NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో కీలక అంశాలు.. ఇది కుట్ర..! ఆ విషయం తెలిసే హత్య..!
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీబీఐ.. మరోసారి ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాయలంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.. అయితే, ఈ లోగా హైకోర్టును ఆశ్రయించారు అవినాష్‌రెడ్డి.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. ఇక, ముందస్తు బెయిల్ పిటిషన్ లో కీలక అంశాలను ప్రస్తావించారు అవినాష్‌రెడ్డి.. వైఎస్‌ వివేకా హత్యతో నాకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్‌ వివేకా కూతురు సునీత.. సీబీఐ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేతతో కలిసి కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. సునీతకు వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా అనుకూలంగా వ్యవహరించినందుకే సునీత కక్ష గట్టిందన్నారు.. వివేకానందరెడ్డి తన రెండో భార్య కొడుకుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సీట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.. అంతే కాకుండా స్కూల్‌ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు.. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్లాన్‌ కూడా చేశారు.. అయితే, ఇదంతా సునీతకు తెలిసి.. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేశారని తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి..

వైసీపీ నేతలకు పవన్‌ వార్నింగ్‌..
వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ నేతలు, మంత్రులు తెలంగాణ ప్రజలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ మంత్రి ఒకరు (హరీష్ రావు) ఏపీకి సంబంధించిన కామెంట్లు చేశారు.. కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం అభ్యంతరకరం అన్నారు. ఒక జాతిని అవమానిస్తుంటే వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అని మండిపడ్డారు.. మొన్నటి వరకు తెలంగాణలో కేబుల్ వ్యాపారం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వారు ఈ విషయం మీద ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. నేను ఆది నుంచి చెబుతున్నాను.. ఎప్పుడైనా ప్రజలు, పాలకులు వేరు.. కానీ, ఇలాంటి వివాదాల్లోకి ప్రజలను, జాతిని లాగడం సరికాదన్నారు.. ఎవరైనా కామెంట్లు చేస్తే.. వ్యక్తిగతం చేసుకునేది ఉంటే చేసుకొండి.. కానీ, ప్రజలను మాత్రం లాగొద్దు అని విజ్ఞప్తి చేశారు పవన్‌ కల్యాణ్.

స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఈ రోజు రేట్లు ఇలా..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 61 వేల మార్క్‌లో గోల్డ్‌ రేట్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55 వేల 940 రూపాయలుగా ఉంది గోల్డ్‌ రేట్‌. ఇక కిలో వెండి ధర 78వేల 5 వందలుగా ఉంది. ఈ రోజు దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,090గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,180గా ఉండగా.. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,940గా.. 24 క్యారెట్ల గోల్డ్​ రేటు రూ. 61,030గా ఉంది. ఇక, చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,500గా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా కొనసాగుతోంది.. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,990గాను.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,080 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.

నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది?
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా నిర్వహించే సమావేశాలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడంలేదు. ఇక.. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. అనిల్ కుమార్‌కు బాబాయ్ వరుసయ్యే రూప్ కుమార్ యాదవ్ ఆయనతో విభేదించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలిపై మంత్రి కాకాణి.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లిపురం వద్ద అనిల్ అనుచరుడు లే ఔట్ వేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం కూడా అందులో కలిపేశారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనిల్ మద్దతిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు అంబాపురం వద్ద ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ విషయంలో అనిల్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని దళిత సంఘాలు విమర్శలు చేశాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనతో సంప్రదించకుండానే రూరల్ వ్యవహారాల్లో అనిల్ జోక్యం చేసుకుంటుండటం ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. అనిల్ వ్యవహారశైలిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాణి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

2024 ఎన్నికల తర్వాత బాబు, లోకేష్ తోకలు కట్ చేస్తాం
2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తాం అంటూ వార్నింగ్‌ ఇచ్చారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మేరకు దోషులకు శిక్ష పడుతుందన్నారు.. కానీ, దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు.. ఇక, నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్‌ జగన్ పై విమర్శలు చేయాలంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ర్టానికి రాజధాని సమస్య ఏర్పడిందని విమర్శించారు. మరోవైపు టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి భాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పైరవీలకు చెక్ పడిందన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టిటిడి నిర్ణయాలు తీసుకుంటుందంటూ ప్రశంసలు కురిపించారు.. అటు సామాన్యలుకు.. ఇటు వీఐపీలకు ఇబ్బంది లేకుండా ధర్మారెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కానీ, కొంతమందికి అసౌకర్యం కలిగినంత మాత్రాన.. టీటీడీపై విమర్శలు చేయడం తగదన్నారు.. ఇక, పల్నాడులో రాజకీయం ఎప్పుడు హీట్‌గా ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే రాబోవు ఎన్నికల్లో జిల్లాలోని 7కి ఏడు సీట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

అలిగిన ఆడబిడ్డను కుటుంబంతో కలిపిన ‘బలగం’
దశాబ్దాల తర్వాత కుటుంబ సభ్యులు కలిసి చూసే సినిమా వచ్చింది. అందుకే పంచాయతీ ఆఫీసులో, ఊరి నడిబొడ్డున సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మరి కొందరు సర్పంచులు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపిస్తున్నారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలం ఇంటిల్లిపాదీ అలరిస్తోంది. బంధాలను పంచుకునే ఈ చిత్రం విడిపోయిన కుటుంబాలను ఒకచోట చేర్చింది. బలగం సినిమా కుటుంబ సంబంధాలపై బలమైన ప్రభావం చూపుతుంది. విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నాయి.. కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. మండల పరిధి వనపర్తిలో ఇటీవల ప్రదర్శింపబడిన ‘బలగం’ చిత్రం విడిపోయిన అక్కా, తమ్ముళ్ల కుటుంబాలను కలిచివేసింది. అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో వివాహమైంది. రెండు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మి ఫోటో తీయకపోవడంతో తిండి మానేసింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి చనిపోయాడు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో లింగారెడ్డి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో భార్య వసంత, కుమారుడు శ్రీకాంత్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లారు. అయినా కూడా ఇరు కుటుంబాల మధ్య సఖ్యత లేదు. ఇటీవల సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో బలం చిత్రం ప్రదర్శించారు. ఆ సినిమా చూసి లింగారెడ్డి, లక్ష్మిల గుండెలు మారిపోయాయి. లింగారెడ్డి తన అక్క లక్ష్మి ఇంటికి ఈ నెల 15న సర్పంచ్ శ్రీధర్, గ్రామస్తులు మహేష్, రవీందర్ రెడ్డి సమక్షంలో వెళ్లాడు. ఇద్దరి కుటుంబాలు కలిసి మాట్లాడుతూ ఒకరొనొకరు కన్నీరుమున్నీరయ్యారు. ఇన్ని సంవత్సరాలు కళ్లముందే వున్నా పలకరించుకోలేని వీరు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకుంటూ సరదాగా గడపారు. వీరిద్దరి కుటుంబాలు కలవడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు.

స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం.. ఇది కోర్టుల పని కాదని సూచన..
కేంద్ర మరోసారి స్వలింగ వివాహాలను వ్యతిరేకించింది. ఈ వివాహాలకు చట్టపరమైన అనుమతిని మంజూరు చేయడాన్ని కేంద్రం ఈ రోజు మరోసారి వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణించాలనేది ప్రతీ పౌరుడి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ‘‘పట్టణ ఉన్నతవర్గం’’ దృక్పథాన్ని ప్రతిబింబించేదిగా పేర్కొంటూ, వివాహాన్ని గుర్తించడం తప్పనిసరిగా చట్టబద్ధమైన విధి అని, దీనిని కోర్టులు నిర్ణయించడం మానుకోవాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు సంబంధించి చట్టబద్ధమైన ధ్రువీకరణను కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను తెలియజేసింది. గ్రామీణ, పట్టణ జనాభా విస్తృత అభిప్రాయాలను, వారి వ్యక్తిగత చట్టాలు, వివాహ వ్యవస్థను నియంత్రించే ఆచారాలను దృష్టిలో ఉంచుకుని మతపరమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ చట్టాలు చేస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. వివాహం అనేది సామాజిక చట్టపరమైన సంస్థ అని పేర్కొంటూ..భారత రాజ్యాంగంలోని ఆర్టికట్ 246 ప్రకారం పార్లమెంట్ ద్వారా మాత్రమే ఇది గుర్తించబడుతుందని, చట్టపరమైన గుర్తింపు ఇస్తుందని కేంద్రం తెలిపింది. హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లో వివాహం అనేది కేవలం పురుషుడు, స్త్రీ మధ్య జరిగే ఓ ప్రక్రియ మాత్రమే అని కేంద్రం పేర్కొంది.

అతిక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని…
గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జ్యూడీషియల్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై కూడా సీబీఐ చేత దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ కోరారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, చట్ట పాలలనకు తీవ్రమైన ముప్పు అని, ఇది పోలీస్ రాజ్యం, అరాచకాలకు దారి తీస్తుందని, శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుందని, పోలీసులు డేర్ డెవిల్స్ గా మారినప్పుడు న్యాయవ్యవస్థకు కుప్పకూలే ప్రమాదం ఉందని పిటషన్ లో పేర్కొన్నాడు. జీవించే హక్కు, స్వేచ్ఛను ఉల్లంఘించడం, ప్రజాప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నందు వల్ల ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరాడు. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఒక వ్యక్తిని హత్యచేయడం పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నాడు పిటిషనర్.

తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా..
వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2017-18లో.. అంటే.. ఐదేళ్ల కిందట వ్యవసాయ ఎగుమతుల విలువ 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. అవి ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా పత్తి, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, కాఫీ, టీ మరియు మాంసం ఎగుమతి చేస్తోంది. సాగుకు సంబంధించి తెలంగాణ రైతులు సరికొత్త విధానాలను అవలంభిస్తుండటం, టెక్నాలజీని వాడుతుండటం, పంట దిగుబడుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ వసతులు ఉండటం చెప్పుకోదగ్గ అంశాలని నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయినా అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించటం ద్వారా వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నిజామాబాద్‌కి చెందిన ఒక పండ్ల ఎగుమతిదారుడు పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021-22వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 వేల 55 కోట్ల రూపాయల విలువైన పత్తి ఎగుమతులు జరిగాయి.

సలార్‌‌ నుంచి సాలిడ్ సర్ ప్రైజ్.. రెండు పార్టులుగా సినిమా
ప్రభాస్ అతివల కలల రాకుమారుడు. బాహుబలి సినిమాతో తన రేంజును అమాంతం పెంచేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. రాధేశ్యామ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ సిల్వర్ స్ర్కీన్ పై కనిపించి చాలా కాలం అవుతోంది. గత చిత్రాలతో నిరాశ పరిచిన ప్రభాస్ చేతినిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటిలో ముందుగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెలాఖరు నుంచి చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సలార్‌‌ సినిమాపై ప్రభాస్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. బాహుబలి, కేజీఎఫ్ మాదిరిగా ఈ చిత్రం రెండు భాగాల్లో తెరపైకి రానుంది. చిత్ర బృందం దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సలార్ లో కీలక పాత్ర చేస్తున్న కన్నడ నటుడు దేవరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. సలార్ లో ప్రభాస్‌ రెండు పాత్రలు చేస్తున్నారు. అందులో ఒకటి నెగిటివ్‌ షేడ్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. దేవా అనే పవర్‌‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌‌గా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం. మొదటి భాగంలో కంటే రెండో పార్ట్‌లో ప్రభాస్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేజీఎఫ్ లోనూ ప్రశాంత్ నీల్.. యష్ ను నెగిటివ్‌ క్యారెక్టర్‌‌లోనే చూపెట్టి సక్సెస్ అయ్యారు. గతంలో ప్రభాస్ ‘బిల్లా’ చిత్రంలో నెగెటివ్ షెడ్స్ ఉన్న పాత్ర చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అలాంటి పాత్ర చేస్తున్నారని తెలియగానే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

Show comments