NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అయితే.. ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. అలాగే, వీరితో పాటు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..

దంపతుల అనుమానస్పద మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కు చెందిన ముదాం వెంకటేష్ (40), వసంత (36) అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు వర్షిణి, కొడుకు అజిత్ ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. వెంకటేష్, వసంత ఇద్దరు ఓ పొలంలో శవమై తేలారు. దీంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులకు కొని ఆధారాలు లభించాయి. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కట్టెకు రక్తపు మరకలు గుర్తించారు. భార్య వసంతను భర్త వెంకటేష్ కట్టేతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం వెంకటేష్ పురుగుల మందు తాగి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే భార్యను చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక, మృతుల కుటుంబాలని దర్యాప్తు చేసి అనుమానంపై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే వీరిద్దరూ పొలంలో ఎందుకు వచ్చారు? నిజంగానే భర్త వెంకటేస్ భార్య వసంతను చంపాడా? లేక ఎవరైనా వీరిని చంపి ఇలా చిత్రీకరిస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని దర్యాప్తు తరువాత దీనిపై సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా, కేజ్రీవాల్‌ను అధికారులు ఘనంగా స్వాగతించారు. ఆయన తన భార్య సునీతతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకొని, ఆర్జిత సేవలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ , ఆయన కుటుంబం నిన్న హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో చేరారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, కేజ్రీవాల్ కుటుంబం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని, రాత్రి అక్కడ వసతి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి… ఉప ఎన్నికల సమయంలో పోలీసులతో డబ్బులు పంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు… ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు… వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు రిజర్వేషన్లపై వివాదం.. కర్ణాటక సీఎం క్లారిటీ

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వైఖరిని స్పష్టం చేశారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హజ్ మంత్రి రహీమ్ ఖాన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ఆగస్టు 24న లేఖ రాశారని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతోందని, అయితే ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, దానిని పరిశీలించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

జీడిమామిడి మద్దతు ధర ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తున్నాం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024తోసహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది. వీటితోపాటు ఏపీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. జీడిమామిడి బోర్డు పెట్టాలని సభ్యులు కోరడంతో.. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్ళుగా ఏ శాఖ చూసినా ఏమున్నది అన్నట్టుగా తయారైందన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు..

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిలాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం చల్లగా ఉంటుందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.

వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019లో 1,942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చాం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9 ఎకరాలు మాత్రమే సేకరించిందని, 2019-24 వైసీపీ పాలనలో వేదవతి ప్రాజెక్ట్ కు ఒక్కరూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పనులు నిలిపేసింది మేఘా సంస్థ అని ఆయన వివరించారు. భూసేకరణకు 384 కోట్లు, సివిల్ వర్క్స్ కు 1456 కోట్లు ఖర్చవుతుందని గుర్తించామని, గుండ్రేవుల సమీపంలో కోట్ల విజయభాస్కర రెడ్డి సుంకేశుల బ్యారేజ్ నిర్మాణానికి 2890 కోట్లతో 2019 ఫిబ్రవరి లోనే డీపీఆర్ సిద్ధం అయిందని ఆయన వెల్లడించారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ కావడం తో డీపీఆర్ ను తెలంగాణకు పంపామని, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి మొత్తం 23 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. వేదవతి, గుండ్రేవుల పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి రామానాయుడు.

లోకేష్‌ అన్నకు విజ్జప్తి.. నెట్టంట శ్రీరెడ్డి వినతి

సినీ నటి , వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి, గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ, ఇప్పుడు క్షమాపణలు కోరారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత వంటి నేతలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చిన్నా పెద్దా అని భేదం చేయకుండా తన అభిప్రాయాలను పంచుకుంటూ, వైసీపీకి మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె స్వరం మారింది. ఆమె తన వ్యాఖ్యలను తప్పుగా భావిస్తూ, క్షమాపణలు కోరుతున్నారు.

పరిశ్రమలు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? కేటీఆర్‌కు భట్టి కౌంటర్..

పరిశ్రమలు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. వాళ్ళు ప్రజల సమస్యల కోసం ఏనాడు సచివాలయానికి రాలేదన్నారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని అట్లా కూల్చాలి, ఇట్ల కూల్చాలని చూస్తున్నారని తెలిపారు. ఇది దుర్మార్గపు చర్య అన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ప్రజా స్వామ్యయుతంగా సహకరించాలన్నారు. పరిశ్రమ లు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? అన్నారు. నిరుద్యోగుల కోసమే ప్రత్యేక తెలంగాణ ను తెచ్చుకున్నామన్నారు.