NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

గిఫ్ట్‌గా ఇచ్చిన కారును వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజుకు జనసేన కార్యకర్తలు ఎంతో ఇష్టంతో ఓ కారును కొనిచ్చారు.. రెండు రోజుల క్రితం ఆయనకు జనసైనికులు కారును బహుకరించారు.. అయితే, గిఫ్ట్‌గా ఇచ్చిన కారును తిరిగి వెనక్కి ఇచ్చేశారు ఎమ్మెల్యే.. డౌన్ పేమెంట్ తో టయోటా ఫార్చునర్ కారు కొన్న జనసైనికులు.. మంగళవారం రోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్టుగా అందించారు. దీనికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.. తనపై అభిమానం చూపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే విషయంలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తానని.. అందుకే కారు వెనక్కి చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఏడేళ్లుగా పోలవరం నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్నానని.. ఇదే తరహాలో ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా కూడా తెలియదు..!
క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సాగునీటి వ్యవస్థను భ్రష్టు పట్టించారు అనడానికి పులిచింతల, పోలవరం ఒక ఉదాహరణగా నిలిచాయాని విమర్శించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు… ప్రజల తాగు నీటి అవసరాలు కూడా ప్రాజెక్టులలో నీటిని నిలువ చేయలేకపోయారని మండిపడ్డారు. పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల.. తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయమని అధికారులను.. విశాఖపట్నం పంపిన వైఎస్‌ జగన్.. ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కరువు రహిత దేశంగా, రాష్ట్రంగా ఉండాలి అంటే నదుల అనుసంధానం ముఖ్యం అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది.. కాబట్టి, ముందు చూపుతో పట్టిసీమ ప్రారంభించారన్నారు. పట్టిసీమ ప్రారంభించినప్పుడు ఒట్టి సీమ అంటూ.. వైఎస్ జగన్ అవహేళన చేశారని, ఇప్పుడు అదే పట్టిసీమ ద్వారా రైతుల కష్టాలు తీర్చుతున్నమని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ప్రయాణీకులకు చుక్కలు..! 10 రైళ్లు రద్దు.. మరో 15 సర్వీసులు రీ షెడ్యూల్
ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తోంది రైల్వే శాఖ.. విజయవాడ – విశాఖపట్నం మార్గంలో 10 రైళ్లను రద్దు చేయడంతో పాటు.. మరో 15 సర్వీసులు రీ షెడ్యుల్ చేసింది… పగటి పూట వెళ్లే రైళ్లు రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైల్వే ప్రయాణికులు.. మరోవైపు, రిజర్వేషన్ టికెట్లు అర్థంతరంగా రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రద్దైన రైళ్ల జాబితాలో సింహాద్రి, రత్నాచల్, ఉదయ్ ఎక్స్ ప్రెస్, రాయగడ ట్రైన్ ఉన్నాయి.. విశాఖ – విజయవాడ మధ్య రోజూ వేలాది మందితో రాకపోకలు సాగించే రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.. దీంతో.. రైల్వే శాఖపై మండిపడుతున్నారు. మరోవైపు.. ప్రయాణీకుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో విశాఖ – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను పునరుద్ధరించారు అధికారులు.. విజయవాడ – ఖాజీపేట మీదుగా వెళ్ళాల్సిన ఏపీ ఎక్స్ ప్రెస్ దారి మళ్లించారు.. ఇక, ఆగస్టు 10వరకు రద్దైన రైళ్లను పరిశీలిస్తే.. రాజమండ్రి – విశాఖ ప్యాసింజర్, విశాఖ – మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, విశాఖ – తిరుపతి డబుల్ డెక్కర్ సహా మరికొన్ని ఉన్నాయి.. కడియం – నిడదవోలు, ఖాజీపేట – బల్లార్షా సెక్షన్ల మధ్య జరుగుతున్న రైల్వే సేఫ్టీ వర్క్స్ కారణంగా సర్వీసులు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించిన విషయం విదితమే..

టూరిజం రంగానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్.. మరొకరు అవసరంలేదు..
ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం రంగానికి బ్రాండ్‌ అంబాసిడర్.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మాకు మరో బ్రాండ్‌ అంబాసిడర్ అవసరంలేదన్నారు ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్.. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టూరిజం శాఖ అవినీతిమయమైందని ఆరోపించారు. ప్రక్షాళన చేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. గత ప్రభుత్వానికి టూరిజం అధికారులు అనుకూలంగా వ్యవహరించి కోట్లాది రూపాయలు దోచేశారని విమర్శించారు. ఇక, పులివెందులలో 4స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు గుప్పించారు.. ఇక, తెలుగు సినిమా రంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు మంత్రి కందుల.. ప్రైవేట్ మరియు పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌లో సినిమా రంగానికి మౌలిక వసతులు కల్పిస్తాం అన్నారు.. టూరిజం అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరతాం అన్నారు మంతరి కందుల దుర్గేష్..

బీఆర్ఎస్ కు మరో షాక్.. నేడు కాంగ్రెస్ లోకి కేకే..
తెలంగాణలో చేరిక అంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఎంపీ కే. కేశవరావు కలిశారు. కేకే తో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అనంతరం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కేకే.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్‌ఎస్‌ ను వీడారు. మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరగా, కేకే ఇంకా ఆ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏఐసీసీ నేతల సమక్షంలో కేకే పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈరోజు కేకేతో పాటు మరెవరైనా చేరబోతున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది.

జులై 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు.. ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరణ..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించారు. సీఎంఆర్‌ఎఫ్‌ అమలును పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత CMRFకి సంబంధించిన కోడ్ ఇవ్వబడుతుంది. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపబడుతుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, CMRF దరఖాస్తు ఆమోదించి అబ్దిదారునికి చెక్కు సిద్ధం అందచేయబడతుంది. దరఖాస్తుదారు ఖాతా సంఖ్య చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత ఆన్‌లైన్..దరఖాస్తుదారుల ద్వారా మాత్రమే సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వ అధికారులు https//cmrf.telangana.gov.in\ సైట్ ద్వారా తమ దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.

పరారీలో భోలే బాబా.. హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య..
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హత్రాస్ లోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరుకుంది. కాగా.. సత్సంగ్ నిర్వహించిన తర్వాత జరిగిన ఘటనతో ‘భోలే బాబా’ పరార్ అయ్యాడు.. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో అధికారులు ఇప్పటికే సోదాలు నిర్వహించారు. బాబా కనిపించలేదని డీఎస్పీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 మంది డెడ్ బాడీలను అలీగఢ్ కు తరలించినట్లు పోలీసులు తెలపగా.. అందులో 19 మందిని గుర్తించామన్నారు. కాగా, భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్‌ హరి సత్సంగంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అసలు భోలే బాబా ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆయన పటియాలి తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లుగా చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. 17 ఏళ్ల పాటు ఇందులో పని చేసి.. 26 ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లు ప్రచారం అవుతుంది. తనకు గురువు కూడా ఎవరూ లేరని చెప్పాడని స్థానికులు తెలిపారు. సమాజం కోసం ఆధ్యాత్మిక బాట పట్టినట్లు భోలే బాబు చెప్పారు.. తెల్లటి సూట్, టైతో ఆయన బోధనలు చేస్తుంటాడు అని అక్కడికి వచ్చిన భక్తులు వెల్లడించారు.

మణిపూర్లో భారీ వర్షాలు.. కార్యాలయాలు మూసివేత..!
మణిపూర్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయికే ఇవాళ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, స్కూల్స్, కాలేజీలను మూసివేశారు. కాగా, మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ సైతం రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు, సరస్సులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సైతం వరదలు ముంచెత్తాయి. అయితే, మణిపూర్‌ రాష్ట్రంలోని ప్రధాన నదుల నీటి మట్టాలు క్రమంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,530గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,900గా.. 24 క్యారెట్ల ధర రూ.72,980గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. వెండి ధరలు ఈ రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.50 పెరిగి.. రూ.91,050గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,050గా ఉండగా.. ముంబైలో సైతం రూ.91,050గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.96,000లుగా నమోదవ్వగా.. బెంగళూరులో రూ.450 పెరిగి అత్యల్పంగా రూ.90,500గా ఉంది.

నేటి రాత్రికి భారత్కు టీమిండియా ప్లేయర్స్..
బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు ఈరోజు అర్థరాత్రి వరకు భారతదేశానికి చేరుకోనుంది. ఇండియాకు వచ్చిన తర్వాత టీమిండియా క్రికెట్ బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత, 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలో భారత జట్టు ప్లేయర్లు ఓపెన్ బస్సులో పరేడ్ చేయనున్నట్లు సమాచారం. ఇక, టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ రెండోసారి గెలుచుకుంది. 2007లో టైటిల్‌ను గెలుచుకున్న టీమ్.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024లో టైటిల్‌ను సాధించింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచినప్పుడు.. మొత్తం జట్టును ఓపెన్ బస్సులో ముంబై నగరంలో తిప్పారు. ఆ సమయంలో వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ వారికి ఆపూర్వ మద్దతు ఇచ్చారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ముంబైలో ఓపెన్ బస్సులో టీమిండియా ప్లేయర్స్ చక్కర్లు కొట్టనున్నారు అని సమాచారం. అయితే, బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా.. రోహిత్ సేన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. తుఫాన్ ఎఫెక్ట్ తో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడ చిక్కుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు, వారి కుటుంబాలు భారతదేశానికి తిరిగి ఈరోజు అర్థరాత్రి 1 గంట తర్వాత చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత బృందం రేపు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలివనున్నారు.

నీట్‌ పరీక్షను రద్దు చేయాలి.. స్టాలిన్‌ సర్కారుకు దళపతి మద్దతు
నీట్‌ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్‌ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నీట్ పరీక్ష లీక్ కారణంగా విశ్వసనీయతను కోల్పోయిందన్నారు.

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్
తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి ‘గరుడన్‌’తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. బ్లాక్‌బస్టర్ విడుతలై తర్వాత ప్రధాన నటుడిగా సూరి నటించిన ‘గరుడన్’ రెండవ చిత్రం. విడుతలై చిత్రానికి దర్శకత్వం వహించిన వెట్రిమారన్ గరుడన్ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రానికి ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ దురై గతంలో ధనుష్‌తో పట్టాస్, కోడి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ‘గరుడన్‌’ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్‌ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి తమిళ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అలాగే తెలుగులో అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. థియేట్రికల్, ఓటీటీ విడుదల మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉంది.