న్యూఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. కత్తి, బీర్ బాటిళ్లతో దాడి..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పి. గన్నవరం మండలం ఉడిముడి (ఉడుముడి) గ్రామంలోని శివాలయం సమీపంలో కొంతమంది యువకులు చలిమంట కాగుతూ న్యూఇయర్‌ను స్వాగతించే ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన యువకులు అక్కడకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఒక యువకుడిని చాకుతో పొడిచారు.. మరొకరిపై పగిలిన బీర్ బాటిల్‌తో దాడి చేసి పొడిచారు.. దాడి అనంతరం గాయపడిన యువకులు రక్తస్రావంతో కుప్పకూలారు.. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక, సమాచారం అందుకున్న పి. గన్నవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన 14 మంది యువకులపై కేసు నమోదు చేశారు.. ఘర్షణకు కారణాలు, ముందస్తు విభేదాలపై విచారణ జరిపించారు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.. స్థానికుల కథనం ప్రకారం, యువకుల మధ్య పాత వ్యక్తిగత విభేదాలే ఈ ఘర్షణకు ప్రధాన కారణంగా అనుమానిస్తున్నారు. పండుగ రాత్రి కవ్వింపులు ఆ వివాదాన్ని మళ్లీ రగిల్చాయని తెలుస్తోంది. న్యూఇయర్ వంటి వేడుకల్లో మద్యం ప్రభావంతో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్..
గన్నవరం విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలు అత్యవసర పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు, అలాగే ముంబై నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న రెండు విమానాలను, హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు అనుకూలం కాకపోవడంతో, విమానాశ్రయం అధికారులు గన్నవరం విమానాశ్రయంలో సురక్షిత ల్యాండింగ్ కు నిర్దేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను ఈ రోజు ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది.. వాతావరణ పరిస్థితులు కారణంగా విమానాలు ప్రాధాన్యంగా భూమిపై సేఫ్‌గా దిగడానికి గన్నవరంను ఎంపిక చేశారు. ఈ క్రియాశీల నిర్ణయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం సమర్థంగా నిర్వహించింది. అయితే, ఒక్కో విమానంలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్నారు.. సురక్షితంగా ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులు భూమిపై దిగినారు.. ఎవరికైనా గాయాలు, ఇబ్బందులు నమోదవలేదని వచ్చిన ప్రాథమిక నివేదికలు తెలిపాయి.. ఇక, వాతావరణ పరిస్థితులు సురక్షితంగా మారిన తర్వాత, ఇరువై రెండు విమానాలు తమ గమ్యస్థానమైన హైదరాబాద్‌కి తిరిగి ప్రయాణానికి బయల్దేరనున్నారు. విమానయాన సంస్థ అధికారులు ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వాతావరణ మార్పులు కారణంగా విమానాల మార్గాలను మార్చటం అంతా సాధారణ aviation ప్రక్రియలో భాగమని ఎయిర్ ఇండియా సూచనాదారులు పేర్కొన్నారు. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం అత్యంత ప్రాధాన్యత ఉందని, అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నదన్నారు.
బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం.. వీఐపీ, వీవీఐపీలు టికెట్స్ కొనాల్సిందే..!
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై VIP, VVIPలు సైతం దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది, శుక్రవారం, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 50 వేల వరకు చేరుతోంది. అయితే, రోజుకు 200–300 మంది వరకు సిఫార్సు లెటర్లతో వచ్చే VIPలు, VVIPలు టికెట్ కొనకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ దృష్టికి వెళ్లింది.. ఇదే కాకుండా, కొంతమంది ప్రోటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేస్తున్నారని, దీని వల్ల ఆలయ ఆదాయానికి భారీ గండి పడుతోందని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పద్ధతికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ధర్మకర్త మండలి సభ్యులు, ఇతర ఆలయ అధికారులతో కలిసి విస్తృత సమీక్ష నిర్వహించారు. సిఫార్సు లెటర్లతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నిబంధనను ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు చేయాలి అని చైర్మన్ రాధాకృష్ణ సూచించారు. ఈ నిర్ణయానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కూడా ఎడీసీఎల్ (ADCL) ఛైర్‌పర్సన్ & MDకు ఆదేశాలు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు టికెట్ కొనకుండా వెళ్లడం వల్ల హుండీ, దర్శన టికెట్ ఆదాయం తగ్గిపోతోందని ఆలయ అధికారులు తెలిపారు. కొత్త నిబంధనతో అమ్మవారి సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ఆలయ అభివృద్ధికి నిధుల లభ్యత పెరుగుతుందని చెప్పారు.
ఉపాధి హామీ పథకం ప్రారంభించిన చోటే నిరసన.. ఏపీకి సోనియా, రాహుల్, ఖర్గే..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కాస్తా.. వికసిత్ భారత్ రోజ్‌గార్, వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G )గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు, ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రాంతంలోనే భారీ నిరసన కార్యక్రమానికి చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సిద్ధం అవుతున్నారు.. దీని కోసం వచ్చే నెల ఆంధ్రప్రదేశ్‌కి రాబుతోన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు.. ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లికి రానున్న కాంగ్రెస్ అగ్ర నాయకత్వం.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అయితే, ఉపాధి హామీ పథకం (MGNREGA) జాతీయ స్థాయిలో 2005లో ప్రారంభమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో 2006లో అనంతపురంలో ప్రారంభించారు.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. 2 ఫిబ్రవరి 2006లో ఈ కార్యక్రమానికి నిర్వహించగా.. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పేరును మార్పును నిరసిస్తూ.. 20 ఏళ్ల తర్వాత అదే రోజు అంటే 2 ఫిబ్రవరి 2026న అదే గ్రామంలో నిరసన కార్యక్రమం ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ..
మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉంది..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా కొనసాగాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక్క నిమిషం వినండి.. అందరి సభ్యులకు హక్కులు ఉంటాయి.. అందరి హక్కులు కాపాడాలి.. బీఏసీ సమావేశం అజెండాను సభలో పెట్టారు.. అందులో ఏడు రోజులు సభ అనుకున్నాం.. కానీ, అజెండాలో లేదు.. సెట్ చేయండి అని ఆయన సూచించారు. బిజినెస్ ఎప్పుడూ అనేది ముందు చెప్పండి.. 24 గంటల ముందు పంపడం నేర్చుకోండి అన్నారు. సభలో మాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది అని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక, అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వకపోవడం సరికాదు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉంది అని విమర్శించారు. దీంతో హరీష్ రావు మైక్ ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కట్ చేశారు. సీఎంను తిడుతా అంటే మైక్ ఇవ్వను అని తేల్చి చెప్పారు. హరీష్ రావు ప్రశ్న పై మాట్లాడండి అని సూచించారు. ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకు ఆపలేరు అని స్పీకర్ ని హరీష్ రావు ప్రశ్నించడంతో కాసేపు సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ చీప్ విప్ ఆది శ్రీనివాస్ హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు. సీఎంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. హరీష్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విప్ శ్రీనివాస్ చెప్పారు. దీంతో అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడంతో సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
మరోసారి హరీష్‌రావును టార్గెట్ చేసిన కవిత.. ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారని ఫైర్!
మరోసారి హరీష్‌రావును టార్గెట్ చేసింది ఎమ్మెల్సీ కవిత. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేసింది. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారు?.. మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే ఎలా? అని ప్రశ్నించింది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జాగృతినే నిలుస్తుంది.. నీళ్ల గురించి కేసీఆర్ కంటే రేవంత్‌కి ఎక్కువ తెలుసా? హరీష్‌కు ఎక్కువ తెలుసా.? అని అడిగింది. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది.. అటు సీఎం, ఇటు బబుల్ షూటర్ ఉంటారు.. బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుంది అని కవిత తెలిపింది. ఇక, 2006 నుంచి 2014 వరకు జాగృతి పేరుతో పని చేశాను అని కవిత వెల్లడించింది. మిగతా నాయకులు కేసీఆర్ చెప్పినట్లు పని చేశారు.. బండి నడిపేది ఒకరు, నేనే బండి నడుపుతున్నాను అని ఫీల్ అవుతున్నారు.. హరీష్ రావు నల్లికుంట్ల మనిషి.. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండాలి.. నా వ్యాఖ్యలపై హరీశ్ పై పదే పదే వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ఆయన్నే అడగాలే అని చెప్పుకొచ్చింది. ఇక, నేను రాజీనామా చేసి నాలుగు నెలలు అవుతుంది అని కవిత పేర్కొనింది. చివరిగా నాకు ఫ్లోర్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ ను కోరా.. ఈ నెల 5వ తేదీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తామని సమాచారం ఇచ్చారు.. కేసీఆర్ ను కసబ్ తో పోల్చడం చూస్తే నా రక్తం మరిగిపోతుందని చెప్పుకొచ్చింది. నేను కేసీఆర్ తో మాట్లాడక ఆరు నెలలు అవుతుందని మీడియా వేదికగా కవిత తెలిపింది.
ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువ..
మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మీరాలం బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి.. ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అవుతుంది. దాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ.. దానికి వసతులు కల్పించడం.. ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంది అన్నారు. ఇక, మూడు కోట్ల తెలంగాణ జనాభాలో కోటి 34 లక్షల మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు.. వచ్చే 20 ఏళ్లలో 75 శాతం జనాభా హైదరాబాద్ కి వస్తారని అసెంబ్లీలో సీఎం పేర్కొన్నారు. అయితే, కడుపు నిండా మూసీలో కంటే ఎక్కువ విషం ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే, ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మేము వివరాలు చెప్తుంటే.. ఎందుకు విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు తెలియొద్దని వాళ్ళ బాధపడుతున్నారు.. ఆ కండ్లు చూడండి.. విషపుంతో నిండిపోయాయి.. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేను తీసుకుని మూసీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన వాళ్లా చెప్పేది.. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను చూసి నేర్చుకోండి అని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలను అభివృద్ధి చేయండి అని వెల్లడించారు. ఉప్పల్ ఎమ్మెల్యే కూడా వచ్చి చెప్పాడు.. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? అని ప్రశ్నించారు. ప్రక్షాళన చేయాలి అంటే సలహాలు ఇవ్వండి.. నష్టపోతున్న వారికి కాలనీ కట్టిస్తాం.. నష్టపోయిన వారికి వ్యాపారం చేసుకునే వేసులుబాటు కల్పిస్తామని రేవంత్ చెప్పారు.
వెలుగులోకి కాంగ్రెస్ ఎన్నికల సర్వే.. రాహుల్‌గాంధీపై బీజేపీ విమర్శలు
దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. డిజిటల్ బోర్డుపై ఆధారాలు చూపిస్తూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా కర్ణాటకలో ఒక సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. ఈవీఎంల ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే వెలుగులోకి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో ఈవీఎంలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందంటూ 83 శాతం మంది మద్దతు తెలిపారు. 69 శాతం మంది ప్రజలు ఈవీఎంలు కచ్చితమైన సమాచారం ఇస్తాయని.. 14 శాతం మంది ఈవీఎంలను తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం చెప్పారు. కర్ణాటకలోని 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను చేపట్టారు. బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూర్ సహా 102 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టారు. అత్యధిక శాతం కలబురగిలో 83 శాతం మంది ఈవీఎంలను బలంగా విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం చెప్పారు. మైసూర్‌లో 70 శాతం, బెళగావిలో 63 శాతం, బెంగళూరులో 63 శాతం విశ్వాసం వ్యక్తం చేశారు.
పుతిన్ ఇంటిపై ఉక్రెయినే దాడి చేసింది.. అమెరికాకు ఆధారాలు అందించిన రష్యా
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవుతున్న తరుణంలో ఉక్రెయిన్ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై భారీ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్ తోసిపుచ్చింది. తాజాగా పుతిన్ నివాసంపై దాడి చేసింది ఉక్రెయినే అని.. అందుకు సంబంధించిన ఆధారాలను అమెరికాకు రష్యా అందజేసింది. రష్యా సీనియర్ సైనికాధికారి.. గురువారం అమెరికా సైనిక అటాచ్‌కు అందజేశారు. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ దాడులు చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాతకాలపు దుస్తుల్లో మెరిసిన న్యూయార్క్ మేయర్ దంపతులు.. ఎవరు డిజైన్ చేశారంటే..!
న్యూయార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (34) ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి ముస్లిం మేయర్‌గా ప్రమాణం చేశారు. గతేడాది జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. గురువారం న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణం చేశారు. భార్య రమా దువాజీ రెండు ఖురాన్లు చేతితో పట్టుకోగా.. మమ్దానీ చేయి వేసి ప్రమాణం చేశారు. అయితే ఈ సందర్భంగా భార్యాభర్తలు వేసుకున్న దుస్తులు హైలెట్‌గా నిలిచాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చ నడుస్తోంది. వింటర్ సీజన్‌కు తగ్గట్టుగా మమ్దానీ ఫ్యాషన్ డ్రస్‌ను ధరించారు. హెరింగ్బోన్ నెక్‌టై ఉన్న సూట్‌ను ధరించారు. ఇక ఈ సూట్‌ను ఢిల్లీకి చెందిన డిజైనర్ కార్తీక్ కుమ్రా రూపొందించారు. కార్తీక్ కుమ్రా లేబుల్ కార్తీక్ రీసెర్చ్ రూపొందించింది. ప్రత్యేకంగా ‘టై’ను అస్సాం నుంచి వచ్చిన ఎరి సిల్క్ ఫాబ్రిక్ నుంచి కత్తిరించారు. నాలుగు రేకుల పువ్వులతో ఎంబ్రాయిడరీ చేశారు. ఇక భార్య రామ దువాజీ పాతకాలపు ఫ్యాషన్ గుర్తుచేసేలా రూపొందించారు. కరేఫా-జాన్సన్ శైలిలో దువాజీ తన దుస్తులతో చాలా పాతకాలపు ష్యాషన్‌ను గుర్తుచేసింది. నల్లటి వింటేజ్ బాలెన్సియాగా కోటు, ది ఫ్రాంకీ షాప్ నుంచి కులోట్-స్టైల్ షార్ట్స్, మిస్టా లేబుల్ నుంచి ఒక జత జెన్ Z కూల్ బూట్లను ధరించింది. న్యూయార్క్ వింటేజ్ నుంచి షాన్డిలియర్-స్టైల్ చంకీ బంగారు చెవిపోగులు, బంగారు బ్రాస్లెట్లు ధరించారు. సంప్రదాయం మరియు సంస్కృతిని గుర్తుచేసేలా కనిపించారు.
బిట్‌కాయిన్ పతనం తప్పదా..? 90 శాతం పడిపోతుందా..?
బిట్‌కాయిన్ అంటేనే భారీ లాభాలు తెచ్చిపెట్టేదిగా చూస్తారు.. అయితే, 2025 సంవత్సరం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు చాలా అస్థిరంగా ఉంది.. దీని వలన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు అత్యంత ప్రసిద్ధ క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లో కూడా హెచ్చుతగ్గులు సంభవించాయి. బిట్‌కాయిన్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.. ఆ తరువాత బాగా పడిపోయింది. బిట్‌కాయిన్ ఒకే సంవత్సరంలో 5 శాతానికి పైగా నష్టపోయింది.. కానీ, ఇప్పుడు నిపుణులు బిట్‌కాయిన్ 90 శాతం వరకు క్రాష్ అవుతుందని చెబుతున్నారు. ఈ క్రిప్టో ఆస్తికి 2026 సంవత్సరంలో భారీ పతనం కానుంది అని హెచ్చరిస్తున్నారు.. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ వ్యూహకర్త మైక్ మెక్‌గ్లోన్ ఈ హెచ్చరికను జారీ చేశారు. 2026 నాటికి బిట్‌కాయిన్ ధర 90 శాతం తగ్గి $10,000కి చేరుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల వెనుక గల కారణాన్ని నిపుణులు వివరిస్తూ, మార్కెట్‌లో డిజిటల్ ఆస్తి పోటీదారుల సంఖ్య పెరగడం వల్ల దాని విలువ తగ్గవచ్చని చెబుతున్నారు. తన లింక్డ్ఇన్‌లోని ఒక పోస్ట్‌లో, 2009లో బిట్‌కాయిన్ మొదటి క్రిప్టోకరెన్సీ అని, కానీ ఇప్పుడు దానికి మిలియన్ల కొద్ది డిజిటల్ కరెన్సీ పోటీదారులు ఉన్నారని ఆయన రాశారు. బంగారం బిట్‌కాయిన్‌కు పోటీదారు అని, బంగారం పోటీదారులు వెండి, ప్లాటినం మరియు పల్లాడియం అని పేర్కొన్నారు.. 2026 నాటికి బంగారం ధరలు మరో 10 శాతం పెరిగి ఔన్సుకు $5,000కి చేరుకోవచ్చని చెబుతున్నారు.
50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్‌కు రెడీ..!
మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్‌లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. లిస్టింగ్ (XT2603-1 మోడల్ నంబర్) ప్రకారం Moto X70 Air Proలో 6.78 అంగుళాల 1.5K (1264 × 2780 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే ఉండనుంది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 3.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండటం గమనార్హం. దీన్ని బట్టి ఇందులో Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఉండొచ్చని అంచనా. లిస్టింగ్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో Adreno 829 GPU, అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా వచ్చే అవకాశముంది. Moto X70 Air Proను 8GB, 12GB, 16GB RAM వేరియంట్లలో విడుదల చేయవచ్చు. స్టోరేజ్ పరంగా 256GB, 512GB, అలాగే గరిష్టంగా 1TB వరకు ఆప్షన్లు ఉండొచ్చని సూచిస్తోంది. అయితే ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు మద్దతు ఉండకపోవచ్చు. ఫోటోగ్రఫీ విభాగంలో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్‌కు మద్దతిచ్చే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండనుంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ డివైస్‌లో AI ఆధారిత ఇమేజింగ్ ఫీచర్లు కూడా ఉంటాయని మోటరోలా ఇప్పటికే టీజ్ చేసింది.
దేశవ్యాప్తంగా BSNL VoWiFi సేవలు ప్రారంభం.. స్పష్టమైన కాల్స్ కోసం ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా తన Voice over Wi-Fi (VoWiFi) సేవలను అధికారికంగా ప్రారంభించింది. Wi-Fi కాలింగ్\ గా కూడా పిలవబడే ఈ ఫీచర్ ఇప్పుడు భారత్‌లోని అన్ని టెలికాం సర్కిళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ VoWiFi టెక్నాలజీ ద్వారా వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న చోట్ల కూడా Wi-Fi నెట్‌వర్క్ సహాయంతో కాల్స్ చేయడం, స్వీకరించడం ఇంకా మెసేజెస్ పంపడం సాధ్యమవుతుంది. BSNL అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సేవ IMS (IP Multimedia Subsystem) ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. దీని వల్ల Wi-Fi నెట్‌వర్క్ నుంచి మొబైల్ నెట్‌వర్క్‌కు, లేదా అందుబాటులో లేనప్పటికీ కాల్ నిరవధికంగా కొనసాగుతుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా వినియోగదారుడి ప్రస్తుత మొబైల్ నంబర్, ఫోన్‌లోని నేటివ్ డయలర్లోనే పనిచేస్తుంది. అందువల్ల మూడో పక్ష యాప్‌లను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా అవసరం ఉండవు.
నేడే న్యూజిలాండ్‌తో వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక .. పంత్‌కు ఛాన్స్ ఉందా?
ఈ నెల 11న న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం శుక్రవారం సెలక్టర్లు టీమిండియా జట్టును సెలెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం సెలక్టర్లు ఎంపిక చేయబోయే జట్టులో రిషబ్ పంత్‌కు చోటు ఉంటుందా లేదా అనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ రోజు ఎంపిక చేయబోతున్న జట్టులో ఎవరికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి రిషబ్ పంత్ టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మనోడికి టీ20 జట్టులో చోటు లేదు, వన్డే టీంలోకి కూడా వస్తూ పోతూ ఉన్నాడు. ఈ ఫార్మాట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తుండటం, పంత్ ఫామ్ కూడా గొప్పగా లేకపోవడంతో తన ప్లేస్‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. గత ఏడాది మొత్తం పంత్ వన్డేల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా జట్టులో ఉన్నప్పటికీ పంత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దక్షిణాఫ్రికాతో గత నెల జరిగిన వన్డే సిరీస్‌లో కూడా పంత్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇదే టైంలో పంత్ విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సత్తా చాటాలని ట్రై చేసిన.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో ఆయన వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 70, 22, 24 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ధ్రువ్ జురెల్ ఫామ్ బాగున్న నేపథ్యంలో అతడినే రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసి, పంత్‌ను సైడ్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఎన్నో అవమానాలను భరించాను.. ఆ తర్వాతే సన్మానాలు: చంద్రబోస్
కలల వెతుకులాట నుంచి ఆస్కార్ విజయం వరకు తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. 1995లో ‘తాజ్ మహల్’ చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని నేడు ప్రపంచ వేదికపై తెలుగు పాట జెండాను ఎగురవేశారు. ఆయన ఇటీవల ‘NTV’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో ‘తాజ్ మహల్’ సినిమాతో పాటల రచయితగా పరిచయం అయినట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభంలో సుమారు 21 ఏళ్ల వరకు ఎన్నో అవమానాలను భరించానని, ఆ తర్వాతే సన్మానాలు, బహుమానాలు రావడం మొదలైందని భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో తెలియని మొండి ధైర్యంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి, నేడు 3600కు పైగా పాటలను రాసినట్లు తెలిపారు. దర్శకుడు సుకుమార్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. తమ కలయికలో వచ్చిన పాటలు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఒక పాట రాయడానికి కేవలం 45 నిమిషాలే పట్టినా, అది పూర్తిస్థాయిలో బయటకు రావడానికి కొన్నిసార్లు 19 నెలల సమయం కూడా పట్టిందని వివరించారు. అలాగే ‘సై సినిమాలో అవకాశం రాకపోయినా, రాజమౌళి గారు ఆ వడ్డీతో కలిపి ‘RRR’లో గొప్ప అవకాశం ఇచ్చారు’ అని చమత్కరించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తన జీవిత పాఠాలను, సాహిత్య ప్రయాణాన్ని పంచుకుంటూ, చలనచిత్ర పరిశ్రమలోకి రావాలని కలలు కనే ఎంతో మంది కొత్తవారికి స్ఫూర్తిని నింపారు చంద్రబోస్.
