NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీ బీజేపీలో పదవుల మార్పు కలకలం… నేతల రాజీనామాలు..!
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో జిల్లాల అధ్యక్ష పదవుల మార్పు కలకలం సృష్టిస్తోంది.. ఇటీవలే ఆరు జిల్లాలకు అధ్యక్షులను మార్చేశారు బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు.. మార్చిన జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవులు కట్టబెట్టారు.. అయితే, ఏకపక్షంగా పదవులను మార్చారంటూ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు నేతలు.. పార్టీ పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్‌ చిగురుపాటి కుమారస్వామి.. కృష్ణా జిల్లాలోని వివిధ విభాగాల పదవులకు రాజీనామాలు చేశారు పలువురు నేతలు. పార్టీ పదవులకు రాజీనామా చేశారు అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్‌, రెడ్డి నారాయణరావు.. రాష్ట్ర పార్టీ చీఫ్‌ సోము వీర్రాజు ఒంటెత్తు పోకడల వల్లే పదవులకు రాజీనామాలు చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం వాదనగా ఉంది.. మరిన్ని రాజీనామాలు ఉంటాయంటూ ప్రచారం కూడా సాగుతోంది. అయితే, పార్టీ విధానాలను అనుసరించే పదవుల్లో మార్పులు చేర్పులు చేశామని చెబుతోంది ఏపీ బీజేపీ.. జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్లకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం ప్రమోషన్‌ అని చెప్పుకొస్తున్నారు. కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. జాతీయ కార్యవర్గ సభ్యుడుగా తీసుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది సోమువీర్రాజు వర్గం.. ఇప్పుడు రాజీనామా చేశానని చెప్పుకుంటున్న తోట నగేష్‌.. రెండు నెలల క్రితమే పార్టీ పదవికి రాజీనామా చేశారని పార్టీ అధినాయకత్వం అంటోంది. చిగురుపాటి కుమారస్వామి రాజీనామా మినహా.. మిగిలిన వారి రాజీనామాలేవీ పార్టీ అధిష్టానానికి చేరలేదంటున్నారు.. పార్టీ నుంచి వీలైనంత త్వరగా బయటకెళ్లాలనుకునే వారు తెర వెనుక ఉండి.. రాజీనామాల ఎపిసోడ్‌ నడిపిస్తున్నారని సోము వర్గం ఫైర్‌ అవుతోంది.. ఏపీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు ఏపీ బీజేపీ నేతలు..

కాలేజీలో దారుణం.. అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి..
మారుతున్న కాలానికి అనుగుణంగా.. విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చేసింది. క్రమశిక్షణతో మెలగకుండా, పాడు పనులకు పాల్పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్, సామాజిక మాధ్యమాల ప్రభావంతో.. చెడు అలవాట్లను అలవరచుకుంటున్నారు. తోటి విద్యార్థుల్నే వేధింపులకు గురి చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ఉదంతం. ఘట్కేసర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీలోని యువకులు.. విద్యార్థినుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉన్నత భవిష్యత్‌కు బాట వేసుకోవాల్సిన ఆ యువకులు.. అమ్మాయిలను వేధింపులకు గురి చేశారు. విద్యార్థినుల ఫోటో డీపీలను తీసి, వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేస్తున్నారు. అలా మార్ఫింగ్ చేసిన ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కొందరు ఆగంతకులు అయితే, మరీ హద్దుమీరారు. ఎవరి ఫోటోలనైతే మార్ఫింగ్ చేశారో, వాటిని ఆ విద్యార్థినులకే రాత్రి సమయంలో పంపి, వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థినులు.. ఆందోళనలు చేపట్టారు. ఈ హేయమైన పనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులపై ఫిర్యాదు కూడా చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కీచకానికి ఎవరెవరు పాల్పడ్డారన్న వివరాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.

సుచరిత వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదేనా..?
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాజకీయంగా మా మనుగడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే.. నేను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారన్నారు.. అయితే, అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా? అందుకే.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తానని చెప్పుకొచ్చారు.. ఇక, నా భర్త ఒక పార్టీలో.. నేను మరొక పార్టీలో.. మా పిల్లలు ఇంకో పార్టీలో ఉండరని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే ఉండాలనుకున్నామని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు మాజీ హోంమంత్రి మేకతేటి సుచరిత. అయితే, ఉన్నట్టుండి సుచరిత ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? అనే చర్చ వైసీపీలో ఆసక్తికరంగా మారిపోయింది. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. కానీ, వైఎస్‌ జగన్‌ రెండో కేబినెట్‌లో మాత్రం ఆమెకు చోటు దక్కలేదు.. దీనిపై బహిరంగంగానే ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.. సుచరితను మంత్రివర్గంలో కొనసాగించాలంటూ ఆమె అనుచరులు ఆందోళనలు కూడా చేశారు.. ఏకంగా ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేశారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి.. ఇక, ఆమెకు గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ బాధ్యతలు ఇచ్చినా.. అనారోగ్య సమస్యలున్నాయి.. నేను ఆ పదవిని నిర్వహించలేనంటూ ఆమె తిరస్కరించారు.. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిగా ఉన్న సుచరిత భర్త దయాసాగర్‌.. ఈ మధ్యే రిటైర్మెంట్‌ తీసుకున్నారు. కాకుమానులో జరిగిన వైసీపీ సమావేశంలో.. దయాసాగర్, సుచరిత ఇదరూ పాల్గొన్నారు.. ఆయన సమక్షంలోనే.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారామె.. దీంతో, సుచరిత వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? దయాసాగర్‌.. మరోపార్టీలో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అక్కడ సీటు పక్కా అయితే.. వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తారా? రిటైర్మంట్‌ చేసుకున్న దయాసాగర్‌.. పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారా? ఆయన అడుగుజాడల్లోనే ఆమె కూడా పార్టీ మారతారా? ఇలా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య..
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో విషాదం నెలకొంది. యూనివర్సిటీలోని ఎల్లోరా హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈసీఈ రెండో సంవత్సరం చదవువుతోన్న విద్యార్థి చాణక్య నందారెడ్డిగా గుర్తించారు యూనివర్సిటీ సిబ్బంది.. 19 ఏళ్ల చాణక్య.. ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.. రాత్రి స్నేహితులందరితో మాట్లాడి సంతోషంగానే ఉన్నాడని.. ఆ విద్యార్థి స్నేహితులు చెబుతున్నారు.. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో.. తన స్నేహితులకు మొబైల్‌ ఫోన్‌లో ‘బై’ అని సందేశం పంపి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, మొదటి సంవత్సరంలో 9.8 జీపీఏ మార్కులు సాధించినట్టు తెలుస్తోంది.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. విద్యార్థి మృతికి కారణం ఎవరు? అనే కోణంలో విచారణ మొదలుపెట్టారు.. అందులో భాగంగా.. విద్యార్థి సెల్‌ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.. మృతుడు చాణక్య నందారెడ్డిగా స్వస్థలం.. నెల్లూరు జిల్లాగా చెబుతున్నారు. కాగా, విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.. కొందరు చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఆర్థిక, మానసిక.. ఇతర సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి..

రాజకీయాలకు సీనియర్‌ నేత గుడ్‌బై..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్‌ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు.. దానికి ప్రధాన కారణం తన ఏజ్‌గా చెప్పుకొచ్చారు.. ఇక, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన ఆయన.. 90 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వ్యక్తిలా నటించడం సాధ్యం కాదని.. అందుకే ప్రజల్లోకి రావడం కూడా తగ్గించానని చెప్పుకొచ్చారు.. అయితే ఎస్ఎం కృష్ణ రాజకీయ రిటైర్మెంట్ ప్రకటన రాష్ట్ర రాజకీయ రంగంలో ఎలాంటి ప్రభావం చూపేలా కనిపించడం లేదు. ఎస్ఎం కృష్ణ అధికార బీజేపీ పార్టీకి చెందినప్పటికీ బీజేపీ శిబిరం మాత్రం దీనిపై ఆసక్తి చూపడం లేదు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర నేతలకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఎస్ఎం కృష్ణ చెప్పడం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. బీజేపీ పెద్ద రాజకీయ పార్టీ అని, ఎవరైనా పార్టీని వీడితే నష్టపోయేది లేదన్నారు. అందుకే, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర నేతలకు తెలియజేయాల్సిన అవసరం నాకు కనిపించడం లేదని ఎస్ఎం కృష్ణ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిర్ణయంతో తన మద్దతుదారులకు పెద్దగా తేడా ఉండదన్న సీనియర్‌ నేత.. వేల మంది ప్రజల నిర్ణయాన్ని ఒక్క వ్యక్తి ప్రభావితం చేయడం సాధ్యం కాదని.. ప్రతి ఒక్కరూ తమ స్వశక్తితోనే జీవితంలో విజయం సాధిస్తారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.. ఇక, ఎస్ఎం కృష్ణ తీసుకున్న ఈ రాజకీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తనదైన రీతిలో నిర్వచించింది. ‘కాంగ్రెస్‌లో అగ్రగామిగా ఉన్న ఎస్‌ఎం కృష్ణను వీధుల్లోకి తీసుకొచ్చి అవమానించిన ఘనత బీజేపీకే దక్కుతుంది. సీనియర్ నేత, మాజీ సీఎం నుంచి పాలనాపరమైన సలహాలు తీసుకునేంత ధైర్యం బీజేపీకి లేదు. బీజేపీకి ఆయన సలహా కూడా అవసరం లేదు. బీజేపీ సిద్ధాంతాలు కృష్ణుడికి అసహ్యమా లేదా కృష్ణుడికే బీజేపీకి అసహ్యం ఉందా?’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది..

యోగి కాషాయ దుస్తులపై కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాషాయ దుస్తులు ధరించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజూ మతం గురించి మాట్లాడకండి, కాషాయ దుస్తులు వేసుకోకండి, కొంచెం ఆధునికంగా మారండి. ఆధునిక ఆలోచనలను స్వీకరించండి” అని హుస్సేన్ దల్వాయ్ అన్నారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో వ్యాపారాన్ని ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. వచ్చే నెలలో లక్నోలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రెండు రోజుల ముంబై పర్యటనలో ఉన్న యూపీ సీఎంపై కాంగ్రెస్ నేత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘మహారాష్ట్ర పరిశ్రమలకు మంచి సౌకర్యాలు కల్పించిందని, కాబట్టి మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని.. అవి అభివృద్ధి చెందే వాతావరణం కల్పించాలని’ బుధవారం విలేకరులతో అన్నారు. పరిశ్రమ ఆధునికతకు ప్రతీక అని యూపీ సీఎం కొంత ఆధునికతను అలవర్చుకోవాలని ఆయన అన్నారు.

హెచ్‌1-బీ వీసాలపై చార్జీల మోత..! భారీగా పెరగనున్నాయి..!
అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలని అందరూ కలలుగంటారు.. అయితే, తాజా నిర్ణయాలు చూస్తుంటే.. కొందరికి అది కలగానే మిగిలిపోతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఎందుకంటే? అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీసా చార్జీలు భారీగా పెరగనున్నాయి.. కొన్ని వీసాలపై 35 శాతం మేర చార్జీలు పెరగనుంటే.. మరికొన్నింటిపై ఏకంగా 200 శాతానికి పైగా పెరగబోతున్నాయి.. హెచ్‌1-బీ మరియు ఎల్‌ వంటి ఉపాధి ఆధారిత వీసాల కోసం దరఖాస్తు రుసుములను ప్రతిపాదిత యూఎస్‌ పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) రుసుము నియమం ప్రకారం.. నిర్వహణ ఖర్చులను రికవరీ చేయడానికి మరియు కేసుల బ్యాక్‌లాగ్‌లను నిరోధించడానికి భారీగీ చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది.. కొత్త ప్రతిపాదన ప్రకారం, అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ఇచ్చే హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు రుసుము 70 శాతం పెరిగి 780 డాలర్లకు చేరుకుంటుంది. హెచ్‌-1బీ వీసా పిటిషనర్లు కూడా ప్రీ-రిజిస్ట్రేషన్ ఫీజులో 215 డాలర్లు చెల్లించవలసి ఉంటుంది, ప్రస్తుతం ఆ రుసుము 10 డాలర్లుగా ఉంది. 2019లో, హెచ్‌-1బీ పిటిషన్‌ల కోసం ప్రతి లబ్ధిదారునికి డీహెచ్‌ఎస్‌ 10 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజును ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత నియమం ప్రకారం, అధిక నైపుణ్యం కలిగిన విదేశీ పౌరులను నియమించుకునే యజమానులు ఎల్‌-1 పిటిషన్‌లపై ఉద్యోగులకు 201 శాతం ఎక్కువ చెల్లిస్తారు. ఇది 460 డాలర్ల నుండి 1,385 డాలర్లకు పెరగనుంది.. మరియు వో-1 పిటిషన్‌లపై వ్యక్తులు 129 శాతం ఎక్కువ చెల్లించాలి. అంటే ఆ ఫీజు 460 డాలర్ల నుండి 1,055 డాలర్లకు పెరుగుతంది.

98 సెకండ్స్ లో 932 టికెట్స్ సోల్డ్ అవుట్… ‘ఆర్ ఆర్ ఆర్’ ది ఆల్మైటీ
రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎపిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్సృష్టించింది. కరోన కారణంగా దెబ్బ తిన్న ఇండియన్ ఫిల్మ్ గ్లోరిని తిరిగి తీసుకోని వస్తామని ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ ఏ టైంలో చెప్పారో కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్ సౌండ్ బౌండరీలు దాటి వినిపించడం మొదలయ్యింది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా, వెస్ట్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకి రానంత రీచ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి వచ్చింది. ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉన్న మన ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్ లో జెండా ఎగరేస్తోంది. తాజాగా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ అయిన “ది క్రియేటివ్ లైఫ్, TCL చైనీస్ థియేటర్స్” లో జనవరి 9న స్క్రీనింగ్ కానుంది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణిల సమక్షంలో జరగనున్న ఈ స్క్రీనింగ్ టికెట్స్ సేల్ స్టార్ట్ అవ్వడం కోసం చాలా మంది ఎదురు చూసారు. అయితే ఊహించని రేంజులో హాట్ కేకుల్లా ‘ఆన్ లైన్ సేల్స్ స్టార్ట్ చేసిన 98 సెకండ్స్ లోనే 932 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి”. అంత త్వరగా టికెట్ సేల్స్ కంప్లీట్ అవ్వడంతో ఆశ్చర్యపోయిన బియాండ్ ఫెస్ట్ వాళ్లు “ఒక ఇండియన్ సినిమా స్క్రీనింగ్ కి ఈరెంజ్ బుకింగ్స్ రావడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయ్యింది కాబట్టి గతంలో ఇండియన్ సినిమాకి ఇలాంటి రీచ్ రాలేదు. సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యండి” అంటూ ట్వీట్ చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం రాజమౌళి అండ్ టీం లాస్ ఏంజిల్స్ వెళ్లారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడి మీడియా అండ్ ఆడియన్స్ తో ‘ఆర్ ఆర్ ఆర్ టీం’ Q&A’ సెషన్ లో పాల్గొననున్నారు.