NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

ఒలింపిక్ సన్నాహకాల మధ్య పారిస్‌లో ఆస్ట్రేలియా మహిళ పై సామూహిక అత్యాచారం

పారిస్‌లో జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు రావడంతో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ ప్యారిస్‌లోని పిగల్లే జిల్లాలో తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ సమీపంలోని కబాబ్ షాప్‌లో ఆశ్రయం పొందింది. బాధతో, ఆమె బట్టలు పాక్షికంగా చిరిగిపోయి, సహాయం కోసం కాల్ చేయడానికి రెస్టారెంట్ సిబ్బందిని అభ్యర్థించింది. ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే ప్రాసిక్యూటర్లు ఈ కేసును “గ్యాంగ్ రేప్”గా అభివర్ణించారు. దర్యాప్తును వేగవంతం చేశారు.

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తుంది. అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. అల్లూరి జిల్లాలో 100కు పైగా లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంది. చింతూరు నుంచి ఛత్తీస్‌ గఢ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు ఐదు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాల్లోనే డ్రైవర్లు, ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బందంలో చిక్కుకుపోయాయి. ఈ వరదల వల్ల వరి, నారుమళ్ళు, ఉద్యాన, కూరగాయలు పంటలు మొత్తం నీటమునిగాయి. భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టింది. 46.07 అడుగుల దగ్గర గోదావరి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 10, 83, 684 క్యూసెక్కులకు చేరింది. అయితే, గోదావరి వరదపై అధికారులు సమీక్ష నిర్వహించారు. నేటి మధ్యాహ్నానికి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోదావరి పరివాహ ప్రాంతంలో గడిచిన 12 నుంచి 18 గంటల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు. ధవలేశ్వరం బ్యారేజీ దగ్గర వరద నీరు ఎగువ నుంచి నిలకడగా వస్తుంది. ప్రస్తుతానికి 14.50లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు రిలీజ్ అవుతుంది.

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 25 అగ్నిమాపక యంత్రాలు

దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతోంది. ఘటనా స్థలానికి 25 అగ్నిమాపక వాహనాలను పంపించారు. సమాచారం మేరకు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదంపై పోలీసులకు సమాచారం అందింది. ఈ ఫ్యాక్టరీ నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వార్త రాసే వరకు మంటలను అదుపు చేయలేకపోయారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు చెందిన 25 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఫ్యాక్టరీ నుంచి నల్లటి పొగ వెలువడుతోంది. ఆకాశంలో మంటలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ పైన ఉన్న ఆకాశమంతా నల్లగా మారిపోయింది. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే విషెస్‌!

నేడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు. 1976 జూలై 24న సిద్ధిపేటలో జ‌న్మించిన కేటీఆర్‌.. నేటితో 48వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో చాలా తండాలకు రోడ్డుమార్గం లేదని, తండాలకు 100 శాతం బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి జరిగినట్లు అని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన తప్పులకు శిక్షపడ్డా ఇంకా మారడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఇంకా వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాల్లో బతుకుతున్నారని, 7 లక్షల అవాసాలకు నీళ్లు ఇంకా ఇవ్వలేదని ఆయన అన్నారు. దేవుడి మీకు మంచి బుద్ధి ప్రసాదించండి అని మాత్రమే అడగగలం.. అంతకు మించి ఏం చేయలేం అంటూ విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్‌. సరైన రోడ్లు లేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు.

ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అని తేల్చి చెప్పారు. అయితే, 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచితి ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పుకొచ్చారు.. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తాం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ వెల్లడించారు.

ఇంగ్లీష్ విద్యకు ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. పరీక్షలతో పిల్లలపై ఒత్తిడి..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు మంత్రుల కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ విద్యకు ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదు.. మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ, పరీక్షలు వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది అని తెలిపారు. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.. ఇంగ్లీషు భాష అవసరమే కానీ.. ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు నాలాగా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడటం మంచిది కాదు అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయింది

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఆర్టీసీపై చర్చ జరిగింది. దీనిపై వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు.. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని, రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి ఆయన అన్నారు. ఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదన్నారు. సీఎం హాఫ్ నాలెడ్జీ తో మాట్లాడుతున్నారని, ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో.. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని ఆయన తెలిపారు. మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందన్నారు.

పార్లమెంట్‌లో రైతులతో రాహుల్ గాంధీ భేటీపై వివాదం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రైతులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లోని రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ ఇప్పటికే చర్చనీయాంశమైంది. రైతులకు పాస్‌లు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ విషయం మీడియా ముందుకు రావడంతో రాహుల్‌ను కలిసేందుకు రైతులను అనుమతించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నందున కొంతమంది రైతులను నా ఛాంబర్‌కు పిలిపించానని, అయితే వారి పాస్‌లు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. నేనే వారిని కలవడానికి వెళ్తున్నాను. ఇది ఒక సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. మీడియాలో వార్తలు రావడంతో రైతులు లోనికి వెళ్లేందుకు పాస్ లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రాహుల్ ఛాంబర్‌లో సమావేశం కానుంది.

ఆసుపత్రిలో లేని వైద్యులు.. ఇద్దరు గర్భిణులకు పురుడు పోసిన ఎమ్మెల్యే!

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో సర్జన్‌ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది కంగారుపడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. నేనున్నానంటూ రంగంలోకి దిగారు. ఇద్దరు గర్భిణులకు విజయవంతంగా సిజేరియన్‌ చేశారు. ప్రసూతి సేవలందించిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. తెల్లం వెంకట్రావు. ఎంఎస్‌ సర్జన్‌ అయిన తెల్లం గతంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్జన్‌గా సేవలందించారు.

గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిండు గర్భిణులను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అధికార యంత్రాంగం తరలించింది. భద్రాచలం ఆసుపత్రిలో ఐదుగురు సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఇటీవల నలుగురు బదిలీ అయ్యారు. ఉన్న ఆ ఒక్క సర్జన్‌ కోర్టు పని మీద బయటకు వెళ్లారు. మంగళవారం ఆసుపత్రిలోని గర్భిణుల్లో ఇద్దరికి పురిటి నొప్పులు వచ్చాయి. సిజేరియన్‌ తప్పనిసరి కావడం, సర్జన్‌ లేకపోవడంతో.. మిగతా వైద్యులు, సిబ్బంది కంగారుపడ్డారు.

మమతా బెనర్జీ పై షేక్ హసీనా ప్రభుత్వం భారత సర్కార్‎కు ఫిర్యాదు

బంగ్లాదేశ్‌లో దిగజారుతున్న పరిస్థితులపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై భారతదేశంలో వివాదం ఆగలేదు..బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యను సీరియస్‌గా తీసుకున్న పొరుగు దేశం న్యూఢిల్లీకి అధికారిక నోట్ పంపింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ తన ప్రకటనలో.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాకు చాలా మంచి, సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ ప్రకటనతో గందరగోళానికి ఆస్కారం ఉంది. ఈ విషయంపై మేము భారత ప్రభుత్వానికి ఒక నోట్ పంపాము. ఇటీవల బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా పోలీసుల క్రూరత్వాన్ని చూసిన పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ నిస్సహాయ ప్రజలు పశ్చిమ బెంగాల్ తలుపులు తడితే, వారికి ఖచ్చితంగా సహాయం చేస్తానని అన్నారు. ఆయన ప్రకటన తర్వాత భారతదేశంలో కూడా రాజకీయాలు వేడెక్కాయి. బిజెపి ప్రభుత్వ నాయకులు అతని ప్రకటనపై ప్రశ్నలు లేవనెత్తారు.