*లిక్కర్ కేసులో కీలక పరిణామం! సీబీఐ కస్టడీకి కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీంతో సీబీఐకి అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో జైల్లోనే ఆమెను విచారించాలని న్యాయస్థానం తెలిపింది. విచారణకు ముందు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పింది. అలాగే విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని ధర్మాసనం షరతు పెట్టింది. ఇక విచారణలో కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్‌లో దొరికిన సమాచారం ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారించనుంది. అలాగే భూముల కొనుగోలు వ్యవహారంపై కూడా ప్రశ్నించినుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన వంద కోట్ల వ్యవహారంపై సీబీఐ లోతుగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తమ కుమారులకు పరీక్షలు జరుగుతున్నందున తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. గురువారం విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను, మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఇద్దరికీ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరూ తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు.
*తెలంగాణకు చల్లని కబురు.. గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణశాఖ
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భానుడు భగభగమండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సుర్యుడు సుర్రు మంటున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులైతే ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే మూడు రోజులు వేడిగాలుల నుంచి ఉపశమనం పొందవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ తెలిపింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడకక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు దాదాపుగా మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏప్రిల్ 8న ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మంగళవారం కామారెడ్డిలో వర్షం కురవొచ్చని వెల్లడించింది. వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాకపోతే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్సుందని వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లోని గోల్కొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే ఆయా జిల్లాల్లో మాత్రం మూడు రోజుల పాటు వేడి గాలుల నుంచి ఉపశమనం పొందే ఛాన్సు ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
*వాలంటీర్ల అంశంపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో పింఛన్ దారుల్లో వాలంటీర్లకు మంచిపేరు తెచ్చి పెట్టిందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. చంద్రబాబు హయాంలో రెండు మూడు రోజుల సమయం పట్టేదని.. పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు. వాలంటీర్లు పింఛన్ దారులకు దేవుళ్లుగా కనిపించారన్నారు. ఎవరైనా ఒక పార్టీ పెట్టి, మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టి ముఖ్యమంత్రి అవుతారు.. చంద్రబాబు అలా చేయరు.. టీడీపీలోకి వచ్చి ఎన్టీఆర్ గెలిపించిన వందల మందిని కొనుగోలు చేశారని విమర్శలు గుప్పించారు. టీడీపీని కబ్జా చేశారు.. ఎన్టీఆర్ కోర్టుకు వెళ్తే పార్టీ చంద్రబాబుదే అని తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కోసం ఎన్టీఆర్‌ను, రాజకీయ భవిష్యత్ కోసం వంగవీటి రంగాను చంపారని.. జగన్‌ను రాజకీయంగా సమాధి చేయడం కోసం 23 మంది ఎమ్మెల్యేలను వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాపులను రౌడీలు, గుండాలు అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కాపులను లొంగదీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇంట్లో ఖాళీగా కూర్చోరని… కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతారని పోసాని ఆరోపణలు చేశారు. ఇంట్లో ఖాళీగా కూర్చోని చంద్రబాబు పింఛన్ దారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. 60, 70 లక్షల ఫించన్ దారులు జగన్‌కు ఓటేస్తారేమోనని అని కుట్రలు చేశారన్నారు. ఆంధ్ర దేశానికి క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరైనా సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకుకోవాల్సిందే అని ఎన్నికల కమిషన్‌తో ఆదేశాలు జారీ చేయించారన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సకల సౌకర్యాలు అనుభవించారని.. జైల్లో ఏసీ, ఇంటి భోజనం అన్ని తెప్పించుకున్నారన్నారు. కుంటి, గుడ్డి, లెప్రసి ఉన్నవాళ్లు అనే జాలి, దయ చంద్రబాబుకు ఉండదన్నారు. నారా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరూ ఒకే మనస్తత్వం కలవారని.. ఒకేలా ఆలోచిస్తారన్నారు.
*అమానుషం.. అత్యాచార బాధిత విద్యార్థిని పరీక్షలకు అనుమతించని పాఠశాల..
రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ పాఠశాల అమానుషంగా వ్యవహరించింది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ విద్యార్థినిని 12వ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. పరీక్షలకు హాజరయ్యేందుకు తనకు అడ్మిట్ కార్డ్ ఇవ్వలేదని సదరు బాలిక ఆరోపించింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 12 తరగతి చదువుతున్న విద్యార్థిని గతేడాది సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే, ఆమె పరీక్షలు రాసేందుకు వస్తే పాఠశాల వాతావరణం దెబ్బతింటుందని, అందుకే పరీక్షలు రాసేందుకు ఉపాధ్యాయులు అనుమతించలేదని బాధితురాలు చెబుతోంది. తన ఉనికి పాఠశాల వాతావరణాన్ని పాడుచేస్తుందని, ఇంట్లోనే చదువుకోవాలని ఉపాధ్యాయులు చెప్పినట్లు బాలిక ఆరోపించింది. ప్రస్తుతం పాఠశాలపై చర్యలు తీసుకునేందుకు చైల్డ్ వెల్ఫేర్ బోర్డు సిద్ధమవుతోంది. బాధితురాలిని బోర్డు సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై బాలిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం తాను బోర్డు పరీక్షలకు హాజరయ్యానని, పరీక్షకు హాజరు కావడానికి పాఠశాల అడ్మిట్ కార్డు ఇవ్వలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ అంజలీ శర్మ చెప్పారు. విద్యార్థుల జాబితాను నుంచి బాలిక పేరును తొలగించినట్లు తెలిపింది. మరోవైపు, విద్యార్థిని 4 నెలలు తరగతులకు హాజరుకాకపోవడం వల్లే అడ్మిట్ కార్డ్ ఇవ్వలేదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చెబుతోంది. గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెను పాఠశాలకు రానీయకుండా అడ్డుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో సదరు బాలిక 79 శాతం మార్కుల్ని సాధించింది. అయితే, ప్రస్తుతం పాఠశాల నిర్లక్ష్యం వల్ల 12వ తరగతి పరీక్షలకు హాజరుకానీయకుండా చేయడంతో ఒక ఏడాది నష్టపోవచ్చని అంజలీ శర్మ చెప్పారు.
*విషపూరిత పామును పెంచుకోవచ్చు.. కానీ బీజేపీని నమ్మలేం..
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని, పారామిలిటరీ బలగాలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తుందని అన్నారు. గురువారం కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు, బీఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) కాషాయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ ఆవాస్ యోజన కోసం మళ్లీ పేర్లు నమోదు చేసుకోవాలని బీజేపీ ప్రజల్ని అడుగుతోంది. పేర్లు మళ్లీ ఎందుకు నమోదు చేయాలి.? మీరు విషపూరిత పామును నమ్మవచ్చు, మీరు దానిని పెంచుకోవచ్చు, కానీ మీరు బీజేపీని నమ్మలేరు, బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది’’ అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ దర్యాప్తు సంస్థల ముందు తల వంచబోదని, లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్ఎఫ్ స్థానిక ప్రజల్ని హింసిస్తే పోలీసులకు ఫిర్యాదు చేుయాలని కూచ్ బెహర్ మహిళలకు దీదీ పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి నిసిత్ ప్రమాణిక్‌పై విమర్శలు చేశారు. అనేక కేసుల్లో ఉన్న ప్రమాణిక్ హోం వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా నియమించడం దేశానికి అవమానకరమైన విషయమని, టీఎంసీ 2018లో అతడిని పార్టీ నుంచి తొలగిస్తే, తర్వాత బీజేపీలో చేరారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడాన్ని తమ ప్రభుత్వం అనుమతించదని మమత స్పష్టం చేశారు. ఈ చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేస్తే వారిని విదేశీయులుగా పరిగణిస్తారని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు చేయవద్దని సలహా ఇచ్చారు. సీఏఏపై బీజేపీ అబద్దాలు చెబుతోందని ఆరోపించారు. సీఏఏ కమిటీలో జనాభా లెక్కల విభాగానికి చెందిన ఒక సభ్యుడిని చేర్చడాన్ని ప్రశ్నిస్తూ.. భవిష్యత్తుల్లో ఎన్ఆర్సీ కోసం ఎలాంటి ప్రణాళిక లేకపోతే అలాంటి వ్యక్తిని ఎందుకు కమిటీలో చేర్చారు..? అని ప్రశ్నించారు. సీఏఏ తల అయితే, ఎన్ఆర్సీ తోక అని అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని, మీరు బీజేపీని ఓడించాలంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు, మైనారిటీ పార్టీగా ఉన్న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)కి ఓటేయవద్దని కోరారు. ఐఎస్ఎఫ్ ఎంఐఎం లాగే ఉందని, వారు మైనారిటీ ఓట్లు చీల్చి బీజేపీకి సాయం చేస్తున్నారంటూ విమర్శించారు.
*12 తరగతి సిలబస్ నుంచి బాబ్రీ కూల్చివేత, గుజరాత్ అల్లర్ల అంశాలు తొలగింపు..
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి స్కూల్ పుస్తకాల్లో కీలక మార్పులను చేసినట్లు తెలుస్తోంది. పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తీసేసింది. దీంతో పాటు హిందుత్వ రాజకీయాలు, గుజరాత్ అల్లర్లు, మైనారిటీలకు సంబంధించిన కొన్ని సున్నితమైన అంశాలను పుస్తకాల నుంచి తొలగించనుంది. ఈ మార్పులతో కొత్త పుస్తకాలు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడనున్నాయి. NCERT ఈ మార్పులను గురువారం (ఏప్రిల్ 4) తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో NCERT పుస్తకాలు బోధించబడుతాయి. దేశంలో 30 వేలకు వరకు సీబీఎస్‌సీ స్కూల్స్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో బాబ్రీ కూల్చివేత ప్రస్తావన ఉన్న పుస్తకంలో మూడు చోట్ల మార్పులు చేయాలని NCERT నిర్ణయించింది. దీనికి బదులుగా రామమందిర ఉద్యమాన్ని బోధించనున్నారు. దీంతో పాటు రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పునిచ్చిందో కూడా వివరంగా బోధించనున్నారు.‘స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ రాజకీయాలు’ పేరుతో ఉన్న 8వ అధ్యాయంలో ఈ మార్పు చేసింది. ఈ అధ్యాయం 2006-07లో పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో చేర్చబడింది. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన 5 ముఖ్యమైన భారత రాజకీయ పరిణామాలను ఈ అధ్యాయంలో చర్చించారు. దీంట్లో ఒకటి అయోధ్య ఉద్యమం. ఇదే కాకుండా 1989లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నాలుగు సంఘటనలను ప్రస్తావించారు. 1990లో మండల్ కమిషన్ అమలు, 1991 ఆర్థిక సంస్కరణల ప్రారంభం, అదే ఏడాది రాజీవ్ గాంధీ హత్య వంటి 5 ముఖ్యమైన సంఘటనలను హైలెట్ చేస్తుంది.జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి కొన్ని అంశాలను మార్చారు. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ‘‘ ఈ ప్రాంతం అక్రమ ఆక్రమణలో ఉందని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ పాకిస్తాన్ గా అభివర్ణింస్తుంది’’ అయితే దీనిని మారుస్తూ.. ఇది పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, దీనిని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్((POJK) అని పిలుస్తారని మార్పు చేసింది. డెమెక్రటిక్ రైట్స్ పేరుతో ఉన్న 5వ అధ్యాయంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను తీసేసింది.
*ప్రధాని అభ్యర్థి ఎవరు.. రాహుల్ గాంధీ సమాధానం ఇదే!
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పీ చిదంబరం తదితరులు ‘న్యాయ్ పత్ర’ పేరుతో శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టో రిలీజ్ అనంతరం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొనగా.. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన స్పందించారు. ‘ఇండియా కూటమి సైద్ధాంతిక ఎన్నికల్లో పోరాడుతోంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఎన్నికల్లో మేము గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి.. వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారికి మధ్య జరుగుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తాం. మీడియా అంచనాలకు అందని విధంగా ఈసారి ఎన్నికల్లో నువ్వానేనా అనేలా పోటీ ఉంటుంది. బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయి’ అని రాహుల్ ఆరోపించారు.
*జర్మనీ నుంచి ఇండియాకు టెస్లా కార్‌ల దిగుమతి.. RHD కార్ల ఉత్పత్తి ప్రారంభం.
ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలోకి ఎలక్ట్రిక్ కార్ మేకర్ దిగ్గజం ‘టెస్లా’ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా భారత్‌లో కార్‌ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం అధ్యయనం చేస్తోంది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలపై దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 2 బిలియన్ల పెట్టుబడితో ఇండియాలో కార్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం టెస్లా సిద్ధమవుతోంది. గతంలో టెస్లా కార్ల దిగుమతిపై భారీ సుంకాలను విధించిన ఇండియా, నూతనంగా తీసుకున్న విధానంలో 500 మిలియన్ల పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తే, ఆ కంపెనీల దిగుమతులపై పన్ను రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెస్లా పరిమిత సంఖ్యలో కార్లను ఇండియాలోకి దిగుమతి చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, ఏడాదికి 8000 కార్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే టెస్లా జర్మనీలో భారత్ కోసం కార్‌లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి దేశంలోకి కార్‌లను దిగుమతి చేయనున్నారు. భారతదేశంలో వినియోగించేందుకు రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్లు(RHD)లను ఉత్పత్తి చేస్తోంది. యూఎస్, చైనా మార్కెట్లలో ఈవీల డిమాండ్ మందగించడం, చైనీస్ ఈవీ కార్లలో ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో టెస్లా భారత్‌పై దృష్టి సారించింది. టెస్లా ఇప్పటికే భారత్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటోంది. చైనా నుంచి సోర్సింగ్ తగ్గించి, భారతదేశాన్ని తన పెద్ద సోర్సింగ్ హబ్‌గా మార్చాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
