప్పడానికి వాళ్లేవరు? అని ప్రశ్నించారు. ఇక, స్టీల్ ప్లాంట్ పై నిరంతరం ఒత్తిడితో సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను సున్నితంగా కనిపించవచ్చు.. కానీ, ప్రజల కోసం వ్యక్తిగత దూషణలను భరించడానికి సిద్ధమే అన్నారు. మరోవైపు.. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా మా ప్రభుత్వ ఆలోచన చేస్తుందని తెలిపారు. పాలసీ నచ్చకపోతే ప్రధాని గురించి మాట్లాడినోడిని.. టీడీపీ హయాంలో జరిగిన వైఫల్యాలపై కూడా చర్చించానని చెప్పుకొచ్చారు. సీఎం పదవిపై నా ఆసక్తిని ఇప్పటికే చెప్పాను.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.. టీడీపీ , జనసేన ప్రభుత్వమా.? బీజేపీతో కలిసి వెళ్లాడమా..? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు పాలకులను బాధ్యులుని చేస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు. వైసీపీ వాళ్లు డబ్బుతో బలిసిపోతుంటే.. సామాన్యుడు బ్రతకడానికే ఇబ్బంది పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌.

రెండు నెలల్లో ముఖ్యమంత్రి ఇంటికి పోతాడు
కరీంనగర్ లో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పాపన్న విగ్రహానికి ఎంపీ బీజేపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ మద్యం టెండర్ల ద్వారా ఆదాయం సంపాదిస్తుంది అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కాస్లీ పార్టీలు.. మరో రెండు నెలల్లో ముఖ్యమంత్రి ఇంటికి పోతాడు అని ఆయన తెలిపాడు. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు టైమ్ ఉన్న ముందే మద్యం టెండర్లు పెట్టాడు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. నవంబర్ వరకు టెండర్లకు సమయం ఉంది.. కానీ, ముందే 2000 కోట్ల రూపాయలు సంపాదించాలి అని సీఎం కేసీఆర్ టార్గెట్ పెట్టుకున్నాడు.. సంవత్సరానికి 50 వేల కోట్లు సంపాదించాలని ముఖ్యమంత్రి అనుకున్నాడు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి పోటీ చేసే అభ్యర్థులే లేరు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ముందు పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాలేదు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క దరఖాస్తుకు 50 వేల రూపాయలు అని చెప్పడం ఏంటి?.. డబ్బులు లేని వారు ఎవరు పోటీ చెయ్యొద్దని కాంగ్రెస్ అనుకుంటుంది.. డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్స్.. మంచి చేసే వారికి టికెట్ లేదు.. డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు.. తెలంగాణలో దరఖాస్తుల టైమ్ నడుస్తుంది అని బండి సంజయ్ విమర్శించారు.

చంద్రయాన్‌ ప్రయాణంలో కీలక ఘట్టం.. ల్యాండింగ్‌కు అడుగు దూరంలో..
భారతదేశం తన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్‌తో ఈరోజు చంద్రునిపై కలలకు దగ్గరగా చేరుకుంది. వచ్చే బుధవారం చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్‌కు ముందు కీలకమైన విన్యాసాన్ని ప్రదర్శించింది. చంద్రయాన్ మిషన్ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం పురోగమిస్తోంది. గురువారం చంద్రయాన్-3 మిషన్ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా వేరు చేయబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత, చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని తక్కువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. అక్కడ నుండి చంద్రుని ఉపరితలం దూరం కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, ల్యాండర్ మాడ్యూల్ (ఎల్‌ఎం) సాధారణంగా పనిచేస్తోందని ఇస్రో తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్ డీబూస్టింగ్ ఆపరేషన్‌ని విజయవంతంగా నిర్వహించింది. దీని తరువాత, దాని కక్ష్య ఇప్పుడు 113 కిమీ x 157 కిమీకి తగ్గింది. రెండవ డీబూస్టింగ్ ఆపరేషన్ 20 ఆగస్టు 2023న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ విన్యాసం జరిగిందని ఇస్రో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ ప్రక్రియలో ల్యాండర్ విక్రమ్ వేగాన్ని తగ్గించడం ద్వారా దానిని చంద్రుని కక్ష్యలో దించారు. ఈ ప్రక్రియ ఆగస్టు 20న కూడా జరుగుతుంది. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలం నుంచి విక్రమ్ ల్యాండర్ దూరం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీని తర్వాత ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్-ల్యాండర్ అయిన వెంటనే ఇస్రో చరిత్రను సృష్టించనుంది.

కారుపై స్టంట్.. భారీగా ఫైన్
@Nitinparashar__ అనే వినియోగదారు ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. నోయిడాలో మరణ విందు అని రాశారు. ఆ వీడియో చూస్తే.. కారు నడుపుతున్న యువకుడు ఏమీ కంగారు పడలేనట్లుగా ఉంది. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనే భయం కూడా లేనట్లుంది. తాజాగా ఓ యూట్యూబర్ ఇలానే స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కారుపై స్టంట్ చేస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోయిడా పోలీసులు ఈ వీడియోపై చర్యలు తీసుకున్నారు. చలాన్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. రూ.26,000 చలాన్ వేసినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ చలాన్‌లో కారు యజమాని మహేష్ పాల్‌గా గుర్తించారు. అతను ఢిల్లీ నివాసి. అయితే కారులో ఉన్న స్టంట్‌మ్యాన్‌ మహేశ్‌పాలా లేక మరెవరో తెలియరాలేదు. సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్న.. వారికి భారీ జరిమానా ఒక గుణపాఠంగా చెప్పవచ్చు.

అలా అస్సలు చేయొద్దు.. యూజర్లకు యాపిల్ కంపెనీ వార్నింగ్
ఫోన్ లేని ప్రపంచాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. మనకి ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్ కావాల్సిందే. అది మన జీవితంలో భాగమయిపోయింది. కొంతమంది అయితే తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఆఖరికి బాత్రూంకు వెళ్లినప్పుడు కూడా మొబైల్ వదలరు. మరి కొందరైతే ఫోన్ లో ఛార్జింగ్ లేకుండా మొత్తం వాడేసి ఆఖరికి ఫోన్ ఛార్జ్ చేస్తున్న సమయంలో కూడా వాడకుండా ఉండలేక అలాగే చేతిలో పట్టుకొని వాడుతుంటారు, చెవిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మనం జేబులో ఉన్న ఫోన్లు , ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ లు పేలడం చూస్తున్నాం. వాటి వల్ల చాలా మంది గాయాల పాలు అవుతున్నారు కూడా. అందుకే నిపుణులు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడకూడదని సూచిస్తున్నారు. ఇక ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ కూడా ఇదే విషయంపై తన యూజర్లను హెచ్చరించింది. యాపిల్ ఫోన్..మొబైల్ ఫోన్లలో దీనికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ప్రతి ఒక్కరి డ్రీమ్ ఫోన్ యాపిల్ యే. జీవితంలో ఒక్కసారైనా దీనిని వాడాలని అందరు అనుకుంటూ ఉంటారు. ఇక యూజర్లను ఆకర్షించే విధంగా యాపిల్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త మోడళ్లను అందిస్తోంది. అయితే తాజాగా యాపిల్ సంస్థ కొన్ని విషయాల్లో తన యూజర్లను హెచ్చరించింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టి దాని పక్కనే పడుకోవడం చాలా ప్రమాదకరం అంటూ యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేస్తే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చని హెచ్చరించింది. ఇక చార్జర్ అడాప్టర్ పై, ఫోన్ పై ఎప్పుడు పడుకోవద్దని దీని వల్ల వాటిపై ఒత్తిడి పడుతుందని తెలిపింది. దుప్పట్లు , దిండ్ల కింద వీటిని ఉంచవద్దని, గాలి, వెలుతురు ఉండే ప్రదేశాల్లో ఉంచాలని సూచించింది. ఇక మరో ముఖ్యమైన సూచనగా ఐ ఫోన్లకు ఇతర చార్జర్లను ఉపయోగించవద్దని కేవలం కంపెనీ ఫోన్ తో పాటు ఇచ్చిన ఛార్జర్ నే వినియోగించాలని కోరింది. వేరే ఫోన్ ఛార్జర్ ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఉపయోగిస్తే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి రావచ్చని యాపిల్ సంస్థ హెచ్చరించింది.

ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్… ఇక హ్యాకింగ్ బెడద తప్పినట్టే
ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. నెట్ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కవ ధరకు అందుబాటులో ఉండటం కూడా మనం నెట్ కు బాగా అలవాటు పడేలా చేస్తోంది. నెట్ వర్కింగ్ కంపెనీలు పోటీలు పడి మరి బెస్ట్ ఆఫర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సింగల్స్ ను మనం చాలా విధాలుగా పొందవచ్చు. మన మొబైల్ లో ఉన్న సిమ్ కార్డు నెట్ వర్క్ ను ఆన్ చేసి మొబైల్ డేటా ఉపయోగించవచ్చు. లేదంటే మోడం లాంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇక ప్రస్తుతం ప్రతి ఇంటిలో వైఫై ను ఉపయోగిస్తున్నారు. దీని గురించి అందరికే తెలిసిందే. వైఫై, బ్రాడ్ బ్యాండ్, రూటర్ వంటి పదాలు చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. బయటకు వెళ్లిన, ఇంట్లో ఉన్న ప్రతి క్షణం మన చేతితో ఫోన్ ఉండాల్సిందే. దానిలో ఇంటర్నెట్ ఉపయోగించాల్సిందే. వీటిపై మనం చెప్పలేనంతగా ఆధారపడిపోయాం. నిజం చెప్పాలంటే కాళ్లు, చేతులు లాగా ఇవి కూడా మన శరీరంలో భాగమయిపోయాయి. ఇవి లేకపోతే నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా క్షణం కూడా గడవని కాలంలో మనం ఉన్నాం. బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ కనెక్టివిటీ, ఇళ్లల్లో వైఫైపై మాటల్లో చెప్పలేనంతగా ఆధారపడిపోయారు. అయితే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వైఫైతో వీటి బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు వైఫై ద్వారా డేటాను చాలా ఈజీగా దొంగలించగలుగుతున్నారు. అందుకే మన డేటాను గోప్యంగా ఉంచడానికి లైఫై (LiFi) బెటర్ అని చెప్పవచ్చు.

సినిమా రిలీజ్ చేయలేక ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత
సినిమా అనేది ఫక్తు వ్యాపారం, ప్యాషన్ కొద్దీ సినీ పరిశ్రమకి వచ్చామని చెబుతున్నా చివరికి వ్యాపారం ఒక్కటే నిలబెట్టేది. అయితే ఇప్పుడు ఒక అవార్డు సినిమా తీసి సినీ నిర్మాత ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీసిన నిర్మాత సినిమాను విడుదల చేయలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం చిన్న వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా మూవీగా ‘ఖుదీరామ్ బోస్’ సినిమాను గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజ‌య్ జాగర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించ‌గా చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. 2022 డిసెంబ‌ర్ 22న ‘ఖుదీరామ్ బోస్‌’ చిత్రాన్ని మన దేశ వ్యాపిత పార్లమెంట్‌ సభ్యులకు కూడా ప్రదర్శించారు. అలా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల వత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారని అంటున్నారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి, స్టంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ల్ క‌న్న‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌సూల్ ఎల్లోర్, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె.వెంక‌టేష్ వ‌ర్క్ చేశారని తెలుస్తోంది. ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవటం మరియు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడం నిర్మాత ఈ దుస్థితికి రావడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.

నటన పరంగా నాతో నేనే పోటీ పడుతూ వుంటాను..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు కియారా అద్వానీ.. ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రతి ఒక్క నటికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే కెరియర్ పరంగా ఇతరులతో తాను పోటీ గురించి అస్సలు పట్టించుకోనని ఆమె తెలియజేశారు. నటన విషయంలో నాకు నేనే పోటీగా ఉంటానని ఆమె తెలిపారు. నటన పరంగా నాలో గతంలో కంటే ఇప్పుడు ఎంతవరకు మార్పు వచ్చిందనేదే నాకు ముఖ్యమని ఆమె తెలియజేశారు. ఈ విధంగా నాతో నేనే పోటీ పడుతూ మంచి నటిగా పరివర్తన చెందుతున్నానని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం కీయారా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

జిన్నా తర్వాత ‘కన్నప్ప’ అంటున్న మంచు విష్ణు..
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర ని ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీ కాళహస్తి లో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు మంచు. తన తండ్రి లెజెండరీ నటుడు, నిర్మాత శ్రీ మోహన్ బాబు గారు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు . కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటిస్తారు. అలాగే లెజెండరీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ , బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథ కి కీలక మెలికలు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా భక్త కన్నప్ప.  అతని భక్తి యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం అని విష్ణు అన్నారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేయనున్నట్లు చిత్రాయూనిట్ తెలిపారు.. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామని విష్ణు మంచు తెలిపారు..

Show comments