NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

డిప్యూటీ సీఎం పవన్‌ ఓఎస్డీగా కడప ఆర్డీవో..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పర్సనల్ సెక్రెటరీ (ఓఎస్డీ)గా కడప ఆర్డీవో మధుసూదన్‌ను నియమించారు.. కడపతో పాటు ధర్మవరం ఆర్డీవోగా కూడా పనిచేశారు మధుసూదన్‌.. ఈ సంద్భంగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చిన ఆర్డీవో మధుసూదన్.. తనను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.. ఇక, పవన్‌ కల్యాణ్ ఓఎస్డీగా బాధ్యతలు తీసుకున్నారు మధుసూదన్.. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు తీసుకున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. వరుసగా తన శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోన్న ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, ఉన్న నిధులు.. చేయాల్సిన పనులపై చర్చిస్తున్నారు.. మరోవైపు.. ఈ మధ్యే.. తన సొంత నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగింది.. జిల్లాలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. వారాహి సభల ద్వారా పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన విషయం విదితమే.

చిత్తూరులో వైసీపీకి భారీ షాక్
చిత్తూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP)కి భారీ షాక్‌ తగిలింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిత్తూరు మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు.. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్‌ బాటలో పలు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.. దీంతో.. వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ప్రస్తుతం సంఖ్యాబలాలు వైసీపీ -46, టీడీపీ -3, స్వతంత్ర – 1 ఉండగా.. తాజా చేరికలతో ఆ లెక్కలు మారిపోయాయి.. అయితే, ఈ రోజు చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం జరగాల్సి ఉంది.. ఆ సమావేశానికి ముందే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ మార్పులు జరుగుతున్నాయి.. పలు మున్సిపాల్టీలో.. మేయర్లు, కార్పొరేటర్లు కూడా కొందరు అధికార టీడీపీలో చేరుతున్నారు.. కూటమి ప్రభుత్వానికి చేరువ అవుతున్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ.. సినిమాలు మానేయొద్దు..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.. పొత్తుల విషయంలో.. సీట్ల విషయంలో.. అధికారం పంచుకునే విషయంలో.. ఇలా అనేక సూచనలు చేస్తూ వచ్చారు.. అయితే, ఇప్పుడు జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారడంతో.. సినిమాలు చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య రాజకీయ విశ్లేషణ లేఖ రాశారు.. కూటమి ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలల్లో పరుగులు పెట్టస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఇక, ప్రధానంగా కాపులు ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు జోగయ్య.. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు.. మీరు సినిమాలు మానేయకుండా సగం రోజులు సినిమాలకు, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలనీ నా సూచన అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు..

రేపే ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. వీటిపైనే ఫోకస్..!
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు.. ఈ రోజు హస్తిన పర్యటన ముగించి.. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, రేపు ప్రజా భవన్‌ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు ఏపీ సీఎం.. దానికి అంగీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి.. అయితే, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఏమున్నాయనే కోణంలో ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.. షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల విభజన.. ఆస్తుల పంపకాల వంటివి ఇంకా తేలాల్సి ఉంది. ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడం కీలకమైన వ్యవహరంగా ఉంది. అలాగే ట్రాన్సుకో, ఉన్నత విద్యా మండలి, పట్టాణభివృద్ధి శాఖ పరిధిలోని ఏపీ హౌసింగ్ బోర్డు నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సి ఉంది. ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రమంలో తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తం వచ్చినా.. ఏపీకి కాస్తో కూస్తో ఆర్థిక ఊరట ఉంటుందనేది ప్రభుత్వ పెద్దల భావనగా ఉందట… దీంతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. నదీ జలాల వాటాల గొడవలు.. డిస్కంలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గొడవ వంటివి కూడా సీఎంల భేటీలో ప్రస్తావనకు తెచ్చేలా ఏపీ ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం, నంది విగ్రహం..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరో పురాతన శివలింగం బయటపడింది.. దేవస్థానం యాఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడినట్టు అధికారులు తెలిపారు.. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం బయపటడిందని చెబుతున్నారు.. శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉంది.. మరోవైపు.. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో రాసి ఉన్న గుర్తులు ఉన్నాయి.. బయటపడిన శివలింగాన్ని పరిశీలించిన దేవస్థానం అధికారులు.. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు.. దానిపై అధ్యయనం చేసిన అధికారులు.. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న లిపి 14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు.. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద ప్రతిష్టించినట్లు లిపిలో ఉన్నట్టు వెల్లడించారు.. మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారుల ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు అధికారులు..

స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి..
స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో కూర్చొనే కహానీ లు చెప్తున్నారని మండిపడ్డారు. పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంకా భ్రమల్లో ఉన్నారు.. సైకాలజిస్ట్ కి చూపించుకుంటే బెటర్ అంటూ సలహా ఇచ్చారు. తెలంగాణ రైతులు.. ప్రజలను అవమాన పరిచేలా వ్యవహారం చేస్తున్నారని అన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది కేసీఆర్ సర్కార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం మీద యావ ఎంత ఉందో కేసీఆర్ మాటలు వింటుంటే అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ మీద విశ్వాసం లేక… ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో మీతో ఎవరు ఉంటారో చూసుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం విలువల గురించి కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మండిపడ్డారు. ఫిరాయింపులు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ ది త్యాగాల చరిత్ర.. కేటీఆర్ ది భోగాల చరిత్ర అన్నారు. హరీష్ ని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మీరు పార్టీ ఫిరాయింపుల చేసినప్పుడు ఏమైంది మీ సోయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఫార్మెట్లో హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేశారు. ఇప్పటికే డబుల్ సిక్సర్ కొట్టాము.. రాత్రి ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారని గుర్తు చేశారు. మరో సిక్సర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడతారని ధీమా వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకోండి.. తుమ్మలకు వినతిపత్రం
రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ రైతు పరి రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరి వినతిపత్రం అందజేశారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. రైతులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలన్నారు. రైతులకు సంబంధించి ఐదు తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. రైతు పండించిన పొకు ఇటువంటి ధర కల్పించాలన్నారు. ధరలు నిర్ణయించడంలో కేంద్రం విఫలమైంది. ప్రతి పంట పైన 1000 నుండి 4000 తగ్గించి కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. పంటలకు ప్రకటించిన ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు పండించిన పంటలకు పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలిపారు. వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు పంట రుణాన్ని మూడు లక్షల వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

నేను తీవ్రవాదిని కాదు.. బెయిల్‌ ఇవ్వండి: కేజ్రీవాల్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ పిటిషన్‌పై జూలై 17వ తేదీన విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి పిటిషన్‌పై గురువారం స్వల్ప విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తనకు ఉపశమనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. తాను ఉగ్రవాదిని కాదని కూడా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే కోర్టులో సీబీఐ అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేశారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు.. ED కేసులో దిగువ కోర్టు నుంచి బెయిల్ పొందారు.. అయితే, ఢిల్లీ హైకోర్టు దానిని నిలిపివేయడంతో ఆ తర్వాత ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే, మరోసారి కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ వచ్చింది.. ఆ తర్వాతే మళ్లీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని సింఘ్వీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటిత నేరస్థుడు లేదా ఉగ్రవాది కాదు.. మధ్యంతర ఉపశమనం కోసం బెయిల్ అడుగుతున్నాను అంటూ కేజ్రీవాల్ తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది అడ్వకేట్ డీపీ సింగ్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. అతను అరెస్టును సవాలు చేశాడు.. ఇది ఇప్పటికే పెండింగ్‌లో ఉంది అని వెల్లడించారు.

అమర్‌నాథ్ యాత్రకు కేవలం ఆరు రోజుల్లోనే 1.30 లక్షల మంది భక్తులు..
సౌత్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ గుహలో ఆ పరమ శివుడ్ని సందర్శించే వారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 1. 30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. కాగా, గురువారం ఒక్క రోజే 24 వేల మంది యాత్రికులు ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకోగా.. బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు నీలకంఠుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే, శుక్రవారం ఉదయం ఎనిమిదో బ్యాచ్‌లో 6, 919 మంది యాత్రికులు జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్, అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్- పహల్గామ్ జంట బేస్ క్యాంపుల వైపు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య బయలుదేరి వెళ్లారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్ర మార్గంలో అడుగడుగున భద్రతా దళాలను భారీగా మోహరించాయి. ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీతో దాదాపు 52 రోజుల పాటు కొనసాగనుంది. గత ఏడాది 2023లో 4.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వచ్చారు.. కానీ, ఈ సారి అంతకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.

స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే?
ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గుతున్నాయి. దాంతో బంగారం ధర మరోసారి 73వేల మార్క్‌ను తాకింది. నిన్న తులం పసిడిపై రూ.710 పెరగ్గా.. నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం (జులై 5) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,090గా ఉంది. మరోవైపు కిలో వెండిపై రూ.200 పెరిగి.. రూ.93,200గా నమోదైంది.

బ్రేకింగ్: ప్రేమించి మోసం చేశాడు..రాజ్ తరుణ్ పై లవర్ పోలీస్ కేసు
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నమ్మించాడని ఇప్పుడు చేసుకోకుండా మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ చేశాడని ఇప్పుడు దూరం పెట్టాడని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్తో రిలేషన్ లో ఉన్నానని లావణ్య చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేకసార్లు బెదిరింపులకు గురిచేశారని కూడా ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. కేవలం రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ సోదరుడి మీద కూడా లావణ్య ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 30వ తేదీన నార్సింగ్ లో పోలీసులు లావణ్యను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అప్పుడే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అనే విషయం ఒకసారిగా తెర మీదకు వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసు గురించి కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తనను కావాలనే కొంతమంది ఇరికించారని తనకు ఆ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం. తన సినిమాలోని ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు, నేను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని 45 రోజులు జైలులో ఉన్నాను, ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

‘కుబేర’ నుంచి రష్మిక వీడియో వచ్చేసింది.. వామ్మో గొయ్యి తవ్వి మరీ..!
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ చిత్రం కుబేరను తమిళం, తెలుగులో ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కుబేర చిత్రం నుంచి విడుదలైన ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పింక్ కలర్ సూట్ ధరించిన రష్మిక.. సూట్‌కేస్‌ని తీసుకొస్తున్న ఫొటోను వదిలారు. అంతేకాదు రష్మికకు సంబదించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో నేషనల్ క్రష్ ఓ గడ్డపారతో గొయ్యి తవ్వి సూట్‌కేస్‌ని బయటకు తీశారు. సూట్‌కేస్‌ ఓపెన్ చేయగా.. అందులో మొత్తం డబ్బే ఉంది. డబ్బును చూసిన రష్మిక తెగ సంతోషపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.