NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్‌ అవ్వకండి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ క్రమంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఆదివారం నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు చోట్ల రహదారులను మూసివేసి వాహనాలను దారి మళ్లించనున్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లించనున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే బస్సులు ట్యాంక్‌బండ్‌కు బదులు తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్తాయి. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ ఘాట్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్క్‌లను మూసివేయనున్నారు. పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డు వైపు, ఖైరతాబాద్‌ జంక్షన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు, తెలుగుతల్లి జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డు వైపు అనుమతిస్తారు. అలాగే చింతలబస్తీ నుంచి వచ్చే వాహనదారులను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సుదర్శన యాగం, చండీ హోమం, వాస్తు హోమం నిర్వహించనున్నారు. ఉదయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు ఈ హోమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం జరిగే పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య..! కుటుంబ సభ్యుల అనుమానం..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు విడుదలైన తర్వాత.. ఫెయిల్‌ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా, విజయవాడలోని తాడిగడప కాలేజీ చైతన్య హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది.. నిన్న హాస్టల్‌లో ఊరివేసుకుని ఇంటర్ విద్యార్థిని వాణి ఆత్మహత్య చేసుకుంది.. ఇంటర్‌లో ఒక్క సబ్జేక్ట్‌ ఫెయిల్ కావడంతో ఇతర విద్యార్థుల ముందు లెక్చరర్‌ మందలించారట.. తోటి విద్యార్థుల ముందు లెక్చరర్‌ వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.. అయితే, కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు.. వాణి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న గది వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు.. వాణి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం మార్చిలో మృతదేహాన్ని ఉంచారు.. కాగా, పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకే.. ఆత్మ విశ్వాసం కోల్పోయి ఇలా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది..

రజనీకాంత్‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్‌.. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపెట్టేలా..!
ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల వేదికగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు గుప్పించిన ఆమె.. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానన్న రోజా.. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా విమర్శించారు.. ఇక, చంద్రబాబు విజన్‌, హైదరాబాద్‌ అభివృద్ధిపై రజనీ చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చిన రోజా.. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డే అన్నారు.. దానికి కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలని సూచించారు మంత్రి రోజా. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదని హితవుపలికారు మంత్రి రోజా.. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేసిన ఆమె… విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేదికగా చేసిన కామెంట్లతో రజనీకాంత్‌పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారు. ఇంతలా మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. మరోవైపు.. రజనీకాంత్‌ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని జోస్యం చెప్పారు మంత్రి ఆర్కే రోజా.

వైసీపీకి షాక్‌..! ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు బాలినేని.. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్‌లో ఉన్నారు బాలినేని.. కాగా, ఆయన రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. అయితే, సీఎం వైఎస్ జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి.. జగన్‌ 2 కేబినెట్‌లో చోటు దక్కలేదు.. ఈ సమయంలోనూ ఆయన అలకబూనడం.. వైసీపీ అధిష్టానం, సీఎం జగన్‌ ఆయనకు నచ్చజెప్పారు.. ఆ తర్వాత పార్టీ బాధ్యతలను అప్పగించారు.. కొన్ని సందర్భాల్లో మినహా.. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా ఉన్న బాలినేని ఉన్నట్టుండి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది..

గ్రామాల్లో టీడీపీ కనుమరుగు.. చంద్రబాబుకు పిచ్చి పట్టింది..!
గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యిందని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు.. కోటి 45 లక్షల కుటుంబాలను పార్టీ నేతలు కలిశారు.. కులాలు.. వర్గాలు.. పార్టీలకు అతీతంగా పథకాలను ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో కలెక్టర్ కు కూడా అధికారాలు లేవు.. అప్పట్లో జన్మ భూమి కమిటీలే లబ్ధిదారులను నిర్ణయించేవారన్న ఆయన.. ఇప్పుడు అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు.. అందుకే ప్రజలు సీఎం వైఎస్‌ జగన్ స్టికర్ ను తమ ఇంటికి అంటించుకుంటున్నారని తెలిపారు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కు భారత్ రత్న రావడానికి నేనే సిఫారసు చేశానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కాకాణి.. దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో చంద్రబాబు అన్నారని విమర్శించారు.. చంద్రబాబుకు మతిమరుపు పెరిగింది.. ఇప్పుడు పిచ్చి కూడా పట్టిందని కామెంట్‌ చేశారు.. చంద్రబాబు మంచి పాలన అందించి ఉంటే ఎందుకు 23 స్థానాలకే పరిమితమయ్యారు? అని ప్రశ్నించారు. ఈ సారి కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు.. ఎన్టీఆర్‌ చేసిన పనులే చెప్పుకుంటున్నారు.. కానీ, తాను ఏమి చేశారో చెప్పలేకపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ విలువలు గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని ఫైర్‌ అయిన ఆయన.. ప్రతి సర్వేలో కూడా జగన్ కే ప్రజలు మద్దతు ఇస్తున్నారని.. అది చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. రోగిపై లైంగిక దాడి..!?
ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏ పరిస్థితిలో ఉన్నారు కూడా చూడకుండా లైంగికదాడులకు పాల్పడుతున్నారు.. పిసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఘాతుకానికి పాల్పడుతున్నారు.. తాజాగా, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరోసారి కలకలం రేగింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై లైంగిక దాడికి యత్నించాడో వ్యక్తి.. గత అర్థరాత్రి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అది గమనించిన తోటి రోగులు.. అటెండర్లు.. కామాంధుడి దుశ్చర్యను అడ్డుకున్నారు.. ఈ ఘటనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, స్థానికుల సమాచారంలో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. భాదితురాలు మచిలీపట్నంకు చెందిన నాగలక్ష్మిగా తెలుస్తుండగా.. నిందితుడు గుంటూరుకు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు పోలీసులు.. ఇక, ఆస్పత్రిలో బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కాగా, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే ఓ ప్రబుద్ధుడు మానసిక దివ్యాంగురాలైన యువతికి ఉద్యోగం ఆశ చూపి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆస్పత్రిలో మరో ఇద్దరు ఒప్పంద కార్మికులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే.

ఎనీ టైం మందు.. ఏటీఎం తీసుకొచ్చిన ప్రభుత్వం..
ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్‌ డైలాగ్‌ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్‌ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్‌ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట.. ఇప్పుడు చెన్నైలో ఈ ఎనీ టైం మందు మిషన్‌ ఏర్పాటు చేశారు. కోయంబేడులోని ఓ మాల్ వద్ద తమిళనాడు ప్రభుత్వం ATM మందు మిషన్ ఏర్పాటు చేసింది.. నాలుగు ప్రాంతాలలో ATM తరహాలో మిషన్ ఏర్పాటు చేసింది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్.. ఈ మిషన్‌ దగ్గరకు వెళ్లి.. అందులో చూపించే.. బ్రాండ్‌లను నచ్చిన బ్రాండ్‌ను ఎంపికచేసుకునే వెసులుబాటు ఉంది.. ఇక, ఆ బ్రాండ్‌కు ఎంత మొత్తం చెల్లించాలో చూపిస్తుంది.. ఆ పేమెంట్‌ డిజిటల్‌ రూపంలో చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మీరు ఎంపిక చేసుకున్న లిక్కర్‌.. డెలివరీ చేస్తుంది ఆ మిషన్‌.. అయితే మద్యం మిషన్ ఏర్పాటుపై బీజేపీ నేత, సినీనటి ఖుష్బూ సెటైర్లు వేశారు.. ప్రజలను మద్యానికి బానిసలుగా ఉంచడానికి డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఐడియా సూపర్‌గా ఉందండీ అంటూ సోషల్‌ మీడియాలో ఎద్దేవా చేశారు. మరోవైపు, మద్యం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయాని డీఎంకే ఎంపీ కనిమోళి స్వయంగా అంగీకరించారు.. ఇలాంటి వాటి వల్ల తమిళ యువత ఆరోగ్యం నాశనం అవుతుందన్నారు. ఏదేమైనా.. ఎన్ని విమర్శలు ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో లిక్కర్‌ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్న విషయం విదితమే.

బైజూస్ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఎడ్-టెక్ సంస్థ బైజూస్ ఎండీ, సీఈవో బైజు రవీంద్రన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సోదాలు నిర్వహించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం రవీంద్రన్, అతని కంపెనీ ‘థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’పై కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ బెంగళూరులోని రెండు వ్యాపార కార్యాలయాలు, ఒక నివాస స్థలంలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు నేరారోపణ పత్రాలు, డేటా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈడీ సోదాల అనంతరం వెంటనే బైజూస్ సంస్థ స్పందించింది. ఈ సోదాలు ఫిమా కింద సాధారణ విచారణకు సంబంధించినవేనని పేర్కొంది. “మేము అధికారులతో పూర్తిగా పారదర్శకంగా ఉన్నాము. వారు కోరిన మొత్తం సమాచారాన్ని వారికి అందించాము. మా కార్యకలాపాల సమగ్రతపై మాకు అత్యంత విశ్వాసం తప్ప మరేమీ లేదు. మేము అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, నైతికతను సమర్థించటానికి కట్టుబడి ఉన్నాము.” అని బైజూస్ వెల్లడించింది. “2011 నుండి 2023 మధ్య కాలంలో కంపెనీ రూ. 28,000 కోట్ల (సుమారు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు ఫెమా శోధనలు వెల్లడించాయి” అని ఈడీ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. ఇదే కాలంలో విదేశీ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వివిధ విదేశీ సంస్థలకు దాదాపు రూ.9,754 కోట్లను పంపినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది.

చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్‌లో 2వ స్థానం
రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతను సెప్టెంబర్ 4, 2022న ఫ్రాన్స్‌లోని లెస్ సాబుల్స్-డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో ఎరౌండ్-ది-వరల్డ్ సెయిలింగ్ రేస్‌లో రెండవ స్థానంలో నిలిచాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ (జీజీఆర్‌) రేసులో భారత్‌కు చెందిన అభిలాష్‌ టోమీ శనివారం రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అభిలాష్ టోమీ ప్రయాణిస్తున్న పడవ బయానాట్ 236 రోజుల పాటు ప్రయాణించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఫ్రాన్స్ తీరానికి చేరుకుంది. 44 ఏళ్ల అభిలాష్ టామీ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయుడు, ఆసియా వ్యక్తిగా పేరగాంచారు. గురువారం రాత్రి మొదటి స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు చెందిన 40 ఏళ్ల నావికుడు కిర్‌స్టెన్ న్యూషాఫర్‌కు నిర్వాహకులు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. సముద్రం అకస్మాత్తుగా గాలి లేకుండా మారడంతో కిర్‌స్టన్ చివరి 2-3 నాటికల్ మైళ్లను కవర్ చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పట్టింది. దీంతో అభిలాష్ రెండో స్థానంలో నిలిచాడు.

మొత్తానికి బౌండరీలు దాటుతున్నారు… ఈవారం కూడా విరుపాక్షదే
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ ఇప్పటివరకూ ఏడు రోజుల్లో 62.5 కోట్లని కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 28న ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి వీటి వలన విరుపాక్ష సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుందేమో అని ట్రేడ్ వర్గాలు లెక్కేసాయి కానీ ఏజెంట్ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో విరుపాక్ష సినిమాకి ఈ వీక్ కూడా కలిసోచ్చేలా ఉంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని ఇలానే మైంటైన్ చేస్తే చాలు విరుపాక్ష సినిమా తెలుగు వెర్షన్ తోనే వంద కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న విరుపాక్ష మూవీ అనౌన్స్మెంట్ సమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రొజెక్ట్ అయ్యింది. రిలీజ్ సమయంలో తెలుగుకి మాత్రమే స్టిక్ అయ్యారు కానీ ఇక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చేయడంతో మేకర్స్ ఇప్పుడు బౌండరీలు దాటడానికి రెడీ అయ్యారు. హిందీలో గోల్డ్ మైన్స్, తమిళ్ లో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4E మూవీస్ విరుపాక్ష సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మే 5న విరుపాక్ష సినిమా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. మరి కాంతార స్టైల్ లో ఇక్కడ హిట్ అయిన విరుపాక్ష మూవీ ఇతర ఇండస్ట్రీల బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.