NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్

ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకొనేందుకు టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో స్టాక్ యార్డులు, చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణా చేసే టిప్పర్లకు ఉన్న జీపీఎస్‌లను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. అనధికారిక ఇసుక డంప్‌లను నిల్వ ఉంచిన, అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలను సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు.

 

మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా
జార్ఖండ్‌లోని రాంచీలో రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. జార్ఖండ్‌లో జరిగే ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలే కాదు, జార్ఖండ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎన్నికలని జార్ఖండ్‌లోని గొప్ప వ్యక్తులు నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సోరెన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్‌ షా తెలిపారు. జార్ఖండ్‌లో దుష్పరిపాలన, అవినీతిని అంతం చేస్తామని ఆయన అన్నారు. మట్టిని, కూతుళ్లను, రొట్టెలను కాపాడుతుందని, బీజేపీ ఏది చెబితే అదే చేస్తుందని అమిత్ షా అన్నారు. మేము మా తీర్మానాలన్నింటినీ నెరవేర్చామని, అధికారంలోకి రాగానే జార్ఖండ్ అభివృద్ధికి కృషి చేస్తామని షా అన్నారు. జార్ఖండ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అయితే ఇక్కడి నుంచే అవినీతిని అంతం చేస్తామన్నారు. హేమంత్‌ సోరెన్‌ ప్రధాని మోడీ నుంచి లక్ష కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడని, మీకు ధైర్యం ఉంటే జార్ఖండ్‌ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని అమిత్‌ షా అన్నారు. 2004 – 14 వరకు 10 సంవత్సరాలలో జార్ఖండ్‌కు ప్రభుత్వం రూ. 84 వేల కోట్లు ఇచ్చింది. ప్రధాని మోడీ 2014 – 24 మధ్య జార్ఖండ్‌కు రూ. 3 లక్షల 8 వేల కోట్లు ఇచ్చారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

 

యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపుల మెసేజ్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు. ఆయన పది రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఈ మెసేజ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు కాల్చి చంపేశారు. అలాగే, బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ సల్మాన్‌ ఖాన్ తో సన్నిహితంగా ఉన్నందుకే అతడ్ని చంపామని నిందితులు తెలిపారు. ఆ తర్వాత నుంచి పలువురికి లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జీశాన్‌ సిద్ధిఖీ కూడా హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడికి కూడా బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.

 

2027 ఆఖరిలో మళ్లీ ఎన్నికలు.. ఊహించని విజయం సాధిస్తాం..
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని విమర్శలు చేశారని.. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఎంతో కృషి చేశారన్నారు. కీలకమైన జిల్లాకు ఆయన అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు. వచ్చే ఎన్నికలలో14 స్థానాలకు 14 స్దానాల్లో గెలిచేలా భూమన కృషి చేస్తారని చెప్పారు. మళ్ళీ 2027లో ఊహించని విజయం సాధిస్తామన్నారు. అందరినీ ఈసారి కలుపుకుని విజయం సాధిస్తామన్నారు. జగన్‌ ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారని.. ఈ రోజు ప్రజలకు సంక్షేమం దూరం అయ్యిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుడిను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. విశాఖకు వెళ్లి రుషికొండ నిర్మాణాలను చూస్తున్నారన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులను నిర్మాణము చేస్తే ప్రవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామన్నారు. 2027 లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్ళీ మన నాయకుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమనదేనని వ్యాఖ్యానించారు. ఆయనలో ఉన్న నాయకత్వ పటిమతో రాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతామన్నారు.

 

బాలీవుడ్పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్
బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరాఠీ, బోజ్‌పురి, బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారు అని మండిపడ్డారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవన్నారు. ఒక వేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో ఫెయిల్ అయితే.. ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశం ఉందన్నారు. అయితే, హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని.. దాన్ని తమపై బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ద్రవిడ ఉద్యమాలన్నారు. ఈ మేరకు మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో ఉదయనిధి స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. అయితే, జాతీయవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి లాంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా వినియోగించారని డిప్యూటీ సీఎం ఉదయనిధి పేర్కొన్నారు. తద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని చెప్పుకొచ్చారు. సంస్కృతి, భాషాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమం.. 1930ల్లో, 1960ల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు కొందరు ‘జాతీయవాదులు’ ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా భారతీయ జనతా పార్టీపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.

 

బంగ్లాదేశ్లో రోడ్డెక్కిన 30 వేల మంది హిందువులు..
బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడి ఘటనలు ఎక్కువ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా హింస చెలరేగుతుంది. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ హిందువులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ నగరంలోని హిందువులు రోడ్డు మీదకు వచ్చారు. ఏకంగా 30 వేల మంది భారీ ర్యాలీ తీశారు. తమకు రక్షణ కల్పించాలని మధ్యంతర సర్కార్ కి విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు, నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ర్యాలీ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, ప్రజల్లో వ్యతిరేకత, విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు పారిపోయింది. ఆ తర్వాత తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక సర్కార్ ఏర్పడింది. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొని, ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు యూనస్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా కొనసాగుతారని అక్కడి సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు ఆగిపోయాయి. అయితే, దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై దాడులు క్రమంగా పెరిగిపోయాయి. గత ఆగస్టు నుంచి వేలాది మంది హిందువులపై దాడులు, దోపిడీ ఇతరత్రా అకృత్యాలు కొనసాగుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల హిందువులు ర్యాలీలు, నిరసనలకు దిగుతున్నారు.

 

ఇరాన్ లోని యూనివర్సిటీలో డ్రస్ కోడ్ కు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ
మహిళల దుస్తుల విషయంలో కఠిన చట్టాలు ఉన్న దేశం ఇరాన్. ఇరాన్‌లో మహిళలు తలకు స్కార్ఫ్‌లు, పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇలాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశంలో ఓ మహిళ తన బట్టలు విప్పి నిరసన తెలిపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టెహ్రాన్ ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ఓ విద్యార్థినికి అవమానం జరిగింది. విదేశీ మీడియా ప్రకారం, నైతిక పోలీసులు (బాసిజ్ మిలీషియా) మహిళను వేధించారు. ఆమె హిజాబ్, బట్టలు చింపేశారు. ఆ తర్వాత యూనివర్శిటీ బయట ఆ మహిళ నిరసనకు దిగింది. మహిళ డ్రెస్ కోడ్ ప్రకారం దుస్తులు ధరించలేదని, దాని కారణంగా నైతిక పోలీసులు ఆమెను హెచ్చరించారని.. మహిళ నిరసన ప్రారంభించిందని మరొక మీడియా కథనం. ఆ మహిళ తన బట్టలు విప్పి యూనివర్సిటీ బయట కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ఆ మహిళ యూనివర్సిటీ చుట్టుపక్కల వీధుల్లో తిరగడం ప్రారంభించింది. దీంతో ఇరాన్ అధికారులు విద్యార్థిని అరెస్ట్ చేశారు. అమీర్ కబీర్ అనే ఇరాన్ మీడియా వ్యక్తి, మహిళను అరెస్టు చేసే సమయంలో కొట్టారని పేర్కొన్నారు. ఇంతలో ఇరాన్ సంప్రదాయవాద ఫార్స్ న్యూస్ ఏజెన్సీ.. విద్యార్థి తరగతిలో “అనుచితమైన బట్టలు” ధరించారు. దుస్తుల కోడ్‌ను అనుసరించమని సెక్యూరిటీ గార్డులు హెచ్చరించారని చెప్పారు. హెచ్చరించబడిన తరువాత ఆ స్త్రీ “తన బట్టలు తీసివేసింది”. సెక్యూరిటీ గార్డులు విద్యార్థితో “శాంతంగా” మాట్లాడారని పేర్కొంది. ఇరాన్‌లో తప్పనిసరి దుస్తుల కోడ్‌కు సంబంధించి 2022 సంవత్సరంలో నిరసన కూడా వెలుగులోకి వచ్చింది. మహ్సా అమిని కస్టడీ మరణం తర్వాత, తప్పనిసరి డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా మహిళలు తమ స్వరాన్ని పెంచారు. ఈ నిరసన సందర్భంగా మహిళలు తమ హిజాబ్‌లను విప్పడమే కాకుండా వాటిని దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. చర్య తర్వాత ఈ ఉద్యమం శాంతించింది. ఈ ఉద్యమంలో 551 మంది నిరసనకారులు మరణించారు. వేలాది మంది అరెస్టయ్యారు.

 

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని ట్రూడో
కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాల్గొన్నారు. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై భారత్- కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. హ్యాపీ దీపావళి.. ఈ వారం వారితో సంబరాలు జరుపుకున్నాను.. ప్రత్యేక క్షణాలు గడిపానని ఎక్స్ (ట్విట్టర్)లో ట్రూడో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా చేతికి కట్టుకున్న తాళ్లను వీడియోలో చూపించారు. గత కొన్ని నెలలుగా కెనడాలోని పలు దేవాలయాలను తాను సందర్శించా.. గత కొన్ని నెలల్లో నేను మూడు హిందూ ఆలయాలను సందర్శించినప్పుడు కట్టిన తాళ్లు ఇవి అని చెప్పుకొచ్చారు. ఇవి తెగిపోయే వరకు వాటిని నేను తొలగించనని కెనడా ప్రధాని వెల్లడించారు. ఇక, దీపావళి సంబరాల దృశ్యాలను కూడా ఆ పోస్టులో పంచుకున్నాడు ట్రూడో. గతంలో ఆయన దీపావళి సందేశంలో ఇండో- కెనడా కమ్యూనిటీ లేకపోతే దేశంలో దీపావళి సాధ్యం కాదు అన్నారు. వీరు ఆర్టిస్టులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, లీడర్స్‌గా, సంస్కృతిపరంగా కెనడాలో బెస్ట్‌ అని చెప్పుకొచ్చారు. అయితే, మరోవైపు భారత్‌- కెనడా సంబంధాలు క్షిణించిన నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షం కూడా తొలుత దీపావళి వేడుకలకు దూరంగా ఉంది. ది ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా కెనడా (ఓఎఫ్‌ఐసీ) పార్లమెంట్‌ హాల్‌లో తలపెట్టిన దీపావళి సెలబ్రేషన్స్ కి హాజరుకానని ప్రతిపక్ష నేత పియర్రె పొయిలీవ్రే తెలిపారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆయన కార్యాలయం రియాక్ట్ అయింది. దీంతో ఆయన కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు.

 

ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య
ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మఠం’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన మఠం గురు ప్రసాద్‌గా ప్రసిద్ధి చెందారు. అపార్ట్‌మెంట్‌లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మఠం గురుప్రసాద్ టాటా తన న్యూ హెవెన్ అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఈ అపార్ట్మెంట్లో 8 నెలలు నివసించాడు. ఆదివారం అతని మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. మఠం గురుప్రసాద్‌కు చెందిన అపార్ట్‌మెంట్‌ నుంచి ఆదివారం ఉదయం దుర్వాసన వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మదనాయకనహళ్లి పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మఠం గురుప్రసాద్ మొదట గిరినగర్‌లో నివసించారు. 8 నెలల క్రితం బెంగళూరు నార్త్ తాలూకా మదనాయకనహళ్లిలోని టాటా న్యూ హెవెన్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. కొన్ని నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మఠం, డైరెక్టర్ స్పెషల్, ఎడ్డెలు మంజునాథ్, రంగనాయక సహా పలు చిత్రాలకు గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సంభాషణకర్తగా కూడా గుర్తింపు పొందారు.

Show comments