NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎం జగన్‌ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
నిన్న జరిగిన సీఎం సమీక్షకు గైర్హజరుపై స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్న.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదన్నారు. ఇక, నేను, కొడాలి నాని పార్టీ మారుతున్నాం అంటూ ప్రచారాలు వచ్చాయి.. అవి మెరుపు కలలు మాత్రమే.. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి.. పరోక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీ పోటీ పడలేదు.. అందుకనే టీడీపీకి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయి.. అయినా టీడీపీ అభ్యర్థులు గెలిచారు అంటే ఆర్థిక అంశాలే అని విమర్శించారు. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకుల నుండి డబ్బులు ఖర్చు పెట్టించేందుకే ముందస్తు ఎన్నికలు అంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టచ్‌లో ఉన్నారంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు.. ఇది మైండ్ గేమ్‌ మాత్రమే అంటూ మండిపడ్డారు వంశీ… అంతిమంగా ఓట్లు వేసి గెలిపించేది ఓటర్లు మాత్రమే అన్నారు. చంద్రబాబు నాయుడుని చూసి ఓట్లు వేయని వారు.. నారా లోకేష్ సుందర మోకారవిందాని చూసి ఓట్లు వేస్తారా ? అంటూ ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీ.

వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతుండగా చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షల తొలి రోజైన సోమవారం వికారాబాద్‌ జిల్లాలో పరీక్ష ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్‌ గ్రూప్‌లో తెలుగు ప్రశ్నపత్రం ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది. తాజాగా ఈరోజు వరంగల్‌లో 10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కలకలం సృస్టిస్తోంది. ఉదయం 9.30 గంటలకు ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. పదోతరగతి ప్రశ్నపత్రం స్టూడెంట్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను సేకరించడం ప్రారంభించారు. అయితే ఈ ప్రశ్నపత్రం అసలైనదా? అది నకిలీదో కూడా తెలియాల్సి ఉందని అంటున్నారు. వరుసగా రెండో రోజుకూడా పదోతరగతి పశ్నాపత్రం లీక్ అవడంతో ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్‌.. పర్యటన వివరాలు ఇవే..
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఐదవ రోజు మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కోదండ రాముడు.. ఇక, రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్నారు ఒంటిమిట్ట రాముడు.. మరోవైపు సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తుల సౌకర్యార్థం 118 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది ఏపీఎస్‌ ఆర్టీసీ.. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు అనగా బుధవారం ఒంటిమిట్టను సందర్శించనున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చే సింది.. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న సీఎం జగన్‌.. స్వామి వారిని దర్శించుకోనున్నారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 5వ తేదీన మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక, అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండరామస్వామి ఆలయానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం.. 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న ఆయన.. మళ్లీ టీటీడీ అతిథి గృహానికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు.. ఇక, సాయంత్రం 4.25 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం.. సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన దృష్ట్యా.. కడప జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.

ఢిల్లీలో జనసేనాని బిజీ బిజీ.. వరుస భేటీలు.. పొత్తులపై తేల్చేస్తారా..?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపున్నారు.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు.. నిన్న సాయంత్రం పవన్ కల్యాణ్‌.. నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌ మురళీధరన్ తో సమావేశమయ్యారు. గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది.. ఇక, ఈ రోజు మరోసారి మురళీధరన్‌తో సమావేశం అయ్యారు పవన్‌ కల్యాణ్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.. జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. నిన్న సమావేశం ముగిసిన తర్వాతే కాదు.. ఈ రోజు కూడా.. ఇంకా పలువురిని కలవాల్సి ఉందని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. అందరినీ కలిసిన తర్వాత వివరాలు చెబుతాన్నారు.. అయితే, ఈ భేటీల్లో పొత్తులపై కీలకంగా చర్చ సాగుతున్నట్టుగా సమాచారం.. బీజేపీ మాత్రం జనసేనతో కలిసి వెళ్లాలని ఆలోచనతో ఉండగా.. పవన్‌ కల్యాణ్ మాత్రం.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు నడుస్తూనే.. ఎన్నికల్లో విజయం సాధ్యమనే భావనలో ఉన్నారు.. ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక, ఈ రోజు మురళీధరన్‌తో జరిగిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌తో పాటు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్ పాల్గొన్నారు. దీంతో.. పొత్తులపై కీలక చర్చ జరిగిందనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో నిన్న రాత్రి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన పవన్‌.. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని.. కేంద్రమే ఆ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.. మరోవైపు.. బీజేపీ పెద్దలతో ఇంకా సమావేశాలు ఉన్నాయని జనసేనాని చెబుతున్న నేపథ్యంలో.. సాయంత్రం బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే రాలేదు..!
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సోమవారం రోజు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు ఆళ్ల.. అయితే, ఆర్కే, పార్టీకి మధ్య గ్యాప్‌ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వడం కూడా కష్టమేననే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆయన సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. అయితే, నిన్న సీఎంతో ఎమ్మెల్యేల సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. తన ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో పాటు, తనకు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే సమావేశానికి వెళ్లలేదన్నారు.. 99 శాతం ఎమ్మెల్యేలు హాజరై ఒకరో ఇద్దరో రాకపోతే దాన్ని మీడియా హైలెట్ చేయడం బాధాకరం అన్నారు.. ఇక, నేను మంగళగిరిలో పోటీ చేసినా.. చేయకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయం అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఆర్కే.. నేను రాజకీయాలలో ఉంటే సీఎం వైఎస్‌ జగన్ తో ఉంటాను.. లేదంటే వ్యవసాయ పనులు చేసుకుంటానని స్పష్టం చేశారు.. ఇక, నేను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.. మా బాస్‌ వైఎస్‌ జగన్‌.. ఆయన చెప్పిందే ఫైనల్‌.. నేను పోటీ చేయకపోయినా మంగళగిరిలో గెలిచేది వైసీపీయే అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కాగా, తాడేపల్లి వేదికగా సోమవారం గడపగడపకు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.. ఆ సమావేశానికి కొందరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం విదితమే. ఇక, ఎన్టీవీతో మాట్లాడిన ఆర్కే ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం.. కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.. బెదిరింపుల నుంచి బుజ్జగింపులకు తగ్గారు..!
ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షా సమావేశం వేదికగా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను.. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించడంతో.. ఆయన బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారు అంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం సమీక్ష సమావేశంలో స్పష్టమైన మార్పు కనిపించింది.. ఎమ్మెల్యే లు, మంత్రులకు బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారని కామెంట్ చేశారు.. మంత్రులను మారుస్తామని స్వయంగా చెప్పిన సీఎం.. ఇప్పుడు వెనక్కి తగ్గారని పేర్కొన్న ఆయన.. సెమీఫైనల్ లో ఫలితాలు చూసి ఖంగుతిన్నారని.. జగన్ సమావేశానికి పార్టీ ముఖ్యమైన ఎమ్మేల్యేలు, ధర్మాన వంటి నేతలు హాజరుకాకపోవడమే నిదర్శనంగా చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాసరావు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ టైటానికి షిప్ మునిగిపోవడానికి రెడీగా ఉందన్నారు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని.. వైసీపీతోనే భూ స్థాపితం అవుతారంటూ హాట్‌ కామెంట్లు చేశారు. ఇక, వాళ్ళు వస్తామన్నా ఏ పార్టీ చేర్చుకోదని స్పష్టం చేశారు.. నిన్న సీఎం జగన్‌ సమావేశానికి వైసీపీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలు కారణమన్న ఆయన.. రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించేది విజయ శంఖారావం సభగా అభిర్ణించారు. కాగా, రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించనున్న సభ.. వియ శంఖారావ సభ కానుందని టీడీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం కోసం రేపు చంద్రబాబు వస్తున్నారు. బూత్ స్థాయి నుంచి నిర్వహించే రివ్యూ పార్టీ పటిష్టతకు కీలకంగా భావిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మార్పుకు నిదర్శనంగా టీడీపీ చెబుతోంది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత అనివార్యమో.. 2024లో టీడీపీ గెలుపు అంతే ఖాయం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇక, వైసీపీ వైఫల్యాలు, నాయకులు సాగించిన దోపిడీపై పోరాటం టీడీపీకి ఉత్తరాంధ్రలో 34స్థానాలను సాధించి పెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

షర్మిలపై తమ్మినేని సీరియస్.. రాజకీయ నాటకాలు మానుకోవాలని..
షర్మిల ఫోన్ చేశారని ఆమెతో కలిసి పని చేయడానికి మేము కూడా సిద్ధమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కానీ షర్మిలకు మోడీ.. ఆధాని దోపిడీ గుర్తుకు రాలేదని మండిపడ్డారు. మైనార్టీల మీద దాడులు జరుగుతున్నా మాటలు రావు ఆమెకి అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. జుగుస్తకరంగా షర్మిల వ్యవహారం అంటూ నిప్పులు చెరిగారు. షర్మిల రాజకీయ నాటకాలు మానుకోవాలని అన్నారు. మేము ఎన్నో సార్లు ఉద్యమాల్లో కలిసి రండి అని పిలిచాం.. ఒక్క రోజు కూడా రాలేదని తమ్మినేని, షర్మిలపై మండిపడ్డారు. సీపీఐ.. సీపీఎం కలిసి పని చేయాలని నిర్ణయించామని అన్నారు. ఏప్రిల్ 9 న సీపీఐ.. సీపీఎం ఉమ్మడి సభ ఉంటుందని, సీట్ల వ్యవహారంలో కూడా సర్దుకుపోవాలి అని నిర్ణయం తీసుకున్నాట్లు వెల్లడించారు. లెఫ్ట్ పార్టీల చరిత్ర లో ఉమ్మడి సభ ఇది మొదటి సారి అని తెలిపారు తమ్మినేని. రాష్ట్ర రాజకీయాల్లో.. బీజేపీ తప్పుడు పద్దతిలో ఎదగాలని చూస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఐక్యత కూడా ప్రదర్శించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు ఓ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ నిజాయితీ గల సంస్థ మోడీ అన్నారు.. మరి గతంలో కాంగ్రెస్ చెప్పినట్టు వింటుంది మోడీనే అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా కూడా సీబీఐ.. నన్ను అప్రూవర్ కావాలని చెప్పినట్టు ప్రకటించారని తెలిపారు. ఇప్పుడేమో గొప్పది అంటున్నారని ఎద్దేవ చేశారు. కవిత తప్పు చేస్తే శిక్షించాలని కోరారు. కేసీఆర్ పార్టీ పై వేధింపులు మానుకోవాలని, కక్ష సాధింపు కేసులు వద్దన్నారు. పరీక్ష పత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇద్దరి నిందితులు అని చెప్పడం సరికాదన్నారు తమ్మినేని. గతంలో సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఖండించారు. ఖమ్మంలో మేము మద్దతు ఇవ్వలేదనేది సరికాదన్నారు. 2014 ఎన్నికల్లో మేము వైఎస్ఆర్సిపి కి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు.

హత్య కేసులో నిందితుడు.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు పెరోల్..
ఇటీవల అత్యాచార కేసులో నిందితుడైన యువకుడికి బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఓ కోర్టు. పోలీసులు, అధికారులు సమక్షంలో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది. తన కొడుకు ప్రేమించిన అమ్మాయికి వేరేవారితో పెళ్లి అవుతుందనే భయంతో కోర్టును ఆశ్రయించింది. అసాధారణ పరిస్థితిగా పరిగణించిన కర్ణాటక హైకోర్టు దోషికి పెరోల్ మంజూరు చేసింది. అయితే ప్రభుత్వ న్యాయవాది.. పెళ్లి చేసుకోవడానికి పెరోల్ మంజూరు చేసే నిబంధన లేదని కోర్టులో వాదించారు. అయితే దోషి ఆనంద్ కు పెరోల్ ను మంజూరు చేసే అసాధారణ పరిస్థితిగా దీనిని జస్టిస్ ఎం నాగప్రసన్న పరిగణించి పెరోల్ ఇచ్చారు. ఆనంద్ తల్లి రత్నమ్మ, ప్రేమికురాలు నీతా పెరోల్ పిటిషన్ తో హైకోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్ల నీతా తనకు మరొకరితో వివాహం జరుగుతోందని, అందువల్ల తనను పెళ్లి చేసుకోవడానికి ఆనంద్ కు పెరోల్ మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొంది. గత 9 ఏళ్లుగా ఆనంద్ తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. హత్య కేసులో ఆనంద్ కు జీవిత ఖైదు విధించబడింది. ఆ తరువాత దీన్ని 10 ఏళ్ల జైలు శిక్షగా తగ్గించారు. ప్రస్తుతం అతడు 6 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్నాడు. నిర్భంధంలో ఉన్న వ్యక్తి విడుదల తప్పనిసరి అని.. జైలులో ఉన్న అతను, తను ప్రియురాలు వేరే వివాహం చేసుకుంటే భరించలేడని, జీవితంలో ప్రేమను కోల్పోతాడని, అందువల్ల అతనికి పెరోల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం వరకు దోషి ఆనంద్ ను పెరోల్ పై విడుదల చేయాలని జైళ్ల డిప్యూటీ ఐజీ, పరప్పర అగ్రహార జైల్ చీఫ్ సూపరింటెండెంట్ ను కోర్టు ఆదేశించింది. మళ్లీ జైలుకు తిరిగి వచ్చేందుకు, పెరోల్ వ్యవధిలో ఇతర నేరాలకు పాల్పడకుండా కఠిన షరతులు విధించాలని అధికారులను ఆదేశించింది.

మోడీని గెలిపించింది డిగ్రీ కాదు… జనాకర్షణ..
మహరాష్ట్ర సీనియర్ ఎన్సీపీ నేత, మాజీ మంత్రి అజిత్ పవార్ మోదీ డిగ్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల డిగ్రీలపై ప్రశ్నించడం సరికాదని, ఆ మంత్రి ప్రజలకు ఏం చేశారన్నదే చూడాలని ఆయన అన్నారు. 2014లో మోదీ డిగ్రీ చూసి ప్రజలు ఆయనకు ఓటేశారా..? అని ప్రశ్నించారు. ఆయనకు ఉన్న ప్రజాకర్షణే ఆయన్ను గెలిపించిందని అన్నారు. ఈ సమయంలో డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదని, ద్రవ్యోల్భణం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా..? అని ప్రశ్నించాలని అని సూచించారు. మోదీ డిగ్రీకి సంబంధించి ఏడేళ్ల కేసులో కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది గుజరాత్ హైకోర్టు. ఈ సమాచారాన్ని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జరిమానా విధించింది. అయితే ఆయన ఈ తీర్పు అనంతరం మాట్లాడుతూ.. మోదీ విద్యార్హతపై మరింత అనుమానాలు పెరిగాయని, మోదీ నిజంగా విద్యావంతుడు అయితే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండేవారు కాదని కేజ్రీవాల్ విమర్శించారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయన ప్రభుత్వం అవినీతిపై దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకువస్తుంటే కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించింది.

ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత ఎంఎస్ ధోని అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇన్సింగ్స్ ఆఖరి ఓవర్ లో ధోని ఔటయ్యాడు. అయితే మార్క్ వుడ్ 19 ఓవర్ లో వేసిన రెండో-మూడు బాల్స్ ను మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇప్పుడు.. ధోనీని అతని అభిమానులు సూపర్ హీరో కంటే ఎక్కువగా చూస్తున్నారని ఆనంద్ మహీంద్రా అన్నారు. కాబట్టి, అతనికి CSK యూనిఫారంతో పాటు కొత్త యూనిఫాం కూడా తయారు చేయించాలని ఆయన సూచించాడు. కొన్ని వినూత్నమైన, ఆసక్తికరమైన కేప్ డిజైన్‌లతో ముందుకు రావాలని ట్విట్టర్ వినియోగదారులను ఆనంద్ మహీంద్రా కోరారు. MS ధోనీ యొక్క ప్రత్యేక యూనిఫామ్‌లో ఒక కేప్‌ను తప్పనిసరిగా తయారు చేయాలని తాను భావిస్తున్నాను.. అది లేకుండా సూపర్ హీరో ఎలా వెళ్తాడని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ కు సంబంధించిన ఒక వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. దానిని అభిమానులతో పంచుకున్నాడు. ఎంఎస్ ధోనితో ఉన్న యానిమేషన్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ ఎంట్రీకి రిపీట్స్ పడాల్సిందే… లుక్ ఇరగదీసాడు
బాలేవుద్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ మిక్స్ చేస్తూ పాయల్ దేవ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకీ మామ, పూజా హెగ్డేలు కనిపించరు. లుంగీ కట్టి సల్మాన్, వెంకీ స్వాగ్ తో డాన్స్ చేశారు. ఈ ఇద్దరితోనే మంచి జోష్ లోకి వస్తున్న టైంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అనే వార్త వినిపిస్తూనే ఉంది. దాన్ని నిజం చేస్తూనే ‘ఎంటమ్మ’ సాంగ్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. గతంలో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేశాడు, దానికి పే ఆఫ్ గా చరణ్ ఈరోజు ‘ఎంటమ్మ’ సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఎల్లో షర్ట్, వైట్ లుంగీ ఎత్తి కట్టి చరణ్ డాన్స్ చేస్తుంటే మాస్ ఆడియన్స్ ని ఫుల్ పీల్స్ పెట్టినట్లు ఉంది. అతని బాడీ లాంగ్వేజ్ లో స్వాగ్ అండ్ స్టైల్ దెబ్బకి సాంగ్ లో ఇంకెవరూ కనిపించకుండా పోయారు. స్టార్టింగ్ లో వెంకటేష్, సల్మాన్ తో కలిసి నాటు నాటు టైపు స్టెప్ వేసిన చరణ్… ఆ తర్వాత సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలతో ఎంటమ్మ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేశాడు. పూజాని కూడా పక్కకి నెట్టి సల్మాన్, చరణ్ మాత్రమే డాన్స్ చేశారు. ఇక లాస్ట్ లో తను మాత్రామే కనిపిస్తూ చరణ్ డాన్స్ చేసిన విధానం మెగా అభిమానులకే కాదు పాన్ ఇండియా అభిమానులకి కూడా నచ్చేలా ఉంది. సింపుల్ స్టెప్స్ ని అంతే సింపుల్ గా చాలా ఈజ్ తో చేశాడు చరణ్. ఈ రేంజ్ మాస్ లుక్ లో చరణ్ తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. ఇలాంటి లుక్ ఒక పూర్తిస్థాయి సినిమా చేస్తే చరణ్, ప్రతి ఒక్కరికీ మెగాస్టార్ నటించిన ‘ముఠామేస్త్రీ’ ఫీల్ ఇవ్వడం గ్యారెంటీ. మరి చరణ్ తో ఫ్యూచర్ లో సినిమా చెయ్యబోయే దర్శక నిర్మాతలు చరణ్ ని ఇలాంటి మాస్ లుక్ లో చూపించే ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. మొత్తానికి ఈ ఒక్క సాంగ్ తో సల్మాన్ ఖాన్ సినిమా మార్కెట్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ కొంచెమైనా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.