టీటీడీ కీలక నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి సర్కారు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆదేశాలతో టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేశారు. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఈవో చర్యలు చేపట్టారు.
వకుళామాత వంటశాల ప్రారంభం.. తిరుమలపై సీఎం చంద్రబాబు సమీక్ష
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు పర్యటించారు. వకులామాత అన్నప్రసాద వంటశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వంటశాలను పరిశీలించి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అంతకు ముందు టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని…ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు.భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు.. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి…మరింత మెరుగుపడాలన్నారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి.. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలన్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలన్న ఆయన.. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని చెప్పారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదన్నారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. తిరుమల పేరు తలిస్తే.. ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి.. ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి సమీక్షలో సూచించారు.
నిజామాబాద్ లో విషాదం.. బెట్టింగ్ కు బానిసై కుటుంబంతో సహా ఆత్మహత్య..
ఆన్‌లైన్ బెట్టింగ్ పుణ్యమా అని ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. దీనివల్ల కొన్ని కుటుంబాలు సర్వ నాశసనం అయ్యాయి. అయినా.. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తూ హెచ్చరిస్తున్నా, సన్నిహితులు వారిస్తున్నా కొందరు మాత్రం బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తీసుకున్న అప్పులు మళ్లీ తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, అప్పు తీర్చలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వడ్డే పల్లిలో గ్రామంలో సురేష్ ఆయన భార్య హేమలత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీష్ అనే కొడుకు వున్నాడు. అయితే హరీష్ తల్లిదండ్రులకు అండగా వుండాల్సిపోయి వారిని పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ లోనే గడిపేవాడు. అయినా తల్లిదండ్రులు ఎప్పుడు మందలించలేదు. ఇదే అదునుగా భావించిన హరీష్ రాను రాను ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. అందులో డబ్బులు పెడుతూ వచ్చాడు. అలా వందలు, వేలు కాదు ఏకంగా లక్షల్లో బెట్టింగులు కాయడం మొదలు పెట్టాడు. ఈవిషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఎంతవరకు బెట్టింగులకు అప్పులు చేశావని కొడుకును అడిగారు. సుమారు రూ.30 లక్షల వరకు అని హరీష్ చెప్పడంతో తల్లిదండ్రుల గుండె ఆగిపోయింది. కొడుకును మందలించిన అప్పు తీర్చాల్సిందేనని.. జీవనోపాధిగా వున్న పొలాన్ని అమ్మారు. అయినా అప్పు తీరకపోవడంతో ఏం చేయాలో కుటుంబానికి అర్థం కాలేదు. ఇంకా వున్న అప్పు ఎలా తీర్చాలి అనే ప్రశ్న ఎదురైంది. ఇక చేసేది ఏమీలేక చావే దిక్కని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఇంట్లో ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు అప్పు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. కొడుకు కోసం కుటుంబం మొత్తం ఉరితాడుకు వేలాడింది అంటూ కన్నీటి పర్వతం అయ్యారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్‌గిరిగుట్ట, దుండిగల్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అదేవిధంగా మేడ్చల్, కృష్ణాపూర్, కండ్లకోయలో వర్షం కురుస్తోంది. నగరమంతా మేఘావృతమై ఉంది. ఇక రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొండమల్లేపల్లిలో 6.84 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా చందంపేటలో 5.91, నిడమనూరులో 4.45, గుండ్లపల్లిలో 4.98, పెద్దఅడిసర్లపల్లిలో 3.87, నాగర్‌కర్నూల్ జిల్లా పదరలో 4.19, ఉప్పనూటలో 4.16, రంగూరు జిల్లా మాడ్గులులో 3.88 సెం.మీ. 4.05 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది.
ఉగ్రదాడి కేసులో దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ 22 చోట్ల దాడులు
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సానుబుతిపరులపై దర్యాప్తు భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) శనివారం 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీలో దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాలెగావ్ లోని హోమియోపతి క్లినిక్‌పై ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, కుట్రకు సంబంధించిన ప్రధాన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా విస్తృత దాడులు ప్రారంభించింది. RC-13/24/NIA/DLI కేసు కింద ఈ చర్య తీసుకోబడింది. దింతో దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ నెట్‌వర్క్ లక్ష్యంగా చేసుకొని 5 రాష్ట్రాల్లోని 22 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జైష్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఇంత సమగ్ర చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ జమ్మూ కాశ్మీర్ వెలుపల కూడా విస్తరిస్తోంది. ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలోని ముస్తఫాబాద్‌లో ఎన్‌ఐఏ అర్థరాత్రి దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో ఎన్‌ఐఏతో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. సోదాల్లో అనుమానాస్పద వస్తువులు లభించినట్లు సమాచారం అందుతోంది. అధికారులు కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఇద్దరినీ మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి రాత్రంతా కొనసాగి తెల్లవారుజామున ముగిసింది.
24 గంటల్లోగా డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్ష.. ప్రభుత్వానికి డాక్టర్లు అల్టిమేటం
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చెందిన యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. అయితే వారు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం, కోల్‌కతాలోని ధర్మటాలకు చెందిన జూనియర్ డాక్టర్ దేబాశిష్ హల్దర్ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే 24 గంటల్లోగా తన డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ధర్మతాళ్ల కూడలిలో వీరి ఊరేగింపుపై ఉద్రిక్తత నెలకొంది. వేదికపై బారికేడ్లు వేసి ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు. 24 గంటల్లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే రేపటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని, ఇందులో భాగంగా కొందరు ఇక్కడే ఉంటామని, మరికొందరు పశ్చిమ బెంగాల్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని చెప్పారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా బుధవారం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్‌లు టార్చ్‌లైట్ ఊరేగింపు నిర్వహించారు.
ఎన్సీపీ నేత దారుణ హత్య.. ఉద్రిక్తత వాతావరణం
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NSP) నాయకుడు సచిన్ కుర్మీ గత రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సచిన్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు ముంబై పోలీసులు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు, రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళన నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో సచిన్ కుర్మీ గాయపడ్డాడు. వెంటనే అతడిని పోలీసు వాహనంలో జేజే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నేడు అతడికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
నాగార్జునపై కేసు నమోదు
అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ్మిడికుంట కబ్జా చేసి Nకన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపించారు. ఇటీవల నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జునాకు చెందిన N కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువుకు చెందిన 3 ఎకరాల భూమి కబ్జా చేసి కట్టారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కన్వెన్షన్ కూల్చివేస్తారని ఆరోపణలు వచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఈ అక్రమ నిర్మాణంపై మరోసారి ఫిర్యాదులు అందాయి. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో దూకుడు పెంచిన హైడ్రా N కన్వెన్షన్ ను అప్పటికప్పుడు కూల్చివేశారు అధికారులు. తాజాగా మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.నాగార్జున సదరు మంత్రిపై క్రిమినల్ & డెఫమేషన్ కేసు నమోదు చేసాడు. ఈ వివాదం ఇలా సాగుతుండగా ఇప్పుడు మరోసారి నాగార్జున పై కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ వివాదం పెద్దది కావడంతో ఇలా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. వరుస వివాదాలతో సతమతమవుతున్న నాగార్జున ఈ కేసులను ఎలా ఎదుర్కుంటారోనని టాలీవుడ్ వర్గాలు చర్చిస్తున్నాయి.
మొదటిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్
నేడు జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో ఒలింపిక్ పతక విజేత మను భాకర్ మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. మను భాకర్ తన తండ్రి రామ్ కిషన్ భాకర్‌తో కలిసి 2024 హర్యానా ఎన్నికల కోసం చర్కి దాద్రీలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. ఇక ఓటు వేసిన తర్వాత డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేయడం వ్యక్తి బాధ్యత అని అన్నారు. ఈ దేశంలోని యువతగా, అత్యంత అనుకూలమైన అభ్యర్థికి ఓటు వేయడం మన బాధ్యత. చిన్న అడుగులు పెద్ద లక్ష్యాలకు దారితీస్తాయి.. నేను మొదటిసారి ఓటు వేశాను… అని మను భాకర్ అన్నారు. ఇక నేడు హర్యానాలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఓటింగ్ కోసం 20,632 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలలో 1,07,75,957 మంది పురుషులు, 95,77,926 మంది మహిళలు, 467 మంది థర్డ్ జెండర్ ఓటర్లు మొత్తంగా 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,462 మంది పోలీసులు, 21,196 మంది హోంగార్డులు, 10,403 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీఓ)లను మోహరించినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. పౌరులు నిర్భయంగా ఓటు వేసేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి మూలలో గట్టి నిఘాఉంచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు 31 సీట్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత జేజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది.