NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

తెలంగాణ ప్రభుత్వం చొరవ అభినందనీయం.. అప్పుడే స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యం
స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.. రాజకీయాలకు అతీతంగా స్టీల్ పరిరక్షణ పోరాటం సాగించాల్సిందేనని పిలుపునిచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ.. కాగా, గతంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్‌ చేసిన విషయం విదితమే.. “సింగరేణికి చెందిన ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయాలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి” అంటూ ట్వీట్‌ చేసిన విషయం విదితమే.

ముగిసిన విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్ర..
విశాఖ ఉక్కు పోరాటం ఉధృతం అవుతోంది.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.. కార్మికుల పోరాటానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచియి.. ఇక, ఇవాళ విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్ర నిర్వహించింది.. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం ఆలయం వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటలకు సింహాచంలో ముగిసింది.. తొలిపావంచ దగ్గర సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం సమర్పించారు జేఏసీ నేతలు.. అదరవొద్దు.. బెదరవొద్దు.. ఉక్కు సంకల్పం వీడవొద్దని ఈ సందర్భంగా కార్మికుల నినాదాలు చేశారు. మరోవైపు విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్రలో పాల్గొన్న మాజీ ఐపీఎస్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో భాగస్వామ్యం అవుతున్నాం.. జనం తరపున మూడు గంటలకు నేను బీడ్ వేస్తున్నాను అని ప్రకటించారు.. ఇక, ఈ రోజు జరిగిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందు చూపిస్తాం అని హెచ్చరించారు. ప్రైవేటీకరణ మీ విధానం అయితే.. ప్రజలు ఎలా తిప్పికొడతారో చూపిస్తాం అంటూ వార్నింగ్‌ ఇచ్చారు లక్ష్మీనారాయణ.

టీటీడీ పేరుతో 40 ఫేక్‌ వెబ్‌సైట్లు.. నమ్మారా అంతే సంగతులు
కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొలువు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఇక, ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు, శ్రీవారికి నిర్వహించే వివిధ సేవలు, ప్రత్యేక పూజలు, గదుల బుకింగ్‌ ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే పెడుతున్నారు.. ఈ కోటాకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొత్తం కోటా బుకింగ్‌ పూర్తి అవుతుంది.. అయితే, ఇదే సమయంలో టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు హల్‌చల్‌ చేస్తున్నాయట.. టీటీడీ పేరుతో భక్తులను మోసం చేస్తున్న 40 వెబ్‌సైట్లను టీటీడీ గుర్తించింది.. ఆ 40 వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ ఐటీ జీఎం సందీప్‌ రెడ్డి.. దర్శన టికెట్లు, వసతి గదుల కేటాయింపు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ భక్తులను ఆ వెబ్‌సైట్ల మోసం చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చిన టీటీడీ.. వాటిపై చర్యలకు పూనుకుంది.. ఆయా ఫేక్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు భక్తులను, ప్రజలను మోసం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ 40 వెబ్‌సైట్లు చేస్తున్న మోసాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో తాజాగా, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే కాగా.. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.. అంతా అతని సైగల్లోనే, కనుసన్నల్లోనే జరిగాయంటూ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని సీబీఐ అభియోగాలు మోపుతోంది.. వైఎస్‌ వివేకా హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి.. వైఎస్‌ వివేకా ఇంటికి వెళ్లారని సీబీఐ చెబుతోంది.. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరూ వైఎస్‌ వివేకా ఇంట్లో ఉన్నట్లు తేలింది.. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేక మృతదేహానికి ఉదయ్‌ కుట్లు వేయించారు.. అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు.. వివేక చనిపోయాడు అని తెలిసే వరకు ఇంట్లోనే ఉన్నారని ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌ పేర్కొన్నట్టు సీబీఐ వెల్లడించింది. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని పేర్కొన్న సీబీఐ.. బాత్‌రూమ్‌ నుండి వైఎస్‌ వివేకా డెడ్ బాడీని బెడ్ రూమ్ కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని తెలిపింది.. అయితే, వివేక తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. అందులో భాగంగానే ఉదయ్‌ కుమార్‌ రెడ్డి.. తన తండ్రి అయిన ప్రకాష్‌రెడ్డితో వైఎస్‌ వివేకానందరెడ్డి తలకు కుట్లు వేయించినట్టు తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది సీబీఐ. వివేకానంద రెడ్డి గుండెపోటు అనే చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని.. గాయాలు కనపడకుండా ఉండేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని సంప్రదించి కుట్లు వేయించారని తెలిపింది.. చనిపోయిన వివేకా తలకు ప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ వేశాడు.. పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించినా తమ సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. పారిపోతాడనేటువంటి అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశామని.. ఇంకా ఈ కేసులో విచారణ జరుగుతుంది.. మరి కొంతమందిని కూడా అరెస్టు చేస్తామని చెబుతున్నారు సీబీఐ అధికారులు. దీంతో, ఇప్పటికే చాలా మందిని విచారించిన సీబీఐ.. ఇంకా ఎవరిని అరెస్ట్‌ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

లిక్విడ్‌ వేస్ట్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ జవహర్‌నగర్‌లోని డంప్‌యార్డుకు తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెత్తాచెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది. భూగర్భ జలాలు, చెరువులు కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నిర్వహణలో జీహెచ్‌ఎంసీ ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జీహెచ్‌ఎంసీ జవహర్‌నగర్‌లో లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. 2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2 వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు 4 వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటికే వృథా నీటితో నిండిన మలారం చెరువులో దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అంతేకాకుండా ఈ చెరువులోని వృథా నీరు పొంగిపోకుండా దాదాపు 4 కోట్ల 35 లక్షలతో తుపాను నీటి మళ్లింపు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్‌నగర్‌ డంప్‌యార్డు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ 2020 నాటికి క్యాపింగ్‌ పనులను పూర్తి చేసింది.

తమిళనాడులో దారుణం.. పరువు హత్యకు కొడుకు, అత్త బలి
ఈ రోజుల్లో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫ్రికా అమ్మాయిలను కోడలిగా తెస్తున్నారు. ఇలాంటి సమాజంలోనూ నేటికీ పరువు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తమకన్నా తక్కువ డబ్బు ఉన్న వారిని పెళ్లి చేసుకున్నాడని… తక్కువ కులం వారిని వివాహం చేసుకుందని.. కన్నవారిని చంపుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకొందరేమో తమ బిడ్డను ప్రేమించిన వారిని హత్య చేస్తున్నారు. తమ కుటుంబానికి సరితూగరని.. ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది ఇతర కులాల వారిని, మతాల వారిని ప్రేమించిన పాపానికి ప్రేమికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటన ఒకటి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగుచూసింది. ఈ పరువు హత్యకు కొడుకు, అత్త బలయ్యారు.

కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర తన తండ్రికి కంచుకోట అయిన షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి కాళ్లు తాకుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షికారిపుర నుంచి నామినేషన్‌ దాఖలు చేసేందుకు మూడు రోజుల ముందు విజయేంద్ర యెడియూరులోని సిద్ధలింగేశ్వర ఆలయానికి వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటకలో ప్రముఖ షెడ్యూల్డ్ కులాల నేత అయిన పరమేశ్వర విజయేంద్ర అక్కడ ఉండటంతో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నో ఊహాగానాలు, డ్రామాల తర్వాత బీజేపీ షికారిపుర నుంచి విజయేంద్రను బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయగా, కేంద్ర నాయకత్వం అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. యడ్యూరప్ప కూడా సిద్ధరామయ్యపై తన కుమారుడు పోటీ చేసే అవకాశాలను తోసిపుచ్చారు. 1983 నుంచి యడ్యూరప్ప ఏడుసార్లు విజయం సాధించడంతో షికారిపుర బీజేపీకి సేఫ్ సీటుగా భావిస్తున్నారు. అయితే టికెట్ ఆశించిన కొందరు స్థానిక నేతల నుంచి విజయేంద్రకు కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.

విమానాశ్రయం మూసేస్తే వ్యాపారం ఎట్లా?. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొత్త చిక్కు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెల 10వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తుంటారు. పొలిటికల్‌గా ఓటర్లను ప్రభావితం చేసే ఏ నిర్మాణాలు కూడా బయటికి కనిపించటానికి వీల్లేకుండా కవర్ చేస్తుంటారు. ఈ రూల్సే ఇప్పుడు శివమొగ్గ జిల్లా రిటర్నింగ్ అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఎందుకంటే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సోగేన్ అనే ప్రాంతంలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. ఆ విమానాశ్రయం అధికార భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలాన్ని పోలి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్‌పోర్ట్‌ని పూర్తిగా కప్పేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శివమొగ్గ జిల్లా రిటర్నింగ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. లోటస్ ఆకారంలోని టెర్మినల్‌తో 775 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించారు. ఈ టెర్మినల్ నిర్మాణం కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గంటకు 300 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ప్యాసింజర్ టెర్మినల్‌లి తీర్చిదిద్దారు.

టీ-హబ్.. సూపర్బ్. సాంకేతిక రంగంలో సాటిలేనిది
టీ-హబ్ అంటే టెక్నాలజీ హబ్. కానీ.. చాలా మంది తెలంగాణ హబ్ అనుకుంటారు. ఆ రేంజ్‌లో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది. తాజాగా.. టీ-హబ్‌ని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మెచ్చుకున్నారు. ఈ వినూత్న కేంద్రం.. సాంకేతిక రంగంలో సాటిలేని ఒక అద్భుతమని అభివర్ణించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ-హబ్‌ని ఆదిత్య ఠాక్రే మంగళవారం సందర్శించారు. ఆ సమయంలో ఆయన వెంట తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు. టీ-హబ్ పక్కనే ఉన్న టీ వర్క్స్ మరియు ఇమేజ్ టవర్స్ గురించి మంత్రి కేటీఆర్.. ఆదిత్య ఠాక్రేకి వివరించారు. టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీల నిర్వహణ, ఆవిష్కరణల గురించి కూడా చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే టీ-హబ్‌ని ఏర్పాటుచేశామని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ స్టార్టప్‌లను ఎంకరేజ్ చేసేందుకు ఇలాంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయటం అభినందించాల్సిన విషయమన్నారు. ఆలోచనతో రండి.. ఆవిష్కరణతో వెళ్లండి.. అనే స్లోగన్‌తో పని చేస్తున్న టీ-హబ్.. స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, ఇంకుబేటర్స్, యాక్సెలరేటర్స్‌కి కమ్యూనిటీ స్పేస్‌లాగ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

చిక్కుల్లో ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్
ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ 22బెట్ ఇండియాకు అతను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటననలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్ లో రిజిస్టర్ అయిన బెట్ 22తో గత నవంబర్ లో మెకల్లమ్ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ( ఈసీబీ ) దీనిపై ఫోకస్ పెట్టింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్ లో పాల్గొనడం.. పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు.. టీమ్ హెడ్ కోచ్ గా మెకల్లమ్ కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్ లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో 22బెట్ ఇండియాపై ఆ దేశం నిషేదం విధించింది కూడా.. ఆ దేశానికి చెందిన ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్ గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టు మ్యాచ్ లు గెలిచింది. మరి ఈసీబీ ఈ అంశంపై అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మెకల్లమ్ పై చర్యలు తీసుకుంటే ఇంగ్లండ్ టెస్ట్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన యాషిస్ సిరీస్ ముందు మెకల్లమ్ పై వేటు వేస్తే ఇంగ్లండ్ టీమ్ పరిస్థితి ఏంటీ అనేది ప్రశ్నార్థకం కానుంది.

ఇదేం సైకిల్ రా బాబు.. దీన్ని ఎలా తొక్కడం
సైకిల్ అంటే ఎలా ఉంటుంది.. రెండు పెద్ద చక్రాలు.. వాటిని అటాస్ చేస్తూ ఫ్రేమ్-చైన్ అంతేకదా.. మనకు తెలిసిన సైకిల్.. సైకిల్ అనే కాదు.. ఏ వాహనానికైనా ఇంచుమించు గుండ్రని టైర్లు, చక్రాలు అలాగే ఉంటాయి. అలా కాకుండా సైకిల్ కు చతురస్రాకారంలో ఉండే టైర్లు ఉంటే.. అలా సింపుల్ గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే.. అదెలా సాధ్యమనిపిస్తోంది కాదా.. అయితే రష్యాకు చెందిన ది క్యూ సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీన్ మాత్రం దీనిని చేసి చూపించాడు. చతురాస్రాకారంలో టైర్లను రూపొందించి.. సాధారణ సైకిల్ ఫ్రేమ్ కు అమర్చి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యుద్ద ట్యాంకుల చక్రాల్లో వాడే టెక్నాలజీని స్వ్యేర్ టైర్ సైకిల్ లో వినియోగించారు. సింపుల్ గా.. చెప్పాలంటే.. ఇందులో చక్రాలు మొత్తానికి మొత్తంగా తిరగవు.. జస్ట్ వాటి అంచున ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బెల్ట్ మాత్రమే కదులుతుంది. అలాగే స్వ్యేర్ వీల్ చతురస్రాకారపు వీల్స్ కదలకుండా అలాగే ఉంటాయి.