తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు (5న) నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి. మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 6వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఎంఎస్ ధోనీ మంచి మనసు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా చాలా కూల్‌గా ఉంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడు ధోనీ. అంతేకాదు అందరితో చాలా సరదాగా గడుపుతాడు. అన్నింటిని ఇంచి మంచి మనసున్న మనిషి. ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్న ధోనీ.. తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు మహీ సాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ టైటిల్ అందించిన విషయం తెలిసిందే. మోకాలి గాయంతోనే 16వ సీజన్ ఆడిన ధోనీ.. లీగ్ ముగియగానే సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన విల్లా, వ్యవసాయ క్షేత్రంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన విల్లాలో పని చేసే ఓ సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు.
ఎన్నికల రాష్ట్రాలపై కేంద్రం దృష్టి.. కేబినెట్ విస్తరణకు రెడీ అయిన బ్లూ ప్రింట్
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రివర్గంలో పలు మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పలువురు మంత్రుల పేర్లు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో తన మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సన్నాహకానికి సంబంధించి ప్రధాని మోడీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సారి మంత్రివర్గంలో చాలా కొత్త ముఖాలు కనిపించనున్నాయి.
పలువురు మంత్రులకు ప్రధాని పింక్ స్లిప్ లు ఇవ్వడంతో పాటు పలువురు కొత్త మిత్రులను చేర్చుకునే కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్‌కు చెందిన ముగ్గురు మంత్రులు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, దర్శనా జర్దోష్‌ల కుర్చీకి ముప్పు పొంచి ఉంది. మోడీ కేబినెట్‌లో ప్రస్తుతం యూపీ నుంచి 16 మంది మంత్రులు ఉన్నందున యూపీ నుంచి కూడా కొంతమంది మంత్రులు డిశ్చార్జ్ కావచ్చు. జూలై 2022లో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, RCP సింగ్ ఇద్దరి రాజ్యసభ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఇద్దరూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో 75 మంది మంత్రులు ఉండగా, విస్తరణ తర్వాత మోడీతో కలిపి మొత్తం 81 మంది మంత్రులు ఉండవచ్చు.
మోడ్రన్ బిచ్చగాడు..చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన..
రెండు చేతులు, కాళ్లు బాగానే ఉన్న కొందరు సోమరి పొతులుగా మారుతున్నారు.. అలాంటి వాళ్ళు రోడ్ల మీద, రైళ్ల లో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారి గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు.. సాధారణంగా రైళ్లలోని సాధారణ కోచ్‌లలో యాచకులు పాటలు పాడుతూ అడుక్కుంటూ ఉంటారు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో రైళ్ళల్లో బిక్షగాళ్లు ఉంటారు.. అయితే వారి చేతిలో మాములుగా సంచి లేదా బొచ్చే ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇప్పుడు వాళ్ళు కూడా డిజిటల్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.. చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్నారు.. తాజాగా ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది..
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకిముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ముర్ము చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఉత్సవాల్లో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరి వెళ్తారు.
భర్త మృతితో.. వైన్ షాప్ కి వెళ్లిన భార్య..
హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వైన్స్ షాప్ లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కనకదుర్గ వైన్స్ లో మద్యం సేవించడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి.. మద్యం సేవించి షాప్ లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. షాప్ సిబ్బంది కాళ్లు, చేతులు పట్టి రోడ్డుపై పడేశారు.. దీంతో సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. తన భర్త మృతికి షాప్ సిబ్బంది, యాజమాన్యమే కారణమంటూ మృతుడి భార్య మృతదేహాంతో వైన్స్ ముందు అర్ధరాత్రి వరకు ఆందోళనకు దిగింది. నా భర్తకు ఎలాంటి అనారోగ్యం లేదు.. కూలీ పనులు చేసుకునే.. నా భర్త మరణానికి వైన్ షాప్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని Ntvతో మృతుడి భార్య మైబా పేర్కొన్నారు. నాగి చనిపోయాడు అని తెలిస్తే.. మాకు ఎందుకు చెప్పలేదు అని ఆమె ప్రశ్నించింది.
రెట్టింపు లాభాలతో దూసుకుపోతున్న సామజవరగమన..
భారీ బడ్జెట్ తో విడుదల అవుతున్న పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి.సినిమా తీసిన నిర్మాతల కు భారీ నష్టాలను మిగిలిస్తున్నాయి.కానీ కంటెంట్ వున్న చిన్న చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి., రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు అంతగా ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడిన ఈ సినిమా మూడవ రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల 20 లక్షల రూపాయల కు అమ్ముడుపోయిందని సమాచారం. నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం గా అన్నీ ప్రాంతాలను కలిపి దాదాపు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.. ఇక ఐదవ రోజు కూడా ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువగానే వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా 5 వ రోజు 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది.. అలా పెట్టిన డబ్బులకు రెట్టింపు లాభాలను కేవలం 5 రోజుల్లోనే సాధించింది..
మార్నింగ్ వాక్ చేస్తున్నవారిపై దూసుకెళ్లిన కారు.. తల్లి, కూతురు మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తున్న తల్లి కూతుర్లపై కారు దూసుకుపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదర్ షాకోట్ శాంతి నగర్ లో అనురాధ కుటుంబం నివాసం ఉంటుంది. రోజూ తన కూతురు తో కలిసి అనురాధ మార్నింగ్ వాక్ వెళ్లతూ ఉంటుంది. దీంతో రోజూలాగానే ఇవాళ ఉదయం బండ్లగూడ సన్ సిటీ వద్ద అనురాధ తన కూతురు మమత, కవిత అనే మహిళతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళారు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని విధి వక్రీకరించింది. కారు రూపంలో జీవితాలను ఛిదిలం చేసింది. ఫుట్ పాత్ పై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. అంతేకాకుండా.. అక్కడే మార్నింగ్ వాకర్స్ పై కూడా దూసుకుని పొదల్లోకి వెళ్లింది. దీంతో తల్లి కూతురు అనురాధ, మమత అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కారు డ్రైవర్ కారు వదలి పారిపోయాడు.
పాదయాత్ర చేసిన భట్టినే ఖమ్మం సభలో పక్కకు నెట్టారు
కర్ణాటక ఫలితాల తర్వాత దేశంలో, రాష్ట్రంలో అధికారం లేని కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోంది శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా తన నివాసంలో మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే కారణమని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపాలనే దురాలోచనతోనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే విజయవంతంగా అమలు అవున్నాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తాం అని చెప్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మేము సమైఖ్యoగా ఉన్నామని చెబుతూనే క్రమశిక్షణ లేకుండా 1400 కిమీ పాదయాత్ర చేసిన భట్టిని ఖమ్మం సభలో పక్కకు నెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మోడీ ఇంటిపేరు’ విషయంలో నేడు కోర్టుకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూలై 4వ తేదీ మంగళవారం రాంచీలోని ఎంపీ..ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకానున్నారు. అనంతరం ఈరోజే పాట్నా హైకోర్టులో ఆయనపై విచారణ జరగనుంది. ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యకు సంబంధించి ఎంపీ-ఎమ్మెల్యే రెండు కోర్టుల్లోనూ ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసుల విచారణ కొనసాగుతోంది. విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని రాంచీ కోర్టు ఆదేశించింది. దీంతో రాహుల్ ఈరోజు రాంచీ చేరుకుని కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే వ్యాఖ్యకు రాహుల్‌పై గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువునష్టం కేసు దాఖలయ్యిందని, అందులో ఆయన దోషిగా తేలింది. ఈ శిక్ష తర్వాతే కేరళలోని వాయనాడ్ స్థానం నుండి అతని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయబడింది. అతను MP నుండి మాజీ MP అయ్యాడు.
అద్దెకు అమ్మానాన్నలు.. భలే బిజినెస్ బాసూ
అద్దెకు తల్లిదండ్రులు దొరుకుతుండటంతో పిల్లలను చూసుకునేందుకు ఆ దేశంలోని పేరేంట్స్ చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగాలు చేసుకునే వారికి పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు అప్పగించి, వాళ్లు చిల్ అవుతున్నారు.
కులమతాలకు అతీతంగా రంగా జయంతి
కులమతాలకు అతీతంగా రంగా జయంతి నిర్వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో రంగా అభిమానులు ఐకమత్యం చూపించాలన్నారు వంగవీటి రాధాకృష్ణ. ప్రజలు రంగా గురించి మాట్లాడుతున్నారని, ఎవరూ డిమాండ్ చేయరు… అభిమానం ఉంటే చేయాలన్నారు. చైతన్య రథం సినిమా ఇక్కడ కూడా అభిమానుల కోసం వ్యాపార ధోరణి లేకుండా ప్రదర్శిస్తామన్నారు వంగవీటి రాధా. అనంతరం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ.. రంగాకి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అని, ఓట్ల రాజకీయాల కోసం గతంలో రంగా వర్ధంతులు జయంతులు చేసారు ఈ సీఎం అన్నారు. రంగా పేరిట ఒక పథకం, స్మృతివనం పెట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయాలన్నారు.
వరుస అప్డేట్స్ తో ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్న థమన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ వున్నారు .. ఇటీవలే టీజర్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై టీజర్ తోనే భారీగా అంచనాలు పెంచేయగా ఇప్పుడు మ్యూజికల్ గా అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఐ మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ స్టేటస్
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలంలోని మల్కాపూర్‌కు చెందిన మనోహర్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్ వాట్సాప్‌లో ‘ఐ మిస్ యూ ఫ్రెండ్స్’ అని స్టేటస్ పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పదేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవల కారణంగా అన్నతో మాటల్లేకపోవడంతో తనకి ఎవరూ లేరు అనే మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నేడు చిత్తూరులో సీఎం జగన్ పర్యటన
సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.00 గంటలకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరు చేరుకోనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు. ఉదయం 10.55 గంటలకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సిఎంసి ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. అలాగే మధ్యాహ్నం 1.30 గంటలకు సిఎంసి ఆసుపత్రి హెలిప్యాడ్ నుండి రేణిగుంట పయనం కానున్నారు సీఎం జగన్. జగనన్న పాలవెల్లువ పథకంలో భాగంగా డెయిరీని నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. 20 ఏళ్లుగా మూతబడి ఉన్న చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను పూర్తిగా తీర్చేసింది ప్రస్తుత ప్రభుత్వం. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, అమూల్ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం సిఎం జగన్ చిత్తూరులో సోమవారం భూమిపూజ చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
