NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ!

కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో తేలడంతో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో జరిగిన పార్టీపై డ్రగ్స్ ఎన్డీపీఎస్‌ యాక్ట్ కేసు నమోదు చేశారు. భారి శబ్దాలతో పార్టీ నడుస్తున్నట్లు డయల్‌ 100కు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులు దాడులు చేపట్టి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్‌ టెస్టులు నిర్వహించారు. ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా.. మిగతా వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు తెలిసింది. మరో వైపు భారీగా ఫారిన్ లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు పోలీసులు. రాజ్‌ పాకాలపై సెక్షన్‌34, ఎక్సైజ్‌ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీలో మరో ట్విస్ట్
హైదరాబాద్ శివార్లలో కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీకి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. రాజు పాకాల ఫార్మ్ హౌస్‌లో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. క్యాసినోకు సంబంధించిన కాయిన్స్‌ని స్వాధీన పరుచుకున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున క్యాసినో నడిచినట్టు అధికారులు గుర్తించారు. నాలుగు సూట్ కేసుల్లో క్యాసినో మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌజ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో దొరికిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. పోలీసులకు డ్రగ్‌ టెస్టు కోసం శాంపిల్స్‌ ఇవ్వలేదని సమాచారం. పురుషులకే పాజిటివ్ రానప్పుడు మేము ఎందుకు ఇవ్వాలని తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిన విజయ్‌ మద్దూరి పోలీసులకు చుక్కలు చూపించినట్లు సమాచారం. యూరిన్ రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటలకు విజయ్ శాంపిల్స్ ఇవ్వగా.. టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. మోకీల పోలీస్ స్టేషన్‌లో రాజ్ పాకాలపై కేసులు నమోదయ్యాయి. రాజ్‌ పాకాలపై రెండు కేసులు నమోదు చేశారు. అనధికారికంగా విదేశీ మద్యాన్ని సరఫరా చేసినందుకు కేసు నమోదు కాగా.. అనుమతి లేకుండా ఫాంహౌజ్‌లో పార్టీ నిర్వహించినందుకు మరో కేసు నమోదైంది. విజయ్ మద్దూర్‌పై నార్కోటిక్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విజయ్ మద్దూర్‌ను మోకీల పోలీసులు అరెస్టు చేశారు.

 

విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి
విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 500 ఎకరాలలో ఏవియేషన్ సర్వీసులు, సౌకర్యాల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం బ్రైట్ స్పాట్‌గా మారుతుందన్నారు. వారణాసి, అయోధ్యకు విమాన సర్వీసుల ఇవ్వాలని ప్రతిపాదన ఉందన్నారు. విశాఖ నుంచి వీలైనన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విజయవాడ – విశాఖ మధ్య రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ ధరలు తగ్గుతాయన్నారు. ఎయిర్ బస్‌తో కనెక్ట్ చేయడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయ్యప్ప భక్తులు ఇరుముడితో వెళ్లే సౌకర్యం కల్పించామన్నారు. జనవరి 20 వరకు దీక్ష దారులు ఇరుముడితో వెళ్లేందుకు సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిబంధనలలో మార్పులు చేసి సర్క్యులర్ ఇచ్చామని చెప్పారు. నవంబర్ 9న సీ ప్లేన్ డెమో సర్వీస్.. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామన్నారు. జూన్ 2026కు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కడప – హైదారాబాద్.., రాజమండ్రి – ఢిల్లీకి సర్వీసులు ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. డిమాండ్ ఆధారంగా ప్రతీ నెల ఏపీ నుంచి రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కొవిడ్ ముందు ప్రభావితం అయిన ఎయిర్ సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ఏవియేషన్‌కు వస్తున్న బెదిరింపు హెచ్చరికలపై లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నివేదిక వచ్చిన తర్వాత ఈ ఫేక్ థ్రెట్ వెనుక బాధ్యులు, ఉద్దేశాలు వెలుగు చూస్తాయన్నారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. లా& ఆర్డర్ ,ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు దర్యాప్తులో వున్నాయన్నారు. సోషల్ మీడియా నుంచి ఈ తరహా బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టామన్నారు. సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి సంబంధించి రెండు కీలక చట్టసవరణలు చేసి మరింత కఠిన వైఖరి తీసుకుని వస్తామన్నారు. ఫేక్ థ్రెట్‌లు ఇచ్చే వాళ్ళను విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.

 

ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని డిప్యూటీ సీఎం‌ పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 2024 -25 సంవత్సరంలో సిమెంట్ రోడ్లు 3,000 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 500 కిలోమీటర్లు, గోకులాలు 22,525, ఫారం పాండ్లు 25,000 , 30,000 ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటి పనులు పల్లె పండుగ నుంచి మొదలు కావాలన్నారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేయాలన్నారు. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు. పనులు ఏ దశలో ఉన్నాయో కూడా ప్రజలకు తెలియచేస్తేనే పారదర్శకత ఉంటుందన్నారు. గత పాలకుల మాదిరి పంచాయతీలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టడం లేదు అని ప్రజలకు తెలపాలన్నారు. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ద్వారా కూడా ఏ పంచాయతీకి ఎంత నిధులు అందాయో, వాటి ద్వారా చేస్తున్న పనులు ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పనుల ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మనం చేపట్టిన అభివృద్ధి పనులను సైతం నాణ్యంగా పూర్తి చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.

 

జనగామలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు
జనగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయషాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. షాపింగ్‌మాల్ పూర్తిగా దగ్ధమైంది. పక్కనున్న 5 షాపులకు మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణం కూడా పూర్తి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు గంటలు ప్రయత్నించినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఒకే ఫైర్ ఇంజన్ ఉండడంతో మంటల్ని అదుపులోకి ఫైర్ సిబ్బంది తీసుకురాలేకపోయారు. అనంతరం స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి ఫైరింజిన్‌లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల స్థానికులు, షాప్‌ నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు. పక్కన ఉండే షాప్ నిర్వాహకులు షాపులను ఖాళీ చేస్తున్నారు. రెండు వస్త్ర దుకాణాలు పూర్తిగా దగ్ధం కాగా.. రూ.10 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. తొలుత విజయ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగగా.. అనంతరం పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణానికి మంటలు వ్యాపించాయి.

 

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ విధ్వంసం .. 130 మంది మృతి
ట్రామీ తుఫాను ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను ఈ సంవత్సరం ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో అత్యంత విధ్వంసక తుఫానులలో ఒకటి. ఇప్పటి వరకు ఈ తుపాను కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో చనిపోయిన, గల్లంతైన వారి సంఖ్య 130కి చేరుకుంది. ఈ విధ్వంసంలో చిక్కుకున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. శుక్రవారం ట్రామీ తుఫాను కారణంగా సంభవించిన తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన, తప్పిపోయిన వారి సంఖ్య 41. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా మరణాలు సంభవించాయి. అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ మనీలాకు ఆగ్నేయ దిశలో భారీగా ప్రభావితమైన ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాను అసాధారణంగా భారీ వర్షాలకు కారణమైందని నివేదించారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లో ఒకటి నుంచి రెండు నెలలపాటు కురిసిన వర్షం వరద నియంత్రణ వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. అనేక ప్రాంతాలు ఇప్పటికీ వరదలోనే ఉండడంతో సహాయక సామగ్రిని పంపిణీ చేయడంలో ఆటంకం ఏర్పడింది. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే విపత్తులను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం ఒక పెద్ద వరద నియంత్రణ ప్రాజెక్టును ప్రారంభించాలని యోచిస్తోందని మార్కోస్ చెప్పారు. సుమారు 5 మిలియన్ల మంది ప్రజలు ఈ తుపాను కారణంగా ప్రభావితం అయ్యారు. వీరిలో దాదాపు అర మిలియన్ మంది వివిధ ప్రావిన్సుల్లోని 6,300 కంటే ఎక్కువ అత్యవసర ఆశ్రయాల్లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌ను తాకిన 11వ టైఫూన్, దక్షిణ చైనా సముద్రంలో అధిక పీడన గాలుల కారణంగా వచ్చే వారం యూ-టర్న్ తీసుకోవచ్చని అత్యవసర క్యాబినెట్ సమావేశంలో మార్కోస్ ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాను దాని మార్గం నుండి కదలకపోతే, వియత్నాం కూడా దాని బారిన పడే అవకాశం ఉంది. ప్రధాన ఉత్తర ద్వీపం లుజోన్‌లో లక్షలాది మంది ప్రజల భద్రత కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం వరుసగా మూడో రోజు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసింది. ప్రతి సంవత్సరం 20 తుఫానులు ఫిలిప్పీన్స్‌ను ప్రభావితం చేస్తాయి. 2013లో వచ్చిన టైఫూన్ హైయాన్ అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫానులలో ఒకటి. తుఫాను 7,300 మందికి పైగా మరణించింది లేదా తప్పిపోయింది. మొత్తం గ్రామాలను నాశనం చేసింది.

 

ప్రైవేట్ పార్ట్‌లో కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఘనుడు
దీపావళి పండుగ సీజన్‌లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరగడం, ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా వీటి అక్రమ రవాణా కూడా పెరుగుతోంది. శనివారం జైపూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి పురీషనాళం నుంచి సుమారు కిలోకు పైగా బరువున్న బంగారు ముక్కలను బయటకు తీశారు. వాటి ధర రూ.90 లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ప్రయాణికుడు అబుదాబి నుండి జైపూర్ విమానాశ్రయంలో దిగాడు. అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి మలద్వారం నుంచి కిలోకు పైగా బరువున్న మూడు బంగారు ముక్కలను బయటకు తీశారు. వీరి ధర ప్రస్తుతం మార్కెట్ లో రూ.90 లక్షల కంటే ఎక్కువ. రెండు రోజులుగా వేర్వేరుగా ఆపరేషన్లు చేసి బంగారాన్ని వైద్యులు వెలికితీశారు. నిజానికి బుధవారం జైపూర్ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్ గురించి సమాచారం అందింది. 8 గంటలకు అబుదాబి నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను పరీక్షించగా.. బేవార్‌కు చెందిన మహేంద్ర ఖాన్‌పై అనుమానం వచ్చింది. ఎక్స్-రే స్కాన్ తర్వాత అతని శరీరంలో బంగారు గడ్డలు ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడిని జైపురియా ఆసుపత్రిలో చేర్చారు. శరీరంలోని బంగారం రికవరీ ఆపరేషన్ తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు అబుదాబి (యుఎఇ) నుండి జైపూర్‌కు చేరుకున్న ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ నంబర్ EY 366లోని ప్రయాణికులను తనిఖీ చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. విచారణలో ప్రశ్నోత్తరాల సమయంలో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. దీని తర్వాత కోర్టు అనుమతితో అతని ఎక్స్-రే చేయగా, అందులో అతని ప్రైవేట్ పార్ట్‌లో బంగారం దాచినట్లు అధికారులు వెల్లడించారు. వైద్యులు వేర్వేరు ఆపరేషన్లు చేసి, అతని పురీషనాళం నుండి ప్లాస్టిక్‌తో చుట్టబడిన మూడు క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 1121 గ్రాముల బంగారం నాలుగు ముక్కలుగా రికవరీ చేయబడింది.

 

నేడు వైజాగ్ బీచ్ రోడ్ లో సందడి చేయనున్న సూర్య..
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలిగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య కు జోడిగా బాలీవుడ్ దిశా పటానీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్ విలన్ రోల్ లో నటించారు. సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కానుంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ మరియు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించగా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అభిమానుల చూపించిన ప్రేమకు సూర్య ఎమోషనల్ అయ్యాడు. తాజాగా కంగువ మేకర్స్ వైజాగ్ లో మరో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. ఈ ఆదివారం అక్టోబర్ 27న సాయంత్రం 5 గంటలకి RK బీచ్ రోడ్ గోకుల్ పార్క్ లో కంగువ మీట్ ని నిర్వహిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సూర్య, దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా రానున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌లపై ఈ హై-బడ్జెట్ పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Show comments