NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

రూ.4లకే బిర్యానీ.. ఏపీలో ఎగబడ్డ జనం..

బిర్యానీ… ఈ మాట వినగానే నోరూరని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సీజన్ అయినా బిర్యానీ హవా ఎప్పుడూ యథావిధిగా ఉంటుంది. పండగలైనా, వేడుకలైనా, బిర్యానీ లేకుండా ఏనాడు పూర్తవ్వదు. పార్టీలు అయినా, ప్రత్యేక రోజులు అయినా గెస్టుల కోసం బిర్యానీ ఆర్డర్ అనేది మస్ట్ ఐటమ్ అయిపోయింది. మన భారతీయుల జీవనశైలిలో అది విడదీయలేని భాగంగా మారిపోయింది.

తాజాగా అనకాపల్లిలో ఒక హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా, నిర్వాహకులు విపరీతమైన ఆఫర్‌ను ప్రకటించారు. నూతన వ్యాపారానికి ప్రజల దృష్టి ఆకర్షించేందుకు, ప్రత్యేక ఆఫర్ రూపంలో వినూత్న ప్రయత్నం చేశారు. చికెన్ బిర్యానీ కేవలం ₹4కే! అని ప్రకటించడంతో, ఆ వార్త అందరి చెవులకూ చేరుకుంది. ఇంకేముంది, జనం ఆ హోటల్‌ దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి.. కౌశిక్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని ఎమ్మెల్యే అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. టూరిజం మీద చర్చ కాదు..లగచర్ల బాధితుల మీద చర్చ పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కి ఓటు వేసినందుకు లగచర్ల వాసులకు బేడిలు వేశారని మండిపడ్డారు. వాళ్ళు ఏమి తప్పు చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు, అదానీ కోసం భూములు గుంజుకుంటున్నారన్నారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. .

మంచి మంచి కట్టుబాట్లు.. ఆస్తికోసం అన్నదమ్ములను చంపిన సోదరి

నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరుగుతోంటే, మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. ఒకప్పుడు మానవీయతకు, సంబంధాల సమతౌల్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తుల కోసం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. దుశ్చర్యలకు వెనకాడకుండా వెళ్ళిపోతున్నారు. ఎంతలా అంటే, రక్త సంబంధాలను కూడా వదిలిపెట్టకుండా, తమ దురాశ కోసం మరణాలకు కూడా కారణమవుతున్నారు. ఇటువంటి శోచనీయ సంఘటన పాల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.

ఒకే కుటుంబంలో తండ్రి మరణానంతరం ఆర్థిక లాభాల కోసం జరిగిన ఘర్షణలు ముగ్గురు సంతానాన్ని విడగొట్టాయి. ఈ దుర్మార్గానికి తల్లి, తండ్రి కన్న సోదరి కారణమవడం కలచివేసే విషయం. వివాదాలు ఓ దారుణ సంఘటనకు దారి తీసి, అన్నను, తమ్ముడిని హతమార్చడంలో ముగిసాయి.

కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్‌ ట్వీట్..

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అధోగతి పాలయ్యిందని, కేసీఆర్‌ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదిక ద్వారా అప్పుల వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.

బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ, సర్పంచులకు లేదు..

సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రూ.690 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఏడాది కాలం నుండి రూ.690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస గుచ్చుకుంటుందని తెలిపారు. గవర్నర్ ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారు. కేసీఆర్ పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారని హరీష్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారన్నారు. పల్లె ప్రగతికి ప్రతి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 150 కోట్లు ఇచ్చామన్నారు.

హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ

తల్లి లేకపోవడం తండ్రి హత్యకు గురవడంతో మైనర్లు అయిన వారి కుమార్తెలు అనాథలయ్యారు. ఏలూరుకు చెందిన వెంకటకనకరాజుకు ముగ్గురు ఆడపిల్లలు ఆయన భార్య ఎనిమిదేళ్ల కిందట మరణించింది. అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. ఏలూరులోని రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి కింద కన కరాజు హత్యకు గురయ్యారు. పెద్ద కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదని కక్ష గట్టిన నాని అనే యువకుడు ఆయనను కత్తితో పొడిచాడు. కనక రాజు మృతదేహానికి సర్వజన ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్ప గించారు. ఈ క్రమంలో కనకరాజు తల్లి, బంధువులు, ముగ్గురు ఆడపిల్లలు ఆసుపత్రి మార్చురీ వద్దకొచ్చారు.

అసెంబ్లీలో సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై హరీష్ vs సీతక్క..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో హరీష్ రావు వర్సెస్ సీతక్క వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లింది.

పనుల్లో వేగం కంటే నాణ్యత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు

పోలవరం టీడీపీ 72శాతం పూర్తి చేస్తే  వైసీపీ ప్రభుత్వంలో ఎప్పటికీ పూర్తి చేస్తామో చెప్పలేమని చేతులు ఎత్తేసిందన్నారు ఏలూరు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంలో వైసీపీ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వైసీపీ టైం లో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ స్థలంలో కొత్త వాల్ పనులు జనవరి రెండు నుంచి ప్రారంభమవుతాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో వేగం కంటే నాణ్యత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారని ఆయన తెలిపారు. డి వాల్ పూర్తయ్య వరకు వేచి చూడకుండా నిపుణుల సూచనలతో ఈ సి ఆర్ ఎఫ్ డ్యాం పనులు చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయని, కేంద్రం ఇచ్చిన లక్ష్మీ ప్రకారం 2027 నాటికి పోలవరం పనులు పూర్తి చేయడమే టార్గెట్ అని ఆయన తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుంది..

ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శాసన సభలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటేనే అందరి మాటలను వినేట్టు ఉండటమని గుర్తు చేశారు. ప్రజలకు సంబంధించిన అవకతవకల గురించి చర్చించడమే ఈ సభ యొక్క ఉద్దేశ్యం అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియాలనేది బీఆర్ఎస్ ఉద్దేశ్యం అన్నారు. ప్రభుత్వం ప్రజలను హింస చేస్తుంది.. మేము ప్రజలకు అండగా ఉన్నామన్నారు.

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

వైఎస్సార్‌సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి శారద పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అధికారికంగా విధులు నిర్వహిస్తున్న తమను మాజీ ఎమ్మెల్యే దూషించారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి టౌన్ పోలీసులు మధుసూధన్‌రెడ్డిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Show comments