NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఆగని మాటల యుద్ధం.. మాజీ సీఎం కిరణ్‌పై పెద్దిరెడ్డి ఫైర్‌..
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్‌ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నాను అని అబద్ధాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు.. అయన మరణం అనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇక, వైఎస్ జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా ? అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి.. వైఎస్‌ జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకున్నారు.. చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని విమర్శించారు. మరోవైపు.. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే 10 రోజులపాటు అయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచారు.. ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పి అక్కడ సంపద దోచుకుంది నిజం కాదా ? అని నిలదీశారు. నేను పుట్టింది తెలంగాణలో, నేను కూడా తెలంగాణ వాడినే అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.. ఆఖరి బాల్ నాదే అని చెప్పి ఏపీ ప్రజల్ని మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి.. వాళ్ల సొంత తమ్ముడే ఆయన్ని ఇక్కడ నుండి తరిమేశారు.. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి, నేడు బీజేపీ టికెట్‌పై పోటీ చేయడానికి సిగ్గు ఉండాలి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులు వేసుకుని తిరిగాడు.. ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇక, నాకు ఒక ఓటు తగ్గినా పర్లేదు.. కానీ, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

గోదావరి జిల్లాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ.. రాబోయే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే..!

గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలు రాబోయే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు గోరంట్ల.. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా పదోసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారాయన.. భారీ ర్యాలీగా కలెక్టర్ కు తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగినవి.. రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని ధీమా వ్యక్తం చేశారు.. రాబోయే ఎన్నికల్లో వన్ సైడ్ వార్ గా కూటమి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక మేనిఫెస్టోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడుతాను అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మరోసారి రాజమండ్రి రూల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

బాలయ్యకు రూ.9 కోట్ల అప్పు.. రూ.81 కోట్ల విలువైన ఆస్తులు..!
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోసారి ఆ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు.. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆయన.. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్‌విక్టరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.. తన నియోజకవర్గంతో పాటు రాయలసీమ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు.. అయితే, ఈ రోజు హిందూపురం నియోజకర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు నందమూరి బాలకృష్ణ.. త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్‌వో కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఇక, నామినేషన్‌ పత్రాల్లో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నప్రకారం ఆయనకు రూ.9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఎన్నికల అఫిడవిట్‌లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు… ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు.. ఇక, ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది.. మరోవైపు అప్పులు విషయానికి వస్తే.. బాలయ్యపై రూ.9 కోట్ల 9 లక్షల 22 వేల అప్పు ఉండగా.. ఆయన భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 98 వేలుగా ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ..

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి ప్రభుత్వాలే.. ఖమ్మంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వం కావాలని బీజేపీ కోరుకుందని కేంద్ర మంత్రి అన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి ప్రభుత్వాలేనని విమర్శలు గుప్పించారు. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాల చరిత్రేనని ఆయన ఆరోపించారు. బోఫోర్స్, చక్కర ఒక్కటేమిటి అన్ని కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో ఒక్క కుంభకోణం లేదని.. మోడీ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందన్నారు. మెజారిటీ వచ్చిన తరువాత జమ్మూ కాశ్మీర్‌ను సంపూర్ణంగా విలీనం చేసిన చరిత్ర బీజేపీదేనని స్పష్టం చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినట్లే రామమందిరం నిర్మించామన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌లు పేదరికం పోగొడుతామని చెప్పారని.. కానీ చేయలేదన్నారు. దేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా చేసింది నరేంద్ర మోడీ అని.. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి ఐదవ స్థానానికి వచ్చిందన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇబ్బందులు పడ్డ వారిని మన దేశంలోకి తీసుకుని వచ్చామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

పసుపు రైతులు ఇచ్చిన డిపాజిట్ ఖర్చుతో నామినేషన్ దాఖలు
నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్‌కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అనంతరం నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు రైతుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని.. డిపాజిట్ ఖర్చు కూడా రైతులు ఇవ్వటం సంతోషమని ఆయన అన్నారు. పసుపు రైతు రమేష్ తనకు ఈ ప్రపోజల్ ఇచ్చారన్నారు. పసుపుతో పాటు అన్ని రకాల పంటలపై దృష్టి పెడతామని..అన్ని పంటలకు మార్కెటింగ్,మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. భారత దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తీర్చి దిద్దటం మా మేనిఫెస్టోలో ఉందన్నారు. గల్ఫ్ వలసలు ఆపుతామమని.. ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. ఓట్లు తగ్గుతాయని భయంతో బీఆర్ఎస్. నేతలు కవిత ఫోటో పెట్టుకోవటం లేదని ఆయన విమర్శించారు.

బీజేపీకి ఓటు వేయకపోతే.. మీ పౌరసత్వం, మీ ఆధార కార్డు తీసేస్తారు..
ఈద్ జ‌రుపుకునేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వ‌చ్చిన వ‌ల‌స కూలీలు ఓటు వేయ‌కుండా తిరిగి వెళ్లొద్దని ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు. మీరు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌కుంటే కాషాయ పాల‌కులు మీ ఆధార్ కార్డు, పౌర‌స‌త్వాన్ని తీసేస్తార‌ని పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో ఇవాళ ( శుక్రవారం ) జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచార సభలో దీదీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో సీఏఏను తాను ఎట్టి పరిస్థిత్తులో అమ‌లు చేయ‌బోన‌న్నారు. ఎన్ఆర్‌సీని ఇక్కడ అమ‌లు చేసేందుకు అనుమ‌తించ‌న‌ని స్పష్టం చేశారు. అస్సాంలో సీఏఏను అమ‌లు చేస్తుండ‌గా అక్కడ ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఆందోళ‌న వ్యక్తం చేసింది. ఇక, కాషాయ నేత‌లు ఇప్పుడు ఉమ్మడి పౌర‌స్మృతి (యూసీసీ) గురించి మాట్లాడుతున్నార‌ు.. యూసీసీని వారు తీసుకు వ‌స్తే ఏమ‌వ‌తుందో మీకు తెలుసా అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. దాని వల్ల మీరు మీ గుర్తింపును కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని వెల్లడించింది. అలాగే, ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌, వామపక్షాలపై కూడా మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో కలిసి కాంగ్రెస్‌, వామపక్షాలు తృణమూల్‌ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తాను.. కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానని చెప్పారు.. ఇంత చేస్తే బెంగాల్‌లో కాంగ్రెస్‌- బీజేపీ కోసం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌, వామపక్షాలకు ఎవరూ ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చింది.

ఇంకా నీళ్లల్లోనే దుబాయ్.. స్తంభించిన జనజీవనం
గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్‌ను దడదడలాడించింది. పలుచోట్ల రోడ్లు, ఇళ్లు ఏకమైపోయాయి. మరికొన్ని కోతకు గురయ్యాయి. భారీ నీటి ప్రవాహానికి కార్లు, బైకులు, వస్తువులు కొట్టుకుపోయాయి. దాదాపు నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడలేదు. ఓ వైపు అధికారులు.. సహాయ బృందాలు పని చేస్తున్నా.. వర్షపు నీరు ఇంకా రోడ్లు, ఇళ్ల మధ్య నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వీడియోలు పెడుతున్నారు. అంటే వర్షం ఎంతగా కురిసిందో దీని బట్టి చెప్పొచ్చు. ఏప్రిల్ 15 సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. మొదట చినుకులతో నెమ్మదిగా ప్రారంభమై.. అనంతరం ఒక్కసారిగా తీవ్ర ప్రభావం చూపించింది. విపరీతంగా వర్షం కురిసింది. 1949 తర్వాత అంతటి వర్షం కురవడం మళ్లీ ఇదే కావడం విశేషం. ఇక వర్షపునీరు అపార్ట్‌మెంట్ల కింద నిలిచిపోవడంతో కార్లు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమైపోయారు. మరోవైపు వర్షపునీరు బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి.

ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్‌లు నిలిపివేత
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు టెల్ అవీవ్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్ ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాలను ఏప్రిల్ 30, 2024 వరకు నిలిపివేసినట్లు ఎయిరిండియా పేర్కొంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు రీషెడ్యూల్ చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో ఎయిరిండియా పేర్కొంది. మరింత సమాచారం కోసం 011-69329333 / 011-69329999 నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని.. లేదా వెబ్‌సైట్ http://airindia.comని సందర్శించొచ్చని వెల్లడించింది.

హార్థిక్ పాండ్యాను పట్టించుకోని ఆకాశ్‌ మధ్వాల్‌
ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌- ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరి ఓవర్‌ వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడిన ఆఖరికి ముంబై వైపు మొగ్గు చూపించింది. ఫలితంగా హార్దిక్‌ సేన ఈ సీజన్‌లో ఎట్టకేలకు మూడో విజయాన్ని నమోదు చేసింది. అయితే, గురువారం నాడు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కాగా, చంఢీగడ్‌లోని ముల్లన్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్ సెంచరీ(78) సాధించగా.. రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ(18 బతుల్లో 34-నాటౌట్‌) రాణించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో తేలికగా మ్యాచ్‌ను ముంబైకి ఇచ్చేస్తుంది అనుకునే సమయంలో పంజాబ్‌ హీరోలు శశాంక్‌ సింగ్‌(25 బంతుల్లో 41), అశుతోశ్‌ శర్మ(61) రెచ్చిపోవడంతో.. ముంబై జట్టుకి చెమటలు పట్టించారు. ఓ దశలో మ్యాచ్‌ను పంజాబ్‌ వైపు తిప్పేశారు అనే అనుమానం వచ్చింది. టెయిలెండర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌(21) పోరాడిన ఫలితం లేకపోయింది. చివర్లో హర్షల్‌ పటేల్‌(1 నాటౌట్‌)తో పాటు కగిసో రబడ క్రీజులో ఉండగా ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌ విజయ 12 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్‌ పాండ్యా పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ తో బౌలింగ్ వేయించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్‌ మధ్వాల్‌ ఫీల్డ్‌ సెట్‌ చేసే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. కానీ, అదే సమయంలో హార్దిక్‌ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆకాశ్ పెద్దగా పట్టించుకోలేదు.. రోహిత్‌తో చాలా సేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సల్మాన్ తర్వాత షారుఖ్.. భారీగా భద్రత పెంపు!
ముంబైలోని బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి (గెలాక్సీ అపార్ట్‌మెంట్) వెలుపల కాల్పుల ఘటన తర్వాత, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ భద్రతను పెంచారు. పోలీసు రక్షణలో ఉన్న ఎస్‌ఆర్‌కెతో సహా స్టార్‌లందరినీ సమీక్షించామని, ఆ రక్షణనను మరింత కఠినతరం చేసే ప్రక్రియను ప్రారంభించామని ముంబై పోలీసులకు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి చర్యలు షారుఖ్ ఖాన్ విషయంలో తీసుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వై ప్లస్ భద్రతలో షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇక సల్మాన్ ఇంటిపై దాడి తర్వాత, 6 సాయుధ సైనికులతో 24 గంటలు ఉండేలా షారుక్ ఖాన్ భద్రతను మరింత పెంచారు. షారుఖ్ ఖాన్ ముంబైలో ఉన్నా లేదా బయట ఉన్నా.. ఆయన్ని ఎల్లవేళలా సెక్యూరిటీ కవర్‌లో ఉంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల కోల్‌కతాలో మ్యాచ్ ముగిసిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య షారుక్ కనిపించారు. 2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా విడుదల సందర్భంగా డాన్ రవి పూజారి నుంచి షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ముప్పును సీరియస్‌గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం షారుక్ ఖాన్‌కు భద్రతను పెంచింది. ఇక ఆయనకు Y ప్లస్ భద్రతను ఇచ్చింది. ఇక షారుక్ నటించిన ‘పఠాన్’ మరియు ‘జవాన్’ చిత్రాలు గత సంవత్సరం విడుదలయ్యాయి, ఆ సమయంలో కూడా కింగ్ ఖాన్‌కు అండర్ వరల్డ్ నుండి బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు బైక్ రైడర్లు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినప్పుడు, ఇంటి వెలుపల మోహరించిన పోలీసు వ్యాన్ అక్కడ నుండి కనిపించకుండా పోయిందని వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ కాల్పులకు పాల్పడ్డారని అంటున్నారు.

మార్కెట్లో మెంటలెక్కిస్తున్న పుష్ప 2 క్రేజ్.. మొత్తం అన్ని వందల కోట్లా?
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తుంటే… మెంటల్ వచ్చేస్తుంది’ అనేది సినిమాలో రావు రమేష్ చెప్పే డైలాగ్. ఇప్పుడు అదే డైలాగ్ సరిగ్గా అల్లు అర్జున్ కి సరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పుష్ప 2 సినిమాకు సంబంధించి జరుగుతున్న బిజినెస్ పరిశీలిస్తే ఈ మాట అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా నార్త్ బెల్ట్ లో ఒక రేంజ్ పెర్ఫార్మన్స్ చేసి తెలుగులో కంటే ఎక్కువ కలెక్షన్లు అక్కడ నుంచే రాబట్టింది. ఇది ఏమాత్రం ఊహించని సినిమా యూనిట్ రెండో భాగాన్ని మరింత పెద్దదిగా, ఇండియా వైడ్ ప్రేక్షకులందరూ ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బిజినెస్ మొదలైపోయింది. నార్త్ థియేటర్ రైట్స్ అనిల్ తడానీతో కలిసి కరణ్ జోహార్ భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక అన్ని భాషల ఓటీటీ రైట్స్ 250 నుంచి 300 కోట్లు పలుకుతుండగా ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ రైట్స్ కూడా టి సిరీస్ సంస్థ కొనుగోలు చేసిన వార్త వెలుగులోకి వచ్చింది. కేవలం ఆడియో రైట్స్ కోసమే 65 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఇంకా సౌత్ అలాగే ఓవర్సీస్ బిజినెస్ జరగలేదు కానీ ఇప్పటికే జరిగిన డిజిటల్ నార్త్ ఇండియన్ థియేటర్ రైట్స్, ఓటీటీ, మ్యూజిక్ రైట్స్ తో దాదాపు 540 కోట్లు పుష్ప మేకర్స్ కి వచ్చినట్లుగా చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొత్తగా బెంగాలీ భాషలో కూడా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద పుష్ప 2 క్రేజ్ తో పాటు అల్లు అర్జున్ క్రేజ్ కూడా చూస్తుంటే ఈ సినిమా అనేక సంచలన రికార్డులను నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది.