NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!
చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నుంచి కీలక నేతలు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎం సుబ్రమణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైసీపీలో చేరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యనేత సీఎం వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ సీనియర్‌ నేత, 2019లో టీడీపీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ.. అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ అన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.

జనసేనను వదలని సింబల్ టెన్షన్.. ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్
జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమకు సింబల్ టెన్షన్ ఏం లేదని జనసేన నేతలు అంటున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే తరహాలో ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుందని జనసేన పేర్కొనింది. తెలంగాణలోనూ ఇదే తరహా లొల్లి పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసును తమకే కేటాయించామని కేంద్ర ఎన్నుకల సంఘాన్ని కోరతామని జనసైనికులు అంటున్నారు.

సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!
మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని భావించిన ఈసీ.. ఆంక్షలు విధించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసే బదులుగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాల‌ని నిర్ణయించారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. నేడు మొదటి రోజు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వచ్చారు. ఉదయం నుంచి సచివాలయాల వద్ద పెన్షనర్స్ బారులు తీరారు. అయితే డబ్బు లేకపోవడంతో పెన్షన్ల పంపిణీ ఇంకా ఆరంభం కాలేదు. సచివాలయాల సిబ్బంది డబ్బు డ్రా చేయడం కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు నుంచి సచివాలయం వరకు డబ్బు తరలించే క్రమంలో ఇబ్బందులు లేకుండా ఆర్వోల వద్ద పర్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో పెన్షన్లు పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మండుటెండలో వృద్ధులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని ముందే చెప్పాము..
గత ఎన్నికల సమయంలో కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని చెప్పామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీళ్ల కోసం తల్లడిల్లి పోతున్నారని తెలిపారు. హైదరాబాద్ లో నీటి కోసం యుద్ధాలు మొదలు అయ్యాయన్నారు. ఈ అసమర్థ సీఎం దన వనరులు ఢిల్లీ తరిలించే ప్రయత్నం తప్ప జల వనరులు తెచ్చే ప్రయత్నం చేయట్లేదన్నారు. మేము 38 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టినామన్నారు. దాని నిర్వహణ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేక పోతుందన్నారు. ఒక అసమర్థ ముఖ్యమంత్రి డబ్బు తరలింపు గురించి పట్టించుకోడు, నీటి వనరులను తరలించడం గురించి కాదు. సాగునీరు లేక తాగునీరు లేక గ్రామీణ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రెట్లు చెల్లించి ట్యాంకర్లను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం కష్టాలు మొదలయ్యాయి.

టాం అండ్ జెర్రీ ఫైట్ లా ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహారం..!
కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలి టాం అండ్ జెర్రీ ఫైట్ లా కనిపిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు చివరిలో కలిసిపోతాయన్నారు. ఈ రెండు పార్టీ లు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వస్తున్న అంశాలు దిగ్భ్రాంతి నీ కలిగిస్తున్నాయన్నారు. అసలు దోషులను కాపాడే ప్రయత్నం రేవంత్ సర్కారు చేస్తుందన్నారు. మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తుందన్నారు. దేశభద్రత, వ్యక్తి గత భద్రత కు భంగం కలిగించేలా పోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందన్నారు. రియల్ ఎస్టేట్, నగల వ్యాపారులను దోచుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించారని తెలిపారు. రేవంత్ రెడ్డి కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సూత్ర దారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన మధ్య సీట్ల పంచాయితీ.. ఇంకా కుదరని లెక్క
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(శిండే)ల మధ్య సీట్ల పంపకాలపై పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు టాక్. ఇరు వర్గాలు నాయకులు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం కొనసాగుతుంది. దీంతో బీజేపీ, షిండే వర్గాలకి చెందిన శివసేన నాయకులు ఆందోళన పడుతున్నారు. సీట్ల పంపకంపై ఇరుపార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాలకు గాను బీజేపీ 29, శివసేన 13, ఎన్సీపీ(అజిత్ పవార్) 6 స్థానాల్లో బరిలోకి దిగుతాయని భావించాయి. అయితే, షిండే వర్గం 22 సీట్లు కావాలని డిమాండ్ చేశారు. కానీ, చర్చల తర్వాత ఈ ప్రతిపాదనకు ఏక్ నాథ్ షిండే ఒప్పుకున్నారని బీజేపీ నేతలు తెలిపారు. అయితే, ఇప్పటికీ ఫైనల్ లిస్టు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, శివసేన (షిండే)ల మధ్య వాగ్వాదంతో ఏక్ నాథ్ షిండే వర్గంలోని సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కానీ, అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఇంకా సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవడంతో షిండే వర్గంలోని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బ‌రువు త‌గ్గిన ఢిల్లీ సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగ్గా లేనట్లు తెలుస్తుంది. ఆయ‌న 4.5 కేజీల బ‌రువు త‌గ్గిపోయారు. మార్చి 21వ తేదీన ఆయ‌నను లిక్కర్ స్కామ్ కేసులో కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులోని రెండ‌వ సెల్‌లో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ బ‌రువు త‌గ్గిన‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ జైలు అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేద‌ని పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు కేజ్రీవాల్ జుడిషియ‌ల్ రిమాండ్ లో ఉండనున్నారు. కాగా, 14 X 8 ఫీట్ల వెడ‌ల్పు ఉన్న తీహార్ జైలులోని సెల్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను బంధించారు. అయితే, బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా పెరుగుతున్నట్లు జైలు డాక్టర్లు వెల్లడించారు. ఓ ద‌శ‌లో 50 క‌న్నా త‌క్కువ షుగ‌ర్ న‌మోదు అయిన‌ట్లు నివేదికలో తెలిపారు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచేందుకు మెడిసిన్స్ ఇస్తున్నట్లు వైద్యులు చెప్పారు. లంచ్‌, డిన్నర్ కోసం ఆయనకు ఇంటి భోజనం పెడుతున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ కండీష‌న్‌ను డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ‌ర్జెన్సీ కోసం ఆయ‌న సెల్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ తర్వాత ఐటీ శాఖ పరిధిలో మరో రెండు పార్టీలు
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. తన బ్యాంకు ఖాతాలన్నింటినీ సీజ్ చేసి, ఎన్నికల ప్రచారానికి డబ్బును ఉపయోగించకుండా చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయనందుకు పార్టీకి రూ.3567 కోట్ల నోటీసులు అందాయి. కాంగ్రెస్ తర్వాత, మరో రెండు రాజకీయ పార్టీలు ఆదాయపు పన్ను శాఖ రాడార్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటికీ నోటీసులు జారీ చేసేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. సహకార బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.380 కోట్లకు సంబంధించి ఈ రెండు పార్టీలపై విచారణ జరుగుతోంది. ఈ విషయం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినది. 2020-21, 2022 ఆర్థిక సంవత్సరాల్లో సహకార బ్యాంకుల్లో రూ.380 కోట్లు డిపాజిట్ చేసి పన్ను రిటర్నులు దాఖలు చేయలేదని వారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు పక్షాలపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించింది మరియు త్వరలో ఈ విషయంలో నోటీసు కూడా జారీ చేయబడుతుంది. సహకార బ్యాంకుల్లో ఇరువర్గాలు డిపాజిట్ చేసిన మొత్తాల్లో కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించామని.. అందుకే వీటిని పరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలు చేసిన డిపాజిట్లపై కూడా శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ రెండు పార్టీల పేర్లు బయటపెట్టలేదు కానీ.. ఈ పార్టీలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సంబంధం ఉన్నట్లు మాత్రం కచ్చితంగా తేలింది.

ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోతో హీరోయిన్ ప్రేమ పెళ్లి..!
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బెస్ట్ మూవీతో కాలీవుడ్ లోకి సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా నటించి మెప్పించింది. ఇకపోతే గత సంవత్సరం తమిళంలో విడుదలైన ‘దాదా’ సినిమతో బిగ్గెస్ట్ కమర్షియల్ సాధించింది అపర్ణ దాస్. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ఈమెను చేసుకోబోయే వ్యక్తి గురించి చూస్తే.. మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒక‌రిగా నటించిన దీప‌క్ ప‌రంబోల్‌ను అప‌ర్ణ‌దాస్ పెళ్లాడ‌నున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ సినిమాలో సుధి పాత్ర‌లో దీప‌క్ న‌టించారు. దీప‌క్‌, అప‌ర్ణ‌దాస్ లు గత కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరూ పెద్ద‌ల అంగీకారంతో త్వరలో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్లు సమాచారం అందుతోంది. కేర‌ళ‌లోని వ‌డ‌క్క‌చేరిలో ఏప్రిల్ 24న అప‌ర్ణ‌దాస్‌, దీప‌క్ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments