NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్

ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..!

నేడు ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..

నేడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో భేటీ కానున్నారు. నియోజక వర్గాల్లో అభివృద్ధి అంశాలతో పాటు, తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం, కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ, బీజేపీ నేతల సమావేశానికి కీలక ప్రాధాన్యత సంచరించుకుంది.

నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..

హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. అగ్ని ప్రమాద ఘటనలతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే పరుగులు పెట్టి మంటలను అదుపు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేయడం సంతోషంగా అని పించింది

సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, ఆయన పాపం పండిందన్నారు. తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసిందని, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు కుట్ర చేసింది పీవీసునీల్ కుమార్ అని ఆయన అన్నారు. నన్ను కస్టోడియాల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారని రఘురామ అన్నారు. అందరూ కలిసి కుట్ర చేశారు, ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడు అని రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.

అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..

అదానీ గ్రూప్స్ తో పాటు దాని అనుబంధ కంపెనీలు.. ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై ఆమెరికాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ ఈరోజు (బుధవారం) రియాక్ట్ అయింది. ఇందులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై కేసు నమోదు చేశారనే వార్తల్లో నిజం లేదని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో గ్రీన్ ఎనర్టీ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి ( గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్‌)పై సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

క్లినిక్ లపై తెలంగాణ వైద్య బృందం తనిఖీలు.. నకిలీ వైద్యుల గుట్టు రట్టు..

నిజమైన వైద్యులు పోయేప్రాణాలను కాపాడితే.. ఆరోగ్యంగా ఉన్న అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు నకిలీ వైద్యులు. ఎలాంటి విద్యార్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో మురికివాడలు, కాలనీల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసి తాము అందిస్తున్న సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అనారోగ్యంతో తమ వద్దకు వచ్చే రోగులకు అవసరానికి మించి యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ దందా ఎక్కువైంది. కొంతమంది ఒకే దవాఖానల్లో ఇన్ పేషెంట్లకు బెడ్లు కూడా ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హతలు, వైద్య విద్య లేకుండానే కొందరు వైద్యులుగా చలామణి అవుతూ ఎంతో మంది ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇలాంటి క్లీనిక్, నకిలీ వైద్యులపై తెలంగాణ వైద్య మండలి బృందం ఉక్కుపాదం మోపింది. ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్లినిక్ లపై తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్, బాన్సువాడలో రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. కనీస విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల గుట్టు రట్టు చేశారు. విచ్చలవిడిగా యాంటి బయాటిక్స్, పైల్స్ కు ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు గుర్తించారు. 30 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 15 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. నకిలీ డిగ్రీ, డీబీఎంఎస్ ల పేరుతో క్లినిక్ ల నిర్వహణ చేపట్టినట్లు గుర్తించారు. నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదానీ సోలార్‌ ప్రాజెక్టు విషయం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పవన్, ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయిన పవన్, మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ధ్వజమెత్తారు.

లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పార్లమెంటులోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇక నేడు మూడో రోజు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నేటి ఎజెండాలో రైల్వేస్ (సవరణ) బిల్లు 2024ను చర్చ, ఆమోదం కోసం సమర్పించడం ఉంది. వీటితోపాటు ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టబడుతుంది. చమురు రంగం (నియంత్రణ & అభివృద్ధి) సవరణ బిల్లు 2024 కూడా నేడు ఎగువ సభలో చర్చకు రానుంది.

గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయండి..

సౌర విద్యుత్తు కాంట్రాక్టుల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు అదానీ గ్రూప్ 2,200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. ఇక, గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ ఛేంజ్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. తాజాగా, ఈ వ్యవహారంపై లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా ఆందోళనలు.. కనిపిస్తే కాల్చివేతకు పాక్ సర్కార్ ఆదేశాలు

పాకిస్తాన్‌ దేశంలోని గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతలు, కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అణచి వేసేందుకు.. కనిపిస్తే కాల్చివేతకు షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిరసన ప్రదర్శనలకు స్వస్తి పలుకుతున్నట్లు పీటీఐ కార్యకర్తలు ప్రకటించారు. ఇక, పీటీఐ నిసరనల నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. దీంతో పాక్‌ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు అమలు చేయడంతో.. ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తదుపరి వ్యూహం ఏమిటనేది ఇమ్రాన్ పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను ఫాసిస్ట్ మిలిటరీ పాలనగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభివర్ణించింది.