NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

శ్రీశైలం డ్యామ్‌కు పోటెత్తిన వరద.. ఇక గేట్లు ఎత్తుడే మిగిలింది..!
శ్రీశైలం డ్యామ్‌ క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఓవైపు కృష్ణా రివర్‌.. మరోవైపు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది.. తుంగభద్ర జలాశయంలో 28 గేట్ల ద్వారా లక్ష 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.. ఇక, తుంగభద్ర నుంచి నీటి విడుదల లక్షా 50 వేలకు పెంచే అవకాశం కూడా ఉంది.. జూరాల నుంచి ఇప్పటికే 2 లక్షల 51 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.. ఇలా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.. రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.. రాబోయే 15 రోజుల్లో కృష్ణ బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 864.4 అడుగులకు చేరుకుంది.. నీటినిలువ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 118.5 టీఎంసీలుగా ఉంది.. ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. సోమ లేదా మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అంటూ ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.. గేట్లు ఎత్తే సమయంలో.. పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి పర్యాటకులు పోటెత్తే విషయం విదితమే.

ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.2 కోట్లతో పరారీ.. గుర్తుపట్టకుండా గుండు గీయించుకొని..!
ఏటీఎంలలో నింపాల్సిన డబ్బులతో ఓ ఉద్యోగి పరారయ్యాడు.. ఏకంగా రూ.2 కోట్ల 20 లక్షలకు పైగా క్యాష్‌తో కనబడకుండా పోయాడు.. అంతేకాదు.. గుండు గీయించుకున్నాడు.. కానీ, కేవలం 12 గంటలు కూడా గడవకముందే పోలీసులకు చిక్కాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి పోలీసులకు చిక్కిన ఘరానా దోపిడికి పాల్పడిన హీటాచీ క్యాష్ మేనేజ్ మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్.. ఏటీఎంల్లో నింపాల్సిన రెండు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతో అశోక్‌ పరారయ్యాడు.. హెచ్‌డీఎఫ్‌సీ దానవాయిపేట బ్రాంచ్ నుండి డబ్బులు విత్ డ్రా చేసి బయట ఏటీఎం సెక్యూరిటీ కళ్లు గప్పి దోడ్డి దారిన పరారయ్యాడు అశోక్‌.. ఇక, హీటాచీ క్యాష్ మేనేజ్ మెంట్ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు.. ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. అయితే, నిందితుడు అశోక్ డబ్బులతో సిఫ్ట్ కారులో ఉడాయించిననట్లు సమాచారం సేకరించారు పోలీసులు.. కారును అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వదిలి పరారయ్యాడు.. స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో ఉన్న అశోక్ ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. తనను ఎవరూ గుర్తుపట్టకుండగా ఉండే విధంగా గుండు చేయించుకుని ఊళ్లో తిరిగాడట అశోక్‌.. మొత్తంగా ఘటన జరిగిన 12 గంటల లోపే ఘరానా దోపిడీ కేసును ఛేదించారు రాజమండ్రి పోలీసులు.. దోపిడీ చేసిన రెండు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతోపాటు కారు స్వాధీనం చేసుకున్నారు..

సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి మహిళ విజ్ఞప్తి.. మీరే దిక్కు.. లేకుంటే..!
తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా.. వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మంత్రి నారా లోకేష్‌.. తమను కలిసి సమస్యలు చెప్పినా.. సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా.. ఆ సమస్యలను ఇట్టే పరిష్కరిస్తున్నారు.. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ బ్రాహ్మణ మహిళా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్.. నాకు మీరే దిక్కు.. లేకుంటే మరణమే శరణ్యం అంటున్నారు ఆ మహిళ.. కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన మహిళ.. ఒంటరి మహిళ అని చూడకుండా స్థానిక నాయకులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి ఉన్న ఆస్తుపాస్తులపై కన్నేస్తున్న చోటా నాయకులు స్థానికంగా ఉన్నారని.. ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్న నన్ను.. చిత్ర హింసలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గత కొన్నాళ్ల కిందట చిన్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన నాయకులు.. మళ్లీ నా కుటుంబాన్ని వేధింపులకు గురిస్తున్నారు.. ఫోక్సో కేసులో రాజీకి రమ్మని ఇబ్బంది పెడుతున్నట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.. నాకు, నా కుటుంబానికి ఆ నాయకుల నుండి ప్రాణహాని ఉందన్న ఆమె.. నాకు నేనుగా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.. నాకు నా కుటుంబానికి.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు బాధిత బ్రాహ్మణ మహిళ..

కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు.. పోలవరం బాధ్యత మాదే..
కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్‌.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్ధిని వివరించారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం అన్నారు.. 2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.. బడ్జెట్‌లో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చాం. దేశాభివృద్ధికి ఏపీ తోడ్పాటు ఇస్తుందన్నారు.. ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమన్నారు మురుగన్‌.. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉందన్న ఆయన.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 50,474 కోట్ల మేర లబ్ది చేకూర్చాం. ఏపీకి ప్రత్యేక ఆర్థిక చేయూత ఇచ్చే క్రమంలో అమరావతికి రూ. 15 వేల కోట్ల మేర నిధులు కేంద్రం ఇప్పించనుంది. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంగా చెబుతున్నాం అన్నారు.. పోలవరం నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. వివిధ కారిడార్ల ద్వారా ఏపీలో అభివృద్ధి చేపట్టడం.. ఉపాధి కల్పించడం వంటివి చేస్తాం. వెనుకబడిన జిల్లాలకు సాయం కొనసాగిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాం. వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి సహకారం అందిస్తాం అన్నారు.

పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్.. రేవంత్ రెడ్డి కౌంటర్..
సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. గృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. హరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాన్నారు. గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారన్నారు. బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఆలోచన మారలేదు.. విధానం మారలేదన్నారు. బీఆర్‌ఎస్‌ తీరు వల్ల కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాలేదన్నారు. గొర్రెల పథకంలో 700 కోట్ల స్వాహా చేశారని తెలిపారు.వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారని అన్నారు. పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్‌ఎస్‌ దుర్మార్గ​ కారణం కాదా? అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను సభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, కొడంగల్‌కు గోదావరి నీరు ఇవ్వొద్దని కుట్ర చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగిందన్నారు. పార్లమెంట్‌ ఎ‍న్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చినా వారి బుద్ధి మారలేదన్నారు. చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులను భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వం అన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో ప్రజలు బొంద పెట్టారని మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధమా? విచారణకు సిద్ధమైతే సవాళ్లు బీఆర్ఎస్ స్వీకరించాలి? అని సవాల్ విసిరారు.

నేను ఒప్పుకున్నానా..? హరీష్ పై భట్టి ఫైర్
ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారు.. నేను ఒప్పుకున్నానా..? అని హరీష్ రావు పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై హరీష్ రావు మాట్లాడారు. మమ్మల్ని కూడా చూపించండి.. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఇదే చెప్తున్నారు అన్నారు. ఆయన వారసులు అని చెప్పుకునే మీరు.. మమల్ని కూడా చూపించండి అంటూ మాట్లాడారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారని హరీష్ రావు అన్నారు. మేము నెలనెలా వారికి జీతాలు ఇచ్చే పని మొదలుపెట్టాం. రైతుల్ని హైదరాబాదు నగరాన్ని మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టామన్నారు. మా బడ్జెట్ చూసి హరీష్ రావుకి కంటగింపుగా ఉందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ కి వచ్చారు. ఇవాళ సభకు రాలేదని తెలిపారు. వీళ్ళు వచ్చి గుడ్డ కాల్చి మీద వేస్తే ఎట్లా అంటూ హరీష్ రావు అన్నారు. భట్టి కూడా ఒప్పుకున్నారని హరీష్ రావు మాటలకు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారు.. నేను ఒప్పుకున్నానా..? అని హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. నేను చెప్పింది వేరైతే హరీష్ రావు చెప్పే మాటలు తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పాలన ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో కూడా అలానే భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత ఇవ్వాళ సభకు వస్తారు అనుకున్నామని తెలిపారు. బడ్జెట్‌పై ఎల్‌ఓపీ మాట్లాడుతారు అనుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ టెండర్లు ముందే ఎందుకు పిలిచారు? అని భట్టి ప్రశ్నించారు. టానిక్ లాంటి వారితో కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళనివ్వమన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాకు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని మొదలు పెట్టామని తెలిపారు. సర్కార్‌ సొమ్ము ప్రజలకు చేరేలా చేశామని తెలిపారు.

తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్న తీహార్ జైలులో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గొడవ జరగడంతో.. ఓ ఖైదీ పదునైన ఆయుధంతో తోటివారిపై దాడికి దిగడంతో.. ఇద్దరు ఖైదీలు గాయపడినట్లు జైలు అధికారులు ఇవాళ (శనివారం) తెలిపారు. తీహార్ జైలులోని సెల్ నంబర్‌ 8, 9లో ఉన్న ఖైదీల మధ్య శుక్రవారం నాడు ఈ గొడవ చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు ఖైదీలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కాగా, లిక్కర్ కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసు ఆరోపణలపై అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్‌ జైలులోనే ఉన్నారు. తాజా ఘర్షణలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. జైలులో ఉన్న తమ నేతల భద్రతపై పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా..
పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియాలో మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన జరిగిన ప్రదేశం నుంచే ర్యాలీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను తొందరలోనే తెలియజేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇక, అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపుతుంది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్‌ ప్రాణాలు వీడిచారు. తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలో దుండగుడి తూటాకు అతడు బలైపోయాడు. తాజాగా, జరిగిన బహిరంగ సభలో డొనాల్డ్ ట్రంప్‌ అతడిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులు ఆర్పించారు. కాగా మళ్లీ ఫైర్‌ఫైటర్‌ కోరీ గౌరవార్థం సభను నిర్వహించబోతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!
జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరిట స్కూటర్‌ను తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా విద్యుత్తు కార్లు విక్రయిస్తున్న బీఎండబ్ల్యూ సంస్థ.. ద్విచక్ర వాహనాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. సీఈ 04 స్కూటర్‌ ధర ధర రూ.14.9 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూంలో) ఉంది. ఈ ధర చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. ఈ ప్రీమియం స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓసారి చూద్దాం. డిజైన్‌ పరంగా సీఈ 04ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. బాడీ ప్యానెల్స్‌ విశాలంగా ఉండడంతో స్కూటర్‌ పరిమాణం పెద్దగా ఉంటుంది. సీ 400 జీటీ తరహాలోనే కొన్ని మార్పులు చేసి హెడ్‌లైట్‌ను డిజైన్‌ చేశారు. ఒకే సీటును రెండు కలర్లతో ఇచ్చారు. ఇంపీరియల్‌ బ్లూ, లైట్‌ వైట్‌ రంగుల్లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంది. ఇందులో ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఏబీఎస్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ ఇల్యుమినేషన్‌, 10.25 ఇంచెస్ టీఎఫ్‌టీ, తాళం చెవి లేకుండానే ఆపరేట్‌ చేయడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. బీఎండబ్ల్యూ సీఈ 04లో మూడు రైడ్‌ మోడ్‌ (ఎకో, రెయిన్‌, రోడ్డు)లను ఇచ్చారు. ఎమర్జెన్సీ కాల్‌, రివర్స్‌ గేర్‌, టైప్‌-సి యూఎస్‌బీ పోర్ట్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ముందు డబుల్‌ డిస్క్‌, వెనక సింగిల్‌ డిస్క్‌ బ్రేకింగ్‌ సిస్టమ్ ఇచ్చారు. ఇది 15kW మోటార్‌తో వస్తోంది. గరిష్ఠంగా 42హెచ్‌పీ శక్తిని, 62ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0-50 కిమీ వేగాన్ని 2.6 సెకన్లలోనే అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 120 కిమీ వేగంతో వెళుతుంది. దీంట్లో 8.5kWh బ్యాటరీని ఇచ్చారు.

సినిమాలు చేస్తూనే ఉంటా.. దమ్ముంటే ఆపుకోండి! ఫిల్మ్ చాంబర్‌కి విశాల్ సవాల్
తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌పీసీ), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్‌పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విశాల్ పోస్ట్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో టీఎఫ్‌పీసీకి విశాల్ అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. సినిమాల విడుదల విషయంలో జోక్యం చేసుకోవడమేంటని తమిళనాడు ప్రభుత్వంపై విశాల్‌ కొన్ని రోజుల క్రితం ఫైర్ అయ్యారు. దాంతో టీఎఫ్‌పీసీ టార్గెట్‌ చేస్తూ ఆయనపై కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని నిర్మాతల మండలి అల్టిమేటం జారీ చేసింది. తాజాగా ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా హీరో విశాల్ స్పందించాడు. ‘మిస్టర్ కథిరేశన్.. మనమందరం సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాల గురించి మీకు తెలియదా?. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యులు, వారి సంక్షేమం కోసం మాత్రమే డబ్బులను ఖర్చు చేశాం. ముందు మీరు మీ పని సక్రమంగా చేయండి. పరిశ్రమలో పరిష్కరించాల్సిన పనులు చెలానే ఉన్నాయి. థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్, డబుల్ టాక్సేషన్ వంటి సమస్యలు ఉన్నాయి. ముందు వాటిపై దృష్టి పెట్టండి. విశాల్ సినిమాలు చేస్తూనే ఉంటాడు. మీకు వీలైతే నన్ను ఆపడానికి ట్రై చేయండి. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా?’ అంటూ ఫైర్ అయ్యారు విశాల్. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ పోస్ట్ తమిళ ఇండస్ట్రీలో కాకరేపుతోంది.

బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది..
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు “తుఫాన్” సినిమా చేశారు.  తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మా మూవీని మరింత ఎఫెక్టివ్ గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ లో మ్యూజిక్ విని సర్ ప్రైజ్ అయ్యాను. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్ తో, తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. “తుఫాన్” సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా” అని అన్నారు.

సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న స్టార్ దర్శకుడు..ఎవరో తెలుసా..?
నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన ‘ఆ’ చిత్రంతో టాలీవుడ కి పరిచయమయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. విభిన్న కథాంశంతో వచ్చిన ఆ చిత్రంతో ఇండస్ట్రీని అలాగే నిర్మాతలను ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. తదుపరి సీనియర్ హీరో రాజశేఖర్ కథానాకుడిగా కల్కి చిత్రానికి దర్శకత్వం వహించి యాంగ్రీ యంగ్ మ్యాన్ కు హిట్ అందించాడు. ఆ కోవలోనే బాలనటుడు తేజాసజ్జా హీరోగా జంబి రెడ్డితో సూపర్ హిట్ అందించాడు ఈ దర్శకుడు. ఈ చిత్రం సూపర్ హిట్ తో తేజా సజ్జా తో మరొక సినిమాను ప్రకటించాడు. ఇటీవల తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కాగా ఈ దర్శకుడు దాదాపు 30 కోట్ల వ్యయంతో సొంత ప్రొడక్షన్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తదుపరి రానున్న సినిమాలకు సంబంధించిన కథ పరమైన చర్చలు, తదితర పనులు ఇక నుండి ఈ దర్శకుడు నిర్మించబోయే ఆఫీసులోనే ఙరిగిపోతాయని తెలుస్తోంది. అటు ఇటుగా వంద మంది వరకు వివిధ శాఖలకు చెందిన టెక్నీషియన్స్ ఈ ఆఫీసులో పని చేస్తారాని సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ భవనాన్ని 20 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసారు. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ ఙరుగుతోందని త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఈ ప్రొడక్షన్ హౌస్ ఓపెనింగ్ ఉండనుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.