NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

“నటి కస్తూరిపై కేసు”.. 4 సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు

తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో కస్తూరి ఒకరు. రాజకీయాలు, సెలబ్రిటీలపై అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉండే ఆమె తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో, క్షమాపణలు చెప్పాడు. ఈ స్థితిలో అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వ్యవహరించడంతో పాటు నటి కస్తూరిపై చెన్నై ఎగ్మూర్ పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అవమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో నవంబర్‌ 4న చెన్నైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో నటి కస్తూరి అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువాళ్లని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంలో తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి ఆ మాటలు వెనక్కి తీసుకున్నానన్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడేవారు అంతఃపురంలో రాజ మహిళలకు సేవ చేసేందుకు వచ్చారంటూ కామెంట్ చేయడంతో పలువురి నుంచి వ్యతిరేకత వచ్చింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి సమావేశంలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్వోడీలు పాల్గొంటారు. ఆన్లైన్ విధానంలో జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. అయితే.. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై సమస్త అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేయనున్నారు. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు.

డెడ్ బాడీ కావాలంటే రూ. 4లక్షలు కట్టండి.. ఠాగూర్ సీన్ రిపీట్..

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెడికోవర్ హాస్పిటల్ లో జరిగిన ఘటన ఠాగూర్ సినిమా సీన్ ను తలపించింది. మెడికోవర్ హాస్పిటల్ కు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగప్రియకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు మూడు లక్షలకు పైగా డబ్బు కట్టారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అంతటితో ఆగలేదు.. జూనియర్ డాక్టర్ అని కనికరం కూడా లేకుండా.. నాగప్రియ మృత దేహంతో బేరసారానికి దిగడం సంచలం సృష్టించింది. ఆమె డెబ్ బాడీ కావాలంటే ఇంకా నాలుగు లక్షలు కట్టాల్సిందే అని డిమాండ్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఇప్పటి వరకు మూడు లక్షలు చెల్లించామని మృతదేహాన్ని అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినా ఆసుపత్రి యాజమాన్యం ససేమిరా అన్నారు. డబ్బు కట్టేంత వరకు మృతదేహాన్ని ఇచ్చేది లేదని కఠినంగా వ్యవహరించడంతో నాగప్రియ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో మొరపెట్టుకున్నారు. దీంతో అరికెపూడి గాంధీ కాల్ చేసిన ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు!

గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో.. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాలకు ధరలు చేరుకున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉండి నిన్న ధరలు తగ్గాయని పసిడి ప్రియులు సంతోషించేలోపే మరలా గోల్డ్ షాక్ ఇచ్చింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,650గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,350గా ఉంది.

మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నిన్న తగ్గింది. నేడు మరలా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.96,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేలుగా నమోదైంది. ఇటీవలి రోజుల్లో లక్ష పన్నెండు వేలకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అత్యల్పంగా బెంగళూరు, ముంబైలలో 96 వేలుగా ఉంది.

నర్సీపట్నంలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగించి తీరుతానని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపద్యంలో నర్సీపట్నం టౌన్ మొత్తం పోలీసు దిగ్బంధంలో వుంది. నియోజకవర్గం నలువైపుల నుంచి నర్సీపట్నం వైపు వచ్చే మార్గాలను పోలీసులు పికెటింగ్ పెట్టారు. సాధారణ ప్రజలు తప్ప రాజకీయ నాయకులను, వాహనాలను టౌన్ లోకి అనుమతించడం లేదు.

ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే.. సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించిన మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, GHMC అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్ అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని తెలిపారు. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని అన్నారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారని వివరించారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. ఈ సర్వే కు పబ్లిక్ సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని తెలిపారు.

అప్పటినుండే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అందరి ద్రుష్టి వక్ఫ్ సవరణ బిల్లుపైనే

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభలను (లోక్‌సభ, రాజ్యసభ) సమావేశపరచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యాంగ భవనంలోని సెంట్రల్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని రిజిజు ఒక పోస్ట్‌లో తెలిపారు.

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌

అమెరికా ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతానికి అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. వివరాలు తెలిసే సరికి ట్రంప్ 230 స్థానాలలో ముందజలో ఉండగా.. కమలా హారిస్ 210 స్థానాలతో స్వల్పంగా వెనుకపడి ఉంది. ఇకపోతే, డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుండి డెమోక్రటిక్ అభ్యర్థిగా సారా మెక్‌బ్రైడ్ (Sarah McBride) విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు. జాన్ వేలెన్ 3, సారా మెక్‌బ్రైడ్ రిపబ్లికన్ గెలుపు కోసం పోటీ పడ్డారు. తాను గెలిచింది కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడం కోసం కాదని, కేవలం డెలావేర్‌లో మార్పును సృష్టించేందుకేనని సారా వివరించారు.

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతూ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో బన్నీని చూసేందుకు వేలాది మంది అభిమానులు అక్కడకు తరలి వచ్చారు.

కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీ పురందేశ్వరి

ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సదస్సులో చర్చిస్తున్న అంశాల పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. ఇదే సందర్భంలో మహిళా సాధికారత కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో చేపడుతున్న సానుకూల, ఖచ్చితమైన అంశాలను సవివరంగా వివరించడానికి ఈ సదస్సు ద్వారా మంచి అవకాశం దొరికింది అని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. 8వ తేదీ వరకు కాన్ఫరెన్స్ చర్చల్లో పాల్గొని, 11వ తేదీన స్వదేశానికి ఆమె తిరిగి రానున్నారు పురందేశ్వరి.