*మళ్లీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయం..
గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఏనాడూ చూడని సంక్షేమం ఈ ఐదేళ్లలో చూశామన్నారు. పార్టీలో పదవులు, అధికారం అనుభవించిన వాళ్లు పార్టీ నుంచి పోతే వాళ్లను తలదన్నే వాళ్లు వస్తారన్నారు. వాళ్లు పార్టీ మారినా భయం లేదని.. వాళ్లు గొప్పవాళ్లమని అనుకుంటున్నారని.. అదేమీ లేదని అంతా భ్రమ అని అన్నారు. పార్టీ మారడమనేది వ్యక్తిగతమని.. పార్టీ నుంచి వెళ్లేవారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలన్నారు. పార్టీ బీఫాంతో తీసుకున్న పదవులు పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడం నాయకత్వమా అంటూ మంత్రి ప్రశ్నించారు. ఈ గెంతులు, ఎత్తులు 40 రోజులేనని.. మళ్లీ జగన్ అన్న ప్రభుత్వం రావటం ఖాయమన్నారు. ఇంత బలం ఉన్న వారు ముసుగులు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. అందరికి ఎమ్మెల్యేగా తాను, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అందుబాటులో ఉంటామన్నారు. పిటిషన్లు పెట్టి, ఫిర్యాదులు చేసి పింఛన్లను అడ్డుకున్న వాళ్లు ఇప్పుడు మాకు సంబంధం లేదనటం చూస్తే సిగ్గేస్తోందన్నారు. కూటమిలో కొత్త కుట్రలు పురుడు పోసుకుంటూ ఉన్నాయన్న మంత్రి.. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక అమ్మ కలెక్టర్లు, ఎస్పీలను మార్చాలని అంటోందని.. గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లు కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. వాళ్లను మేము నియమించామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
*చంద్రబాబుకు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదు
పల్నాడులోని సత్తెనపల్లి లో మంత్రి అంబటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సత్తెనపల్లి లో సభ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మీద నా మీద విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు కు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదని, చంద్రబాబు ను విమర్శించిన వాళ్లను పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నాడన్నారు. చంద్రబాబు పదేపదే ఆంబోతు అని విమర్శిస్తున్నాడు చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడని, మా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళని సంకన ఎత్తుకొని తిరుగుతున్నాడన్నారు. టీడీపీ సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని, కుప్పంలో చంద్రబాబు గెలవడం కూడ ఈసారి కష్టమన్నారు అంబటి రాంబాబు. అంతేకాకుండా..’ లోకేష్ యువ గళం అని తిరిగాడు మంగళగిరి కే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్ రెండు రోజులు తిరిగితే ఐదు రోజులు జ్వరం వస్తుంది. నా మీద బురద చల్లడానికి బహిరంగ సభలో నామీద విమర్శలు చేశాడు. అసెంబ్లీలో నన్ను ఎదుర్కోలేక నా మీద కక్ష పెట్టుకొని నన్ను సత్తెనపల్లి లో గెలవకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు. కన్నా లక్ష్మీనారాయణ అనేక పార్టీలు మారాడు రేపు ఓటమి తర్వాత ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబు కారణం. చంద్రబాబు అసమర్థత వల్లే కక్కుర్తి వల్లే పోలవరం పూర్తి కాలేదు.. చంద్రబాబు పొలిటికల్ డాన్సర్ కాసేపు పవన్ కళ్యాణ్ తో కాసేపు మోడీతో సిపిఎం సిపిఐతో కూడా డాన్సులు వేస్తాడు. నేను సంక్రాంతికి మాత్రమే డాన్స్ వేస్తాను.. మంత్రి అంటే తెలియకుండానే తన కుమారుడు లోకేష్ మంత్రిని చేశాడు చంద్రబాబు. మంత్రి అంటే ఏంటో తెలుసా అని మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సత్తెనపల్లిలో రెండవసారి పోటీ చేస్తున్నాను. ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలు కు వెళ్లడం ఖాయం మళ్లీ అధికారంలోకి రాబోయే వైసీపీ ప్రభుత్వం. 175 స్థానాల్లో వైసిపి గెలవబోతోంది. పోలవరం ఎందుకు పూర్తి కాలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబే. చంద్రబాబు అసమర్థత, కక్కుర్తి వల్లే పోలవరం పూర్తి కాలేదు.. నేను సంక్రాంతికి మాత్రమే డాన్స్ వేస్తాను.. కాని చంద్రబాబు పొలిటికల్ డాన్సర్, కాసేపు పవన్ కళ్యాణ్ తో , కాసేపు మోడీతో , కుదిరితే సిపిఎం సిపిఐతో కూడా డాన్సులు వేస్తాడు.. మంత్రి అంటే తెలియకుండానే తన కుమారుడు లోకేష్ మంత్రిని చేశాడు చంద్రబాబు.. అలాంటి చంద్రబాబు మంత్రి అంటే ఏంటో తెలుసా అని మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.. ఎన్నికల తర్వాత చంద్రబాబు మళ్ళీ జైలు కు వెళ్లడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సత్తెనపల్లిలో మళ్ళీ పోటీ చేస్తున్నాను.మళ్లీ అధికారంలోకి రాబోయేది వైసిపి నే … 175 స్థానాల్లో వైసిపి గెలవబోతోంది’ అని అంబటి రాంబాబు అన్నారు.
*కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. అయితే.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరుకావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తెల్లం వెంకటరావు పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి ఫిర్యాదు చేస్తున్నామని, స్పీకర్ గారు చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకు వెళతాం. కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరడం పార్టీ వ్యతిరేక వ్యతిరేక చర్యలు క్రిందకే వస్తుందని, తెల్ల వెంకట్రావు రాజీనామా చేసి పార్టీ మారాలి. లేదంటే స్పీకర్ అనర్హత వేటు వేయాలన్నారు. క పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండని అని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు దేనితో కొట్టాలి..?? అని ఆయన ప్రశ్నించారు.
*ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటాం.. అభ్యర్థులను చూసి ఓటు వేయాలి
మంచిర్యాల జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులను చూసి ఓటు వేయండని.. పెద్దపల్లిలో యువకుడి వంశీని ముందుంచామన్నారు. ఈ సందర్భంగా.. నేతకాని సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పనులకు కోడ్ వల్ల ఆటంకం కలిగింది.. 2018 ఎన్నికలు జరిగిన తరువాత రెండు నెలల తరువాత పాలన మొదలు పెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో పథకాలను ప్రారంభించి పాలన మొదలు పెట్టామని చెప్పారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2 వందల యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఇవి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సైతం పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇవ్వన్నీ ఇస్తున్నాం అంటే ఓట్లు తమకే వేయాలన్నారు. మరోవైపు.. కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను ఆగం చేసారని దుయ్యబట్టారు. 7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే.. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాక ఐదేళ్లు పాలన గడిచిన తరవాత ఇవ్వకపోతే అడగండని అన్నారు. బీఆర్ఎస్ పెద్దలు రైతులను లూటీ చేసారని మంత్రి ఆరోపించారు. పైగా ఇప్పుడు రైతుల కోసం అంటూ ధర్నాలు చేస్తున్నారు.. అలాంటి వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. నీటి లభ్యత విషయంలో అక్టోబర్ మాసంలో తక్కువగా ఉందని వాళ్ల పత్రికలే రాసుకున్నారు.. ఇప్పుడేమో కాంగ్రెస్ వల్ల కరువు అంటున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే కరువు వచ్చింది అంటున్నారు.. కాళేశ్వరం వాళ్లు కట్టి కుంగిపోతే తాము ఏం చేయడం లేదని ఆరోపిస్తున్నారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం నుంచి నీళ్ళు వదిలి పెట్టి మేము వదిలి పెట్టాం అని అబద్ధాలు చెప్పుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ ఒక్క సీటు గెలువదు.. కాబట్టి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
*ఈనెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన
ఈనెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికీ అవగాహన రాలేదన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల డ్యూటీలో పెట్టవద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. కాంట్రాక్టు బేస్ తో పనిచేసేవాళ్లను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో వాడదని, గ్రామ వార్డు సచివాలయాల చట్టం తెచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అనే పదం చట్టంలో వాడలేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ పుట్టిన తర్వాత పెన్షన్లు పంపిణీ జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ వచ్చిన తర్వాత పెన్షన్ల వ్యవస్థ ప్రారంభమవ్వలేదని, రాబోయే కాలంలో మే ఒకటో తేదీన నూటికి నూరు శాతం , ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పెన్షన్ల పంపిణీ జరిగి తీరుతుందన్నారు. అయితే.. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన గతంలో ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు. అయితే.. ఈ పర్యటనను ఖరారైంది.
*దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..?
దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..? అని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తాత్కాలిక పేరు కోసం, చప్పట్ల కోసం నా ప్రసంగం ఉండదు అది నా విధానం కూడా కాదన్నారు. ఒకరిని కించ పరిచే విధంగా రాజకీయ వ్యవస్థ ఉండకూడదనే కోరుకునే మొదటి వ్యక్తిని అన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి ఆ ప్రజలనే నేను నమ్ముకున్నారని తెలిపారు. ఆరు దశాబ్దాలు దేశాన్ని, నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందని అన్నారు. అనేక డిక్లరేషన్ లు, అనేక పాలసీలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిందన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని తెలిసి, ఇచ్చిన హామీలు అమాలువుతాయా అనే అవగాహన కాంగ్రేస్ కు ఉందా..? అని ప్రశ్నించారు. అవగాహన లేక హామీలు ఇచ్చారా.. లేక తప్పుడు హామీలతో అధికారంలోకి రావడానికి హామిలిచ్చారా అనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాక ధరణి సమస్యల మీద దృష్టి పెడతారని అనుకున్నామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యం మీద దృష్టి పెడతారని అనుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పంటలెండి కరువు దాపరించడానికి కారకులెవరో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రెండు లక్షలు రైతు రుణ మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది రుణ మాఫీపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ప్రతి మహిళ అకౌంట్లో 2500 వేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. 17 కు 17 పార్లమెంట్ సీట్లు గెలిపించండని కాంగ్రెస్ అడుగుతోందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే పనేనా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 280 సీట్లు ఉంటే ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 17 సీట్లు వస్తె రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి దళితుడు కాదన్నారు, వరంగల్ ఎంపీ సీట్ ఎట్లా ఇస్తారు..? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లోకి ఎట్లా తీసుకున్నారు..? అని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ యాంటీ డిబెక్షన్ చట్టం తెచ్చారు.. మీరు మాత్రం ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..? అని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేయలేదా..? నాడు రేవంత్ రెడ్డి బంగపడి, అవమాన పడి వస్తె మల్కాజిగిరి ప్రజలు అక్కున చేర్చుకున్నారా లేదా..? మల్కాజిగిరి రేవంత్ అడ్డనా..? అని ప్రశ్నించారు. ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిన హుజూరాబాద్ లో ప్రజలు నన్ను గెలిపించారన్నారు. ఊరల్ల ఒకదారి అయితే, ఊసర వెల్లిలది మరోదారి అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అంటూ మండిపడ్డారు. నిన్నటి దాకా ఒక పార్టీ ఇవాళ అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారంతా రేపు ఇంకో పార్టీలోకి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తుందా..? అన్నారు. మల్కాజిగిరి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మోడీ వచ్చాక దేశంలో టెర్రరిస్ట్ ల బాంబుల మోత లేదు, కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. నాడు మేడిన్ చైనా.. నేడు మోడీ హాయంలో మేడిన్ ఇండియా అన్నారు. మల్కాజిగిరి ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలను బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా అని తెలిపారు.
*నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండి..
నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఢిల్లీ ఎన్నికలు అన్నారు. ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం బాగుంటుంది? ఎవరు ప్రధానమంత్రి అయితే మన గౌరవం పెరుగుతుంది? ఎవరు సమర్థవంతంగా ముందుకు తీసెళ్తారో వాళ్లకు ఓటెయ్యాలని కోరుతున్నాను అన్నారు. స్వాత్యంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని అయ్యే వరకు దేశం ఎలా ఉందో బేరీజు వేసి మోడీకి ఓటెయ్యండి అని కోరారు. అందరూ పోలింగ్ లో పాల్గొనాలి అని కోరారు. అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో 40% పోలింగ్ కూడా జరగదన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసే దగ్గర 80% పోలింగ్ అవుతుందన్నారు. ఎవరికి అయిన ఓటెయ్యండి కానీ ఓటు వేయడానికి ముందుకు రండీ అన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడాన్ని ఒక మూవ్మెంట్ లాగా తీసుకెళ్లాలన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసినప్పటి నుంచి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని వందల సార్లు చర్చలు చేశారన్నారు. కొత్త పార్లమెంట్ లో మొదటి బిల్లు చట్టసభల్లో మహిళల కోసం ప్రవేశపెట్టామన్నారు. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు మోడీ అన్నారు. ఇస్లామిక్ దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ లేదన్నారు. కాంగ్రెస్ పాలించిన ఈ ఆటవిక సంప్రదాయాన్ని కొనసాగించిందన్నారు. మహిళల మెడలో కత్తిలాగా ట్రిపుల్ తలాక్ వేలాడిందన్నారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ఇచ్చారన్నారు. నిన్న రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తీసుకొస్తామన్నాడని తెలిపారు. లవ్ జిహాద్ ని కూడా చట్టబద్ధం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పాడని గుర్తు చేశారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా.? అని మండిపడ్డారు. సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించారన్నారు. మహిళల గౌరవాన్ని పెంచడానికి 13 కోట్ల టాయిలెట్స్ నిర్మించారని తెలిపారు. నాకు మనసు పూర్తిగా ఓటేసి.. గెలిపించి.. ఢిల్లీకి పంపాల్సిందిగా కోరుతున్నానని అన్నారు.
*అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
బెంగళూర్ నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నగర వాసుల్ని ఎండలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. గత దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నగరంలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్‌కి పెరిగింది. 2016లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, ప్రస్తుతం రికార్డువుతున్న ఉష్ణోగ్రతలు దీనికి కొద్ధి దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూర్ నగరంలో సగటున ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా కనీసం 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది ఈశాన్య రుతుపవనాల కాలంలో బెంగళూర్ నగరంలో వర్షాలు తక్కువ కురిశాయి. చలికాలంలో బెంగళూర్‌లో వర్షం పడలేదు. ప్రధానంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రుతుపవనాల కాలంలో తక్కువ వర్షాలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేగవంతమైన పట్టణీకరణ కూడా బెంగళూర్ ఇక్కట్లకు మరోకారణమని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో పనిచేస్తున్న డాక్టర్ పువియరాసన్ తెలిపారు. బెంగళూర్ వాసులు ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తమ దినచర్యను మార్చుకుంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. బెంగళూర్‌లో శనివారం రాత్రి 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే, ఏప్రిల్ 14 తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
*నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..
గుజరాత్ యూనివర్సిటీలో ఏడుగురు విదేశీ విద్యార్థుల వర్సిటీ ప్రాంగణంలో నమాజ్ చేయడం వివాదాస్పదమైంది. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన ఆరుగురు, తూర్పు ఆఫ్రికాకు చెందిన మరో విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయడంతో గొడవలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, వీరిని హాస్టల్ ఖాళీ చేయాల్సిందిగా యూనివర్సిటీ కోరింది. మార్చి 16 దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫ్ఘన్, గాంబియన్ ప్రతినిధి బృందం యూనివర్సిటీ భద్రతా చర్యలపై వైస్-ఛాన్సలర్తో సమావేశం నిర్వహించింది. ఈ ఏడుగురు విద్యార్థులు ఎక్కువ కాలంగా హాస్టల్ గదుల్లో ఉంటున్నట్లు వైస్ ఛాన్సలర్ నీర్జా గుప్తా తెలిపారు. అందుకే వీరిని ఖాళీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ వ్యక్తులు చదువులను పూర్తి చేసి, కొన్ని పెండింగ్ అడ్మినిస్ట్రేషన్ పనుల కారణంగా హాస్టల్స్‌లో మాజీ విద్యార్థులుగా ఉంటున్నారని ఆమె చెప్పారు. ఇక వారు హాస్టల్‌లో ఉండాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ నిర్ధారించిందని, వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అన్ని పేపర్ వర్క్స్ పూర్తి చేశామని, వారు ఇప్పుడు సురక్షితంగా స్వదేశానికి వెళ్లొచ్చని, సంబంధిత కాన్సులేట్లకు సమాచారం ఇచ్చామని ఆమె చెప్పారు. గుజరాత్ యూనివర్సిటీలో 300 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. రంజాన్ మాసంలో నమాజ్ హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నందున, యూనివర్సిటీ హాస్టల్‌లోకి కొంతమంది ప్రవేశించి విదేశీ విద్యార్థులపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శ్రీలంక, తజకిస్తాన్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు.
