NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పర్యటకులకు అలర్ట్‌.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత..
కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది నీటి ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు..? నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు ఎప్పుడు కిందికి విడుదల చేస్తారు? అని పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సమయం రానేవచ్చింది.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్‌ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్‌ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది.. దీంతో.. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదలనున్నారు అధికారులు.. మొదట నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.. అయితే, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.37 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో.. విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు.. శ్రీశైలం డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 877.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 171.8625 టీఎంసీలకు పైగా ఉంది.. సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 880 అడుగులకు చేరువగా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు బుద్దా వెంకన్న రిక్వెస్ట్..
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న.. నేను ఒక కామన్ మెన్‌గా దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా.. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి అంటూ వ్యాఖ్యానించారు… కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు.. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు.. వారి దాడులు, దారుణాలుచెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని విమర్శించారు.. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.. పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారు.. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారు.. చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నాం అంటూ హాట్‌ కామెంట్లు చేశారు. ఇక, వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని విమర్శించారు బుద్దా వెంకన్న.. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపథం చేశారు.. చంద్రబాబును ఓడించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు అని ఎద్దేవా చేశారు.. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలి అని డిమాండ్‌ చేశారు.. చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లది.. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయం.. కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నారు.

వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు..! గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేనా..?
వైసీపీకి అధికారం చేజారి.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతన్నారు.. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‎కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట.. వారందరూ ఇతర జిల్లాలకు చెందిన నేతలు కావటంతో ఆయనకు టీడీపీలోకి ఎంట్రీకి వర్కవుట్ కావటం లేదట.. ఎక్కే గడప.. దిగే గడప అంటూ తేడా లేకుండా తిరుగుతున్నా అడుగులు ముందుకు పడటం లేదట.. దీంతో ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి.. టీడీపీలో చేరేందుకు అధినేత వద్ద మాట్లాడాలని కోరారట.. శిద్దా చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంత వరకూ సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయటం లేదని చెప్పారట మంత్రి రవికుమార్.. సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ లు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే శిద్దా టీడీపీ చేరికకు లైన్ క్లియర్ అవుతుందని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.. దీంతో శిద్దా.. టీడీపీ చేరిక ఆశలకు మరికొంత కాలం జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మరి టీడీపీలో శిద్దా చేరికకు సీఎం చంద్రబాబు, లోకేష్ లు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. శిద్దా రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోంది.. తెలియాలంటే వేచిచూడాలి..

వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ..
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్‌ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్‌ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విషయం విదితమే.. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు జేసీ దివాకర్‌రెడ్డి.. అయితే, వైఎస్‌ రెండో కేబినెట్‌లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు.. ఇక, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు.. ఆ త్వాత ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపినా.. విజయం సాధించలేదు.. ఇక, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్‌పై, తమపై కేసులు పెట్టి.. తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలు జీవితాన్ని కూడా గడిపారు.. జేసీ ట్రావెల్స్‌ కేసుల విషయంలో.. అధికారులపై కేసులు పెడతానంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు జేసీ.. మరో వైపు తాజా ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అయితే, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు వైఎస్‌ విజయమ్మను కలవడం ఆసక్తికరంగా మారింది. తమ బద్ధ శత్రువు అయిన వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అనే చర్చ ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

తెలంగాణకు వాళ్ళేదో కరెంట్‌ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణకు వాళ్ళేదో కరెంట్ తెచ్చినట్టు ఎంతకాలం ఉదార కొడతారు? అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు వారు మాట్లాడారు. ఛత్తీస్ ఘడ్, యాదాద్రి , భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని తెలిపారు. వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించామని తెలిపారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారన్నారు. విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని చెప్పిందని అన్నారు. విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామన్నారు. తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ తెలిపారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందన్నారు. కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని తెలిపారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని అన్నారు. 53.46 శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయండని ఆదేశించారు. ఆనాడు నేను సభలో మాట్లాడితే నన్ను సభ నుంచి మార్షల్స్ తో బయటకు పంపించారని తెలిపారు. సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు… అవి ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన ఆయనదే..
యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన కేసీఆర్ ది.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆనాటి సీఎం.. నేను రాజుని.. నా కొడుకు యువరాజు అనే రీతిలో వ్యవహరించారని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన కేసీఆర్ ది.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఆయన వల్లనే అన్నారు. వ్యవస్థ కుప్ప కూలిపోయింది. రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ లు కూడా రావడం లేదన్నారు. ఐఏఎస్ అధికారులతో కాళ్ళు మొక్కించుకున్న చరిత్ర వాళ్లదన్నారు. ఒక్కడే ఐపోయాడు జగదీష్ రెడ్డి పాపం అన్నారు. అంతకు ముందు 13 మంది ఉండే అని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ నుండి వెయ్యి మెగావాట్ల కరెంట్ కొంటాం అని ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ నిర్ణయాల వల్ల వేల కోట్లు అప్పుల పాలు అయ్యారన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయింది. కేజ్రీవాల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చర్యలు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ గత కొద్ది రోజులుగా జైలులో ఉన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌పై సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనున్న తరుణంలో సీబీఐ కేజ్రీవాల్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. గత నెల జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్టయ్యాడు. ఇడి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ లభించింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు నుంచి కొంత కాలం బెయిల్ పొందారు. ఇడి అతనిపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని మద్యం కుంభకోణానికి ప్రధాన కుట్రదారుగా పేర్కొంది. ప్రస్తుతం ఆయన సీబీఐకి సంబంధించిన కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.

భారత్ లో ఉద్యోగులకు తొలిసారి 8 గంటల డ్యూటీ..ఉచిత వైద్యం కల్పించింది ఈయనే..
నేడు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా అంటే జేఆర్‌డీ టాటా జయంతి. అతను 29 జూలై 1904న జన్మించాడు. జేఆర్‌డీ టాటా దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్‌కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన కేవలం 34 సంవత్సరాల వయస్సులో 1938లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1991 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన టాటా గ్రూప్ అత్యంత విజయవంతమైన ఛైర్మన్‌గా గుర్తింపుపొందారు. ఈ సమయంలో.. ఆయన టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం అనేక విప్లవాత్మక పథకాలను ప్రారంభించారు. వాటిని ఇతర కంపెనీలు కూడా అనుసరించాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక పారిశ్రామికవేత్తకు మాత్రమే భారతరత్న లభించింది. అది జేఆర్‌డీ టాటాకు మాత్రమే. ఆయనకు 1992లో దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. జేఆర్‌డీ జీవితంలో స్పృశించని కొన్ని అంశాలను ఇప్పుడు నెమరేసుకుందాం. జేఆర్‌డీ.. రతన్ దాదాభోయ్ టాటా.. సుజానే బ్రియర్‌లకు రెండవ సంతానం. భారతదేశంలో కారు నడిపిన మొదటి మహిళ ఆయన తల్లే. ఆమె ఫ్రెంచ్, కాబట్టి జేఆర్‌డీ టాటా చిన్నతనంలో ఎక్కువ భాగం ఫ్రాన్స్‌లో గడిచింది. అక్కడే ఆయనకు విమానాలపై ఆసక్తి ఏర్పడింది. 15 సంవత్సరాల వయస్సులో.. జేఆర్‌డీ పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కల నెరవేరాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే. బొంబాయిలో మొదటి ఫ్లయింగ్ క్లబ్ ప్రారంభించినప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలు. 1929 లో తన పైలట్ లైసెన్స్ పొందారు. భారతదేశంలో తొలిసారిగా పైలట్ లైసెన్స్ ఒకరికి జారీ చేయబడింది. ఈ విధంగా ఆయన భారతదేశంలో పౌర విమానయానానికి పితామహుడిగా మారారు.

‘శాంసంగ్‌’ నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ‘శాంసంగ్‌’ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకు కూడా రిలీజ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఎంట్రీ లెవల్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ05కి కొనసాగింపుగా వస్తోంది. ఎం సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎం35’ 5జీని శాంసంగ్‌ తీసుకొచ్చింది. నివేదికల ప్రకారం… శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ ఉండనుంది. 120 Hz రీఫ్రెష్‌ రేటు, 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. వెనక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై రన్ అవుతుంది.

ఊహించని ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా థార్ రాక్స్..
మహీంద్రా & మహీంద్రా కంపనీనుండి రాబోయే 5 డోర్ల థార్ విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ చిత్రం ‘షరాబి’ లోని ‘ఇంతహా హో గయీ ఇంతెజార్ కి…’ పాటతో పెద్ద థార్ బయటి లుక్ ను చూపబడింది. మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ పరిగణన లోకి తీసుకుంటే 5 డోర్ల థార్ నుండి పెద్ద అంచనాలను కలిగి ఉంది. మహీంద్రా థార్ 3 డోర్‌లో సీటింగ్ స్థలం లేకపోవడం సమస్యను అధిగమించడానికి కంపెనీ 5 డోర్ మోడల్‌ ను తీసుకువస్తోంది. దీని వీల్‌బేస్ కొంచెం పొడవుగా ఉంది. అలాగే వెనుక సీటు ప్రయాణీకుల కోసం 2 ప్రత్యేక తలుపులు అందించబడ్డాయి. C మోటిఫ్ LED DRLలు, కొత్త డ్యూయల్ టోన్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ తో కూడిన వృత్తాకార LED హెడ్‌లైట్‌ లతో కొత్త థార్ ఎలా ఉందొ వీడియోలో చూడవచ్చు. ఇక దీని ప్రారంభ ధర సుమారు రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.

క్యా లఫ్డా అంటూ వచ్చేసిన రామ్, కావ్య థాపర్..
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి రెండు సింగిల్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్మార్ట్ శంకర్ కు ఎంత ప్లస్ ఆయుందో ఇప్పుడు రానున్న డబుల్ ఇస్మార్ట్ కు అంతే ప్లస్ అవబోతుందని భావిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ చిత్రంలోని మూడవ సింగిల్ కాసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. ధనుంజయ్ సీపాన మరియు సింధూజ శ్రీనివాసన్ రొమాంటిక్ టచ్‌తో పాడిన ఈ పాట  వినసొంపుగా ఉంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుంది. పాట యొక్క ఆకర్షణీయమైన స్వభావానికి దోహదపడింది. ఈ సీజన్‌లో రొమాంటిక్ మెలోడీగా ‘క్యా లఫ్దా’ నిలుస్తుంది.  ఈ పాటలో రామ్ మరియు కావ్యా థాపర్ మధ్య  కెమిస్ట్రీ పాటకు మరింత ఆకర్షణ తెచ్చింది. టీజర్‌కు ప్రేక్షకుల నుండి అత్యుత్సాహకరమైన స్పందన లభించడంతో సినిమా విశేషమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లు మరియు ప్రమోషన్‌లతో హోరెత్తిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా.. సమ్మర్ 2025 విడుదల
స్టైలిష్ స్టార్ ఆలు అర్జున్ హీరోగా జీనియస్డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రానున్న చిత్రం పుష్ప-2. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పెండింగ్ ఉండడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మరొక డేట్ ప్రకటించారు మైత్రీ మూవీస్. పుష్ప రాకతో డిసెంబరులో రావాల్సిన సినిమాలు పరిస్థితీ అయోమయంలో పడింది. టాలీవుడ్ సర్కిల్స్ వినిపిస్తున్న న్యూస్ ప్రకారం పుష్ప -2 డిసెంబరు 6న విడుదల అవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ సగం షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది.బన్నీ, ఫహద్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఎడిటింగ్, డబ్బింగ్ పనిపనులను కనీసం మొదలు పెట్టలేదని టాక్. ఇటీవల బన్నీ దర్శకుడు సుకుమార్ లాంగ్ షెడ్యుల్ క్యాన్సిల్ చేసి విహార యాత్రలకు వెళ్లడం కూడా జరిగిపోయింది. ఇప్పటికిప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా కూడా డిసెంబర్ నాటికి విడుదల కష్టమేనని ఈ నేపథ్యంలో 2025 వేసవికి రిలీజ్ చేసేలా మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.