NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పెన్షన్ల పంపిణీకి గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన సర్కార్.. ఒకేరోజు పూర్తిచేయాలి..!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లలు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసింది.. అది కూడా అప్పటి వరకు ఉన్న వాలంటీర్‌ వ్యవస్థ సపోర్ట్‌ లేకుండానే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది చంద్రబాబు సర్కార్‌.. ఇక, జులై నెల ముగింపునకు వచ్చింది.. దాంతో ఆగస్టు 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి రెడీ అవుతోంది.. పింఛన్ల లబ్ధిదారులకు ఒక్కరోజులోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ సర్కార్‌.. పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. పెన్షన్ పంపిణీ రోజే.. ఆగస్టు 1వ తేదీనే దాదాపు 99 శాతం పంపిణీని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేసింది.. ఇక, గత నెలలో మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్‌తో కలిసి.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈసారి.. అంటే ఆగష్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్‌ మరో రెండు గేట్లు ఎత్తివేత..
ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర నుంచి క్రమంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.. దీంతో.. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. సోమవారం సాయంత్రం 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు.. ఈ రోజు మరో రెండు గేట్లను ఎత్తివేశారు.. దీంతో.. శ్రీశైలం జలాశయం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.. ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌కు ఇన్‌ ఫ్లో రూపంలో 4,42,441 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఐదు గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తడంతో పాటు.. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కలుపుకొని.. మొత్తం 1,95,457 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.. ఇక, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిటమటం 885 అడుగులు కాగా… ప్రస్తుతం నీటిమట్టం 882.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు.. అయితే, ప్రస్తుతం ప్రాజెక్టులో 201.5822 టీఎంసీలు నీరు ఉంది.. మరోవైపు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలోవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అధికారులు.. అయితే, ఇన్‌ఫ్లో మరింత పెరిగితే.. మరిన్ని గేట్లను కూడా ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.. ఎప్పటికప్పుడు.. ఇన్‌ఫ్లోను నిషితంగా పరిశీలిస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు..

జీవీఎల్‌ హాట్‌కామెంట్స్.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు..!
బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్‌ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు.. 10 ఏళ్లు ఏపీ ప్రజలు ఇచ్చిన సీట్లతో అధికారం చేసి రాష్ట్రం గొంతు నులిమేశారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామంగా అభివర్ణించారు. రాష్ర్ట విభజన తర్వాత ఏపీ నష్ట పోవడానికి.. రాజధాని లేకపోవడమే కారణం అన్నారు జీవీఎల్.. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం అన్న ఆయన.. ప్రధానిని కీలు బొమ్మను చేసి జనపథ్ నిర్ణయాలు అమలు చేసిన రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు.. అసెంబ్లీ, పార్లమెంట్‌ అయినా 10 శాతం సీట్లు రాకపోతే హోదా రాదు అంటూ వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు.. ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదన్నారు.. కోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చు.. కానీ, పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో పెద్దగా జోక్యం వుంటుందని అనుకోవడం లేదన్నారు.. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది అతి ఆలోచన.. రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు..

ఏపీ అసెంబ్లీని ప్రొరోగ్ చేసిన గవర్నర్.. సర్కార్‌కు లైన్‌ క్లియర్‌
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీని ప్రొరోగ్‌ చేశారు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు.. ఇక, అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది.. దీంతో.. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీపై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.. సుమారు రూ. 1 లక్ష కోట్లతో నాలుగు నెలల కోసం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.. ఇవాళ లేదా రేపు ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేస్తుందనే చర్చ సాగుతోంది.. కాగా, సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది అప్పటి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతామని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుందని భావించినా.. వివిధ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చిన సర్కార్‌.. అసలు, బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కూడా వీలుగా ఉన్న పరిస్థితులు లేవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.. ఈ నేపథ్యంలో.. నాలుగు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి.. ఆ తర్వాత మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు ఆర్థికనిపుణులు..

కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకొస్తున్న ఏఐ..గూగుల్ కి గట్టిపోటీ
సెర్చ్ ఇంజిన్ గా మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న గూగుల్ గట్టి పోటీ ఎదురవనుంది. ఈ కంపెనీ ఏఐ సాంకేతికతలో సరికొత్త విప్లవానికి తెరలేపిన విషయం తెలిసిందే. చాట్ జీపీటీ ని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. ఈ సెర్చ్ ఇంజిన్ కు ‘సెర్చ్ జీపీటీ’ అనే పేరు ఖారారు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ ఫీచర్ వాడుకలోకి వస్తే.. గూగుల్ కు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం సెర్చ్ జీపీటీ అతికొద్ది మంది యూజర్లు, పబ్లిషర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మరికొంత మందికి దీని యాక్సెస్ ఇవ్వనుంది సంస్థ. సెర్చ్ జీపీటిని పొందాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. దీనికి సంబంధించిన ఫీచర్లను ఓపెన్ ఏఐ వెబ్ సైట్లో ఉంచింది. ఇది ఎలా ఉంటుంది? ఎలా పనిచేస్తుందో వివరిస్తూ..ఓ వీడియోను సైతం పంచుకుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.. యూజర్లు అడిగే క్వెరిలీకు ఏఐ సామర్థ్యంతో వెబ్ మొత్తం వెతికి సరైన సమాధానాలను అతి తక్కువ సమయంలోనే అందిస్తుంది. ఇదే ప్రోటో టైప్ సెర్చ్ జీపీటీ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

విరాళాల సేకరణపైనే కాకుండా.. భక్తులకు మెరుగైన సేవలపై దృష్టి పెట్టండి..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.. టీటీడీ అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించడం అని కాకూండా.. భక్తులకు మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాలన్నారు.. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మప్రచారానికి టీటీడీ వేదికగా మారాలని సూచించారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడడంతో.. టీటీడీలో కూడా మార్పులు వస్తాయని ఆశాభావాని వ్యక్తం చేశారు.. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు వైభవంగా, సక్రమంగా నిర్వహించేలా.. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై టీటీడీ దృష్టి సారించాలన్నారు ఎల్వీ సుబ్రమణ్యం..

నాగదేవత విగ్రహంపై నాగుపాము.. అంతా ‘శివయ్య’ మహిమ!
హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఓదెల మండల కేంద్రంలోని శ్రీశంభులింగేశ్వర, అభయాంజనేయ స్వామి ఆలయాల ఆవరణలో సోమవారం ఓ భారీ నాగుపాము సంచరించింది. చివరకు ఆలయాల సమీపంలోని మర్రిచెట్టు కింద ఉన్న నాగదేవత విగ్రహంపై పడగ విప్పింది. విగ్రహంపై పాము చాలా సమయం అలానే ఉంది. స్థానికులు నాగదేవత విగ్రహంపై ఉన్న పామును వీడియో తీసి వాట్సాప్​లో షేర్ చేశారు. దీంతో విషయం నిమిషాల వ్యవధిలో ఊరంతా పాకింది. స్థానికులు, భక్తులు తరలివచ్చి.. నాగుపామును ఆసక్తిగా తిలకించారు.

వామ్మో.. ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ రూ. 8,500 కోట్లు
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి. అయితే, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (SBI) 2020 ఆర్థిక సంవత్సరం నుంచే మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీని వసూలు చేయడం నిలిపివేసింది. కానీ గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ మొత్తం 38 శాతం పెరిగింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. 2020 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ జరిమానాగా రూ. 8,500 కోట్లు వసూలు చేశాయి. సమాచారం ప్రకారం.. కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ పరిమితి నగరాలు, గ్రామాలలో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని పట్టణ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతాలో కనీస త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ. 2,000. పట్టణాలకు రూ.1000, గ్రామాలకు రూ.500. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నగరాల్లో రూ.250, పట్టణాల్లో రూ.150, గ్రామాల్లో రూ.100 వరకు మినహాయించుకోవచ్చు.

మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!
మగువలకు శుభవార్త అనే చెప్పాలి. గత మూడు రోజుల్లో రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జూన్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి.. రూ.63,200లుగా ఉంది. 24 క్యారెట్లపై రూ.210 తగ్గి.. రూ.68,950గా నమోదైంది. రెండు వారాల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుదలకు తోడు బడ్జెట్‌ 2024లో కస్టమ్స్‌ సుంకం తగ్గించడంతో భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200లుగా ఉండగా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,950గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,350 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.69,100గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.68,950గా నమోదైంది. చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల ధర రూ.63,850గా.. 24 క్యారెట్ల ధర రూ.69,650గా కొనసాగుతోంది. మరోవైపు ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధర నిన్న రూ.500 పెరగా.. నేడు అంతే తగ్గింది. మంగళవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.84,500గా ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.89,000గా నమోదైంది. ఇటీవలి రోజుల్లో కిలో వెండి ధర లక్ష దాటిన విషయం తెలిసిందే.

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టీ20 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ మీద భారత్‌ కన్నేసింది. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో టీ20కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ కండరాలు పట్టేయడంతో రెండో మ్యాచ్ ఆడని గిల్.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం. మెడ కండరాలు పట్టేయడంతో శుభ్‌మన్ గిల్ రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ గెలవడంతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. తొలి టీ20లో గిల్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆగస్టు 2 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌కు కూడా గిల్ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో కొలంబో వేదికగా వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడనున్నారు. ఇప్పటికే ఇద్దరు శ్రీలంకకు చేరుకున్నారు.

మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?
లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వంలో నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కాగా కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన 20 రోజులకు అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది సత్యభామ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 27 తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేసింది. తాజాగా సత్యభామ మరో ఓటీటీలో విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన సత్యభామను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆయిన ఈటీవీ విన్ ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించింది సదురు ఓటీటీ సంస్థ. కాజల్ ముఖ్య పాత్రలో వచ్చిన సత్యభామను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాతలు. కాజల్ ను పోలీస్ రోల్ లో చేసే యాక్షన్ సిక్వెన్స్ ఇష్టపడేవారు ఓటీటీలోకి ఉన్న సత్యభామను చూసేయండి. ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు అలాగే శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి లు నిర్మాణం వహించారు.