Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!

తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేశారు.

తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌.. బెస్ట్‌ సినిమాగా కల్కి..!

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం లేకుండా పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. జ్యూరీ ఏకగ్రీవంగా విజేతలను ఎంపిక చేసిందని జయసుధ తెలిపారు.

చంద్రబాబు గారికి అభినందనలు.. విజయం కలగాలని కోరుకుంటున్నా!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను అని పవన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘పోలీసు యోగాంధ్ర’ కార్య‌క్ర‌మం.. పాల్గొన్న సీఎస్‌ విజయానంద్‌!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్‌ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌, ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అంతేకాదు యువతీ యువకులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు.

ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవు!

ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని.. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు అని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి పెమ్మసాని సందర్శించారు.

101 శాతం బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలిపే ప్రయత్నం చేస్తున్నారు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై, తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న కుట్రలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్న కొందరు కోవర్టులు నన్ను ఓడించేందుకు ప్రయత్నించారని, పేయిడ్‌ న్యూస్‌లు వేసి, లేఖల్ని లీక్‌ చేసి, బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ను కలిపే కుట్రలు చేస్తున్నారు అని విమర్శించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉండాలంటే ట్వీట్లు చేయడం మాత్రమే కాదు, కార్యాచరణ చూపించాలి. పార్టీ నడిపించే సత్తా మీకు లేదని నన్ను తప్పుబడుతున్నవారు ముందుగా వాళ్లు ఏం చేశారో చెప్పాలి,” అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

వంగవీటి రంగా విగ్రహం తొలగింపు.. అంతర్వేదికరలో ఉద్రిక్తత!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అంతర్వేదికరలో కాపు సంఘాలు వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్నికి అనుమతి లేదు అంటూ పోలీసులు తొలగించారు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటూ కాపు సంఘాలు వాగ్వివాదానికి దిగాయి. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విగ్రహాన్ని మళ్లీ ఇదే ప్లేసులో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలను పోలీసుల అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది.

ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. గాయపడిన మహిళకు పాజిటివ్!

మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ నిర్ధారణ అయింది. చిలకలూరిపేటకు చెందిన వృద్దుడు, బాపట్లకు చెందిన మరో‌ మహిళకు పాజిటివ్‌గా తేలింది.

తండ్రి డైరక్షన్‌లో హీరయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కూతురు.. టీజర్ రిలీజ్..!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా పయనం’. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటిస్తున్నది. అర్జున్ కుమార్తెకు ఇది హీరోయిన్‌గా తొలి సినిమా. మరోవైపు హీరోగా నిరంజన్ సుధీంద్ర నటిస్తున్నాడు. ఆయన ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర సోదరుడి కుమారుడు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇది ఓ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటోంది.

 

Exit mobile version