NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఈనెల 13,14 జీఆర్‌ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశం..

చెన్నయ్‌ నగరానికి తాగునీటిని అందించడంపై చర్చ ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటకు ఆన్‌లైన్‌ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో కృష్ణా నదీయాజమాన్య సంస్థ సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందిజేసిన కేఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ రాయ్‌పురే సాచారాన్ని తెలుగు రాష్ట్రాక పంపారు. మరోవైపు గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 13న జరగనుంది. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జీఆర్‌ఎంబీ భేటీకి హాజరుకావాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు జీఆర్‌ఎంబీ సమాచారం పంపింది. ఈనెల 6న జరగాల్సిన ఈ సమావేశాన్ని తెలంగాణ అభ్యర్థన మేరకు గోదావరి బోర్డు ఈనెల 13కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అథారిటీ చైర్మన్‌ భూపాల్‌సింగ్‌ నేతృత్వంలో సమావేశం కొనసాగనుంది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు తెలంగాణ అధికారులకు సమాచారం అందించారు. జిసి రివర్ లింక్ ప్రాజెక్టును ఎక్కడ చేపట్టాలనే అంశంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది. ముందుగా సమ్మక్కసాగర్ నుంచి, తర్వాత ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు చేశారు. NWDA బోర్డు సమావేశంలో, ఇంద్రావతి నుండి కూడా కొత్త తరలింపు ప్రతిపాదించబడింది. ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో 9న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించి సందేహాలను నివృత్తి చేయాలని నిర్ణయించింది.

 

ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన బోగీలు
విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు . ఇదే ట్రైన్ విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సి వుంది. రైలు నాలుగో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ప్రమాదానికి గురైంది. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది. అధికారులు ప్రయాణికులను బయటకి పంపారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 

తీహార్ జైలులో వున్న కవిత కోసం ఢిల్లీకి కేటీఆర్‌, హరీష్‌ రావు..
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు కేటీఆర్, హరీష్ రావులు అక్కడ పర్యటించనున్నారు. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. బెయిల్ కోసం కవిత కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈడీ కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు అందజేయడంతో బెయిల్ విషయంలో ఆమెకు నిరాశే ఎదురైంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాల బెయిల్‌ పిటిషన్లను విచారించిన ధర్మాసనం కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.అంతకుముందు కోర్టు విధించిన గడువు ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్ నగరంలోని కట్టెలమండి అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ కేసును అబిడ్స్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఐదు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ గ్రామంలో పోలీసులు కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. నిందితుని పోలీస్ స్టేషన్ తీసుకువస్తుండగా పాప కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిందితున్ని స్థానికులు కుటుంబ సభ్యులు చితక్కొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ అబిడ్స్‌లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో కిడ్నాప్ చేసిన నిందితుడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించి.. గల్లిగల్లిలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ లభ్యమైంది. అనంతరం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ గ్రామంలో కిడ్నాపర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలిక క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బాలికను, నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా చెబితే చిన్నారిని కిడ్నాప్ చేశాడా? లేక చిన్నారిని ఏదైనా చేసేందుకు కిడ్నాప్ చేశాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు. లేక డబ్బులు డిమాండ్ చేయడానికి చిన్నారిని కిడ్నాప్ చేసి వుంటాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

 

శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సాగర్‌ గేట్లు తెరిచే అవకాశం
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 200.1971 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి 2,98,573 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా డ్యాం గేట్లు తెరవడంతోపాటు వారాంతపు సెలవులు రావడంతో హైదరాబాద్‌ ఘాట్‌ రోడ్డు మొత్తం 4 కిలోమీటర్ల పైన ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తాయి. కృష్ణమ్మ పరవళ్ల అందాలను చూస్తూ యాత్రికులు సెల్ఫీలు తీసుకుంటూ మైమరిచిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్‌ డ్యామ్ వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్‌ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ఉదయం 7గంటల కల్లా 260.0858 టీఎంసీల నీరు ఉంది. మరో 52 టీఎంసీలు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. సోమవారం సాయంత్రం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తూ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 4,58,393 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 40,560 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర జలాశయాలకు వరద నిలకడగా కొనసాగుతోంది.

 

వైసీపీ నేత హత్యతో వణికిపోతున్న సీతారామపురం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నంద్యాల జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 40 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తన భర్తను హతమార్చారంటూ మృతుడి భార్య ఆరోపించారు. అయితే, మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అత్యంత సన్నిహిత అనుచరుడిగా తెలుస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బరాయుడు హత్యతో సీతారాంపురం గ్రామం వణికిపోతోంది. గ్రామాన్ని ఎస్పీ అదిత్‌ రాజ్‌ సింగ్‌ రాణా సందర్శించారు. నంద్యాల జీజీహెచ్‌లో సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను ఎస్పీ అదిత్ సింగ్ రాణా విచారించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఓటెయ్యనందుకే హత్య జరిగినట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు.

 

బీమా కంపెనీలు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అల్టిమేటం
కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటి వరకు 323 మంది ప్రాణాలు కోల్పోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక శాఖ ముందుకు వచ్చింది. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని కోరుతూ ఎల్‌ఐసీ సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు మంత్రిత్వ శాఖ శనివారం అల్టిమేటం ఇచ్చింది. కేరళలోని వాయనాడ్, ఇతర జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన బాధితులు, వారి కుటుంబాల క్లెయిమ్‌లను త్వరితగతిన ప్రాసెస్ చేసి, వారికి డబ్బు డెలివరీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం LIC , ఇతర బీమా కంపెనీలను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. కంపెనీ వెబ్‌సైట్, SMS మొదలైన వాటి ద్వారా మీ పాలసీదారులకు వీలైనంత త్వరగా చేరువ కావాలని కోరింది. ఈ జిల్లాల నుంచి గరిష్ఠ క్లెయిమ్‌లు అందుతున్నాయి. దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడిన ఘటన, కేరళలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌తో సహా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విపత్తు బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల బీమా క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం బీమా కంపెనీలను కోరింది. మంత్రిత్వ శాఖ ఆదేశాలలో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద పాలసీ హోల్డర్‌లకు క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పంపిణీ చేయాలని LICని కోరింది. క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు.. వారి డబ్బు ప్రజలకు చేరేలా చూసేందుకు అన్ని బీమా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌ను కోరింది.

 

ఆడపిల్లల విషయంలో కోర్టును ఆశ్రయించిన అఖిలేష్ యాదవ్
అయోధ్యలో 12 ఏళ్ల మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కారణంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్ట్ చేసి, అత్యాచార బాధితులకు ప్రభుత్వం ఉత్తమ వైద్య సదుపాయాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడపిల్లల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై సమాజ్ వాజ్ పార్టీ అధినేత కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని.. పరిస్థితిని అర్థం చేసుకుని దర్యాప్తులో బాధుతులకు సాధ్యమైన భద్రతను అందించాలని అఖిలేష్ యాదవ్ కోరారు. ఇంతకు ముందు కూడా అఖిలేష్ ట్వీట్ చేసి బాధితురాలికి డిఎన్‌ఎ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎస్పీ నేతతో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దీనిపై రాష్ట్ర యోగి ప్రభుత్వం సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా గళం పెంచింది. ఈ విషయంపై యోగి ప్రభుత్వం ఎస్పీని కూడా కార్నర్ చేసి, నిందితుడు సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాడని, అతను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీతో తిరుగుతున్నాడని అన్నారు. ఇలాంటి నేరస్తులను కాల్చిచంపకపోతే పూలమాల వేస్తారా? అని ప్రశ్నించారు. యోగి ప్రభుత్వ దాడులపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయాలనే దురుద్దేశంతో ఉన్న వ్యక్తుల ప్రణాళిక ఎప్పటికీ విజయవంతం కాకూడదన్నారు. అయోధ్యలో 12 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం కేసు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. నిందితులు మైనర్‌తో నేరం చేయడమే కాకుండా ఆమెపై అసభ్యకరమైన వీడియో కూడా తీశారు, ఆ తర్వాత వారు ఆమెతో ఒకసారి కాదు చాలాసార్లు నేరానికి పాల్పడ్డారు. అయితే మైనర్ బాధితురాలు గర్భం దాల్చడంతో మైనర్‌పై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రెండున్నర నెలల క్రితం మైనర్ బాధితురాలు కూలి పని చేసి పొలం నుంచి తిరిగి వస్తుండగా, బేకరీ యజమాని మొయీద్ ఖాన్ తనను కలవడానికి పిలిచాడని సర్వెంట్ రాజు బాధితురాలితో చెప్పగా, ఆ తర్వాత మొయీద్‌తో ఈ నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సర్వెంట్ రాజు కూడా మైనర్‌పై అత్యాచారం చేశాడు. విచారణ అనంతరం నిందితులు మొయీద్‌ఖాన్‌, పనిమనిషి రాజుఖాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వయనాడ్ బాధితులకు బాధ్యతగా బన్నీ.. సాయం ఎంతంటే..?
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు వయనాడ్ భాదితులకు పెద్ద మొత్తంలో విరాళాలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. విషాద ఘటనపై మలయాళం స్టార్ హీరోలు పెద్ద మనసుతో స్పందించారు. అక్కడి మెగాస్టార్ మమ్ముట్టి, అతని కొడుకు, మరో స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, అతని భార్య నజ్రియా, తమిళ హీరో విక్రమ్, సూర్య, జ్యోతిక, కార్తీ లాంటి వాళ్లు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంవిరాళం ఇచ్చారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రూ. 3 కోట్లు విరాళం అందజేశారు. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన వంతు భాద్యతగా ముందుకొచ్చాడు. బన్నీ వ్యక్తిగత ‘X’ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ “వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నా మీద చాలా ప్రేమ చూపించింది, నా వంతు సాయంగా పునరావాస పనులకు కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు ₹.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను” అని పోస్ట్ పెట్టాడు పుష్ప.

 

మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన బ‌డ్జెట్ అనంతరం బంగారం ధ‌రలు ఒక్కసారిగా త‌గ్గిన విష‌యం తెలిసిందే. తులం బంగారంపై ఏకంగా రూ.5 వేల వ‌ర‌కు తగ్గింది. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మ‌ళ్లీ బంగారం ధ‌ర‌లో పెరుగుద‌ల క‌నిపిస్తోంది. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఆగష్టు 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,700లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,580గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,580గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.64,850లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,730గా కొనసాగుతోంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్స్ ధర రూ.70,580గా నమోదైంది. ఇటీవల వరుసగా పెరిగిన వెండి ధర కూడా కాస్త దిగొచ్చింది. నిన్న భారీగా తగ్గిన వెండి.. నేడు స్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.85,500గా ఉంది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.85,500గా ఉంది. బెంగళూరులో రూ.85,750, చెన్నైలో 90,900గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.90,900గా కొనసాగుతోంది.