NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

డిప్యూటీ సీఎం పవన్‌ ప్రకటన.. రియల్ భూమ్ @ పిఠాపురం..!
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు రియల్‌ భూమ్‌ నడుస్తోందట.. దానికి ప్రధాన కారణం జనసేనాని పవన్‌ ప్రకటనే అంటున్నారు స్థానికులు.. పిఠాపురం నుంచి బరిలోకి దిగి.. భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు పవన్‌ కల్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసార తన సొంత నియోజకవర్గంతో పాటు.. కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు.. దీనికి రియల్‌ భూమ్‌కి కారణం ఏంటి? అంటారా? విషయం ఏంటంటే.. పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు పవన్.. 3.52 ఎకరాల భూమి కొన్నట్లు స్వయంగా పవన్‌ కల్యాణే ప్రకటించారు.. రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం, మిగతా స్థలంలో ఇల్లు కడతానని బహిరంగ వెల్లడించారు.. మరో 16 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన పవన్‌.. దానికి రైతులతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని.. వచ్చే పర్యటనలో రిజిస్ట్రేషన్ కి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ఏ అవకాశాన్ని వదులుకోని రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు రంగ ప్రవేశం చేశారట.. పవన్ భూములు ఉన్న ప్రాంతాల్లో స్థలాలు కొనే వేటలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు పడిపోయారట.. డిప్యూటీ సీఎం భూములు ఎక్కడ ఉన్నాయి, చుట్టూ పక్కల అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటూ ఆరా తీస్తున్నారట.. ఇతర ప్రాంతాలకి చెందినవారు.. ఎప్పుడూ లేని విధంగా తమకు ఫోన్ లు చేసి భూములు రేట్లు అడుగుతున్నారని మధ్యవర్తులు చెబుతున్నమాట.. పిఠాపురం టౌన్ లో రోడ్డు ప్రక్కన భూముల ధర భారీగా ఉందట.. ఎకరం భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతుండగా.. భూమి లోపలకి ఉంటే రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోందని చెబుతున్నారు.. అయితే, ఇదంతా ఇప్పుడు పెరిగిన ధరేనట.. ఎందుకంటే..? ఇంతకు ముందు రూ.50 లక్షల నుంచి కోటి. 25 లక్షల రూపాయలు దాటలేదని స్థానికులు చెబుతున్నారు.. జాతీయ రహదారి 216కి సమీపంలో ఉన్న భూములు ఎకరం రూ.3 కోట్లు, లోపలకి ఉన్నవి రూ. కోటిన్నర వరకు చెబుతున్నారట.. గతంలో నేషనల్ హై వే పై కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ధర పలికిందంటున్నారు..

కిడ్నీ రాకెట్ కేసులో మరో ట్విస్ట్..!
విశాఖపట్నం కిడ్నీ రాకెట్‌ కేసు కలకలం రేపుతోంది.. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు.. అయితే, కిడ్నీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. తమ దగ్గర ఎటు వంటి చట్ట విరుద్ధ మైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగవని ప్రకటించింది NRI హాస్పిటల్… కో-ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. నెఫ్రాలజిస్ట్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది NRI హాస్పిటల్… FIR లో కో ఆర్డినేటర్ అనిల్ తో పాటు డాక్టర్ పేరు ఉండగా.. బాధితుల నుంచి వ్యక్తిగత అకౌంట్ కు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించారు అనిల్.. ఇక, కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారీగా మారినట్టు ఆధారాలు చూపుతున్నారు పోలీసులు.. గతంలో అనిల్ పనిచేసిన హాస్పిటళ్లలో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేఉసులో వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్… అయితే, కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.. ఘటనపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్న నేఫథ్యంలో ఆసుపత్రి వర్గాల్లో గుబులు రేగుతోంది.. తెలివిగా కిడ్నీ రాకెట్ కేసులో తప్పించుకునేందుకు హాస్పిటల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది.. తమ దగ్గర ఎటువంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగవని ప్రకటించారు.. కో ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని వెల్లడించారు.. కో-ఆర్డినేటర్ అనిల్ పై పూర్తి తప్పును తోసేసింది హాస్పిటల్‌ యాజమాన్యం… హాస్పిటల్ యాజమాన్యానికి తెలియకుండానే డబ్బులు వసూలు చేశాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారీగా మారినట్టు ఆధారాలు చూపుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు
విభజన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుంబిగించారు.. అందులో భాగంగా.. ఈ రోజు హైదరాబాద్‌ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కాబోతున్నారు.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. గతంలో కేసీఆర్, జగన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించిన ఆయన.. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.. అయితే, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు భేటీ కావడం అభినంద నీయం.. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10 అంశాల మీద మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, చంద్రబాబు లెటర్ రాయటం.. రేవంత్ రెడ్డి స్పందించటం బాగుంది అన్నారు మంత్రి సత్యకుమార్.. ఆస్తులు, నీటి పంపకాలు, ఉద్యోగుల పంపకాలపై స్నేహ పూర్వక చర్చ జరగనుంది.. రాజకీయాలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ఉన్న అంశాలపై చర్చకు ముందుకు రావటం అభినందనీయం అన్నారు. మొదట ఐదేళ్ళపాటు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ఏపీకి అండగా నిలిచింది.. కేసీఆర్, జగన్ ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంపై స్పందన లేకపోవటంతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. ప్రస్తుత సమావేశం ద్వారా ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు. విభజన చట్ట ప్రకారం మాత్రమే ఆస్తులు, ఆదాయ, సహజ వనరుల పంపకాలు జరగాలి.. అంతేకాదు.. చట్టం దాటి పెట్టిన డిమాండ్స్ పై చర్చ జరపాలి అన్నారు. రాజకీయాలు పక్కన పెడితే ఏపీకి అన్యాయం జరిగింది అనేది వాస్తవం.. రాజధాని లేదు, ఏపీకి ఆదాయం లేదు, తెలంగాణకు మిగులు ఆదాయం ఉంది అన్నారు. మరోవైపు.. డిమాండ్స్ పెట్టడం సరికాదు, అత్యాసపరమైన డిమాండ్స్ మంచిదికాదు.. పరిణితి ఉన్న నాయకత్వం చర్చలు బాగానే జరుగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం మొదటి నుంచి అన్యాయం జరిగిన ఏపీకి అండగా ఉంది.. తర్వాత వైసీపీ అభివృద్ధి నిరోధక చర్యలతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. సమావేశంతో రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే వెంటనే గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. డిసెంబర్ లో గ్రూప్ 2 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 పోస్టులను 2000కు, గ్రూప్ 3 పోస్టులను 3000కు పెంచాలని డిమాండ్ చేశారు.గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపికై 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు. దీనిపై నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా.. ఈ రెండింటినీ బ్యాక్ టూ బ్యాక్ నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకపై సీఎం దృష్టి సారించారు.

ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు.. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే..
ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని.. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విభజన అంశాల విషయం లో ప్రాంతీయ ను రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగించుకోవద్దని తెలిపారు. కేంద్రం, మోడీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాస్తున్నా అన్నారు. భారత దేశ సమగ్రత కోసం తన ప్రాణాలు సైతం అర్పించారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అన్నారు. భావితరాలకు, నేటి తరాలకు స్ఫూర్తిని కలిగించేలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పశ్చిమ బెంగాల్ ను తూర్పు పాకిస్తాన్ లో కలుపుతారనే కుట్రల నేపథ్యంలో ఎదురొడ్డి నిలబడ్డారని తెలిపారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చొరవ వల్ల పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉండి సురక్షితంగా జీవించగల్గుతున్నారని తెలిపారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగ ఫలితమే నరేంద్ర మోదీ 370ఆర్టికల్ ను రద్దు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను మరిచిపోయి మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిందని తెలిపారు. 370ఆర్టికల్ తర్వాత నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. మోడీ ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందన్నారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి భారత దేశం విచ్చిన్నానికి కాంగ్రెస్ పాల్పడిందన్నారు.

నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా.. అప్పటి వరకు జరపొద్దు…
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, ఈ వివాదం వేళా నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌‌ ని అధికారులు పోస్ట్ పోన్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల నీట్‌ యూజీ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే, సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విషయంలో వాదనలు కొనసాగాయి.

ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకారం.. యుద్ధం ముగియనుందా?
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలు ప్రారంభించాలనే యూఎస్ ప్రతిపాదనకు హమాస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయాలంటే ముందుగా ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పాలస్తీనా సంస్థ(హమాస్) డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అంగీకరిస్తే ఈ ప్రతిపాదన ఓ ఒప్పందానికి దారి తీస్తుందని కాల్పుల విరమణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న పాలస్తీనా అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఒప్పందంలో మొదటి దశ అని తెలిసింది. ఒప్పందంలోని రెండో దశను అమలు చేసేందుకు పరోక్ష చర్చలు కొనసాగుతాయి దీంతో గతేడాది అక్టోబర్ 7న మొదలైన గాజా యుద్ధం ముగియనుంది.

సినిమా రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య
రోజుకో మలుపుతో, వాదోపవాదనలతో సినిమా రేంజ్ ట్విస్ట్‌లతో సాగుతోంది రాజ్‌తరుణ్ – లావణ్యల వ్యవహారం. తనను రాజ్‌తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని, తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించాడని నిన్న రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. ఈ వాదనను ఖండిస్తూ లావణ్యపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవపడిందని, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయిందని అన్నాడు. ఈ వ్యవహారాన్ని లీగల్ గానే ఎదుర్కొంటానని తెలిపాడు. లావణ్య తనకు ఆన్ లైన్‌లో పరిచయం అయిందని, హీరోగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో సహాయం చేసింది, అంతే తప్ప ఆమెతో నాకు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదు. లావణ్య మస్తాన్ సాయి వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిపాడు. కాగా లావణ్య ఫైల్ చేసిన కేసుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా నిన్న సాయంత్రం 91 సీఆర్‌పీసీ కింద లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. రాజ్ తరుణ్‌పై చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాలని లావణ్య ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. లావణ్య పోలీసులకే ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు ఆధారాలు సమర్పించమని కోరినప్పటి నుంచి లావణ్య అందుబాటులో లేదని తెలుస్తోంది. ఆమెను ఫోన్‌లో అందుబాటులోకి తీసుకుందామని ప్రయత్నించగా.. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని సమాచారం.

హరోం హర నాన్ థియేట్రికల్ డీల్ క్లోజ్ ..!
నటుడు సుధీర్ బాబు టాలీవుడ్ ‘నవదళపతి’గా నామకరణం పొంది నటించిన చిత్రం ‘హరోం హర’. సుధీర్ బాబు సినీ కేరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా హరోం హర నిలిచింది. ఎన్నోఅంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. కానీ, సుధీర్ బాబు గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్ లో, చిత్తూరు యాసలో ప్రేక్షకులను నుండి ప్రశంసలు పొందాడు. ఈ చిత్ర కథ, కధనం ఆద్యంతం కుప్పం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. హరోం హర డిజిటల్ మరియు శాటిలైట్ పెండింగ్ రైట్స్ పెండింగ్ లో ఉన్నాయి. థియేట్రికల్ రన్ ముగియడంతో పలు OTT సంస్థలు ఈ చిత్ర రైట్స్ కోసం రేసులో నిలిచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. హరోం హర నాన్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్లు యూనిట్ వర్గాల నుండి సమాచారం. నిర్మాణ సంస్థ ఊహించినదానికంటే ఎక్కువ ధరకు ఈటీవీ నెట్ వర్క్ కోట్ చేసినట్టు వినిపిస్తోంది. సుధీర్ బాబు సూపర్ హిట్ ఫిల్మ్ సమ్మోహనం చిత్రాన్ని కూడా ఈటీవి నెట్ వర్క్ కొనుగోలు చేసింది. ఆ చిత్రానికి ఈటీవీ విన్ లో మంచి ఆదరణ లభించడంతో హరోంహర కంటెంట్ పై నమ్మకంతో అధిక ధరకు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన ట్టుతెలుస్తోంది.

ఆ హీరోనే హనుమాన్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్న నిర్మాత
హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత జై హనుమాన్ సినిమాకి సంబంధించి హనుమంతుడిగా ఎవరు నటిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కళ్లు చిరంజీవిది పోలి ఉండడం బాడీ రానాని పోలి ఉండడంతో వారిద్దరిలో ఎవరో ఒకరిని హనుమంతుడిగా తీసుకుంటారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇదే విషయం మీద తాజాగా స్పందించారు హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి. ఈ సినిమా కేవలం మేము హనుమంతుల వారి వల్లే చేసామని అనుకుంటున్నాం. మా జర్నీని మొదలుపెట్టించింది ఆయనే, ఆయన వల్లే ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. ఆయన తన పాత్రలో ఏ హీరోని చూడాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా జరుగుతుంది అని ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తాము ఈ పాత్ర ఓపెన్ గా ఉంచామని స్టార్ హీరోలు ఎవరు చేసినా బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే నా పర్సనల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రామ్ చరణ్ కి ఉంటుంది లేదా ఆయన తండ్రి చిరంజీవి నటించిన బాగుంటుందని ఆమె అన్నారు.