పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్
పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు. టెన్త్ పేపర్ లీకేజీలపై బండి సంజయ్ అరెస్ట్ స్పందించిన మంత్రి హరీశ్ రావు సంజయ్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ కుట్రలు నగ్నంగా నిన్న బయటపడ్డయని అన్నారు. KCR ని ఎదుర్కోలేక ఇలా బీజేపీ చేస్తుందని ఆరోపించారు. పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ కుట్రల్ని దేశం మొత్తం గమనిస్తుందని అన్నారు. నిన్న మధ్యాహ్నం పేపర్ లీక్ అయ్యిందని బీజేపీ వాళ్ళు ధర్నా చేశారని అన్నారు.
బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి
బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. డ్రగ్స్ సరఫరా చేసిన బెంగుళూరుకు చెందిన శశిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు.. నిందితుడిని బెంగుళూరు నుంచి బెజవాడకు తీసుకొచ్చారు.. స్కూల్ బ్యాగ్ లో MDMA డ్రగ్స్ ను పెట్టి శశికుమార్ బెంగుళూరులో ఆర్టీసీ బస్సులో ఇచ్చినట్టుగా గుర్తించారు.. ఇక, ఈ డ్రగ్స్ ను బెజవాడలో రిసీవర్లుగా ఉన్న హర్ష, సుహాస్, వర ప్రసాద్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, బెంగుళూరులో బీటెక్ చదువుతోన్న సమయంలోనే శశి, సుహాస్ మధ్య పరిచయం ఏర్పడిందని.. అది కాస్తా స్నేహంగా మారింది.. ఇప్పుడు డ్రగ్స్ సరఫరా వరకు కూడా సాగుతూ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.. బెంగళూరు నుంచి శశి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విజయవాడతో పాటు హైదరాబాద్‌లోనూ గత కొంత కాలంగా సుహస్ అండ్ ఫ్రెండ్స్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, ఈ ముఠా వెనుక ఇంకా ఎవ్వరెవ్వరు ఉన్నారు.. డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి.. ఎవరు తయారు చేస్తున్నారు.. శశికుమార్ వెనుక ఉన్న గ్యాంగ్ ఏంటి? సుహస్‌కు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎంత మందికి డ్రగ్స్ సరఫరా చేశాడు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.
రేపు చిలకలూరిపేటకు సీఎం జగన్.. మరో కొత్త పథకానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. దీని కోసం రేపు అనగా ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు.. లింగంగుంట్లలో పర్యటించనున్న సీఎం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి విడదల రజిని పరిశీలించారు. సీఎం ముందుగా లింగంగుంట్ల గ్రామం చేరుకుని ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు.. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే 676 వాహనాలు (104) సేవలు అందిస్తుండగా, కొత్తగా వచ్చే 234 వాటితో కలిపి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్ అమలుకోసం 910 వాహనాలు (104)లను వినియోగించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. అలాగే ప్రతిజిల్లాకు బ్యాక్‌అప్ కింద మరో 104 వాహనాన్నికూడా రిజర్వ్‌లో ఉంచుతున్నామని తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి 4 గంటలవరకూ విలేజ్‌క్లినిక్‌లో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ఉండనున్నారు..
డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ.. వాగ్వాదానికి దిగిన మహిళ
డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ తాకింది.. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కార్వేటినగరం పెద్ద దళితవాడలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణస్వామి.. అయితే, కార్వేటి నగరం పెద్ద దళితవాడ గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఓ మహిళ నిలదీసింది.. ఉచిత రేషన్ బియ్యం అన్నారు మాకు ఇంతవరకు వేయలేదన్న ఆ మహిళ.. ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం అందిస్తామన్నారు.. కానీ, మా ఇంటి దగ్గరికి ఏ రోజు రేషన్ బియ్యం వ్యాన్ వచ్చి బియ్యం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.. ఇక, మా వీధిలో త్రాగునీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. మా వీధిలో మురికి కాలువలో మురికి నీరు అస్తవ్యస్తంగా ఉంది.. ఎవరికీ చెప్పినా పట్టించుకునే వారు లేరన్నారు.. ఇలా సమస్యలు చెబుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వామితో హేమలత అనే మహిళ వాగ్వాదానికి దిగింది.. అయితే, ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ మహిళ వెనక్కి తగ్గకుండా వాగ్వాదానికి దిగారు.
వైసీపీలో టికెట్ రానివాళ్లే టీడీపీలోకి..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదనే భయంతో ఉన్నవారే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యేలో అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నెల్లూరు నగర ప్రజలపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ 11 వందల కోట్లు అప్పు పెడితే.. మేం అప్పు లేకుండానే అభివృద్ది చేస్తున్నాం అన్నారు.. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ది చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా..? అని సవాల్ చేసిన ఆయన.. సిటీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీ నాయకులతో బహిరంగ చర్చకు నేను సిద్ధం అని.. నెల్లూరు సిటీ నుంచి మాజీమంత్రి నారాయణ పోటీ చేసినా.. నేను రెడీ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్.
పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించిన విషయం విదితమే.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు మరికొందరు నేతలను కలిశారు.. అయితే, బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు.. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.. దేశానికి జగ్జీవన్ రాం ఎన్నో సేవలందించారని గుర్తుచేసిన ఆయన.. ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారు.. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు జగ్జీవన్ రాం ఆహార మంత్రిగా చేశారు.. 1977లో జగ్జీవన్ రామ్‌ను దేశ ప్రధానిని చేయాలని ఆనాటి జనతా పార్టీ ప్రయత్నించిందని తెలిపారు. ఇక, జనసేన, బీజేపీ పొత్తులపై సోము వీర్రాజు మాట్లాడుతూ.. జనసేన-బీజేపీ కలిసి ముందుకెళ్తాయి.. కలిసే ఉన్నాం అని స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన-బీజేపీ కలిసి పోరాడతాయన్న ఆయన.. చంద్రబాబుతో పవన్ కల్యాణే కాదు.. నేను కూడా వివిధ సందర్భాల్లో చంద్రబాబుతో భేటీ అయ్యాను అన్నారు. రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడమనేది సర్వ సాధారణమైన విషయం.. ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదన్నారు.. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఆలయాలపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఏపీలో హైంధవ ధర్మం అపహస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని మండిపడ్డారు. హిందూమతంపై దాడులు జరుగుతోంటే ఒక్క అరెస్టైనా జరిగిందా..? ఏపీలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు యాత్ర చేపడతామని ప్రకటించారు వీర్రాజు.
మా నమ్మకం నీవే జగన్.. ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు..!
రానున్న 2024 ఎన్నిలకల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశాడు అని చెప్పలేడు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏమి చేశాడో చెబుతాడు.. తప్ప ఆయన ఏమి చేసింది చెప్పులేని వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.. ఇక, నారా లోకేష్ పాదయాత్రలో ఎటువంటి హామీలు ఇవ్వలేడని విమర్శించారు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, మా నమ్మకం సీఎం జగనే.. మా నమ్మకం నీవే జగనన్న పేరుతో ఈ నెల 7వ తేదీన నుంచి 20వ తేదీ వరుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ గ్రామన జగనన్న పథకాలు తెలియజేస్తామన్న ఆయన.. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేవలం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు.. కానీ, రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్రబాబుకు లేదంటూ మండిపడ్డారు మంత్రి గుమ్మనూర్ జయరాం.
భక్తులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం
కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. రాబోయే చార్‌ధామ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని మొత్తం 6.35 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో తెలిపింది. వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు మరియు బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107 మరియు గంగోత్రి ధామ్‌కు 96,449 మంది భక్తులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేస్తామని, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
తాజ్‌మహల్, కుతుబ్‌మినార్లను కూల్చేయండి.. మోడీ జీ
తాజ్‌మహల్, కుతుబ్మినార్లను వెంటనే కూల్చివేయాలని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మీ కోరారు. ఈ రెండు స్మారక కట్టడాల స్థానంలో ప్రపంచంలోనే అందమైన దేవాలయాలు నిర్మించాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. తద్వారా 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంతో సహా వివిధ తరగతులకు సంబంధించిన పుస్తకాలను సవరించింది. ఈ క్రమంలోనే అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుర్మీ.. ప్రధాని నరేంద్ర మోడీకి విచిత్రమైన విజ్ఞప్తి చేశారు. తాజ్ మహల్, కుతుబ్ మినార్ వంటి కట్టడాలను కూల్చివేయాలని అన్నారు. తాజ్‌మహల్, కుతుబ్మినార్లను వెంటనే కూల్చివేయాలని ప్రధానిని కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ రెండు స్మారక కట్టడాల స్థానంలో ప్రపంచంలోనే అందమైన దేవాలయాలు నిర్మించాలి. ఆ రెండు దేవాలయాల నిర్మాణశైలి ఏ ఇతర స్మారక చిహ్నానికి దగ్గరగా ఉండకూడదు. దేవాలయాల నిర్మాణానికి కనీసం ఏడాదిన్నర జీతాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కుర్మీ తెలిపారు.
అలీబాబా.. అర డజను ముక్కలు. వ్యూహం మార్చిన జాక్ మా వ్యాపార సామ్రాజ్యం
చైనాలోని ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పాల్పడుతున్న సాధింపు చర్యలకు విరుగుడుగా సరికొత్త వ్యూహాన్ని అమలుచేసింది. బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని అర డజను ముక్కలుగా విభజించాలని నిర్ణయించింది. ఒక కంపెనీని ఆరు ఎంటిటీలుగా మార్చటం ద్వారా విలువ పెంచాలని భావిస్తోంది. అలీబాబా గ్రూప్ ప్రకటించిన ఈ ప్రణాళిక.. మార్కెట్‌లను అమితాశ్చర్యానికి గురిచేసింది. కొత్తగా ఏర్పడే సంస్థలు విడివిడిగా పబ్లిక్ ఆఫరింగ్‌కి వస్తాయని తెలిపింది. తద్వారా నిధుల సమీకరణ చేయనున్నాయని పేర్కొనటంతో ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేశారు. అలీబాబా గ్రూప్ ఆశించిన ఫలితం రానే వచ్చింది. తాజా ప్రకటనతో కంపెనీ షేర్ల విలువ ఒక్కసారే 16 శాతానికి పైగా పెరిగింది. మార్కెట్ క్యాప్ సుమారు 30 మిలియన్ డాలర్లు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో.. అలీబాబా వ్యాపార సామ్రాజ్యం చైనా ప్రభుత్వ అణచివేత నుంచి ఉపశమనం పొందనుందని పరిశీలకులు చెబుతున్నారు. జాక్ మా ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఈ సంస్థ.. కామర్స్, క్లౌడ్, లాజిస్టిక్స్, కన్జ్యూమర్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో వ్యాపారం చేస్తోంది.
వామ్మో.. రష్మిక 27ఏళ్ల వయసులో అన్ని కోట్లా !
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటి రష్మిక మందనకు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో దుమ్ములేపుతోంది. 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రష్మిక తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ వైపు మళ్లింది. ఇప్పటి వరకు రష్మిక దాదాపు 15 సినిమాల్లో నటించింది. రష్మిక తన సినిమాల ద్వారా ప్రతి సంవత్సరం 8 కోట్లకు పైగా సంపాదిస్తుంది. ఆమె ఒక సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. కేవలం 27 ఏళ్ల వయసులో ఆమె మొత్తం సంపద రూ.65 కోట్లు. సినిమాలే కాకుండా, ఆమె ప్రకటనలు, మోడలింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుంది. సంపాదన పరంగా రష్మిక ఇద్దరు బాలీవుడ్ స్టార్‌కిడ్‌లను అధిగమించింది.
వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లా… పుష్ప ఎక్కడ ఉన్నాడు?
బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’ అని మాట్లాడారు. ఈ ప్రమోషనల్ స్టంట్ బాహుబలి ది కంక్లూషన్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయ్యే వరకూ తీసుకోని వెళ్లింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ “వేర్ ఈజ్ పుష్ప” అంటున్నారు. #WhereIsPushpa అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి అప్డేట్ బయటకి వస్తుందని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 8 కాదు ఒకరోజు ముందు ఏప్రిల్ 7న సాయంత్రం 4:05కే అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషనల్ వీడియో ప్రోమోని వదిలారు. ఇందులో “2004లో తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నడ ఉన్నాడు?” అనే డైలాగ్ తో ప్రోమో మొదలయ్యింది. పుష్పకి సపోర్ట్ చేస్తూ ధర్నాలు చేస్తున్న పబ్లిక్, న్యూస్ పబ్లిష్ చేస్తున్న మీడియా, పోలీసుల క్లిప్పింగ్స్ ని ప్రోమోలో చూపించారు. అల్లు అర్జున్ లుక్ ని ఫుల్ వీడియోలో ఏప్రిల్ 7న రివీల్ చేస్తారేమో. అసలు పుష్ప పార్ట్ 1 ఎండ్ లో షెకావత్ సార్ కి వార్నింగ్ ఇచ్చి, నేరుగా పెళ్లి మండపంకి వచ్చి శ్రీవల్లిని పెళ్లి చేసుకున్న పుష్ప జైలుకి ఎందుకు వెళ్లాడు? షెకావత్ సార్ పుష్పని అరెస్ట్ చేశాడా? జైలు నుంచి తప్పించుకోని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడా? లాంటి చాలా డౌట్స్ ని ఒక్క వీడియోతోనే క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు సుకుమార్ అండ్ టీం. మరి ఈ హంటింగ్ వీడియోలో ఏముందో తెలియాలి అంటే ఫుల్ వీడియో బయటకి వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.