ఏపీలో భారీగా పెరిగిన మధ్యం సేల్స్.. దాచేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో గతంలో కంటే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి.. ముఖ్యంగా మార్చి నెలలోనే మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మార్చి మొదటి అర్ధ భాగంలోనే చాలా జిల్లాల్లో మద్యం సేల్స్ విపరీతంగా జరిగాయి.. అంటే చాలా చోట్ల మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి దాచారు అనడానికి ఈ అమ్మకాలు నిదర్శనంగా చెప్పచ్చు.. అదే ఏప్రిల్ నెల అమ్మకాలు చూస్తే కట్టడి చేసేందుకు చర్యలు పెంచడం, ఎక్కడికక్కడ సీజ్ లు, సస్పెన్షన్ లు, షోకాజ్ నోటీసులు ఇస్తుండటంతో మార్చిలో కంటే సేల్స్ తగ్గాయని అధికారులు అంటున్నారు.. అయితే, ముందే మందు దాచేసుకోవడంతో కొనుక్కోవాల్సిన అవసరం రాలేదేమో అనిపించక మానదు.. అయితే, రాష్ట్రంలో మద్యం సేల్స్ పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు ఏపీ ఎక్సైజ్ అదనపు కమీషనర్ దేవకుమార్. కాగా, ఎక్కడైనా సాధారణ రోజుల్లో కంటే ఎన్నికల సమయంలో లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరుగుతాయని గత గణాంకాలు చెబుతున్నాయి.. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో.. లిక్కర్‌కు ఫుల్ డిమాండ్ ఉందని.. ఎన్నికల సమయంలో పచ్చడం కోసమే.. ముందస్తుగా కొనుగోలు చేసి.. నిల్వ చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు లేకపోలేదు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు.. ఒక్కోక్కరి తలపై రూ. 2 లక్షల అప్పు..!
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు.. కులరాజకీయాలను కాంగ్రెస్ పెంచి పోషించిందన్న ఆయన.. మేం ముస్లింకు వ్యతిరేకంగా ఉన్నామని ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.. అయితే, మేము అధికారంలోకి వచ్చాక ఒక దేశం ఒకే ఎన్నిక అమలు చేస్తాం అని ప్రకటించారు. విశాఖ టూరిజంగా.. పారిశ్రామికంగా అభివృద్ది చెందిన నగరాన్ని వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ సిటీగా మార్చిందని ఆరోపించారు. సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా మారాల్సిన పేరు డగ్స్ రాజధానిగా మారుమోగుతుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వనికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు. ఇక, విశాఖలో ఎక్కడా లేని విధంగా భూకబ్జాలు జరిగాయని ఆరోపించారు రాజ్‌నాథ్.. భూ కబ్జాలు ఆగాలన్నా.. అవినీతి లేకుండా ఉండలన్నా.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్యం 13 లక్షలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ దుర్మార్గమైన పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతో కూటమి ఏర్పడిందన్నారు.. అవినీతి లేని ప్రభుత్వం కూటమితోనే సాధ్యం అని ప్రకటించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
చంద్రబాబు గ్యారెంటీ కార్డుకు.. వారంటీ అయిపోయింది..!
ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు పట్టుకుని తిరుగుతున్న గ్యారెంటీ కార్డుకు వారంటీ అయిపోయింది అంటూ సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి అమర్నాథ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తామనే నమ్మకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు.. అందుకే ఈనెల 26న రాబోయే ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని వెల్లడించారు.. ఇప్పటికే అమలు అవుతున్న సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలకు మించి ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో వుండే అవకాశం ఉందన్నారు.. ఇక, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో ప్రకటిస్తామని పేర్కొన్నారు.. మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు.. పారిశ్రామిక, పర్యాటక సమగ్ర అభివృద్ధిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వచ్చాయి.. వాటన్నింటినీ క్రోడీకరించి లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను అని వెల్లడించారు మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్..
బుచయ్య చౌదరికి 8 పదులు వచ్చాయి.. దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు..!
బుచయ్య చౌదరికి 8 పదుల వయస్సు వచ్చింది.. కానీ, దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.. మంత్రి నామినేషన్ కార్యక్రమంలో జక్కంపూడి రాజా.. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ.. భారీ ఎత్తున వైసిపి శ్రేణులు పాల్గొన్నాయి.. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. శాసనసభ సభ్యత్వానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.. రాజమండ్రి రూరల్ లో రెండు పర్యాయాలు వైసీపీ అధికారంలోకి రాకపోవడానికి సంబంధించిన వైఫల్యలను గుర్తించి.. ముందుకు వెళ్తున్నాను.. ఈసారి రూరల్ లో అధికారం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాహానికి తెలుగుదేశం మునిగిపోవడం ఖాయం అన్నారు మంత్రి చెల్లుబోయిన.. ఇక, బుచయ్య చౌదరికి 8 పదులు వచ్చాయి… కొంతమంది దొంగలతో ప్రచారం చేయిస్తున్నారు.. ఆరు పర్యాయాలు గెలిచాడు.. దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు అని మండిపడ్డారు..
కవితకు మళ్లీ ఎదురుదెబ్బ.. రెగ్యులర్ బెయిల్‌పై కోర్టు ఏం తేల్చిందంటే..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే నెల 6కు తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీంతో ఆమె మరిన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఆమె తన పిల్లల పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరింది. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా బుధవారం రెగ్యులర్ బెయిల్‌పై ధర్మాసనం విచారించింది. దీనిపై తీర్పు మే 7న వెలువరించనుంది. కవిత రెగ్యులర్ బెయిల్‌పై ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఈడీ వాదనలపై ఎల్లుండి లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ ఇస్తామని కోర్టుకు కవిత తరపు న్యాయవాది నితీష్ రానా తెలిపారు.
లోక్‌సభ బరిలో ఎస్పీ చీఫ్.. కన్నౌజ్ నుంచి పోటీ..
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరోసారికి పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు. 2019లో బీజేపీ ఈ సీటు గెలిచే వరకు ఎస్పీకి ఈ సీటు నుంచి ఎదురులేదు. ఈ స్థానం నుంచి గురువారం అఖిలేష్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కలిగిన యూపీలో ఎవరు సత్తా చాటితే వారు ఢిల్లీలో అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువ. గత ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రం నుంచి మెజారిటీ స్థానాలు సాధించింది. ఈ సారి కూడా మొత్తం 80 స్థానాలకు గానూ 70+ గెలుపొందాలని భావిస్తోంది. మరోవైపు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులో పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కన్నౌజ్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ మేనల్లుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత స్వయంగా అఖిలేష్ పోటీ చేస్తాడనే వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
“మహిళా వైద్యులు” చికిత్స అందిస్తే రోగులు బతికే అవకాశం ఎక్కువ..
మహిళా డాక్టర్లు వైద్యం అందించి రోగులు చనిపోవడం తగ్గి, బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. పురుష వైద్యులు చికిత్స అందించిన రోగులతో పోలిస్తే మహిళా వైద్యుల చికిత్సలో మరణాల రేటు తగ్గిందని తేలింది. ఈ అధ్యయనం 2016 నుండి 2019 వరకు వివిధ వైద్య పరిస్థితుల కారణంగా ఆస్పత్రిల్లో చేరిన 4,58,100 మంది మహిళా రోగులు మరియు 3,18,800 కంటే ఎక్కువ మంది మగ రోగులతో సహా 7,76,000 మందిపై అధ్యయన చేసింది. మహిళా వైద్యులు చికిత్స చేసిన రోగుల్లో మరణాలు తక్కువగా ఉన్నట్లు, త్వరగా కోలుకున్నట్లు అధ్యయనం తేల్చింది. మహిళా వైద్యులతో చికిత్స పొందిన స్త్రీ పెషెంట్లలో మరణాల రేటు 8.15 శాతం ఉండగా.. పురుష వైద్యులు చికిత్స చేసినప్పుడు 8.38 శాతంగా ఉంది. ఇదే విధంగా లేడీ డాక్టర్లు చికిత్స చేసిన మగ రోగుల్లో మరణాల రేటు 10.15 శాతం ఉండగా.. పురుష వైద్యుల వైద్యంలో 10.23 శాతంగా ఉంది.
అంత మంది సీఎస్కే ఫ్యాన్స్ మధ్య ఆ ‘ఒక్కడు’.. ఇది కదా ఎంజాయ్ అంటే..!
మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ సీఎస్కే విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికీ, మార్కస్ స్టోయినీస్ అజేయ సెంచరీతో లక్నో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. దీంతో.. చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. లక్నో బ్యాటింగ్ లో స్టోయినీస్ వీరబాదుడు బాదుతుంటే.. సీఎస్కే అభిమానుల ముందు ఒకే ఒక్క లక్నో ఫ్యాన్ మాత్రం తెగ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగడంతో సీఎస్‌కేకి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. మ్యాచ్‌ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కడ చూసినా CSK అభిమానులు మాత్రమే కనిపించారు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులు కూడా స్టేడియంలో ఉన్నారు. లక్నో విజయానికి దగ్గరవుతున్న కొద్దీ చాలా మంది చెన్నై ఫ్యాన్స్ మధ్యలో అతనొక్కడే లేచి గంతులేస్తూ.. స్టెప్పులేశాడు. స్టేడియం మొత్తం పసుపు సంద్రాన్ని తలపించినప్పటికీ, సీఎస్కే మ్యాచ్ ఓడిపోవడంతో చాలా డిస్సాపాయింట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో లక్నో గెలవగానే వెంటనే లేచి నిలబడి తెగ ఎంజాయ్ చేశాడు. అతనిని చూసిన సీఎస్కే అభిమానులందరూ నిరాశ చెందారు. ఈ సన్నివేశం కెమెరా కంట్లో చిక్కడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరు..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా చాలా ముఖ్యమైన మ్యాచ్ లో తలపడనున్నాయి . ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది గేమ్ లు ఆడగా మూడు గెలిచి ఐదు ఓడిపోయింది. దింతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో ఉండిపోయింది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఉంది. ఆడిన 8 మ్యాచ్ లలో నాలుగు గెలిచి, నాలుగు ఓడింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్లే ఆఫ్ అర్హత సాధించాలంటే తమ మిగిలిన ఆరు గేమ్ లలో ఐదింటిని గెలవాలి. ఇక అలాగే గుజరాత్ టైటాన్స్ కు మిగిలిన ఆరు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో విజయాలు తప్పనిసరి. కాబట్టి ఈ గేమ్ రెండు జట్లకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ గా మారింది.
మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన కల్కి డైరెక్టర్.. వీడియో వైరల్..
మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సెట్టింగ్స్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పుట్టినరోజు వేడుకలను చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున నటించిన ‘మాస్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ని ప్లే చేయగా డైరెక్టర్ నాగ అశ్విన్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం కలిసి డాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అయితే ఈ పార్టీలో హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. కాకపోతే సోషల్ మీడియా ద్వారా హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పుష్ప టైటిల్ సాంగ్ దిగుతోంది.. ముహూర్తం పెట్టేశారు!
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘పుష్ప:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోగా ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దు అన్నట్టు అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేయగా టీజర్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ దెబ్బతో సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు బన్నీ. తిరుపతి గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్ కట్ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉండగా ఇప్పుడు సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను ఈ రోజు సాయంత్రం 04.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రకటించిన మేరకే సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప పుష్ప పుష్ప, పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ సాగిన 19 సెకన్ల ప్రోమో కేవలం ఫుల్ లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చేలా మాత్రమే కట్ చేశారు. పెద్దగా ఎక్సయిట్ చేసేలా అయితే అనిపించలేదు. ఈ ఫస్ట్ సింగిల్, టైటిల్ సాంగ్ మే 1న ఉదయం 11. 7 నిముషాలకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక పుష్ప 2లో శ్రీవల్లి పాత్రలో మరోసారి రష్మిక నటిస్తుండగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాసిల్ నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.