NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సీఎం అయ్యాక తొలిసారి కుప్పంకు చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్‌ ఇదే..
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు.. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం కుప్పం పర్యటన కొనసాగనుండగా.. 25న మధ్యాహ్నం 12:30 కు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారు.. 1:30కి ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. 3:30కి పీఈఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక, రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం 10 గంటలకు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు ప్రజల నుండి వినతులను స్వీకరింనున్న ఆయన.. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పీఈఎస్ కళాశాలలోని ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు.. ఇక, సాయంత్రం 4:30 గంటలకు రెండు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు.. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైనట్టు శాసన సభలో ప్రకటించారు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. దీంతో.. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు.. ఇక, ఆ తర్వాత అయ్యన్నపాత్రుడుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్.. స్పీకర్‌ స్థానంలో కూర్చుండబెట్టారు. కాగా, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం విదితమే కాగా.. కూటమి నేతలు అయ్యన్నపాత్రుడి తరపున నామినేషన్‌ దాఖలు చేశారు.. ఇక, ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైపోయింది.. కాగా, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయ్యన్నపాత్రుడు.. ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది.. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అయ్యన్నపాత్రుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు.. ఇప్పటి వరకూ ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.. మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు.. 1983 నుంచి ఇప్పటి వరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు అయ్యన్నపాత్రుడు.

కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్న.. ఆయనది రాజీలేని పోరాటం..
కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్నపాత్రుడు.. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు ఆయన అంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చింతకాలయ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా సభా నాయకుడి హోదాలో తొలిసారి ఆయన సభలో చంద్రబాడు మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి.. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారు.. విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారంటూ కొనియాడరు.. ఇక, గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసిన సందర్భంగా తాను చేసిన ప్రకటనను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.. కౌరవ సభలో తాను ఉండబోనని, సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని.. తన కుటుంబ సభ్యులపై గత ప్రభుత్వ హయాంలో అమర్యాదగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారు.. గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు గత పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ జరగకూడదన్నారు.. తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారన్న ఆయన.. ఇప్పుడు వాళ్లకు 11 సీట్లకే పరిమితం అయ్యారు.. అది కూడా దేవుడే స్క్రిప్టే కదా? అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్‌..
ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అంటూ.. అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ స్పీకర్‌ పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ 16వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా.. తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ గతంలో డైలాగులు చెప్పారు.. కానీ, ఈ ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 21 సీట్లలోనూ గెలిచిన సత్తా జనసేనది అని కొనియాడారు.. ఇదే సమయంలో.. వైనాట్‌ 175 అన్న పార్టీ 11 స్థానాలకే పరిమితం అయ్యిందన్నారు.. ఇది కాదా? దేవుడి స్క్రిప్ట్‌ అన్నారు.. గత సభ లాంటి సభను తాను ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలి.. ఇక, వెకిలితనం, వెకిలి మాటలకు స్వస్తి అన్నారు. చట్ట సభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు.. ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేశాం.. కానీ ఇప్పుడు కుదరదు..!
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు. ఇక, ఎన్సీపీ అధినేత శుక్రవారం పూణెలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలతో భేటీ అయ్యారు. కాగా, ఎన్సీపీ ( ఎస్పీ) పూణె అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేన, కాంగ్రెస్‌లతో పొత్తు చెదిరిపోకుండా ఉండేందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందని శరద్ పవార్ ఆ మీటింగ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పినట్లు జగ్తాప్ చెప్పుకొచ్చారు. ఇక, పూణె, బారామతి, మావల్, షిరూర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని కూడా శరద్ పవార్ సమీక్షించారని పూణె చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ తెలిపారు. ప్రతి ఒక్కరు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. సీట్ల పంపకాల సమయంలో ఎన్ని సీట్లు అడుగాలి అనే దానిపై ఇంకా పార్టీ నిర్ణయించలేదన్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని ఎమ్మెల్యే కోటా నుంచి 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు అధికార మహాయుతికి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ)కి అగ్ని పరీక్ష లాంటిది. రాష్ట్రంలోని 288 మంది సభ్యుల సభలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?
యూజీసీ- నెట్2024, నీట్ పేపర్ లీక్ వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో యూజీసీ నెట్ పరీక్షను కూడా ఎన్టీఏ రద్దు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌ను రద్దు చేయకూడదని ప్రభుత్వం ఎంచుకుందన్నారు. పేపర్ లీక్ అనేది పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందన్నారు. 2004, 2015లో విస్తృతమైన లీక్‌లు జరిగిన పరీక్షలను రద్దు చేయడానికి దారి తీసిన సంఘటనలకు భిన్నంగా ప్రస్తుతం ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూస్తుందన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.. న్యాయస్థానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అలాగే, కొంతమంది చేసిన ఈ తప్పుడు పని వల్ల కష్టపడి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కెరీర్‌ను తాకట్టు పెట్టడం అన్యాయం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాము బీహార్ పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం.. వారి దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తా.. వ్యవస్థలోని అవకతవకలను సరిదిద్దుతాము.. మాపై నమ్మకం ఉంచండని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం సహించదు అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

చింపాంజీలు గాయాలను నయం చేస్తాయి.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు
మనుషుల కంటే జంతువులు తెలివైనవనీ తరచూ చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇటీవలి అధ్యయనంలో చింపాంజీలు తమ శరీరంలోని గాయాలను నయం చేయడానికి వివిధ ఔషధ మొక్కలను ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. ఇటీవల ఉగాండాలోని ‘బుడోంగో సెంట్రల్ ఫారెస్ట్ రిజర్వ్’లోని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చింపాంజీల ప్రవర్తన, వాటి ఆరోగ్యంపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత చింపాంజీలు తమ శరీరంలోని గాయాలను నయం చేయగలవని పేర్కొన్నారు. అవి ఔషధాలను కలిగి ఉన్న మొక్కలను కనుగొని తింటాయి. చింపాంజీలు యాదృచ్ఛికంగా మందులు తింటున్నాయా లేదా ఉద్దేశపూర్వకంగా తింటాయా అనేది పూర్తిగా ధృవీకరించలేదని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన ప్లో్స్ వన్(PLOS ONE) పత్రికలో ప్రచురించారు. పరిశోధకులు 51 అడవి చింపాంజీలపై తమ పరిశోధనలు చేశారు. అధ్యయన సమయంలో కొన్ని కారణాల వల్ల తన చేతికి గాయమైన ఒక మగ చింపాంజీ ఫెర్న్ ఆకులను కనుగొని నొప్పిని, వాపును తగ్గించడానికి ఉపయోగిస్తుందని పరిశోధకులు గమనించారు. ఇది కాకుండా మరొక చింపాంజీ పరాన్నజీవి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోంది. దీంతో అది ‘స్కూటియా మిర్టినా’ బెరడును తింటుంది. ఈ ఔషధంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.

ఆ క్రికెటర్‌పై లీగల్‌ యాక్షన్‌కు సిద్దమైన బాబర్‌ అజామ్‌!
టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌ ఘోర పరాభవానికి తానే ప్రధాన కారణమంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు యూట్యూబర్‌లు, మాజీ క్రికెటర్లపై చర్యలు తీసుకోనునట్లు సమాచారం. ఇందులో పాక్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్‌ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా జియో న్యూస్ పేర్కొంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌ గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో భాగంగా పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్.. కెనడా, ఐర్లాండ్‌పై గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ జట్టు వైఫల్యంపై ఆ దేశ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు, యూట్యూబర్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్‌ అజామ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్‌ చేశారు. దాంతో బాబర్‌ లీగల్‌ యాక్షన్‌కు సిద్దమయ్యారు. అహ్మద్ షహజాద్‌తో పాటు యూట్యూబుల్లో పలువురు మాజీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పీసీబీ లీగల్ సెక్షన్ పరిశీలిస్తోంది. వీడియోలను పరిశీలించి లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పీసీబీ కమిటీ చర్చించనుంది.

అంతంత మాత్రంగానే ఇండియన్ 2 బిజినెస్..
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,కాజల్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు .ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్సె ,సాంగ్స్ సినిమాపై అంత హైప్ తీసుకురాలేదు.ఈ సినిమాకు తమిళ్ లో తప్ప మిగిలిన భాషల్లో మాత్రం అంత బజ్ క్రియేట్ కావట్లేదు.ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఈ నెల 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.జులై 12 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే జరిగినట్లు తెలుస్తుంది.ఈ సినిమాను 18 కోట్ల అడ్వాన్సు పద్దతిలో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా నెట్ కలెక్షన్స్ 40 కోట్ల వరకు సాధిస్తే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేందుకు మేకర్స్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నారు.

ఓటీటీలోకి మాస్ అమ్మాయి లవ్ స్టోరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, కొత్త హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో నటించారు.. ఏప్రిల్ నెలలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.. ఓ మాదిరి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీ లోకి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది… సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా కావడంతో ఓ మాదిరిగా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఈ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది.. ఈ మూవీ పోస్టర్‌ను తమ ట్విట్టర్ లో షేర్ చేసింది ఆహా ఓటీటీ. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.. ఈ మూవీ థియేటర్లలో పర్వాలేదనే టాక్ ను అందుకుంది.. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త.. లక్ అంటే ఇదే..
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.. తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.. తాజాగా బాలీవుడ్ లో కూడా ఛాన్స్ పట్టేసిందని ఓ వార్త సంచలనంగా మారింది.. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజుకు వెళ్లింది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ లక్కీ హీరోయిన్ గా మారింది.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది సంయుక్తమీనన్. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మూవీలో ఉంటే హిట్ అనే సెంటిమెంట్ ఉండండతో ఆఫర్ల జోరు పెరిగింది.. తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది..ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రాం తో డెవిల్ లో నటించింది. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు లో నటిస్తోంది. బాలీవుడ్ లో మహారగ్ని మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది.. అలాగే మలయాళం లో కూడా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అందంతో , నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసిన సంయుక్త మీనన్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటోంది…’భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Show comments