NTV Telugu Site icon

Top Headlines @ 1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్, 22-ఎ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్దం అయినట్లు సీఎంకు అధికారులు వివరించారు. జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 11.24 ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నారని గుర్తించారు. గౌతమ్‌ తేజను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలను తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గౌతమ్ ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారని సీఎం ప్రశ్నలు గుప్పించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్నారు. సీసీ కెమేరాల ఫుటేజ్ వెంటనే హ్యాండోవర్ చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం విమర్శించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరిచిపోకూడదన్నారు. ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 

ఏపీ గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు ఇవే..
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. 2014- 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి.. 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది అన్నారు. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశాం.. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగింది అని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారు.. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. ఇక, ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56 శాతం తగ్గించారు.. రోడ్లు, భవనాలపై వ్యయం 80 శాతానికి పైగా తగ్గించేశారని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుతో మూడు రాజధానులన్నారు .. గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్రనష్టం చేశారు.. మూడు రాజధానుల పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.. 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ మారింది.. 2019-24 మధ్య ఏపీ ఇంధన రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది.. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడం ద్వారా రూ.19వేల కోట్లనష్టం వచ్చింది.. అస్తవ్యస్త ఇసుక విధానంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.. నాణ్యత లేని మద్యం, గుర్తింపులేని బ్రాండ్లు తీసుకొచ్చారు.. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి భారీ నష్టం తీసుకొచ్చారు.. వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం.. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం.. ల్యాండ్‌ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం.. సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.

 

అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. జగన్‌ను పలకరించిన రఘురామ కృష్ణంరాజు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాజీ సీఎం జగన్‌ వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్‌.. అంటూ జగన్‌ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి పలకరించారు. ఈ సమావేశాలు జరిగినన్న రోజు అసెంబ్లీకి రావాలని జగన్‌ను కోరారు. ఈ క్రమంలోనే హాజరవుతానని జగన్‌ బదులిచ్చారు. కొన్ని నిమిషాల పాటు ఆసక్తికర చర్చ జరిగింది. అనంతరం జగన్‌తో జరిగిన సంభాషణ వివరాలను ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మీడియాతో పంచుకున్నారు. అసెంబ్లీ హాల్‌లో జగన్ తన భుజంపై 2సార్లు చేయి వేసి మాట్లాడారని చెప్పారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని పేర్కొన్నారు. రోజూ అసెంబ్లీకి రావాలని తాను జగన్‌ను కోరానని.. రెగ్యులర్‌గా వస్తాను.. మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరినట్లు రఘురామ కృష్ణ రాజు తెలిపారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ వెళ్లినట్లు తెలిసింది.

 

ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి… సోనియా గాంధీతో భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు. అనంతరం పార్టీ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్‌లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఎన్నికల సమయంలోనే వరంగల్ అసెంబ్లీలోనే రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం నాడు ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఈరోజు రాహుల్ గాంధీని కలిసి వరంగల్ సభకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. రాహుల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ఏఐసీసీ అగ్రనేతలను ఈ సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఆదివారం వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ తర్వాత క్లారిటీ రానుంది. కాగా.. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కేంద్రమంత్రితో చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిన్న రాత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై నేడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో ఇంజినీర్ల స్థాయిలో సమావేశం జరగనుంది.

 

ఢిల్లీ పర్యటనలో కేటీఆర్‌.. ఇటీవల అనారోగ్యానికి గురయిన కవితతో ములాఖాత్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ కలవనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ ఇవాళ కవితతో భేటీ కానున్నారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కవిత ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీయనున్నారు. మరోవైపు కవితకు కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక తాజాగా ఆమెకు వైద్య పరీక్షలు చేయాలని జైలు అధికారులకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. పరీక్షలు అనంతరం నివేదికను అందించాలని ధర్మాసనం పేర్కొంది. గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను జైలు అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత లాయర్లు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కవిత తన మనవిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే అస్వస్థత కారణంగా దీన్ దయాళ్ ఆస్పత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించారు. కవిత పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశించింది.

 

60ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది : ప్రధాని మోడీ
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో నేడు యావత్ దేశం దృష్టి దీనిపైనే ఉంది. ఇది సానుకూల సెషన్‌గా ఉండాలి. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మూడో ఇన్నింగ్స్‌లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని ప్రధాని మోడీ అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో గౌరవప్రదమైన సంఘటనగా దేశం చూస్తోంది. ఇది అమృతకాలంలో ముఖ్యమైన బడ్జెట్‌. ఈ బడ్జెట్ రాబోయే ఐదు సంవత్సరాల అవకాశాల దిశను నిర్ణయిస్తుంది. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశ కలను నెరవేర్చడానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోటీపడి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనేది ప్రతి దేశస్థుడికి గర్వకారణం. 8 శాతం వృద్ధితో ముందుకెళ్తున్నాం. భారతదేశంలో సానుకూల దృక్పథం, పెట్టుబడి, పనితీరు వాతావరణం ఉంది. గత మూడేళ్లుగా నిరంతరంగా 8 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో పార్టీ కోసం కాకుండా దేశం కోసం పోరాడాల్సిన బాధ్యత ఎన్నికైన ఎంపీలందరిపై ఉంది. రాబోయే నాలుగున్నరేళ్ల పాటు దేశానికి అంకితం కావాలని అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నాను అన్నారు. దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని మోడీ ఎంపీలకు సూచించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాం.. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. ఈ ఐదేళ్లు అంతా కలిసి దేశాభివృద్ధికి పోరాడాల్సిన అవసరం ఉంది. సభను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అన్ని పార్టీల్లో పెద్ద సంఖ్యలో కొత్త ఎంపీలు ఉన్నారు.. చర్చలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వండి.. మొదటి సమావేశంలోనే విపక్షాలు సభను అడ్డుకున్నాయి.. నన్ను కూడా మాట్లాడనివ్వలేదు.. వాళ్లకు పశ్చాత్తాపం కూడా లేదు.. ఈ సభ పార్టీల కోసం కాదు, ప్రజల కోసమని ప్రతిపక్షాలను విమర్శించారు.

 

తమిళ రాజకీయాల్లో సంచలనం.. 100నియోజక వర్గాల్లో విజయ్‌ పాదయాత్ర
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న త‌న పార్టీ రూపు రేఖల మీద దృష్టిపెట్టారు. 2026 ఎన్నికల్లో అఖండ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ పోరులో ఒంటరిగా పోటీ చేసి 5వ కూటమిగా నిలుస్తారా..? పొత్తు పెట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. పాదయాత్రతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి అనుబంధంగా 30 శాఖలు ఏర్పాటు చేయడమే కాకుండా 2 లక్షల మందికి పదవులు కట్టబెట్టేందుకు కృషి చేస్తున్నారు. తమ పార్టీకి జెండాను, ఎన్నికల గుర్తును కేటాయించాలని విజయ్ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈసీ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. వారి నుంచి ప్రకటన రాగానే భారీ సభ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సభలో పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రకటించాలనే వ్యూహంతో విజయ్ ఉన్నారు. పార్టీ కార్యక‌లాపాల‌ను ప్రక‌టించిన త‌ర్వాత రాష్ట్రవ్యాప్తంగా విజ‌య్ పాదయాత్ర చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబర్-నవంబర్ నెలల్లో ఆయన ప్రజల్లోకి వస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తిరుచ్చి వేదికగా రాజకీయంగా తొలి అడుగు వేయాలనుకుంటున్నాడు విజయ్. ఈ మేరకు పార్టీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. గత కొద్ది రోజులుగా విజయ్ మాట తీరు పరిశీలిస్తే.. డీఎంకే, బీజేపీకి వ్యతిరేకమన్న భావన కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన ఏఐఏడీఎంకేతో కలిసి పోటీ చేయవచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే విజయ్ స్వయంగా సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్స్ ఉంది.

 

మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. గత 4-5 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గింది. సోమవారం (జులై 22) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,700 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,850గా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,700
విజయవాడ – రూ.67,700
ఢిల్లీ – రూ.67,850
చెన్నై – రూ.68,250
బెంగళూరు – రూ.67,700
ముంబై – రూ.67,700
కోల్‌కతా – రూ.67,700
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,850
విజయవాడ – రూ.73,850
ఢిల్లీ – రూ.74,000
చెన్నై – రూ.74,450
బెంగళూరు – రూ.773,850
ముంబై – రూ.73,850
కోల్‌కతా – రూ.73,850
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.96,600
విజయవాడ – రూ.96,600
ఢిల్లీ – రూ.91,500
ముంబై – రూ.91,500
చెన్నై – రూ.96,000
కోల్‎కతా – రూ.91,500
బెంగళూరు – రూ.91,550

Show comments