లాస్ ఏంజిల్‌లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు
అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే బలగాలు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దీంతో నేషనల్ గార్డ్స్ మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున నేషనల్ గార్డస్, మెరైన్స్ మోహరించారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్‌లో దాదాపు 700 మంది మెరైన్‌లు మోహరించారు. ఇదిలా ఉంటే నాల్గో రోజు కూడా వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి వలస విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ దగ్గర జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు ఫ్లాష్ బ్యాంగ్స్ మరియు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. ఇక ఈ ప్రాంతాలను ఖాళీ చేయాలని పోలీసులు లౌడ్ స్పీకర్లలో అనౌన్సెమెంట్ కూడా చేస్తున్నారు. ఇక నిరసనకారులు వెళ్లకపోవడంతో రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.
విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా చినాబ్ బ్రిడ్జి.. పైలట్లు ఏం చేస్తున్నారంటే..!
ప్రధాని మోడీ ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికులకు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది. ప్రస్తుతం విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తున్నాయి. వంతెన సమీపంలోకి రాగానే పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన వచ్చిందంటూ అనౌన్సెమెంట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా అద్దాల్లోంచి చూస్తూ తరిస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులంతా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు జస్టిస్‌ను కూడా వదలని కేటుగాళ్లు.. నకిలీ కోర్టు సృష్టించి, నకిలీ జడ్జిని పెట్టి..
సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్‌లో “మీ పేరు ఓ కేసులో ఉంది, విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది, జస్టిస్ స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు” అంటూ నమ్మబలికారు. నకిలీ కోర్టు స్టాఫ్‌లా నటిస్తూ ప్రొఫెషనల్ వ్యవహారంతో వారు మాట్లాడటం, భయపెట్టడం మొదలుపెట్టారు. ఇంతలో “జస్టిస్ కేసు తీవ్రంగా ఉందని, వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని” చెబుతూ ఒక నకిలీ జడ్జి వీడియో కాల్‌లోకి వచ్చాడు. అతని హావభావాలు, వేషధారణ, మాటతీరు నిజమైన న్యాయమూర్తిలా ఉండటంతో బాధితుడు పూర్తిగా నమ్మిపోయాడు. పరినామంగా “ఈ కేసుకు సంబంధించి మీరు కొంత మొత్తంలో డబ్బులు ముందుగా సుప్రీం కోర్టు అకౌంట్లో జమ చేయాలి. కేసు ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తాం” అని నకిలీ జడ్జి చెప్పాడు. నమ్మిన బాధితుడు తన ఖాతాలోని రూ. 1.5 కోట్లు (కోటిన్నర)ని సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు.
బీహార్‌లో ఫేక్ పోలీస్ స్టేషన్.. సంవత్సరం పాటు యథేచ్ఛగా దందాలు
బీహార్‌లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేసి సంవత్సరం పాటు యథేచ్ఛగా దందాలు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి ఫేక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించాడు. ఉద్యోగాల ముసుగులో ఆ గ్రామంలోని యువత నుంచి లక్షల రూపాయలు కాజేసినట్లు తెలింది. కాగా, గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్‌మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్‌ల అక్రమ నియామకాలు చేపట్టాడు సదరు వ్యక్తి. అయితే, స్థానిక యువత నుంచి రూ.25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేసి.. వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు నిందితుడు రాహుల్ కుమార్ షా వెల్లడించాడు. అలాగే, వారికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు సైతం అందజేశాడు. వారితో పెట్రోలింగ్, లిక్కర్ అక్రమ రవాణాపై దాడుల లాంటివి చేయించాడు. వచ్చిన డబ్బులో సగం తాను తీసుకొని.. మిగతా సగాన్ని తన కింది ఉద్యోగులకు అతడు అందజేసేవాడు. అక్రమ రవాణాదారుల నుంచి హస్తగతం చేసుకున్న మద్యాన్ని.. లంచాలు తీసుకుని వాటిని మరలా వారికే ఇచ్చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. దాదాపు సంవత్సరం పాటు ఇలా నకిలీ పోలీసుల ఆగడాలు కొనసాగాయి. అయితే, ఎట్టకేలకు గుట్టు బయటపడటంతో రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఆర్సీబీ ఆటగాళ్ల సన్మానానికి ప్లాన్ సర్కారుదే.. కర్ణాటక గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్మానం చేసేందుకు బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో సుమారు 11 మంది మృతి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఇక, తాజాగా, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ ఆటగాళ్లను సత్కరించడానికి రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలని సిద్ధరామయ్య సర్కార్ ప్లాన్ చేసింది.. విధాన సౌధలోనే సన్మాన కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.. అయితే, విధాన సౌధలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో చేసిన ప్రకటనలో.. ఈ సత్కారం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం గవర్నర్‌ను ఆహ్వానించిందని తేల్చి చెప్పారు.. కానీ, రాజ్ భవన్ వర్గాలు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సీఎం వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉంది.
తెలంగాణలో తప్పిన పెను ప్రమాదం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఇంజిన్ బ్రేక్‌డౌన్
తెలంగాణలో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. నల్లగొండ రైల్వే స్టేషన్ వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆ రైలు ఇంజిన్ ఫెయిలవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజిన్ స్టేషన్ చేరుకున్న తర్వాతే పనిచేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఆగి ఉంటే విషయం ఇంకా పెద్ద ప్రమాదంగా ఉండేదని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉందని గుర్తించి మరొక ఇంజిన్‌ను అక్కడికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ పనులకు కొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నల్లగొండ స్టేషన్‌లోనే నిలిచిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట.. ఎన్నికల పిటిషన్ కొట్టివేత
తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్లో అర్హతలపై, సమాచారంలో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో, నామినేషన్ దాఖలు సమయంలో హరీష్ రావు తమ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని, ఈ విషయంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, అభ్యర్థి చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అందువల్ల, ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. హరీష్ రావు తరఫున ఈ కేసులో వాదనలు వినిపించిన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, పిటిషన్ అసాధారణంగానే కాకుండా, దానిలో ఎలాంటి ఆధారాలు లేకపోవని న్యాయస్థానానికి వివరించారు. హైకోర్టు తీర్పుతో హరీష్ రావు శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కిందికి దూకిన పలువురి పరిస్థితి విషమం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్‌మెంట్‌లో ఈ రోజు (జూన్ 10న) ఉదయం 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆ భవనంలోని ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కిందకు దూకేశారు.. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయ. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..!
అమరావతి ప్రాంత మహిళలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు అమరావతిలో పలువురు మహిళలు రోడ్డెక్కారు. అయితే వారిపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన, ‘‘పిశాచాలు కూడా ఇలా చేయలేకపోవచ్చు. వారిని రాక్షసులుగా కూడా పిలవలేం. వీరంతా కలసి ఒక రకమైన తెగలా తయారయ్యారు. ఈ తెగ పూనుకుంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడగలదు. పూర్తిగా సమన్వయంతో వ్యవస్థీకృతంగా నిరసనలు చేస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి.. మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!
ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితిని ఆమె ఆవేదనతో వివరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై మండిపడుతూ.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పుడు మహిళలకు రక్షణే లేదు. హోంమంత్రి అనిత మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి హోంమంత్రి పదవి ఆమె ఎందుకు చేపట్టారు..? మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా.. జగన్, భారతీ లని విమర్శించేందుకే ఆ పదవిని తీసుకున్నారా..? అంటూ రోజా తీవ్ర విమర్శలు చేశారు.