NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఏపీని జల్లెడపడుతున్న పోలీసులు.. భారీగా బైండోవర్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇక, పల్నాడు జిల్లాలో పోలీసులను కౌంటింగ్ ప్రక్రియ టెన్షన్ పెడుతుంది. పోలింగ్ పూర్తైన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకున్న పోలీసులకు నాయకులు షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగటంతో మరింత అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సెలవులు ఇచ్చేది లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పేసింది. మరోవైపు స్ట్రాంగ్ రూములపై డ్రోన్ ల ఎగరవేత కూడా నిషేధించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ లు చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. పోల్ డే హింస నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. హింసాత్మక ఘటనలు, ఎన్నికల కమిషన్ (ఈసీ) వేటుతో పోలీసుల్లో వణుకు మొదలైంది. మూల మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు. అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. కౌంటిగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందర్నీ పోలీస్ స్టేషన్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై ఏపీ పోలీసులు నిషేధం విధించారు.

అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడులో అరాచకం సృష్టించారు..
ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన ఘర్షణలపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలి అని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడు లో అరాచకం చేశారు.. టీడీపీ, అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకొచ్చారు. సిట్టింగ్ జడ్జితో మా కాల్ డేటా చెక్ చెపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. వైసీపీ నాయకులు ఎంత మంది పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. టీడీపీకి మద్దతు పలుకుతున్నారు అన్న అనుమానంతో అనేక కుటుంబాలను వేధించారు.. 2024లో జరిగిన ఎన్నికలు ప్రజలు పని చేసిన ఎన్నికలు.. అనేక మంది ప్రజలు, అరాచకానికి వ్యతిరేకంగా పోరాడారు అంటూ లావు కృష్ణ దేవరాయలు తెలిపారు. మేము పారదర్శకంగా ఎన్నికల పోటీలో పాల్గొన్నాం అని లావు కృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. మేం లాలూచీ లు పడే రకం కాదు.. ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయి పోలీసులు సరిగ్గా పని చేయలేదు.. నరసరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి వాహనాలు పగల గొట్టారు.. దొండ పాడులో నా వాహనాలు పగలు కొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.. ఘర్షణలు జరుగుతున్నా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు చెప్పాలి.. అలాగే, ఈ ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తు చేయాలి అంటూ లావు కృష్ణ దేవరాయలు డిమాండ్ చేశారు.

నేడు తిరుపతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదీ..
నేడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలపై నేతలతో చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు. మనవడి తల నీలాలు సమర్పించేందుకు తిరుమలకు సీఎం కుటుంబంతో సహా వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాగా.. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు నాలుగు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. అకాల వర్షాలు కురుస్తుండటంతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రైతులు నష్టపోకుండా చివరి ధాన్యం వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. సన్నవాడ సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసినా రైతులకు నీరు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీకి విరుద్ధంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ఇది కపట కాంగ్రెస్ బ్రాండ్ మోసం, దగా, వంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ కార్డులో వరి పంటకు రూ. 500 బోనస్ ప్రకటించారు. ప్రచారంలో ప్రతి గింజను అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారన్నారు. ఇది ప్రజల పాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. నిన్నమొన్నటి వరకు సాగునీరు ఇవ్వక, కరెంట్ కోతలతో పంటలను ఎండబెట్టి, కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక, అకాల వర్షాలు కురవక వానలు కురిశాయి. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ. 15,000 రైతు భరోసా.. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదు. డిసెంబర్ 9న ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు.. అది చేయలేదన్నారు. నేడు బోనస్ విషయంలోనూ ప్రభుత్వ బోగస్ విధానం బట్టబయలైందన్నారు. ఓట్ల నాడు ఒకమాట… నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో.. గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు అన్నారు. ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదన్నారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరన్నారు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారన్నారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. అంటూ కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.

నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు చెల్లించండి.. హరీష్‌ రావు ట్వీట్ వైరల్
కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని ట్వీట్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.

బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం.. కఠిన చర్యలు తప్పవు: బెంగళూరు సీపీ
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ.. ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఈ విషయాన్ని బెంగళూరు సీపీ తెలిపారు. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం అని, డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్‌పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం అని బెంగళూరు సీపీ చెప్పారు. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారని తెలుస్తోంది. ఆదివారం (మే 19) సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా పార్టీ జరగ్గా.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పాల్గొన్నారట. బెంగళూరు సీపీ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు రేవ్‌పార్టీ కేస్ బదలీ చేశాం. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం. డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా చర్యలు తీసుకుంటాం.డ్రగ్స్ పెడ్లర్‌పైనే కఠిన చర్యలు ఉంటాయి చాలా మంది సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశాం. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవు పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. రేవ్‌పార్టీకి ప్రజా ప్రతినిధులు ఎవరూ వచ్చినట్లు సమాచారం లేదని, ఇద్దరు నటులు దొరికారు అని బెంగళూరు సీటీ కమిషనర్ చెప్పారు.

స్కూల్ గర్ల్స్‌ని వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్.. స్నేహితురాలి తల్లే ప్రధాన సూత్రధారి..
స్కూల్ విద్యార్థినిలకు డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహిళతో పాటు ఆమె ఆరుగురు సహచరుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 17-18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు టీనేజ్ బాలికల్ని పోలీసులు రక్షించారు. పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ లాడ్జిపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన 37 ఏళ్ల నదియా అనే మహిళ చెన్నైలో తన కూతురితో కలిసి చదువుతున్న బాలికల్ని టార్గెట్ చేసింది. వారికి డ్యాన్స్ నేర్పిస్తాననే నెపంతో స్నేహం చేసి బ్యూటీషియన్ కోర్సులు కూడా నిర్వహించేందు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలకు వలేసేది. నదియా బాలికలకు రూ. 25,000-30,000 ఇస్తానని చెప్పి వ్యభిచారంలోకి దింపింది. చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూర్, హైదరాబాద్‌లోని కస్లమర్ల వద్దకు పంపించేందు. ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకు సాకులు చెప్పాలనే దానిపై కూడా నదియా బాలికలకు శిక్షణ ఇచ్చేదని పోలీసులు తెలిపారు. నిందితురాలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్లయింట్స్‌తో డీల్ కుదుర్చుకునేది. కస్టమర్లలో కొందరు కోయంబత్తూర్, హైదరాబాద్‌కి చెందిన వృద్ధులు కూడా ఉన్నట్లు తేలింది. పాఠశాల బాలికలకు ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో నిందితురాలు వారిని టార్గెట్ చేసింది.

జూన్ 14న ‘సుబ్రహ్మణ్యం’ ఆగమనం!
సుధీర్‌ బాబు, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమంత్‌ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్‌ సినిమా ఇది. ప్రస్తుతం హరోం హర పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా హరోం హర విడుదల అవుతుందని చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్ బాబు ఫొటోను రిలీజ్ చేసి మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ముందుగా మే 31న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. జూన్ 14న ఏ సినిమా విడుదలకు లేదు. దాంతో హరోం హర సోలోగా విడుదల కానుంది. ఆకట్టుకునే పాటలు, ఆసక్తిని రేకెత్తించే టీజర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రంకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

కోల్‌కతాతో మ్యాచ్.. సన్‌రైజర్స్‌కు శుభవార్త!
ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. రెండు నెలలుగా 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్‌లు నాకౌట్‌ దశకు చేరాయి. నేడు క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమేనటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయిర్-2లో తలపడుతుంది. రిస్క్ తీసుకోకుండా క్వాలిఫయర్‌-1లోనే గెలిచి ఫైనల్ చేరుకోవాలని కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ చూస్తున్నాయి. కీలక మ్యాచ్ నేపథ్యంలో సన్‌రైజర్స్‌కు ఓ శుభవార్త. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ టీమ్స్ ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 17 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఎస్‌ఆర్‌హెచ్ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గణాంకాలు ఆరెంజ్ ఆర్మీని కాస్త టెన్షన్ పెడుతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం తెలుగు జట్టు సన్‌రైజర్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సజావుగా సాగడం ఖాయం. వర్షం కారణంగా సూపర్‌ ఓవర్‌ కూడా సాధ్యం కాకపోతే.. సీజన్‌ను ఎక్కువ పాయింట్లతో ముగించిన కేకేఆర్ ఫైనల్ చేరుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కేకేఆర్ స్టార్ ప్లేయర్లకు చెత్త రికార్డు ఉంది. కేకేఆర్ విజయాల్లో సునీల్ నరైన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్పిన్నర్‌గా మాత్రమే కాకుండా.. బ్యాటర్‌గా మరింత రెచ్చిపోతున్నాడు. అయితే అహ్మదాబాద్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన నరైన్.. మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఇక్కడ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ రికార్డు కూడా పేలవంగా ఉంది. ఈ మైదానంలో అతని స్ట్రైక్‌రేటు 140 మాత్రమే. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అహ్మదాబాద్‌లో భువనేశ్వర్‌ కుమార్‌కు మెరుగైన రికార్డు ఉంది. మూడు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఫామ్‌లో ఉన్న కేకేఆర్ ఓపెనర్ ఫీల్ సాల్ట్ టోర్నీకి దూరమవ్వడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశమే. నేడు అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్‌కు చాలానే కలిసిరానుంది.