అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్‌లో పార్ట్ టైం పనిచేస్తున్న వీర సాయిష్‌ని నిన్న రాత్రి కాల్చి చంపారు దుండగులు.. ఆ విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఉన్నత చదువుల కోసం (ఎమ్మెస్) అమెరికా వెళ్లిన సాయిష్ ప్రాణాలు ఇలా పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇండియాకు చెందిన ఇద్దరు తెలుగు యువకుల మృతిలో పాలకొల్లుకు చెందిన సాయిష్ ఒకరు.. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో వీర సాయిష్ ఇలా ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు..
ఎండ దెబ్బకు.. నిండిన మెట్రో
ఒక వైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెడదామంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇక అందరికీ కార్లు ఉండవు కదా.. అందుకే బస్సులు, ఆటోల కన్నా.. మెట్రో వైపు పరుగులు పెడుతున్నారు. ఐటీ కొలువులు చేసేవారికి మెట్రోలో ప్లేస్ దొరకడం లేదు. అంతేగాక ఇప్పుడూ సమ్మర్ హీటెక్కడంతో అంతా మెట్రో ప్రయాణం వైపే మొగ్గుచూపుతున్నారు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటున్నారు. అందరూ మెట్రోలో ప్రయాణం చేసేందుకు వస్తుండటంతో స్టేషన్లు మొత్తం పబ్లిక్ తో కిక్కిరిసిపోతున్నాయి. వారం రోజుల నుంచి ఇక్కడ రోజుకు 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నాట్లు తెలుస్తోంది. అయితే మెట్రోలో కెపాసిటీకి మించి ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఇదీ ప్రమాదకరం కావడంతో మెట్రో సర్వీసులు పెంచాలని ప్యాసింజర్స్ డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ డే, ప్రత్యేక సందర్భం ఉంటేనే మెట్రో సర్వీసులు వేస్తారు.. ఈ మధ్య ఐపీఎల్ కోసం వేశారు.. ఎండలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీస్ పెంచితే బాగుంటుందని జనాలు అంటున్నారు. అయితే బస్సులు, ఎంఎంటీఎస్ లతో పోలిస్తే మెట్రో ఛార్జీ కాస్త ఎక్కువే.. అయినప్పటికీ చల్లదనం కోసం జనం మెట్రోలో ట్రావెల్ చేసేందుకు వస్తున్నారు.
నేడు బీజేపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామికవేత్త.. అక్కడి నుంచే పోటా..?
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతుంది.. మొన్నటి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఇక మరిన్ని చేరికలు ఉంటాయని.. మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, పారిశ్రామికవేత్తలు పార్టీలోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నమాట.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు బీజేపీలో చేరనున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది.. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే కోర్ కమిటీ సమావేశంలో జాతీయ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్ , కేంద్ర విదేశాంగ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ వి. మురళీధరన్, జాతీయ కార్యదర్శి సునీల్ డియోధర్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి , జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ తదితరులు పాల్గొననున్నారు. అయితే, మురళీధరన్, సోమువీర్రాజుల సమక్షంలో నేడు బీజేపీలో చేరనున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు. ఇప్పటికే గుంటూరు నుండి రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు తులసీ రామచంద్ర ప్రభు. కాగా, గుంటూరుకు చెందిన తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు.. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన విషయం విదితమే.. అయితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలసి పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతూ వస్తున్నారు.. మొత్తంగా ఈ రోజు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు.. రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. మరి, బీజేపీ ఆయన్ని ఏ స్థానం నుంచి బరిలోకి దించుతుందో చూడాలి. గతంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. మరోసారి అదేస్థానం నుంచి బరిలోకి దిగుతారా? అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.
టీటీడీ విజిలెన్స్ వలలో ఎమ్మెల్సీ..
సీజన్, రోజుతో సంబంధం లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎప్పూడు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. అయితే, శ్రీవారిని త్వరగా దర్శించుకొని వెళ్లిపోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు.. దానికోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి.. ఇక, తమకు ఉన్న పలుకుబడితో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా భక్తులకు దర్శనం చేయించిన సందర్భాలు లేకపోలేదు.. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్ కట్టడి చేస్తూనే ఉంటుంది.. తాజాగా, విజిలెన్స్ వలలో చిక్కారు ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ… ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తరచు శ్రీవారి దర్శనానికి వస్తుండడంతో అనుమానించిన టీటీడీ ఉన్నతాధికారులు.. దీనిపై విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.. అయితే, రంగంలోకి దిగిన విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది.. పోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్టు గుర్తించింది.. ఆరుగురి దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు సదరు భక్తులు పంపారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.. ఇక, నెల రోజుల వ్యవధిలో 19 సిఫార్సు లేఖలు జారీ చేశారట ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ.. ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మెల్సీ ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
బీజేపీతో టీడీపీ కలుస్తుందా? అచ్చెన్నాయుడు ఏం చెబుతారు..?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి లేవని ప్రజలు చెప్పాలంటూ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. మాతో ఎవరు కలిసి ఉన్నారో లేదో మేమే చెప్పాలి అన్నారు… అసలు, బీజేపీతో టీడీపీ కలుస్తుందంటే అచ్చెన్నాయుడు ఏం చెబుతారు? అంటూ ప్రశ్నించారు. ఇక, రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది.. పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.. ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త తులసీ రామచంద్ర ప్రభు.. బీజేపీలో చేరతారని తెలిపారు.. బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యే పార్టీ పెద్దల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని వెల్లడించారు.. అంతేకాదు.. త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా పెద్దఎత్తున నేతలు.. బీజేపీలో చేరుతారంటూ హాట్ కామెంట్లు చేశారు. గుంటూరులో ఈనెల 24వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు సోమువీర్రాజు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపడంలేదు..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చుతున్నారు.. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు? అంటూ నిలదీశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పారిశ్రామికవేత్త అదానీకి నొప్పి తగలకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో సీఎం జగన్ ఉన్నారంటూ మండిపడ్డారు.. జగన్మోహన్ రెడ్డి రోబో లాంటి వ్యక్తి.. ఆయనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేని వ్యక్తి అని విమర్శించారు.. రాజన్న రాజ్యం అని అధికారంలోకి వచ్చాక.. దోపిడీ రాజ్యంలా పాలన సాగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసే జరుగుతున్నాయని ఆరోపించారు సీపీఐ నారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సజ్జల వ్యాఖ్యలు దురదృష్టకరమన్న ఆయన.. బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడు.. దోపిడిదారులకు సజ్జల అధికారప్రతినిధి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కన్సర్న్ కూడా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ ఫైర్ అయ్యారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
వల్లభనేని కౌంటర్ ఎటాక్.. వెంటిలేటర్‌పై ఉంది ఎవరు..?
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించారు.. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్ జారిన.. అడుగు జారిన యదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక 150 మంది గెలిచిన పార్టీ వెంటిలేటర్ పైన ఉందో చెప్పాలి..? అంటూ డిమాండ్ చేశారు.. పోయే కాలం వచ్చిన వాళ్లు… వాళ్లు పోయారు, వీళ్లు పోయారు అంటూ అరుస్తుంటారు అని సెటైర్లు వేశారు. 74 ఏళ్లు వచ్చిన చంద్రబాబుకు పరిణితి రాలేదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వల్లభనేని వంశీ.. వాళ్లను చూసి ఆ పార్టీ నాయకులంతా మాట్లాడతారన్న ఆయన.. గన్నవరంలో ఎవరైనా పోటీ చేయొచ్చు అన్నారు.. అంతెందుకు చంద్రబాబు గానీ, లోకేష్ గానీ పోటీ చేయమని నేను చాలా సార్లు డైరక్ట్ గా చెప్పానంటూ తన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.. కాగా, కృష్ణ జిల్లా గన్నవరంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా సమర్థులైన వారిని చంద్రబాబు నియమిస్తారన్న ఆయన.. ఎవరు ఆందోళన చెందనవసరం లేదు.. ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేస్తానంటూ నా దగ్గరకు ఒక్కరు వచ్చారని చెప్పుకొచ్చారు.. పార్టీలో ఉన్నవారు వెళ్తుంటారు.. కొత్తవారు వస్తుంటారు.. సరైన, ధీటైనా వారిని మీరు మీసం మేలేసే వారిని.. ఈసారి తీసుకువస్తాం అంటూ చింతమనేని కామెంట్‌చేసిన విషయం విదితమే.
మళ్లీ పప్పులో కాలేసిన షర్మిలక్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
రాజకీయం అంటే ఆషామాషీ కదు.. అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తామంటే దొరికిపోతారు. అపరిపక్వత లేని రాజకీయ నాయకులు ఉంటే ప్రజల ముందు పరువు పోగొట్టుకోవాల్సిందే. అలాంటి కోవలోకే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన ఆదివాసీ వీరులకు సలామ్.. ఇంద్రవెల్లి పోరుగడ్డకు సలామ్ అంటూ వ్యాఖ్యనించింది. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె అన్నారు. అనంతరం వైఎస్ షర్మిల ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడారు. ఇక్కడే ఆమె పొరపాటుపడింది. ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీగా మీరు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పించండి అని షర్మిల సోయం బాపురావును కోరింది. ఆమె మాటలు విన్న ఎంపీ షాక్ అయ్యాడు. తాను గెలిచింది బీజేపీ నుంచి అయితే ఈమె ఏందీ బీఆర్ఎస్ ఎంపీని అంటోంది అని ఆలోచించి వెంటనే సోయం బాపురావు రియాక్ట్ అయ్యారు. అమ్మ నేను గెలిచింది.. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పును గ్రహించిన షర్మిల ఎంపీ సోయం బాపురావును క్షమాపణలు కోరింది. మీరు బీఆర్ఎస్ ఎంపీగా భావించా అని పొరపాటు దిద్దుకుంది. ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారందూ షర్మిల వ్యాఖ్యలకు నవ్వుకున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూంచ్ ఉగ్రదాడిలో ఏడుగురు టెర్రరిస్టుల హస్తం..
గురువారం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ ఉగ్రదాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడిలో మొత్తం 7 గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. రెండు ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు పాల్గొన్నట్లు తేలింది. పాకిస్తాన్ కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఇఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సహాయంతో ఈ ఉగ్రదాడి జరిగినట్లు శుక్రవారం రక్షణ వర్గాలు తెలిపాాయి. దాడిలో రాకెట్ ప్రొపెల్లడ్ గ్రెనేడ్స్ వాడినట్లు, డజన్ల కొద్ది బుల్లట్స్ ఫైర్ చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. జమ్మూకాశ్మీర్ రాజౌరి ప్రాంతంలో ఈ రెండు ఉగ్ర సంస్థల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కొందరు ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ఈ దాడికి ముందుగా జైషేమహ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) బాధ్యులుగా ప్రకటించుకుంది. అయితే ఈ దాడిలో లష్కరేతోయిబా ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్లు తేలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి రాజౌరీ, పూంచ్ మీదుగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారనే వార్తలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. పూంచ్-రజౌరీ ప్రాంతంలో భారత సైన్యం మృతి చెందడం ఇది నాలుగో ఘటన. సంఘటన జరిగిన ప్రాంతం భారత్-పాక్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)లోని భీంబర్ గలి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ వైపు ప్రాంతం దట్టమైన అడవులతో నిండిఉంది. కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు అడవుల్లో నక్కి దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
హైకోర్టులో గెలిచిన ఐశ్వర్యరాయ్ కూతురు
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనుమరాలు, ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో గెలిచారు. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై యూట్యూబ్ లో వచ్చిన తప్పుడు ప్రచారంపై కోర్టు సీరియస్ అయింది. ఆరాధ్యపై వచ్చిన వీడియోలను వెంటనే తొలగించాలని గూగుల్ సంస్థను కోర్టు ఆదేశించింది. అలాగే తప్పుడు వీడియోలు అప్ లోడ్ చేసిన సదరు యూట్యూబ్ ఎకౌంట్ల వివరాల్ని కూడా అందించాలని కోరింది. కొన్ని రోజుల క్రితం కొన్ని బాలీవుడ్ యూట్యూబ్ ఛానెళ్లు ఆరాధ్య బచ్చన్ పై పలు కథనాలను ప్రసారం చేశాయి. వీటిలో ఐశ్వర్య కూతురి ఆరోగ్యం బాగాలేదని చూపించాయి. మరికొన్ని యూట్యూబ్ చానెళ్లు అసలు ఆరాధ్య చనిపోయిందంటూ వీడియోలు పెట్టాయి. వీటిపై ఆగ్రహించిన అభిషేక్ తో కలిసి ఆరాధ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మైనర్ బాలికలపై వచ్చిన ఇలాంటి కథనాలు పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి కథనాలు చట్టప్రకారం సహించరానివని కోర్టు తెలిపింది. ఆరాధ్యపై ఫేక్ వార్తలు ప్రసారం చేసిన తొమ్మిది యూట్యూబ్ ఛానెళ్లను కోర్టు నిషేధించింది. ఇకపై ఆ అకౌంట్స్ నుంచి ఏ సామాజిక మాధ్యమంలో ఎలాంటి కథనాలు రావడానికి వీల్లేదని, ఛానెళ్లు నడుస్తున్నట్టు తెలిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
చోళులు వచ్చేసారు… ఈసారైనా నిలబడతారా?
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28 రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 500 కోట్లు రాబట్టింది కానీ ఆ కలెక్షన్స్ ఇండియాలోని అన్ని సెంటర్స్ నుంచి వచ్చినవి కావు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని సెంటర్స్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తమిళ కథ కావడంతో తమిళ నేటివిటీ ఉండడంతో తమిళేతర ఆడియన్స్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1కి కనెక్ట్ కాలేకపోయారు. ఈ విషయాన్ని మేకర్స్ బాగా అర్ధం చేసుకున్నట్లు ఉన్నారు అందుకే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2ని ఎక్కువగా తమిళనాడులోనే ప్రమోట్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఎదో ఒక ఈవెంట్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లు ఉంది పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ చూస్తుంటే. అసలు బజ్ క్రియేట్ చెయ్యకుండా, సైలెంట్ గా ఈవెంట్స్ మాత్రమే పెట్టి తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. మొదటి పార్ట్ కే రెండు పార్టులకి పెట్టిన డబ్బులు కూడా వచ్చేయడమే ఇందుకు ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు. అన్ని మేజర్ సెంటర్స్ లో ఒక్కో ఈవెంట్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ 2 టీం, హైదరాబాద్ కూడా వచ్చేసారు. ఈరోజు సాయంత్రం 5:30కి నోవోటెల్ హోటల్ పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి ఈ ఈవెంట్ తో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా బజ్ ని జనరేట్ చెయ్యగలుగుతారేమో చూడాలి. పొన్నియిన్ సెల్వన్ 2 తెలుగులో బజ్ జనరేట్ చెయ్యలేకపోతే మినిమమ్ ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉంటే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా నుంచి ‘మిన్నంచు వెన్నెల’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్ లపైన ఈ సాంగ్ ని డిజైన్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో విక్రమ్-ఐష్ ల లవ్ ట్రాక్ సగమే చూపించారు. చిన్నప్పుడు ప్రేమించుకున్న విక్రమ్-ఐష్ ఎందుకు విడిపోయారు? శత్రువులుగా ఎందుకు మారారు? ఐష్, విక్రమ్ ని చంపడానికి ఎందుకు ప్లాన్ చేస్తుంది? అసలు ఆమె కథ ఏంటి? అరుణ్ మొలిని కాపాడిన కావేరి ఎవరు? ఆమె ఐశ్వర్య లాగే ఎందుకు ఉంది? అనే ప్రశ్నలకి సమాధానం పార్ట్ 2లో ఎలా రివీల్ చేస్తారు అనేది చూడాలి.