NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

శ్రీశైలం డ్యామ్‌కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..
కృష్ణా నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.. ఓవైపు జూరాల.. మరోవైపు తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది.. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 207.4100 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తాకింది నీటిమట్టం.. 545.80 అడుగులకు నీటిమట్టం చేరడంతో క్రస్ట్ గేట్లను తాకింది కృష్ణమ్మ.. జులై 23వ తేదీన 503 అడుగుల వద్ద.. 120.89 టీఎంసీల వద్ద సాగర్ నీటిమట్టం ఉంది.. తాజాగా 546 అడుగుల వద్ద.. 198 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. పది రోజుల్లో 43 అడుగుల నీటిమట్టం పెరగగా.. 78 టీఎంసీల నీరు వచ్చి చేరింది.. గడచిన 48 గంటల్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరిన 50 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, వంశీ హైదరాబాద్‌ వెళ్లిపోయారట.. గత నెలలోనే వంశీ హైదరాబాద్‌కు వెళ్లినట్టుగా చెబుతున్నారు.. తాజాగా వంశీని పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు.. కాగా, టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన వల్లభనేని వంశీ.. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. అయితే 2019 ఎన్నికల్లో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైర్‌ బ్రాండ్‌ స్వరం క్రమంగా మారుతూ వచ్చింది.. వైసీపీ మద్దతుదారుగా మారిపోయిన ఆయన.. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. టీడీపీపై.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగ విమర్శలు చేయడం పెద్ద రచ్చగా మారిన విషయం విదితమే.. మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. వరుసగా రెండో నెల కూడా 1వ తేదీనే ఒకేరోజు రికార్డు స్థాయిలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసింది.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.. ఇక, ఫించన్ల పంపిణీపై స్పందించిన సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు.. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు అంటే.. ప్రభుత్వంలో భాగం. ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశాం అన్నారు సీఎం చంద్రబాబు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అనేక సమస్యలు ఉన్నా.. రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించాం. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం అన్నారు.. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కలిసి కష్టపడదాం… రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్లపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్లపై విషయం కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.. ఈ రోజు డయల్‌ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకి 1500కి పరిమితం చేశాం అన్నారు.. శ్రీవాణి దర్శన టికెట్ల జారికి శాశ్వతప్రాతిపాదికన కౌంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు చర్యలు ప్రారంభించాం.. దళారి వ్యవస్థను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.. ఆన్ లైన్ లో ఓకే ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా టికెట్లు పొందుతున్న 40 వేల ట్రాన్షాక్షన్లు రద్దు చేశామని వెల్లడించారు.. ఆధార్ తో అనుసంధానం చేస్తే దర్శన టికెట్ల జారిలో దళారి వ్యవస్థను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. ఇక, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచేందుకు చర్యలు ప్రారంభించాం అన్నారు ఈవో శ్యామలరావు.. లడ్డు ప్రసాదం దిట్టంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.. అయితే, తయారీ విధానంలోనే కొన్ని మార్పులు చేయాలన్నారు.. నాణ్యమైన లడ్డూ సేకరణపై దృష్టి పెట్టామని వెల్లడించారు. మరోవైపు.. టీటీడీలో డిప్యూటీ ఈవోలను బదిలీ చేశారు.. రిసెప్షన్‌ 1 డిప్యూటి ఈవోగా భాస్కర్.. రిసెప్షన్‌ 2 ఈవోగా హరింద్రనాథ్ ను.. కళ్యాణకట్ట డిప్యూటీ ఈవోగా వెంకటయ్య ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు..

అంసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవాళ తొమ్మిదవ రోజు అసెంబ్లీ సభ కొనసాగతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చివర రోజు కావడంతో మూడు బిల్లులపై చర్చ కొనసాగుతుంది. మొదటగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సివిల్‌ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం సీతక్క వీడియో మార్ఫింగ్ అంశంపై సభలో చర్చ కొనసాగింది. సభలో ఉద్యోగ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించడమే కాకుండా చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కాగా.. ఇవాళ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేక పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ముందుకు వచ్చింది. రెవిన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు ఉన్నాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం పై చేశారన్నారు. 1983 – 2018 మధ్య కాలంలో 20సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే వాటి పై 1లక్ష 73వేల కోట్లు కాగా.. మొదటి అంచాన వ్యయం 1లక్ష కోట్లు నుండి.. 2లక్షల కోట్లకు పెరిగిందని తెలిపింది. ద్రవ్యలోటు పరిమితులకు లోబడి ఉందన్నారు. ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు భారీగా ఉన్నాయని, వాటా అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. కాళేశ్వరం మిషన్ భగీరథ కే ఎక్కువ రుణాలు.. తీసుకున్న రుణాలు.. చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ చెల్లించడానికి.. బడ్జెట్ యేతర రుణాలను తిరిగి చెల్లించడానికి ఇబ్బంది ఎర్పడిందన్నారు. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్నారని తెలిపింది. గత సంవత్సరం బడ్జెట్ లో పన్నెత్తర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారన్నారు. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58శాతం, ఎస్టిలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదన్నారు. ఖర్చు అయిన ఎస్సి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారిమల్లించారని కాగ్ నివేదిక లో వెల్లడించారు.

ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి..
ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో త్వరలో స్పోర్ట్స్ పాలసీ తెస్తామన్నారు. అవార్డులు వస్తె.. ఆటోమేటిక్ గా సాయం అందేలా పాలసీ చేస్తామని వెల్లడించారు. పంజాబ్ తరహాలో పాలసీ తీసుకువస్తామన్నారు. స్పోర్ట్స్ స్టేడియం లు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. భూమి అందుబాటులో ఉంటే మాకు నిధులు విడుదలకు ఇబ్బంది లేదన్నారు. బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నామన్నారు. నేషనల్ అకాడమీ అక్కడ పెట్టాలని అనుకుంటున్నామన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయంకి పెట్టాలి అని అడిగారన్నారు. టీఎస్ నీ టీజీగా చేస్తేనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే సురవరం పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మాకు అభ్యంతరం లేదన్నారు.

కేటీఆర్ చెప్పినట్లు గానే తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం..
సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తామన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తుందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఉండే విచారణ చేస్తున్నామన్నారు. కొత్త చట్టాలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రానికి చట్టాలపై ఆ అభిప్రాయాలు తెలిపాయని వెల్లడించారు. సైబర్ క్రైమ్ అరాచకాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తేవడానికి వెనుకాడబోమన్నారు. సైబర్ క్రైమ్ అరాచకాలు తారాస్థాయికి పోయాయని అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తామన్నారు. సభా ప్రాంగణంలో సభను అప్రతిష్టపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ చట్టాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తుందన్నారు. అసెంబ్లీ విషయంలో మంత్రి సీతక్కపై మార్ఫింగ్ వీడియోలు ప్రచారం జరిగాయని మండిపడ్డారు. మంత్రి సీతక్క మార్ఫింగ్ వీడియోలపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ప్రతిపక్షం చెప్పాలన్నారు.

వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఇది వ్యవస్థీకృత వైఫల్యం కాదన్న నిర్ధారణకు వచ్చామని కోర్టు పేర్కొంది. పేపర్ లీక్ ప్రభావం హజారీబాగ్, పాట్నాలకే పరిమితమైందని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపును నిర్ధారించడం, పేపర్ లీకేజీని నిరోధించడానికి నిల్వ కోసం ఎస్ఓపీ సిద్ధం చేయడం ప్రభుత్వం, ఎన్టీఏ బాధ్యతని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎవరి ఫిర్యాదునైనా పరిష్కరించకపోతే హైకోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. పేపర్ లీక్ క్రమపద్ధతిలో లేదని నిర్ధారించింది. పేపర్ లీక్ పెద్ద ఎత్తున జరగలేదని కోర్టు పేర్కొంది. భవిష్యత్తులో ఎన్టీఏ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అజాగ్రత్త మానుకోవాలని హెచ్చరించింది. “నీట్‌ను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను తిరస్కరిస్తున్నాం. విచారణ సందర్భంగా, పరీక్ష నిర్వహణ పద్ధతిని ఎన్టీఏ మార్చాలి. ప్రశ్నపత్రం సెట్ చేయబడినప్పటి నుండి పరీక్ష పూర్తయ్యే వరకు ఏజెన్సీ కఠినమైన దర్యాప్తును నిర్ధారించాలి. ప్రశ్న పత్రాల ప్రవర్తన మొదలైనవాటిని తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి. ప్రశ్నపత్రాలను రవాణా చేయడానికి, డోర్లు ఓపెన్ చేసి ఉంచిన వాహనాలు కాకుండా.. రియల్ టైమ్ లాక్ ఉన్న మూసివేసిన వాహనాలను ఉపయోగించాలి. ఇది కాకుండా, గోప్యతా చట్టాలను కూడా గుర్తుంచుకోవాలి. తద్వారా ఏదైనా అక్రమాలు జరిగితే వెంటనే స్పందించాలి. ఎలక్ట్రానిక్ వేలిముద్రలు, సైబర్ భద్రతను రికార్డ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి. తద్వారా డేటా సురక్షితంగా ఉంటుంది.” అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.

14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్
రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. 14 గంటల విచారణ అనంతరం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. టీఎంసీకి చెందిన దేగంగా బ్లాక్ ప్రెసిడెంట్ అనీస్ ఉర్ రెహ్మాన్, అతని అన్నయ్యను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, దర్యాప్తు సంస్థ కోల్‌కతా కార్యాలయంలో దాదాపు 14 గంటల పాటు విచారించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి రెహ్మాన్, అతని సోదరుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం అతడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్‌కు రెహ్మాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే మాజీ మంత్రిని అరెస్టు చేసింది. రైస్‌మిల్లు యజమాని, మాజీ మంత్రికి చెందిన మరో సన్నిహితుడు బారిక్ బిస్వాస్‌కు శుక్రవారం విచారణ నిమిత్తం కార్యాలయంలో హాజరుకావాలని ఇడి అధికారులు సమన్లు​జారీ చేసినట్లు అధికారి తెలిపారు. మంగళవారం విశ్వాస్ నివాసం, రైస్‌మిల్లుపై ఈడీ దాడులు నిర్వహించగా రూ.40 లక్షలకు పైగా నగదు, యూఏఈలోని ఆస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ధూమపాన ప్రకటనల్లో ఆటగాళ్లు కనిపించడాన్ని నిషేధించాలని… బీసీసీఐకి ప్రభుత్వం లేఖ
దేశంలో వార్తాపత్రికలు, టీవీ, రేడియో, డిజిటల్ అనేక ఇతర ప్రదేశాలలో అన్ని రకాల ప్రకటనలు ఇవ్వబడతాయి. వీటిలో అన్ని రకాల ఉత్పత్తులకు ప్రకటనలు ఉంటాయి. వీటిలో ధూమపానానికి సంబంధించిన ప్రకటనలు కూడా తరచుగా కనిపిస్తాయి. ఇప్పుడు ధూమపాన ప్రకటనలలో కూడా ఆటగాళ్ళు కనిపిస్తున్నారు, దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంది. తద్వారా యువతలో ధూమపానం పెరగకుండా నిరోధించవచ్చు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బీసీసీఐకి లేఖ రాసింది. అందులో ఆటగాళ్ల మద్యం మరియు పొగాకుకు సంబంధించిన ప్రకటనలను నిషేధించాలని అభ్యర్థించారు. ఆటగాళ్ల పొగాకు, ఆల్కహాల్ సంబంధిత ఉత్పత్తుల ప్రకటనలను నిలిపివేయడానికి బీసీసీఐ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ఆటగాళ్ల ధూమపాన ప్రకటనలను ఆపడానికి కొన్ని చర్యలు కూడా సూచించబడ్డాయి. పొగాకు వ్యతిరేక వడ్డీ ప్రకటనపై సంతకం చేయడం ఇందులో ఉంది. బీసీసీఐ నిర్వహించే లేదా పాల్గొనే స్టేడియంలు లేదా ఈవెంట్‌లలో ఎలాంటి ప్రచారం/ప్రకటనలు చేయకూడదు. ధూమపాన ప్రకటనల ప్రమోషన్లు/భాగస్వామ్యాలకు దూరంగా ఉండాలని బీసీసీఐ పరిధిలోని ఆటగాళ్లకు సూచనలను జారీ చేసింది. అలాగే, ఐపీఎల్ వంటి బీసీసీఐ స్పోర్ట్స్ ఈవెంట్‌లలో సెలబ్రిటీల ప్రకటనలను అనుమతించరాదని లేఖలో అభ్యర్థించారు.

వామ్మో.. దేవరకొండ ఇలా ఉన్నాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిపి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ చేయగా మరింత భాగాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం శ్రీలంక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఓ సాలిడ్ అప్డేట్ ను పోస్టర్ రూపంలో విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ ముఖంపై రక్తం కారుతున్నట్లుగా కనబడుతున్నారు. కారుతున్న నెత్తురుతో చాలా కోపంగా ఆకాశంలో చూస్తూ అరుస్తున్నట్లుగా ఉండే పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, అలాగే ఫస్ట్ లుక్కును ఈ నెలలో ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్ని సరిగా కుదిరితే.. ఈ సినిమా మార్చి 28, 2025న విడుదల చేసే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

“మెట్రో” వేగంతో దూసుకపోతున్న ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్..
ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా “మిస్టర్ బచ్చన్”. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరిలాగే కాకుండా మిస్టర్ పర్చన్ టీం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా రవితేజ వాయిస్ మెసేజ్ ను ఉపయోగించి ప్రమోషన్ ను ఓ రేంజ్ లో చేసేస్తోంది. ఇక ప్రమోషన్ సంబంధించి తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ మెట్రో రైల్లను ఎంపిక చేసుకుంది. మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ.., ఏం తమ్ముళ్లు.. మెట్రోలో ప్లేస్ దొరకలేదా.? లేకుంటే కూర్చోగానే లేపేస్తున్నారా.? అయినా పర్లేదు.. మిస్టర్ బచ్చన్ నుండి లేటెస్ట్ గా పాట రిలీజ్ అయింది.. హ్యాపీగా వినుకుంటూ నిల్చొని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్లండి అంటూనే.. ఇక్కడ సీటు దొరకపోయినా పర్లేదు.. ఆగస్టు 15న సినిమా థియేటర్ కు వచ్చేయండి అక్కడ సీటు గ్యారెంటీ అంటూ హీరో రవితేజ వాయిస్ మెసేజ్ తో ప్రయాణికులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వాయిస్ మెసేజ్ వింటున్న మెట్రో ప్రయాణికుల హావభావాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ పోతినేని నటించిన ” డబుల్ ఇస్మార్ట్ ” సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.