NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు..

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నిఖిల్ ఈ ఇంటర్వ్యూ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, రాజకీయాల్లోకి యువత ప్రవేశం, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య వ్యత్యాసంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి సారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిఖిల్ కూడా నేను హిందీ బాగా మాట్లాడకపోతే నన్ను క్షమించండి అన్నారు. దీనిపై ప్రధాని మోడీ నవ్వుతూ బదులిస్తారు. రాజకీయ నాయకుడు కావాలంటే యువతలో ఎలాంటి ప్రతిభ ఉండాలని నిఖిల్ ప్రధానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలని సూచించారు. ఆశయంతో కాకుండా లక్ష్యంతో రండి అని సూచించారు. ఇక్కడే మోడీ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “నేను ముఖ్యమంత్రి అయ్యాను. నా వల్ల కూడా కొన్ని తప్పులు జరిగాయి. నేనూ మనిషినే, దేవుడిని కాను కదా.” అని తెలిపారు. నేడు ప్రపంచం మొత్తం యుద్ధం దిశగా పయనిస్తోంది. దీనిపై మనం ఆందోళన చెందాలా? అనే ప్రశ్నకు మోడీ నవ్వుతూ.. సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ.. ఇది ఆయన మొదటి పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ కావడం గమనార్హం.

మణికొండలో హైడ్రా.. నెక్నాంపూర్‌లో కూల్చివేతలు..

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు జరగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఈ చర్యలను చేపడుతున్నారు.

జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌పై అవగాహన కల్పించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. “జంప్‌డ్ డిపాజిట్ స్కామ్” పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఈ సందేశంలో భాగంగా, స్కామ్‌ వివరాలు తెలియజేసే వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన హెచ్చరిస్తూ, “మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమయితే సంబరపడిపోకండి. ఆ డబ్బులు చూసేందుకు బ్యాలెన్స్ చెక్ చేస్తూ పిన్ ఎంటర్ చేస్తే, మీ ఖాతా ఖాళీ అవుతుంది” అని తెలిపారు.

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. దీపికా పదుకొణె షాకింగ్ రియాక్షన్

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. అలాగే, ఆదివారాలు సైతం ఆఫీసులకి వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎల్‌అండ్‌టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్‌లైన్‌లో సుబ్రహ్మణ్యన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఎంప్లాయ్ క్వశ్చన్ చేయగా.. దీనికి ఆ కంపెనీ ఛైర్మన్ సమాధానంగా.. ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నా.. సండేస్ కూడా మీతో పని చేయిస్తే అప్పుడు చాలా సంతోష పడతానంటూ పేర్కొన్నాడు. ఎందుకంటే, నేను ఆదివారాలు పని చేస్తున్నాను అని ఎల్‌అండ్‌టీ చీఫ్ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వెల్లడించారు.

గ్రామాల పర్యటనకు పవన్ కళ్యాణ్.. కార్యాచరణ సిద్ధం!

సంక్రాంతి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామంలోనే బస చేసి… అక్కడే టెంట్, అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఇలాగే గ్రామాల్లో టెంట్‌లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు.. ఇక, మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని స్టాల్స్ ను పరిశీలించనున్నారు.. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయబోతున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు..

భక్తుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?.. కూటమిపై రోజా ఫైర్

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిన్న మీడియాతో మాట్లాడిన ఆర్‌కేరోజా తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. “వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు. కానీ.. కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం కారణంగా 6 మంది ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటనకు టీటీడీ ఛైర్మన్, ఈవోతో పాటు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణం. ప్రజల్లో అగ్రహాం రావడంతో సమాజ మెప్పు కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అంగీకరించారు.” అని ఆమె పేర్కొన్నారు.

తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేక దర్శనం..

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది. గాయపడిన భక్తులందరినీ టీటీడీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.

40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, చేర్పులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్ల పల్లి గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు జరిగాయన్నారు. సత్తుపల్లి ప్రజలకు ఎక్కడ ఉన్న రుణపడి ఉంటానని, నా నియోజకవర్గం కంటే సత్తుపల్లి కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్ట్‌ను కదిలిచ్చి గోదావరి జలాలు తమ్మిలేరు ద్వారా బెతుపల్లి కి తరలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉగాది కల్ల సత్తుపల్లి నియోజకవర్గంలో మరొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. నర్సింగ్ కాలేజ్ కూడా సత్తుపల్లి లో పెడుతున్నామని, పిల్లల భవిష్యత్ దృష్ట్యా నర్సింగ్ కాలేజ్ ను పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సత్తుపల్లి నుండి కొవ్వూరు కు రైల్వే లైన్ కు ప్రతిపాదనలు పంపిస్తున్నామని, సత్తిపల్లిని రైల్వే పరంగా అభివృద్ధి చేయాలనేది నా ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.

వైకుంఠ ఏకాదశి వేళ.. పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్‌ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. తిరుపతిలో టోకెన్ల పంపిణీలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఇలా జరగకూడదని కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ముందుగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. “వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు వెళ్తున్న భక్తులు, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, త్రోపులాటలకు తావివ్వకుండా, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తితో దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం.

హైటెక్‌ సిటీలో CII జాతీయ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ CII గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌లో సమావేశాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషమన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ…ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని, న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతదేశంలోనే  గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుందని, ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను ను  తొలగించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Show comments