NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు.. వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
వంగవీటి మోహన రంగా జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన కుమారుడు వంగవీటి రాధా.. వంగవీటి రంగా 77వ జయంతిని పురస్కరించుకుని.. విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వంగవీటి రాధాకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నాం అన్నారు.. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పని చేస్తామని ప్రకటించారు రాధా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించిన ఆయన.. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు.. ప్రజలు ఎలా బుద్ధిచెబుతారో మొన్నటి ఎన్నికల్లోనే చూశాం అన్నారు.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తుందన్న ఆయన.. అందరం కష్టపడి పని చేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమేనని స్పష్టం చేశారు.. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగిన ఎన్నికలుగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.. కానీ, ఇవి బేర సారాల కోసం, పదవుల కోసం జరిగిన ఎన్నికలు కావు అని వ్యాఖ్యానించారు. ప్రతి సామాన్యుడుకు న్యాయం జరగాలన్నదే.. వంగవీటి మోహన రంగా ఆశయం అని స్పష్టం చేశారు వంగవీటి రాధాకృష్ణ..

ఏపీ నుంచి రిలీవ్ చేయండి.. తెలంగాణ ఉద్యోగుల వినతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత.. ఏపీకి చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన మరికొందరు ఉద్యోగులు.. ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో కొనసాగుతూనే ఉన్నారు.. అయితే, సొంత ప్రాంతానికి వెళ్లడానికి వాళ్లు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.. తమను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నట్టు వెల్లడించారు.. సచివాలయం, వివిధ హెచ్‌వోడీల కార్యాలయాలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని ప్రాధేయపడుతున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని.. రెండు రాష్ట్రాల (ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి) సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తమ అంశంపై చర్చించాలని కోరుతున్నారు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు.

ఆఫీస్‌ ఖాళీ.. నిన్న కోమటి రెడ్డి.. నేడు తుమ్మల.. ఆకస్మిక తనిఖీలు..
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. సమయ పాలన లేకుండా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే జరిగితే ఉద్యోగులపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా TGCAB డిపార్ట్ మెంట్ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. NCDC అధికారులతో చర్చించారు. ఈ రోజు NCDC ద్వారా ప్రాంతీయ అవార్డుల పథకం కింద మంచి పనితీరు కనబర్చిన సహకార సంఘాలకు అవార్డుల ప్రదానం చేశారు. ఎంపికైన ప్రాథమిక సహకార సంఘానికి రూ. 25,000/- నగదు బహుమతి, సహకార మెరిట్‌కు ఎంపికైన ప్రాథమిక సహకార సంఘానికి రూ. 20,000/- నగదు బహుమతితో పాటు ప్రతి కేటగిరీ కింద సర్టిఫికెట్లు అందజేశారు. నిన్న ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్ అండ్ బీ విభాగంలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ తిన్నారు. ఇవాళ తుమ్మలకు ఇలాంటి వాతావరణం కనిపించడంతో అధికారులపై సీరియస్ అయ్యారు.

ఈనెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. నేటికీ ప్రకటించని జాబితా..
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపై దృష్టి సారించడంతో ఇక్కడ ఏర్పాట్లూ నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే.. అమ్మవారికి కల్యాణానికి 15 రోజుల ముందే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాల్సి ఉండగా ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆలయ అధికారులు ప్రచారం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎల్లమ్మ కల్యాణానికి ఉత్సవ కమిటీ ప్రారంభం కావాల్సి ఉండగా నేటికీ ప్రారంభం కాలేదు. అయితే.. ఈసారి 15 మంది మాత్రమే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయగా వారి జాబితాను నేటికీ ప్రకటించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ కమిటీని ప్రకటించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం పన్నుల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణానికి వచ్చే దంపతులకు టిక్కెట్టు ధర రూ.2,500గా నిర్ణయించి విక్రయించేవారు. ఈసారి ఎన్ని టిక్కెట్లు ఖరారయ్యాయి. ఎంత మంది భక్తులకు అమ్ముడు పోయిందన్న దానిపై స్పష్టత లేదు. స్థానికులు వెళ్లి కల్యాణ టిక్కెట్లు అడిగితే పూర్తిగా అమ్మేశారన్నారు. దీంతో సూపరింటెండెంట్‌తో ఈఓ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై దృష్టి సారించి ఉత్సవ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని పలువురు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

హత్రాస్ ప్రమాదంలో దర్యాప్తు వేగవంతం.. 20 మంది నిర్వాహకుల అరెస్ట్
యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 121 మంది మృతి చెందిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టి 20 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. హత్రాస్ పోలీసులు 7 బృందాలను ఏర్పాటు చేశారు. చీఫ్ సేవాదార్ దేవ్‌ప్రకాష్ మధుకర్ కోసం బృందాలు శోధిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం హోం శాఖ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుంది. రెండు నెలల్లో కమిషన్ విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ హేమంత్ రావు, డీజీ ప్రాసిక్యూషన్, చీఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ భవేష్ కుమార్ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. జూలై 2న హత్రాస్‌లో జరిగిన ప్రమాదంపై విచారణను కమిషన్‌కు అప్పగించారు. కమీషన్ అనుమతితో విధించిన షరతులను నిర్వాహకులు పాటించారా లేదా అనే దానిపై విచారణ జరుపుతుంది. ఇది ప్రమాదమా లేక ప్రణాళికాబద్ధమైన కుట్రనా అన్నది కూడా కమిషన్ చూస్తుంది. పరిపాలన చేసిన ఏర్పాట్లపై దర్యాప్తు చేసే బాధ్యతను కూడా కమిషన్‌కు అప్పగించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ సూచించనుంది.

మోడీ పర్యటన ముందు పాక్‌కి రష్యా బంపర్ ఆఫర్.. అయినా ఆ దేశ దరిద్రం తెలిసిందే కదా..
కజకిస్తాన్ వేదికగా ఎస్‌సీఓ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పుతిన్ పాకిస్తాన్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే, ఈ ఆఫర్లను పాక్ ఉపయోగించుకుంటుందా..? లేదా..? అనేది ప్రశ్న. ఒక వేళ పాకిస్తాన్, రష్యాతో వాణిజ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తే అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. బుధవారం రోజును ఇద్దరు నేతల సమావేశం జరిగింది. పాకిస్తాన్‌కి మరింత ఎక్కువ ఇంధన సరఫరా చేసే అవకాశాలపై పుతిన్ చర్చించారు. పుతిన్ షహబాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ముఖ్యంగా రెండు కీలక రంగాలను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఇంధనం మరియు వ్యవసాయ-పారిశ్రామిక రంగాలలో సహకారం. మేము పాకిస్తాన్‌కు ఇంధన వనరులను సరఫరా చేయడం ప్రారంభించాము మరియు ఈ సరఫరాను మరింత పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ అభ్యర్థన మేరకు, పాక్ మార్కెట్‌కు ధాన్యం సరఫరాను పెంచడం ద్వారా పాకిస్థాన్ ఆహార భద్రతకు రష్యా మద్దతు ఇస్తోంది’’ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ ఈ ఆఫర్‌ని అంగీకరించినా కూడా రష్యాకు చెల్లించడానికి విదేశీ మారక నిల్వలు ఆ దేశం వద్ద లేవు. ప్రస్తుతం 8.9 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో రణాలు చెల్లింపు కారణంగా పాక్ నిల్వలు వేగంగా తగ్గతున్నాయి. ఒకవేళ పాక్ ఈ ఆఫర్ అంగీకరించా కూడా తిప్పలు తప్పేలా లేవు. ఆమెరికా ఆగ్రహం పాక్ చవిచూడాల్సి వస్తుంది.

గూగుల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా.. ఐతే ఇలా ట్రై చేయండి..
మీరు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలు వంటి గూగుల్ సేవలను తరచుగా ఉపయోగిస్తుంటే.. మీ గూగుల్ ఖాతా స్టోరేజ్ ఫుల్ అయిందని సందేశాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యంగా మీరు పని లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ సేవలపై ఆధారపడితే ఇది నిరాశపరిచే అనుభవం కావచ్చు. అయితే, స్టోరేజ్ ఖాళీ చేయడానికి, మీ గూగుల్ ఖాతాను అంతరాయం లేకుండా ఉపయోగించడం కొనసాగించడానికి మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. మీ గూగుల్ ఖాతా స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు తీసుకోవలసిన మొదటి దశ.. మీ స్టోరేజ్ వినియోగాన్ని తనిఖీ చేయడం. మీరు గూగుల్ వన్ వెబ్సైట్ను సందర్శించి, మీ గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు. లాగిన్ అయిన తర్వాత, మీరు ఎంత స్టోరేజ్ ను ఉపయోగిస్తున్నారో., అందులో ఏది ఎక్కువ స్థలాన్ని తీసుకుంటోందో మీరు చూడవచ్చు. స్టోరేజ్ ను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ప్రయత్నాలను ఎక్కడ చేయాలో ఇది మీకు మంచి ఆలోచనను ఇస్తుంది. మీ గూగుల్ ఖాతాలో ఏది ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుందో మీరు గుర్తించిన తర్వాత, అనవసరమైన ఫైళ్ళను తొలగించడం మొదలు పెట్టండి. ఇందులో పాత ఇమెయిల్లు, పెద్ద ఫైల్స్, డూప్లికేట్ ఫైళ్లు, ఉపయోగించని అనువర్తనాలు ఉండవచ్చు. ఈ వస్తువులను తొలగించడం ద్వారా మీరు విలువైన స్టోరేజ్ ను ఖాళీ చేయవచ్చు. దాంతో కొత్త ఫైళ్ళకు చోటు కల్పించవచ్చు.

హార్దిక్ పాండ్యా డ్యాన్స్.. నవ్వుకున్న విరాట్ కోహ్లీ!
వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ 2024 సాధించి.. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన రోహిత్‌ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. బార్బడోస్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కేరింతలు, హర్షద్వానాలతో రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జయహో భారత్‌’ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్‌ కాగానే.. అభిమానులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో రోహిత్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని పైకెత్తి చూపుతూ.. అభిమానులకు అభివాదం చేశాడు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌ వద్ద కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్‌ ఎంట్రెన్స్‌లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్‌ వాయింపుకు కళాకారులతో కలిసి హార్దిక్ పాండ్యా స్టెప్పులు వేశాడు. అప్పుడే బస్సులోంచి దిగిన విరాట్ కోహ్లీ.. హార్దిక్ స్టెప్పులకు నవ్వులు పూయించాడు. నవ్వుకుంటూ హోటల్‌ లోనికి వెళ్ళిపోయాడు. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, రిషబ్‌ పంత్‌లు కూడా డ్యాన్స్‌ చేశారు. రోహిత్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది. హోటల్‌ యాజమాన్యం భారత జట్టు కోసం ప్రత్యేక కేక్‌ను ఏర్పాటు చేసింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేక్‌ను కట్‌ చేశాడు. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ రోహిత్ సేనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరితో ప్రధాని ముచ్చటించారు. ప్రధానితో భేటీ అనంతరం టీమిండియా ముంబైకు పయనమైంది.

‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చనే మొదటి హీరో: అశ్వినీ దత్
‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. విడుదలైన వరం రోజుల్లోనే రూ.700 కోట్లు కొల్లగొట్టి… రూ.1000 దిశగా దూసుకుపోతుంది. కల్కి 2898 ఏడీ బడ్జెట్‌తో పాటుగా హీరో ప్రభాస్ తనతో చెప్పిన మాటలను కూడా నిర్మాత అశ్వినీ దత్ పంచుకున్నారు. కల్కిలో అమితాబ్ బచ్చన్ గారే మొదటి హీరో అని ప్రభాస్ తనతో అన్నారని అశ్వినీ దత్ తెలిపారు. మనం అమితాబ్ గారిని గౌరవించాలని, అప్పుడే తాము గౌరవించబడతాం అని ప్రభాస్ పేర్కొన్నట్లు చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో నటించాలనే తన కల నెరవేరిందని కూడా రెబల్ స్టార్ చెప్పారట. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ ఆకట్టుకున్నారు. ఇక బౌంటీ ఫైటర్‌ భైరవగా ప్రభాస్‌ సందడి చేశారు. భారీ అంచనాల మధ్య జూన్‌ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా.. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అందరూ కల్కికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వారంలో టిక్కెట్ల రేట్స్ తగ్గనుండడంతో కలెక్షన్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిలో ప్రభాస్‌ కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీపికా పదుకొణె కథానాయిక కాగా.. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు.