NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

*శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..
శ్రీశైలం డ్యామ్‌ క్రమంగా వరద పోటెత్తుతోంది.. తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది.. తుంగభద్ర జలాశయంలో 28 గేట్ల ద్వారా లక్ష 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం:1631.09 అడుగులు..ఇన్ ఫ్లో 1,24,361 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1,50,798 క్యూ సెక్కులు.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 98.218 టీఎంసీలు.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుంగభద్ర నుంచి నీటి విడుదల లక్షా 50 వేలకు పెంచే అవకాశం కూడా ఉంది. తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.. రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.. నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. ఇన్ ఫ్లో : 4,09,591 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో : 62,214 క్యూసెక్కులు కాగా.. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 870.10 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రస్తుతం : 142.0164 టీఎంసీలు కాగా.. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కాగా మరోవైపు సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు..జూరాల నుంచి ఇప్పటికే 2 లక్షల 51 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.రాబోయే 15 రోజుల్లో కృష్ణ బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.. శ్రీశైలంకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. సోమ లేదా మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అంటూ ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.. గేట్లు ఎత్తే సమయంలో.. పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.. ముఖ్యంగా పర్యాటకులు హైదరాబాద్‌ నుంచి పోటెత్తే అవకాశం ఉంది.

 

*ఉగ్ర గోదావరి.. భద్రాద్రి భక్తులను అనుమతించని పోలీసులు
గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల వల్ల దాని ప్రభావం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంపై పడింది. సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్తుల రాక భారీగా తగ్గింది. గత శనివారం నుంచి భద్రాచలం కి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల వల్ల గోదావరి వరద వచ్చింది. భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో భద్రాచలం స్వామివారికి దర్శించుకునేందుకు భక్తుల తాకిడి తగ్గింది. శని, ఆది,సోమవారం కూడా సెలవు దినం అయినప్పటికీ భక్తులు మాత్రం భద్రాచలంకి రావడం లేదు. ప్రధానంగా గోదావరి వస్తున్న వరద వార్తలే కారణం. గోదావరికి వరద వల్ల కరకట్ట వద్ద ఉన్న స్నాన ఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. వరద వల్ల గోదావరిలోకి భక్తులు వెళ్లి స్నానాలు చేయటానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు ప్రమాదవశాత్తు గోదావరిలో పడతారని ఆందోళనతో గోదావరి స్థాన ఘట్టాల వైపు భక్తుల్ని అనుమతించడం లేదు. భద్రాచలం వద్ద గోదావరి 51.90 అడుగులకు చేరింది. సుమారు 13,66,298 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న 20 వేల క్యూసెక్కులకి పైగా ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని వడలడంతో ఇన్ ఫ్లో పెరిగింది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు.. ప్రస్తుత నిల్వ 17 టీఎంసీలు. ఇక నిన్న సాయంత్రం ఎత్తిపోతల అధికారులు ప్రారంభించారు. నంది మేడారం, నంది పంప్ హౌజ్, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌజ్ ల నుంచి అధికారులు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. మధ్య మానేరుకు చేరిన ఎల్లంపల్లి నీరు. మధ్యమానేరు జలాశయం పూర్తి సామర్ధ్యం 27 టీఎంసీలు, ప్రస్తుతం ఏడు టీఎంసీలకు చేరిన నీటి మట్టం కొనసాగుతుంది.

 

పలు పథకాల పేర్లను మార్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం పలు పథకాల పేర్లను మార్చింది. విద్యా వ్యవస్థలోని పలు పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని పలు పథకాలకు కొత్త పేర్లు పెడుతున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం.. జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర.. జగనన్న గోరుముద్ద స్థానంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం.. ‘మన బడి నాడు-నేడు’ స్థానంలో ‘మన బడి-మన భవిష్యత్తు’ పేర్లను ఖరారు చేశారు. స్వేచ్ఛ పథకం స్థానంలో ‘బాలికా రక్ష’.. జగనన్న ఆణిముత్యాలు స్థానంలో అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం పేర్లను ఖరారు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

 

భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం: బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భాగ్యనగర గల్లీ గల్లీలో బోనాల జాతర కొనసాగుతుందన్నారు. అమ్మవారు మన కష్టాలు తీర్చి సుఖసంతోషాలు చేకూరుతాయని హిందువుల నమ్మకం అన్నారు. తల్లికి బోనం సమర్పిస్తే కష్టాలు తొలగుతాయి, సమస్యలు పోతాయన్నారు. అంటువ్యాధుల నుంచి బయటపడతామని సైనికులు సికింద్రాబాద్ లో బోనాలు సమర్పించిన చరిత్ర ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారు. మా పండుగలను పాతబస్తీ లో జరుపుకునే పరిస్తితి లేదని కొంతమంది భక్తులు ఆవేదన చెందుతున్నారు. రాబోయే ది బిజెపి ప్రభుత్వమే. పాతబస్తీలో కూడా గల్లీ గల్లీలో మన పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హిందువుల పండుగల ను కాపాడుటలేదన్నారు. హైదరాబాద్ బోనాల పండుగ కు 5 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. 33 కోట్లు రంజాన్ పండుగకు ఇచ్చారని తెలిపారు. హిందువులు ఎం పాపం చేశారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు. గత పాలకులు ఇదే తరహాలో చేస్తే ఏమైందో చూసామన్నారు. హిందువుల తరపున పక్కా మాట్లాడుతా. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. ఎంఐఎం గోడ మీద పిల్లులు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికారంలోకి వస్తె వారి పక్కన చేరతారని అన్నారు. అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తా అనడంటే సీఎం , అక్బరుద్దీన్ అన్నదమ్ములు అయ్యారన్నారు. దమ్ముంటే కొడంగల్ అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు.

 

స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం: పవన్‌ కల్యాణ్
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలుపుతూ పవన్‌ కల్యాణ్ ట్వీట్‌ చేశారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారని అన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని.. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలని ఆయన అన్నారు. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అంటూ గుర్తు చేసుకున్నారు. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయన్నారు. మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం గారి జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని పవన్ స్పష్టం చేశారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని.. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయన్నారు.

 

భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి దంపతులు..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాలతో సందడి నెలకొంది. లాల్‌దర్వాజ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ పండుగలు కొనసాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. అమ్మవారు కరోనా లాంటి కరోనా బారి నుంచి ప్రజలందరినీ కాపాడాలన్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులంతా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలి. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అఖిలపక్ష నిర్ణయం మేరకు పాత డిజైన్‌తో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తాం. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం. పాతబస్తీ స్థితిని మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మేడిగడ్డ కుప్పకూలినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందని తెలిపారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు కుట్రలు పన్నితే డ్యామ్ ఎలా కూలిపోతుంది? పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

కాంగో రాజధానిలో సంగీత ఉత్సవంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
కాంగో రాజధాని కిన్షాసాలో శనివారం జరిగిన సంగీతోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ప్రముఖ కాంగో గాయకుడు మైక్ కలాంబై ప్రదర్శన ఇస్తున్న కిన్షాసా సెంటర్‌లోని 80,000 మంది సామర్థ్యం గల స్టేడ్ డెస్ మార్టియర్స్ స్టేడియంలో తొక్కిసలాట జరిగిందని కిన్షాసా గవర్నర్ డేనియల్ బుంబా తెలిపారు. తొక్కిసలాటలో ఏడుగురు మరణించారని, మరికొందరు గాయపడిన వారిని ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చారని స్టేట్ టెలివిజన్ తెలిపింది. తొక్కిసలాటకు కారణం ఏమిటనే దానిపై అధికారులు స్పందించలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అయితే, కొంతమంది దుర్మార్గులను తటస్థీకరించడానికి భద్రతా సేవలు ప్రయత్నించినప్పుడు గందరగోళం చెలరేగిందని ఈవెంట్‌ను నిర్వహించిన స్థానిక సంగీత నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ కచేరీకి దాదాపు 30,000 మంది హాజరయ్యారని, ఇందులో అనేక మంది ఇతర సంగీతకారులు ఉన్నారని మేనేజ్‌మెంట్ కంపెనీ మజాబు గోస్పెల్ ఒక ప్రకటనలో తెలిపింది. సన్నివేశం, ప్రసారం నుండి వీడియోలు స్టేడియం వెలుపల బారికేడ్ల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడి, ప్రవేశించడానికి వేచి ఉన్నాయని చూపించాయి. లోపల, ప్రజలు సెంటర్ స్టేజ్ వైపు నడుస్తున్నట్లు చూడవచ్చు. కాంగో సంవత్సరాలుగా ఇటువంటి తొక్కిసలాటలను చూసింది. బలాన్ని ఉపయోగించడం వంటి పేలవమైన గుంపు నియంత్రణ చర్యలపై తరచుగా నిందలు వేయబడ్డాయి. గత అక్టోబర్‌లో ఇదే స్టేడియంలో సంగీతోత్సవం సందర్భంగా జరిగిన ఘర్షణలో 11 మంది చనిపోయారు.

 

నేడు మహిళల ఆసియా కప్‌ ఫైనల్ పోరు.. భారత్, శ్రీలంక ఢీ
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, భారత్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లూ తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. నేడు శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.  మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  ఆదివారం శ్రీలంకతో జరిగే ఫైనల్లో విజయం సాధించి మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించి రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ను గెలుచుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో, యూఏఈపై 78 పరుగులతో, నేపాల్‌పై 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించారు, అయితే బౌలర్లు ముఖ్యంగా దీప్తి శర్మ, రేణుకా సింగ్ ప్రదర్శన పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇప్పటివరకు దీప్తి అత్యధికంగా తొమ్మిది వికెట్లు పడగొట్టగా, రేణుక ఏడు వికెట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. వీరిద్దరి ఎకానమీ రేట్ కూడా అద్భుతంగా ఉంది అంటే ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ కు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరి బలమైన బౌలింగ్‌తో భారత్‌లోని ఇతర బౌలర్లు కూడా లాభపడ్డారు. దీనికి ఉదాహరణ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్, ఆమె ఇప్పటివరకు 5.5 ఎకానమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టారు. భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయమేమీ లేకపోయినా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్‌లకు బ్యాటింగ్ కొంచెం ఆందోళనను కలిగిస్తోంది. మరోవైపు శ్రీలంక కూడా ఇప్పటి వరకు అజేయంగా ఉంది. టోర్నీలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని కూడా సాధించారు. గ్రూప్ దశలో శ్రీలంక 144 పరుగుల తేడాతో మలేషియాను ఓడించింది. ఇప్పటి వరకు శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అటపట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె ఇప్పటివరకు 243 పరుగులు చేసింది, కానీ ఆమె తప్ప, మరే ఇతర శ్రీలంక బ్యాట్స్‌మెన్ 100 పరుగులను చేరుకోలేదు. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవాలంటే శ్రీలంక కెప్టెన్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. భారత్‌ పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌పై శ్రీలంక బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. ఆఫ్ స్పిన్నర్ కవిషా దిల్హరి (ఏడు వికెట్లు) మినహా ఇతర శ్రీలంక బౌలర్లు ఇప్పటివరకు ప్రభావం చూపలేకపోయారు.