NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సీఎం, డిప్యూటీ సీఎంకు హరిరామ జోగ్య సంచలన లేఖ.. ఆ పథకాలు వెంటనే అమలు చేయాలి..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి.. ముఖ్యంగా జనసేన-టీడీపీ పొత్తుకంటే మొదటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య.. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా లేఖలు రాస్తూ వస్తున్నారు.. తాజాగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోజ్‌ చేసిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలన్నారు.. సూపర్‌ సిక్స్‌లోని కొన్ని పథకాలు ఎంత ఉపయోగపడతాయో షణ్ముఖ వ్యూహంలోని మరికొన్ని పథకాలు అంతకుమించి ఉపయోగంగా చెప్పటానికి ఏ మాత్రం సందేహం లేదని పేర్కొన్నారు.. సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన సూచించిన పథకాలు అమలు చేయాలని లేఖలో సూచించిన హరి రామజోగయ్య.. యువకులకు 10 లక్షల రూపాయలు వరకు సబ్సిడీ అందజేసే సౌభాగ్య పథకం బృహత్తరమైనది.. సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని యువత కోరుకుంటున్నారు.. సంపద చేకూర్చే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.. అందుకే సంపద కూర్చే పథకానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువస్తున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య.

మా భార్యలను కాపురానికి పంపండి.. కలెక్టరేట్‌ వద్ద ఇద్దరు అల్లుళ్ల దీక్ష..
తమ భార్యలను కాపురానికి పంపాలంటూ.. అత్తింటికి వెళ్లే అల్లుళ్లను చూశాం.. మరీ అయితే.. నలుగురిని పిలిచి పంచాయితీ పెట్టే వారు లేకపోలేదు.. అయితే, ఓ ఇద్దరు అల్లుళ్లు మాత్రం.. ఏకంగా కలెక్టరేట్‌ వద్దే ఆందోళనకు దిగారు.. తమ భార్యలను కాపురానికి పంపండి అంటూ.. టెంట్‌ వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.. అంతేకాదు.. తమ భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఇద్దరు అల్లుళ్ల రిలే నిరాహారదీక్ష ఆసక్తికరంగా మారింది.. తమ మామ అయ్యంగార్ ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా.. తమను వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ అల్లుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యలను ఇంటి వద్ద ఉంచుకుని.. తిరిగి తమపైనే కేసులు పెడుతున్న మామపై చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలంటూ అల్లుళ్లు వి. పవన్‌, పీబీ శేషసాయి డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో నిపుణుల బృందం పర్యటన..
అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు ఐఐటీ నిపుణులు. గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్యం వల్ల ఐకానిక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. పునాదులు వేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. గత ఐదేళ్లూ పునాదుల్లో నీళ్లు చేరి చెరువును తలపిస్తోంది ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణ ప్రాంగణం. పడవల్లో వెళ్లి పునాదులను పరిశీలించారు ఐఐటీ చెన్నై ఇంజనీర్లు. పునాదుల్లో నీళ్లు ఎప్పటి నుంచి ఉన్నాయని సమాచారం సేకరిస్తోన్నారు నిపుణులు. పునాదుల్లో మట్టి, కంకర శాంపిల్స్ తీసుకున్నారు నిపుణులు. ఇన్నేళ్లూ నీళ్లల్లో పునాదులు ఉండిపోవడంతో భవిష్యత్ నిర్మాణాలకు ఎంత వరకు అనువుగా ఉంటుందని పరిశీలిస్తోంది నిపుణుల బృందం.. నిన్న ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణులు పరిశీలించిన విషం విదితమే.. అయితే, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల పటిష్టతపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి ఐఐటీ నిపుణుల బృందాలు.

ములుగులో పరిశ్రమ ఏర్పాటు చేస్తాం..
ములుగులో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. అభివృద్ధి. అంత పట్టణాలకు కేంద్రం అవుతుందన్నారు. పట్టణీకరణతో వలసలు పెరిగాయన్నారు. దీనికి కారణం గ్రామాల్లో ఊపాది లేకపోవడంతో పట్టణాలకు వెళుతున్నారని తెలిపారు. పల్లెల్లో ఉపాధి అవకాశం కలిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అందులో భాగంగా.. గ్రామాల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ములుగులో కూడా పరిశ్రమ ఏర్పాటు చేస్తామని శుభవార్త చెప్పారు. ప్రజల కోసం కాదు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. అధికారం పోయింది అనే అక్కస్సు తోనే కొలువుల కోసం ధర్నాలు అంటున్నారని తెలిపారు. 10 ఏళ్ల అధికారం లో ఉండగా ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల కోసం అంటూ ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. డీఎస్సీ పెట్టినం ఇవి తట్టుకోలేక.. మొన్నటి వరకు అధికారం లో ఉన్నవాళ్లు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న పడ్డా వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల మరమ్మత్తులకోసం మరిన్ని నిధులు ఇస్తామన్నారు.

హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్.. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 1600 మంది..
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’తో మెరుపు వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 15 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరం చేశారు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో కీలక రహదారుల్ని క్లోజ్ చేశారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేదార్‌నాథ్‌లో 1600 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. గౌరీకుండ్-హరిద్వార్ మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్ర ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతోంది. యాత్రికులను తరలించడానికి ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. మరోవైపు తప్పిపోయిన వారి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 3000 మందిని రక్షించారు. కేదార్‌నాథ్ యాత్రని తాత్కాలికంగా మూసేశారు.

హైదరాబాద్‌లో విక్రయానికి లక్ష ఇళ్లు..గత ఐదేళ్లలో పెరిగిన ధరలు
హైదరాబాద్‌లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ విశ్వనగరం ఆకాశహర్మ్యాలతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. భారీగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల విక్రయాల్లో 29 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2019 నుంచి 2024 వరకు సీఏజీఆర్‌ గణాంకాలను క్రెడాయ్‌ హైదరాబాద్, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి మార్కెట్‌ పరిస్థితి భారీగా పుంజుకుంది. 2019 ప్రథమార్ధంతో పోలిస్తే 2024లో విక్రయాల్లో 148 శాతం వృద్ధి నమోదైంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ కల్గిన స్థిరాస్తుల విక్రయాల్లో ఏకంగా 760 శాతం వృద్ధి సాధించింది. అమ్మకానికి లక్షకుపైగా ఇళ్లు ఉన్నాయని నివేదిక తెలిపింది. నిర్మాణ రంగంలో ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఐదేళ్ల క్రితం విక్రయించిన ఇళ్ల విలువ రూ.34,044 కోట్లు ఉంటే.. గతేడాది రూ.1,15,759 కోట్లకు చేరింది.

మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ఆడవారికి గుడ్ న్యూస్.. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. అలాగే.. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటి ధర కంటే.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర రూ. 100 తగ్గింది. అదే విధంగా.. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్ లో ఒక గ్రాము ధర రూ. 7,058 ఉంది. 8 గ్రాముల ధర రూ. 56,464 ఉంది. 10 గ్రాముల ధర రూ. 70,580 గా ఉంది. నిన్నటి ధరతో చూస్తే.. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గింది. మరోవైపు.. వెండి ధరలు కూడాఈరోజు తగ్గాయి. హైదరాబాద్లో ఒక గ్రాము వెండి ధర రూ. 90.90 ఉంది. 8 గ్రాముల వెండి ధర రూ. 727 ఉంటే.. 10 గ్రాముల వెండి ధర రూ. 909 ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఇవాళ కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 90,900 గా ఉంది. అటు.. విజయవాడలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంటే.. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. విజయవాడలో ఒక గ్రాము ధర రూ. 7,058 ఉంది. అదే.. 8 గ్రాముల ధర రూ. 56,464 ఉంటే.. 10 గ్రాముల ధర రూ. 70,580 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే.. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గింది.

ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్
పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, తన ఆనందం దానికే పరిమితం కాలేదు. స్వర్ణం గెలిచిన వెంటనే తోటి ఆటగాడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. డబుల్స్ ప్లేయర్ యుచెన్ మెకాళ్లపై కూర్చుని ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో.. హువాంగ్ ఆశ్చర్యం, ఆనందంతో ఓకే చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ ఇదే తొలిసారి. కాగా.. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హువాంగ్, జెంగ్ సి వీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో 21-8 21-11తో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వాన్ హో.. జియోంగ్ నా యున్‌లను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మెడలో బంగారు పతకాన్ని ధరించి, చైనాకు చెందిన మరో బ్యాడ్మింటన్ సహచరుడు లి యుచెన్‌ను కలవడానికి వచ్చింది. లి మొదట ఆమెకు ఒక పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి.. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చుని హువాంగ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇది చూసిన హువాంగ్ ఆశ్చర్యం, ఆనందానికి గురై ఓకే చెప్పేసింది. అనంతరం హువాంగ్ మాట్లాడుతూ.. పారిస్‌లో ఎంగేజ్మెంట్ రింగు తాను ఆశించడం లేదని.. ఆటలకు సన్నద్ధం కావడంపై పూర్తిగా దృష్టి సారించానని తెలిపింది. యుచెన్, అతని డబుల్స్ భాగస్వామి Ou Xuan Yi పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో పోటీ పడ్డారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేతలు యుచెన్, జువాన్ డ్రా తర్వాత గ్రూప్ దశ నుండి నిష్క్రమించడంలో విఫలమయ్యారు. హువాం, జెంగ్ సి వీ పారిస్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. వారు కిమ్ వాన్ హో.. జియోంగ్ నా యూన్‌లపై ప్రారంభం నుండి చివరి వరకు ఆధిపత్యం చెలాయించారు. కొరియా జోడీని 21-8, 21-11తో ఓడించేందుకు కేవలం 41 నిమిషాలకే పట్టింది.

వయనాడ్‌ బాధితులకు రష్మిక సాయంపై ట్రోలింగ్?
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ ప్రభుత్వం రక్షణ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కేరళ సీఎం సహాయ నిధి సమకూరుస్తుండగా, అందులో ప్రముఖులు కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక, సూర్య, కార్తీ, విక్రమ్‌లు రిలీఫ్ ఫండ్‌ని విరాళంగా ఇవ్వగా తెలుగు నుంచి నాగవంశీ కూడా ఐదు లక్షలు అందించారు. రష్మిక మందన్న 10 లక్షల రూపాయలు సహాయ నిధికి అందించింది. వాయనాడ్‌లోని పెను విషాదం ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది. వాయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల పునర్నిర్మాణం, ప్రాణాలతో బయటపడిన వారి పునరావాసం కోసం కేరళ ప్రభుత్వ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి నటుడు ఫహద్ ఫాసిల్ అతని భార్య నజ్రియా మొత్తం 25 లక్షలు ఇచ్చారు. సూర్య, జ్యోతిక, కార్తీ మొత్తం 50 లక్షలు ఇచ్చారు. మమ్ముట్టి 15 లక్షలు, దుల్కర్ సల్మాన్ 10 లక్షలు ఇచ్చారు. కొడగుకు చెందిన రష్మిక మందన్న ఇప్పుడు కేరళ సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీన్ని చూసి సంతోషించే వారికంటే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నవారే ఎక్కువవడం గమనార్హం. కొడగు గాట్ సెషన్‌లలో భూమి క్షీణత జరుగుతోంది, కానీ మీకు సహాయం చేసే మనస్సు లేదు, కానీ వాయనాడ్ కి ఇచ్చారా అంటూ కొడగు లోకల్ జనాలు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. తన సొంత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ప్రజలు చనిపోయి, ఇళ్లు కోల్పోయారు. పుట్టిన ఊరిని గౌరవించకుండా ఎక్కడో జరిగిన దానికి సహాయం చేస్తారా అనే ట్రోలింగ్ జరుగుతుంది.

మరో ఓటీటీలో చైతన్య రావ్ ‘డియర్ నాన్న’
యంగ్ టాలెంటెడ్ హీరో చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అంజి సలాది దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాకేష్ మహంకాళి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించగా ముందుగా ఆహాలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుంది. కరోనా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటింది. హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న. చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా ఇందులో చూపించారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలని ఈ సినిమాలో చూపించారు. ఫాదర్ ఎమోషన్ సన్ ఎమోషన్ లో ఇందులో మరో హైలెట్ అని చెప్పొచ్చు. చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని అలరించేలా ఉన్నాయి. అనిత్ కుమార్ మాధాడి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్.

వరుణ్ సందేశ్ సినిమాలో వేణు స్వామి?
అదేంటి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ సినిమాలలో కూడా నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోవద్దు. ఒకప్పుడు వేణు స్వామి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయన నటించలేదు కానీ ఆయనను పోలి ఉన్న ఒక పాత్రను సృష్టించి నవ్వించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజి అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ రామకృష్ణ అనే ఒక పాత్రను సృష్టించారు. రఘు కారుమంచి నటించిన ఈ పాత్ర డిజైన్ చేసిన తీరు చూస్తే కచ్చితంగా అది వేణు స్వామిని ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన పాత్ర అని ఇట్టే అర్థమవుతుంది. దీంతో వేణు స్వామి క్రేజ్ కేవలం సోషల్ మీడియా, మీడియాకే పరిమితం కాలేదు. ఏకంగా సినిమాల్లో పాత్రలు సృష్టించే వరకు వెళ్లిందని చెప్పచ్చు. ఈ పాత్ర అనే కాదు ఈ మధ్యకాలంలో వేణు స్వామి మీద కౌంటర్లు వేస్తున్నామనే భావనలో చాలామంది దర్శకులు వేణు స్వామి లాంటి పాత్రలను సృష్టించి వాటి మీద కౌంటర్లు వేయిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఈ విరాజి దర్శకుడైతే ఏకంగా ఒక పెద్ద పాత్రను సృష్టించడం గమనార్హం. ఇక ఈ సినిమాకి మంచి టాక్ లభిస్తోంది. నిడివి తక్కువ ఉండడం అయితే కాస్త సినిమాకి కలిసొచ్చిన అంశంలా తోస్తుంది.